‘‘భూపతి చంద్ర’’ స్మారక కథానికల పురస్కార ప్రదానోత్సవం


సభకు అధ్యక్షత వహించిన కాంతారావు, తమ తండ్రి స్వర్గీయ శ్రీ భూపతిరావు, తల్లి స్వర్గీయ శ్రీమతి చంద్రమ్మగారల స్మారకార్థం వారి పేర మెమోరియల్‍ ట్రస్టును ఏర్పాటు చేశామని దానిలో భాగంగా ‘‘భూపతి చంద్ర స్మారక కథానికల పోటీ 2025’’ నిర్వహించామని, ఈ పోటీలో ఉభయ తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా తమిళనాడు, న్యూఢిల్లీ, పూణె, బెంగుళూరు, ముంబాయి నగరాల నుండి కూడా వందకు పైగా కథానికలు వచ్చాయని పురస్కారాలు పొందిన రచయితలకు, రచయిత్రులకు, న్యాయ నిర్ణేతలకు అభినందనలు తెలిపి పోటీలో పాల్గొన్న రచయితలకు, రచయిత్రులకు అందరికి కృతజ్ఞతలు తెలియజేశారు.


కథానికల పోటీకి వచ్చిన కథానికల నన్నింటిని తాను చదివానని, న్యాయ నిర్ణేతలు నలుగురు కూడా చదివినారని అందరము చదివిన తర్వాత పారద్శకంగా ప్రథమ, ద్వితీయ, తృతీయ మరియు ప్రోత్సాహక బహుమతులను ప్రకటించామన్నారు. ఈ కథానికల పోటీ కార్యక్రమమును ప్రతి సంవత్సరము నిర్వహించుటకు అందరి సహకారముతో కృషి చేస్తామన్నారు.


ముఖ్య అతిథిగా పాల్గొన్న సీనియర్‍ పత్రికా సంపాదకులు శ్రీ కె. రామచంద్రమూర్తిగారు మాట్లాడుతూ ఈ ఉరుకుల, పరుగులు జీవితములో చాలా మంది జీవించియున్న తల్లిదండ్రులనే మరచిపోతున్న ఈ రోజుల్లో తల్లిదండ్రుల స్మారకార్థం వారి కుమారులు ఐదుగురు వారి పేరిట ట్రస్ట్ ఏర్పాటు చేయడం, ట్రస్ట్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం, కథానికల పోటీని నిర్వహించి పురస్కార ప్రదానోత్సవం గావించడం ఎంతో అభినందనీయమని అన్నారు. సాహితీ పక్రియలలో తనకు కూడా కథానిక పక్రియ ఎంతో ఇష్టమని తెలియజేశారు. తాను హెచ్‍ఎన్ టీవీలో ఉన్నప్పుడు కీ.శే. గురజాడ అప్పారావు 1910లో రచించిన తొలి తెలుగు కథానిక ‘‘దిద్దుబాటు’’ మొదలుకొని వందేండ్ల కథకు వందనాలు పేరిట కీ.శే. గొల్లపూడి మారుతీరావు గారి పర్యవేక్షణలో వంద కథలను సమీక్షించామన్నారు.


ఈ ట్రస్ట్ తరఫున ఇదేవిధంగా ప్రతి సంవత్సరం కథానికల పోటీని నిర్వహించాలని ఆశిస్తున్నాను అని అన్నారు.

గౌరవ అతిథిగా పాల్గొన్న నాగార్జున విశ్వవిద్యాలయం తెలుగుశాఖ పూర్వ అధ్యక్షులు ప్రొఫెసర్‍ మన్నవ సత్యనారాయణ గారు మాట్లాడుతూ.. సాహిత్య చరిత్రలో ‘‘కథానిక’’ పక్రియకున్న విశిష్టత చాలాగొప్పదని, ఈనాటికి పాఠకలోకం ఆదరిస్తున్న ఒకటి, రెండు పక్రియలలో కథానిక మొదటిది అన్నారు. ట్రస్ట్ ఛైర్మన్‍ శ్రీ కాంతారావు గారు నాతో ఈ విషయం మొదటిసారిగా మాట్లాడినప్పుడు ఇది చాలా మంచి నిర్ణయమని ముందుకు వెళ్లండని ప్రోత్సహించాను అని అన్నారు. శ్రీ కాంతారావుగారు రాజకీయాల్లో రాణిస్తూనే సంగీత, సాహిత్యాలలో అభినివేశం కలిగి యుండడం తనకు ఎంతో ఆశ్చర్యం, ఆనందం కలిగిస్తుందని ఈ వయస్సులో కూడా వారు పోటీకి వచ్చిన ప్రతి కథానికను చదివి న్యాయ నిర్ణేతలతో చర్చించి నిర్ణయం తీసుకోవడం వారికే చెల్లిందని మన్నవ అన్నారు.


శ్రీ బి.నరసింగరావు గారు సభనుద్ధేశించి మాట్లాడుతూ తమ కుటుంబం చిన్నప్పటి నుండి పుస్తకాలు, కవితలు చదివే ఆసక్తి మరియు కవిత్వంపై ఉన్న ఆసక్తి గురించి వివరించారు. సుప్రసిద్ధ రచయిత శ్రీ నవీన్‍ గారు అంపశయ్య నవల రచించి 50 సం.లు పూర్తి చేసుకున్న సందర్భంగా BCMT తరఫున 2019లో వారికి ‘కీర్తిశిఖర’ అవార్డును అందజేశామన్నారు.


రమణ సభా కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు, సహాయ సహకారాలందించిన శ్రేయోభిలాషులకు, కథానికల పోటీలో పాల్గొన్న రచయిత్రులకు, రచయితలకు, న్యాయనిర్ణేతలకు మరియు సభలో పాల్గొన్న అందరికి కృతజ్ఞతలు తెలియజేసారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *