చాళుక్యుల శిల్ప సంపదకు ముప్పు!

మహబూబ్‍ నగర్‍ జిల్లా గంగాపురం చెన్నకేశవ స్వామి ఆలయంలో చారిత్రక ఆనవాళ్లు కనుమరుగవుతున్నాయి. ఆలయం నిర్లక్ష్యం కారణంగా అద్భుతమైన చాళుక్యుల శిల్ప సంపదకు ముప్పు వాటిల్లుతుంది. ఇప్పటికే చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన కోట గోడలు ధ్వంసమయ్యాయి. చారిత్రక ఆధారాలుగా నిలిచిన శాసనాలు కనుమరుగయ్యాయి. ఆలయంలోపల శిల్పాల్లో కొన్ని ధ్వంసమయ్యాయి. ఉప ఆలయాలు పట్టించుకునేవారు లేక శిథిలావస్థకు చేరుకున్నాయి. ప్రధాన ఆలయం ద్వారం శిల్ప శోభితంగా కనిపించేది. అది ఇప్పుడు రంగు వెలిసి కళావిహీనంగా కనిపిస్తోంది. లోతైన మెట్ల బావి ఇప్పటికీ భక్తులకు దర్శనమిస్తూ నాటి చారిత్రక వైభవాన్ని చాటుతోంది. ఆలయంలోని ఉప ఆలయాలును పట్టించుకునేవారులేక శిథిలావస్థకు చేరు కుంటున్నాయి. చారిత్రక వారసత్వంసంపదను పరిరక్షించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ద•ష్టిని సారించాలని భక్తులు కోరుతున్నారు. ప్రాచీన వారసత్వ సంపద జాబితాలో ఈ ఆలయాన్ని చేర్చి నిధులు విడుదల చేసి కాపాడాలని భక్తులు కోరుతున్నారు. రంగు వెలుస్తున్న నల్ల రాతి శిల్పాలకు ప్రముఖ శిల్పుల సలహాలు తీసుకుని పూర్వ వైభవం తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. చెల్లాచెదురైన చారిత్రక శాసనాలను ఒకచోట చేర్చి ప్రత్యేక మ్యూజియం ఏర్పాటు చేయాలని హిందూ ధార్మిక సంస్థలు కోరుతున్నాయి.


అసలు చరిత్ర ఇది
దక్షిణ భారతదేశంలోనే అత్యంత ప్రాచీన ఆలయంగా ప్రసిద్ధి చెందిన లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయం మహబూబ్‍ నగర్‍ జిల్లా జడ్చర్ల మండలం గంగాపూర్‍ గ్రామంలో ఉంది. జడ్చర్ల నుండి కల్వకుర్తికి వెళ్లే ప్రధాన రహదారి వెంట 6 కిలోమీటర్లు ప్రయాణిస్తే గంగాపురం ఆలయ ముఖద్వారం కనిపిస్తుంది. కొద్ది లోపలికి వెళ్తే చెన్నకేశవ స్వామి ఆలయం దర్శనమిస్తుంది. బాదామీ చాళుక్యుల కాలంలో ఈ ప్రాంతం ఎంతో ప్రసిద్ధిగాంచింది. కళ్యాణి చాళుక్య రాజు త్య్రైలోక్య మల్ల సోమేశ్వరుడు కీ.శ.1042 -1063 మధ్య ఆలయాన్ని నిర్మించినట్లు ఇక్కడ లభించిన శాసనాల ద్వారా తెలుస్తోంది. స్కాంద పురాణంలోనూ గంగాపురం ఆలయ ప్రస్తావన ఉంది. ఈ ఆలయంలో ప్రధాన దైవం చెన్నకేశవస్వామి. లక్ష్మీదేవితో దర్శనమిస్తాడు. అప్పట్లో కేశవపురంగా ప్రసిద్ధి చెందింది. చెన్నకేశవుడు మీసాలతో గంభీరంగా భక్తులకు దర్శనమిస్తాడు. ఆలయ పరిసరాలన్నీ శిల్ప సంపదతో భక్తుల మనసును దోచుకుంటాయి. శిల్పుల పనితనాన్ని కళ్లకు కట్టినట్టు చూపించే అనేక శిల్పాలు ఈ ఆలయం వద్ద ఉన్నాయి. జైన శైవ మతాలు విరాజిల్లినట్లు చరిత్రకారులు స్పష్టం చేస్తున్నారు.


ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలు
గంగాపురం లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు ప్రతిఏటా రథసప్తమి నుండి ప్రారంభమవుతాయి. ఫిబ్రవరి 2 నుండి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 2 ఆదివారం తిరు కళ్యాణము, 3 సోమవారం పుష్పరథము, 4 మంగళవారం ప్రధాన రథోత్సవం, 5 బుధవారం శకటోత్సవం జరుగుతుంది. బ్రహ్మోత్సవాలకు ఉమ్మడి జిల్లా నుండి కాకుండా ఇతర జిల్లాల నుండి, కర్ణాటక రాష్ట్రం నుండి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. బ్రహ్మోత్సవాల కోసం ఆలయ పాలకమండలి దేవాదాయ ధర్మాదాయ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. బ్రహ్మోత్సవాల పూజలు జనవరి 30 నుండి ఫిబ్రవరి 6 వరకు కొనసాగనుండగా ప్రధాన ఘట్టం మాత్రం ఫిబ్రవరి 2 నుండి ప్రారంభమవుతుంది.


గుముడాల చక్రవర్తి గౌడ్‍

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *