ప్రకృతే నియంత్రిస్తుంది! 11 ప్రకృతే శాసిస్తుంది!!
(గత సంచిక తరువాయి)
జార్జి ఎవరెస్టు యుగం :
విశ్రాంతి నుంచి 1822 అక్టోబర్‌లో తిరిగి వచ్చిన ఎవరెస్టు అకోలా కేంద్రంగా పడమరన గల పూణే నుంచి బొంబాయికి సర్వే చేపట్టాడు. ఈ బొంబాయి సర్వేను ఎవరెస్టు అవమానంగా భావించాడు. నిజానికి ఉత్తరాది మహాచాపం ఎవరెస్టు చేయాలని అనుకుంటే, దాన్ని డి.పెన్నింగ్కు అప్పజెప్పారు. ఇంతలోనే లాంబ్టన్ మరణించడంతో మహాచాపం బాధ్యతతో పాటు, మిగతా సర్వేలకు అధిపతి అయ్యాడు. ఇలా 1823 మార్చిలో ది గ్రేట్ ట్రిగ్నామెట్రికల్ సర్వేకు సూపరింటెండ్‌గా నియమించబడ్డాడు. లాంబ్టన్ మరణించిన తర్వాత కనీసం సిబ్బందిని పరామర్శించ కుండా, వారిని తిడుతూ హైదరాబాద్ కార్యాలయం లోని సర్వే గణన రికార్డుల, పరికరాల భద్రత విషయాన్ని చూసుకున్నాడు. దీంతో రాబోయేది కష్టకాలమని భావించిన డా।। వొయిసె, డి.పెన్నింగ్ తదితరులు ఎవరెస్టును ఓ పులిలా భావించేవారు. సర్వేను విడిచి వెళ్ళుతామని మొరాయించారు. వారు భయపడినట్లుగానే యల్లాపురం జ్వరంతో డా।। వొయిసె కలకత్తాకు వెళ్ళుతుండగా మార్గ మధ్యలోనే చనిపోయాడు. లాంబ్టన్ ఉప అసిస్టెంట్ విలియమ్ రొస్సెన్రోడ్ రాజీనామా చేసాడు. చేసేది లేక డి.పెన్నింగ్ను కనీసం ఒక సంవత్సరం పాటు సర్వేకు సహకరించాలని ఎవరెస్టు కోరాల్సి వచ్చింది. ఇంతలోనే ఎవరెస్టు యల్లాపురం మలేరియాకు గురయ్యాడు. డాక్టర్లు మద్రాసు వెళ్ళి విశ్రాంతి తీసుకొమ్మన్నా వినకుండా 1823 అక్టోబర్‌లో నాగపూర్‌కు, ఎలిచిపూర్ మౌల్యరేఖ దగ్గరకు వెళ్లాడు. అప్పటికి తొమ్మిది నెలలుగా (లాంబ్టన్ మరణం తర్వాత) డి.పెన్నింగ్తో సహా మిగతా సిబ్బంది ఎలాంటి పనిలేకుండా వున్నారు. ఎవరెస్టు మద్రాసు వెళ్ళితే ఈ సిబ్బంది ఎవరిదారిన వారు సర్వేను విడిచి వెళ్ళిపోతే కొత్తవారిని నియమించుకోవడం, వారికి శిక్షణ నివ్వడం కష్టం. అలాగే, ప్రభుత్వం సర్వేపై పునరాలోచన చేయవచ్చు అనేది ఎవరెస్టు ఆలోచన.
పక్షవాతం వచ్చినా సర్వేను కొనసాగించిన ఎవరెస్టు :
ఎవరెస్టు కాళ్ళు చేతులు చచ్చుబడి పోయాయి. ఇద్దరు సహాయకులు జనిత్ (Zenith) సెక్టారులో కూర్చోబెట్టాలి. తిరిగి దించాలి. అలాగే థియోడలైట్ నిలువు చక్రము స్క్రూ తిప్పటానికై, ఎవరెస్టు ఎడమ చేతుని ఒకరు ఎత్తి పట్టుకోవాలి. ఇలా ఆరు నెలల పాటు పల్లకిలో ఆయన్ని మోయాల్సి వచ్చింది. అయినా ప్రతి మౌల్య రేఖ రెండు చివరల నుంచి అక్షాంశ రేఖాంశాలకు మూడు వందలకు పైగా పరిశీలనలు చేసాడు.

ఉత్తర దిశగా చాపం పొడగింపు :
ఓ వైపు ఆరోగ్య సమస్యలున్నా, సూపరింటెండ్టుగా ఎవరెస్టు మనోబలాన్ని పొందాడు. చివరిసారి లాంబ్టన్ గుర్తించిన ఎలిచ్‌పూర్ మౌల్యరేఖను (మధ్యభారత్)
ఉత్తరాన ఝాన్సికి ఈవలగల సిరోంజి పట్టణం దాకా పొడగించడమేకాక, వీటి మధ్యన గల 20 ట్రిగ్నామెట్రికల్ సర్వేస్థానాలకు స్వయంగా వెళ్ళి కోణాన్ని తీసుకున్నాడు. నర్మదానది ఉపఖండాన్ని ఉత్తర, దక్షిణంగా రెండుగా చీల్చినట్లు, 320 కి.మీ. ఈ మహాచాపం కూడా ఉపఖండాన్ని రెండుగా చీల్చినట్లుగా వుంటుంది. ఈ సర్వేకి రెండు సం।।లు పట్టింది. ఈ భూ భాగం సర్వేకి ఎంత ముఖ్యమో, బ్రిటీషు పరిపాలనకు అంతే సౌలభ్యం.
ఢిల్లీ దిశగా మహాచాపాన్ని హోషంగా బాద్ పట్టణం దగ్గర నర్మదా నదిని దాటించారు. తర్వాత భోపాల్‌ను, సిరోంజిని దాటిన మహాచాపం 78 డిగ్రీల రేఖాంశంపై ముందుకు సాగుతున్నది. ఇక్కన్నుంచి పారే బెత్వానది ఒక్కటే ఈశాన్యంగా ప్రవహించి, త్రివేణి సంఘానికి ముందు యమునలో కలుస్తున్నట్లు సర్వే బృందం గుర్తించింది. అంటే, హిమాలయ జనిత గంగా నదిలో దక్షిణ భాగం నుంచి కలిపే నది ఇదొక్కటే! సిరోంజి నుంచి 300 కి.మీ. దూరాన గల ఆగ్రాకు, అక్కన్నుంచి ఢిల్లీ హైరోడ్కు చాపాన్ని పొడగించాలనేది ఎవరెస్టు సంకల్పం. నర్మదా నది మొసళ్ళకు ఆలవాలమైతే, మధ్య భారత్‌లో పులుల భయం. అయినా, తమ ప్రయాణపు ఏనుగల్ని, గుర్రాల్ని, నర్మదానదిలోకి వదిలితే, అవి సురక్షితంగా నదిని దాటాయి. పులుల నుంచి భయంకన్నా, సిబ్బంది ఎవరెస్టునే పులిగా భావించారట!
తిరిగి 1824 సెప్టెంబర్‌లో ఎవరెస్టుకు జ్వరం తిరగబెట్టింది. పల్లకిలో కూడా ప్రయాణం ఇబ్బందికరంగా వుంది. మళ్ళీ సెలవుపై పోవాలనింపించినా, సిరోంజ్ మౌల్యరేఖ కొలత చేయకుండా, భారత్ సరిహద్దుల వరకు మహాచాపం చేర్చినట్లు ప్రకటించకుండా వెళ్లిపోవడానికి ఎవరెస్టుకు మనస్సు అంగీకరించలేదు. పట్టుదలతో 1824-25 మధ్య కాలంలో సిరోంజ్ మౌల్యరేఖ రెండు చివర్ల మధ్యన చక్రాల బండిలో అనేకమార్లు తిరుగుతూ, ప్రతి కొలతను పర్యవేక్షిస్తూ, కచ్చితత్వంకు ప్రాధాన్యతనిస్తూ గణన చేసాడు. 1825 ఫిబ్రవరి 10న సిరోంజ్ దగ్గర క్యాంపును తుఫాన్ తాకి, గుడారాల్ని, పరికరాల్ని చిందరవందర చేసింది. బారోమీటర్ (పాదరస) పాడైంది. థియోడలైట్ ఒక స్క్రూ విరిగింది. సంవత్సరం చివరినాటికి మౌల్యరేఖ పూర్తి చేసారు. ఆరోగ్యం మరింతగా క్షీణించడంతో ఇంగ్లాండ్ వెళ్ళి అయిదు సంవత్సరాల దాకా తిరిగి రాలేదు. పోతే, సర్వేకు సంబంధించిన రికార్డుల్ని వెంట తీసుకెళ్ళి నివేదికల్ని రాసుకున్నాడు. అలాగే సర్వేకు సంబంధించిన మెరుగైన కొత్త విషయాల్ని తెలుసుకున్నాడు. కొత్త పరికరాన్ని మార్పులతో, తిరిగి తయారు చేయించి ఈస్టిండియా కంపెనీ అనుమతితో కొన్నాడు. పగటిపూట సూర్యకాంతితో ప్రతిబింబించే దర్పణాల్ని, రాత్రిపూటకు అనుకూలమైన దీపాల్ని లండన్‌లో చూసాడు. అప్పుడు ఐర్లాండ్‌లో కూడా సర్వే జరుగుతున్నది. దాని పద్దతుల్ని ఎవరెస్టు పరిశీలించాడు. గొలుసులకు బదులుగా సంకోచ, వ్యాకోచాలకు గురికాని, కొలత కడ్డీలను చూసాడు. 1830లో ఇండియాకు వచ్చేముందు వాటిని పరీక్షించుకున్నాడు. 1831లో కలకత్తా చేరిన తర్వాత 10 కి.మీ. కలకత్తా మౌల్యరేఖను కడ్డీలతో తిరిగి కొలిచి, సంతృప్తి పడ్డాడు. ఎవరెస్టు సెలవుపై వెళ్ళిన కాలంలో మహాచాపం సిరోంజి దగ్గరనే ఆగిపోయింది. బదులుగా, లాంబ్టన్తో పనిచేసిన జోసెఫ్ ఆలివర్ను, విలియమ్ రొస్సెన్రోడ్లను సిరోంజి నుంచి కలకత్తా వైపుగా (తూర్పు) త్రిభుజీకరణ చేయమన్నాడు. మహాచాపం బాధ్యతను మాత్రం ఇవ్వలేదు. కలకత్తా శ్రేణి 1100 కి.మీ. దూరమే కాక, భయంకరమైన అడవిగుండా సాగాలి. రొస్సెన్రోడ్ పిల్లలిద్దరు చనిపోయారు. ఎవరెస్టు ఇంగ్లాండ్ నుంచి తిరిగి వచ్చేనాటికి కలకత్తా త్రిభుజీకరణ గంగానది డెల్టా (కలకత్తాకు 110 కి.మీ. దూరం) వరకే పూర్తైంది.
అయితే ఈ సర్వేకి 0.9 మీటర్ల సర్వేకు వాడే థియోడలైటు బదులుగా తక్కువ స్థాయిగల 0.45 మీటర్ల థియోడలైట్ను ఆలివర్ ఉపయోగించాల్సి వచ్చింది. దీంతో 40 కి.మీ. వరకే ఈ తక్కువ స్థాయి థియోడలైట్ పనిచేసేది. దీంతో ఏర్పర్చిన త్రిభుజాలు ఇరుకుగా వచ్చాయి. మొత్తం (1100 కి.మీ.) దూరంలో ఒక్క మౌల్య రేఖ కూడా కొలవని సర్వే ఇదొక్కటే! అంత కచ్చితత్వంలేని ఈ శ్రేణినే ఎవరెస్టు ఆధారంగా చేసుకొని, అనేక అక్షాంశ శ్రేణులతో హిమాలయాల వరకు సర్వేను తీసుకెళ్ళడం ఆయన పనితనానికి నిదర్శనం.

నిజానికి ఈ సర్వే మార్గం అనుకూలమైంది కూడా కాదు. పెద్ద పెద్ద చెట్లతో, పులులతో వున్న అడవి మార్గం. నిచ్చెనకు నిచ్చెన్లకు కట్టి 18-24 మీ. ఎత్తుకు ఎక్కి చూసినా దృష్టి సారించని స్థితి. ఎండుటాకుల చప్పుడైనా, పులులని భయపడి సిబ్బంది పారిపోయే వారు. టెలిగ్రాఫ్ లేకముందు, బురుజుల ద్వారా సంకేతాల్ని పంపే వ్యవస్థ నాడు దేశంలో వుండేది. అలాంటివే కలకత్తా శ్రేణిలో వుండడంతో ఆలివర్, రొస్సెన్ రోడ్లు వీటిని ఉపయోగించుకున్నారు. అయినా వీటికి కూడా కొంత మార్పులు చేయాల్సి వచ్చింది. అలాగే ఆగ్రా, ఢిల్లీ మీదుగా మహాచాపాన్ని హిమాలయాలకు పొడగించాలంటే మైదాన ప్రాంతాల్లో కూడా బురుజుల్ని నిర్మించాలి. (కలపతో నిర్మించే పరంజీ బురుజుల్ని కూడా కొన్ని ప్రాంతాల్లో నిర్మించారు.) కాని వీటికి చాలా కలప కావాలి. దాదాపు 27 మీటర్లు ఎత్తు వుండే ఈ బురుజులు గాలి వీచితే కూలిపోయేవి. అందుకే కట్టడపు బురుజులపై ఎవరెస్టు దృష్టి సారించాడు. వీటి నిర్మాణానికి ఇంజనీర్లు, కూలీలు, రాళ్ళు, సున్నం కావాలి. వీటికై 77,000 పౌండ్లు, ఇంతకన్నా ఎక్కువ జీతాలకు, కూలీలకు కావాలి. అధికారులు ఒప్పుకోక పోవచ్చు అని కలకత్తా నగరంలో రెండు సంకేతాల బురుజుల మధ్యన అధికారుల సమక్షంలో సర్వేను ప్రదర్శించాలనుకున్నాడు. మౌల్వరేఖకు ఉపయోగ పడాలంటే, దాదాపు 300 చెట్లు నరకాలి. పదుల సంఖ్యలో మట్టి మిద్దెల్ని తీసేయాలి. అడ్డం వచ్చే చెరువుల్ని పూడ్చాలి. దీనికి సమ్మతించని అధికారులు స్థలాన్ని మార్పు చేయమన్నారు. ప్రత్యామ్నయంగా కలకత్తానుంచి ఉత్తరానికి వెళ్లే హుగ్లినది ఒడ్డునగల బారక్పూర్ రోడ్డును ఎంచుకొని 10 కి.మీ. నిడివిలో రెండు 23 మీ. ఎత్తులో బురుజులు నిర్మించి, రద్దిని నియంత్రించి ఎడమవైపు రోడ్డు మూసివేసారు.
1831 నవంబర్ 23న ఈ మౌల్యరేఖ కొలత ప్రారంభమైంది. పూర్తి కావడానికి రెండు నెలలు పట్టింది. 19.2 మీ. కొలత కడ్డీలతో మొత్తం 539 సార్లు విడివిడిగా కొలత చేసారు. అంటే రోజుకు సరాసరి 12 సార్లు. దీన్ని చూడడానికి, చివరి రోజున అధికారులతోపాటు ఏసియాటిక్ సొసైటి అధ్యక్షుడైన జేమ్స్ ప్రిన్సెప్ (James Prinsep) ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. అధికారుల ముందు మొదటి భాగాన్ని మళ్ళీ కొలత చేసి, రెండు నెలల్లో ఏమైనా వ్యత్యాసం వుందా అని సరిచూసుకున్నాడు. రెండింటి మధ్యన సెంటీమీటరులో 0.066 భాగం అని తేలింది. ఇంగ్లాండ్‌లో కడ్డీలను పరీక్షించిన దానికంటే, మరింత కచ్చితత్వం రావడంతో ఎవరెస్టు, సిబ్బంది మహాదానంద పడ్డారు. రెండు నెలల తేడాను దృష్టిలో వుంచుకుంటే, కలకత్తా – ఢిల్లీల మధ్య దూరంలో 30 సెంటీమీటర్లు, భూమి చుట్టు కొలతలో 38 మీటర్ల తేడా రావచ్చని జేమ్స్ ప్రిన్సెప్ భావించి, సర్వే విదానాన్ని అభినందించాడు.
సర్వేయర్ జనరల్‌గా జార్జి ఎవరెస్టు :
కలకత్తా మౌల్యరేఖ కొలత తర్వాత రెండు సంవత్సరాలలో (1831-33) ది ట్రిగ్నామెట్రికల్ సర్వేయర్ జనరల్‌గా పదోన్నతి పొందడంతో (స్థలాకృతి, రెవెన్యూ సర్వేలకు కలిపి) సర్వే విధానాల్లో అనేక కొత్తమార్పుల్ని చేసి అధికారుల అనుమతి పొందాడు. ముందు మహాచాపాన్ని హిమాలయాలదాకా తరువాత బెంగాల్లో త్రిభుజీకరణ చట్రాన్ని వీలైతే ఏకకాంలో చేపట్టాలని, అయిదు సంవత్సరాలలో పూర్తి చేయాలని పథక రచన చేసాడు. ఇది జరగాలంటే ఒకటి, రెండు సర్వే బృందాలకంటే ఆరు బృందాలు ఒకేసారి పనిచేస్తే, అనుకున్న లక్ష్యం నెరవేరుతుందని 1832 చివరినాటికి కొత్తవారిని తీసుకొని శిక్షణ నిచ్చాడు. బురుజుల నిర్మాణానికి, సిబ్బంది జీతాలకు అదనపు రొక్కానికై అధికారుల్ని ఒప్పించాడు. ఓవైపు ఆలివర్, రొస్సెన్రోడ్లు కొండల మధ్యన సర్వే చేసుకుంటూ పోతూ, గణాంకాల్ని కలకత్తాకు పంపించారు. మద్రాసు నుంచి డిపెన్నింగ్ని గణాంకాల్ని చేయడానికి పిలిపించాడు.

ఈ మార్పులలో దిట్రిగ్నామెట్రికల్ సర్వే ఓ మహా సంస్థగా రూపొందింది. దీనికి ఎదురులేని అధిపతిగా ఎవరెస్టు ఎదిగాడు. చరిత్రకారులు 1833-43 దశాబ్దాన్ని ఎవరెస్టు దశాబ్దంగా అభివర్ణించారు. 1833-34 శీతాకాంలో సర్వే పడమరకు మళ్ళింది. హిమాలయ కొండలకు చేరాలని, గంగా నదికి ఎదురు ప్రయాణం మొదలు పెట్టించాడు. భారీ పరికరాలు మునగకుండా ప్రత్యేకమైన బోట్లను నిర్మించారు. అనువైన చోట బోట్లు దిగి రోడ్డు మార్గం పట్టారు. ఇలా అయిదు నెలల తర్వాత 2150 మీటర్ల ఎత్తులో డెహ్రాడూన్‌కు ఉత్తరాన గల ముస్సోరిని చేరుకున్నారు. ఇక్కడ ఎవరెస్టు తన శాశ్వత కార్యాలయానికై ఓ పాత ఎస్టేట్‌ను ఖరీదు చేసాడు. కార్యాలయం, గణన గదులు, రికార్డులు పెట్టడానికి ప్రత్యేక సౌకర్యాలను, పరికరాల భద్రతకు, ఇతర వాటిని తయారు చేయడానికి గోదాముల్ని, కర్మాగారాన్ని సిద్ధం చేయించాడు. సిబ్బంది వుండడానికి నిర్మాణాలు చేసారు.
ఎస్టేట్ నుంచి ఈశాన్య దిశలోని హిమనీనద శిఖరాలు, హిమాలయాల సుందర దృశ్యాలు గత 20 సంవత్సరాల అలసటను తీర్చాయి. మనస్సు కుదుట పడడమే కాక, అందరికీ ఆహ్లాదకర వాతావరణం స్వస్థతను చేకూర్చింది. ఇప్పుడు ఎవరెస్టుతో పాటు అందరి చూపులు మనోహరమైన పర్వతాలపై నిలిచాయి.
చివరి మజిలి హతిపాం! నేడో శిథిలావస్థ శిఖరం!!
మానవుడి కృషికి ఓ ఆనవాలుగా, భారత్ ఉపఖండ రేఖాంశ మహా చాపానికి తుది వేదికగా, ఓ చారిత్ర ఘట్టంగా హిమాలయ పర్వతశ్రేణులను ప్రపంచంలోనే మొనగాడి శిఖరాలని చాటిచెప్పిన ఎవరెస్టు మలివిడిదియే ముస్సోరిలోని హతిపాం! అనగా ఏనుగు పాదమని అర్థం! ఇది ఏనుగులకు ఆలవాలమైన శివాలిక్ కొండల్లో వుంది. 600 ఎకరాల విస్తీర్ణం గల ఈ ఎస్టేట్‌ను 1832లో ఓ బ్రిటీష్ కల్నల్ అమ్మగా ఎవరెస్టు కొన్నాడు. తన మహాచాప చివరి కొలతలను, గణనాలకు, హిమశిఖరాల పరిశీలనలకు ఇది అనువుగా వుంటుందని, అనుకూలంగా దాన్ని అభివృద్ధిచేసాడు. ప్రభుత్వం వ్యతిరేకించినా 1833లో కలకత్తాలోని సర్వే కార్యాలయంలోని ముఖ్య పరిపాలనా విభాగాన్ని, సర్వే సిబ్బందిని హతిసాంకు మార్పించాడు. మిగత గణన విభాగం, మ్యాప్‌ల తయారి డిపెన్నింగ్ ఆధ్వర్యంలో కలకత్తాలోనే వుంచారు. ఎవరెస్టు మాటను కాదలనేని ప్రభుత్వం ముస్సోరి కన్నా డెహ్రాడూన్ బాగుంటుందని కార్యాలయాన్ని మార్చమన్నారు. ఎవరెస్టు ఒప్పుకొని మార్చాడు. అలాగే ఇప్పటికి సర్వే ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం డెహ్రడూన్లోనే వుండడం గమనార్హం!
నూతన విధానాలతో ఉత్తరదిశ సర్వే!
లాంబ్టర్ మరణం, ఎవరెస్టు అనారోగ్య మార్పులతో సర్వే మధ్య భారత్‌లోని సిరోంజి దగ్గరే ఆగిపోయింది. దాదాపు ఎనిమిది సంవత్సరాల తర్వాత 1833 నవంబర్‌లో మధురకు ఎవరెస్టు చేరుకున్నాడు. మహాచాపం ఉత్తర దిశకు పొడగించే దారిలో గ్వాలియర్, ఆగ్రా, ఢిల్లీలున్నాయి. ఈ ప్రాంతాలు సర్వేకు అనుకూలంగా లేకపోవడంతో దృశారేఖ జాడతీయడం (ray tracing) అనే కొత్త పద్ధతిలో చక్రసాధనాన్ని, దిక్సూచిని ఉపయోగించి దృశారేఖ స్థానాన్ని ఎవరెస్టు గుర్తించాడు. 1833-34లలో ఫతేపూర్ సిక్రినుంచి సర్వే చేస్తుండగా అక్బర్ సమాధిపై జండా కర్రను పెట్టాడు. ఇక్కన్నుంచి ఆయన కొత్త పద్దతుల్ని ఉపయోగించాడు.
1834 ఏప్రిల్‌లో ప్రాధమిక త్రిభుజీకరణ ఢిల్లీకి చేరింది. ఇక్కడి నుంచి శివాలిక్ కొండలకు చేరింది. ఈ కొండ నుంచి చాపాన్ని డెహ్రడూన్‌కు, ముస్సోరికి దించడానికై అడ్డంకిగా వున్న ఓ కొండను ఆరు మీటర్ల ఎత్తు తవ్వి తగ్గించాడు.
మహాచాపాన్ని రష్యాకు పొడగించడం :
భూమి నిర్ధిష్ట ఆకారం తెలుసుకోవాలంటే, మహాచాపాన్ని టిబెట్ నుంచి ఉత్తర రష్యా భూభాగంలోని నొవా జెమ్బ్లా (Nova Zembla) కు పొడగించాలని ఎవరెస్టు తలిచాడు. కాని, బ్రిటీషు వారితో వున్న వైరుధ్యంతో అక్కడి ప్రభుత్వాలు (రష్యా, చైనా) సహకరించే అవకాశం లేదు. ప్రభుత్వం చొరవ తీసుకోలేదు. ఇదే జరిగితే, విమానయాన, నౌకాయాన మ్యాపుల తయారి సులభమని, స్వాభావికమైన భూ పరిమాణం తెలుస్తే భూమిని భవిష్యత్ అవసరాలకు సరిగ్గా వినియోగించుకోవచ్చుననేది ఎవరెస్టు భావన!

హిమాలయాల్ని బాహ్య ప్రపంచానికి పరిచయం చేసిన సర్వేయర్లు :
ఇతిహాసాల్లో హిమాలయాల ప్రస్తావన వున్నా వాటి ఔన్నత్యం తెలియదు. అలాగే చాలా కావ్యాల్లో కనపడుతుంది. (వరూధిని / ప్రవరాఖ్యుడు). మార్కోపోలో, డెసిడెరి ఫ్రాన్సిస్ యంగ్హస్బండ్ లాంటి వారు ఈశ్రేణులగుండా ప్రయాణించి, ఇవి మహా దుర్భేధ్యాలని ప్రకటించారు. జీవనదులైన యమున, గంగా, బ్రహ్మపుత్ర, సింధూలాంటి నదులకు భారత ఉపఖండం వైపు పుట్టినిల్లు. అలాగే ఉత్తరం వైపు మరికొన్ని నదులు ఆయా దేశాల్లో ప్రవహిస్తాయి. మానవ మనుగడకు, అనేక జాతులకు ఇవి ఆలవాలాలు.
బెంగాల్‌పై 1757లో దాడి తర్వాత కలకత్తా కేంద్రంగా బ్రిటీషువారి పాలన మొదలైంది. వీరి ఆక్రమిత భూభాగాల్ని సర్వే చేయాలని భావించిన నాటి గవర్నర్ రాబర్ట్ క్లైవ్ (Clive) 1760లో మేజర్ జేమ్స్రెన్నెల్ (Rennel)ను మొదటి సర్వేయర్ జనరల్‌గా నియమించాడు. 1800లో మద్రాస్ గవర్నర్ జనరల్ మూడు సర్వే బృందాల్ని ఏర్పాటు చేయగా, మూడోదాని విలియమ్ లాంబ్టన్ నాయకట్వం వహించాడు. ఈయనే ఈ మహాచాపం యొక్క రూపకర్త, సృష్టికర్త.
రెన్నెల్ తన సర్వేలోని భాగంగా భూటాన్ చేరి మంచుచే కప్పబడ్డ శిఖరాల్ని చూడగా, అందులో ఎత్తైన చొమోలారి (Chomo lhari) ఒకటి. అప్పటి దాకా అరావత్, మౌంట్ బ్లాంక్, టైనిరైస్, చింబొరాజో, ఆన్డిస్ పర్వతాలే ప్రపంచంలో ఎత్తైన శిఖరాలుగా గుర్తించబడ్డాయి. కాని చొమోలారి వీటన్నింటికన్నా ఎత్తైనదని రెన్నెల్ మొదటిసారి ప్రస్తావించాడు. కలకత్తా హైకోర్ట్ జడ్జీ, ఏసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాలును స్థాపించిన సర్ విలియం జోన్స్ (Jones), భాగల్పూర్ నుంచి ఇదే శిఖరాన్ని 1784 అక్టోబర్ అయిదున చూసాడు.
అదే సమయంలో నేపాల్ ప్రభుత్వం రెండు సర్వే బృందాల్ని ఆహ్వానించింది. ఒక బృందంలో వున్న కల్నల్ చార్లెస్ క్రాఫర్డ్ (Crawford) దిశాకోణాలతో, మౌల్యరేఖ ఉపయోగించి కొలతలు చేసి హిమాలయ శ్రేణులపై 1805లో ఓ నివేదికను తయారు చేసాడు. తర్వాత నేపాల్, బ్రిటీషు మధ్యన స్నేహ సంబంధాలు దెబ్బతినడంతో చాలా సంవత్సరాలు సర్వేకు అంతరాయం ఏర్పడింది.
పర్వత శ్రేణుల పరిశీలనపై అభిరుచిగలిగిన రాబర్ట్ కొలెబ్రూక్ (Robert Cole Brooke), హెన్రీ కొలెబ్రూక్ (Henery Cole Brooke)లు ఈ సర్వేకు పూనుకున్నారు. ఇందులో రాబర్ట్ సైనికుడు కాగా, హెన్రీ బీహార్‌లోని పూర్ణిమాజిల్లా అసిస్టెంట్ కలెక్టర్. మొదట హెన్రీ 1790లో వరుస పరిశీలనల్ని మొదలుపెట్టి, భాగాల్పూర్ నుంచి జోన్స్ చూసినదానికంటే 144 కి.మీ. ముందు కెళ్ళి ఆ శిఖరం చొమోలారి 7924 మీటర్ల ఎత్తులో వున్నట్లు నిర్దారించాడు. తర్వాత ఈ పనిని రాబర్ట్ కొలెబ్రూక్కు అప్పజెప్పాడు. అప్పటికే బ్రిటీషువారి ఆధీనంలోకి వచ్చిన ఆక్రమిత, దత్తత మండలాల్ని (ఉత్తరాఖండ్) సర్వే చేయాలని ప్రభుత్వం భావించింది. రాబర్ట్ 1807-08లో పని ప్రారంభించాడు. కాని ఈ సర్వేను లాంబ్టన్ చేసిన విధంగా గణిత సూత్రాలకు లోబడి జరగలేదు. అయినా గంగానది ఉపనదులైన గాహగ్రా, రప్తి
ఉపనదులకు ఎదురొడ్డి పర్వత పాదాలను చేరుకున్నాడు. గోరక్‌పూర్ నుంచి మరియు నేపాల్ నైరుతి సరిహద్దున గల పిల్భీట్ నుంచి పర్వత శ్రేణుల్ని పరిశీలన చేసాడు. అనారోగ్యంతో రాబర్ట్ 1808 సెప్టెంబర్ 21న 45 సం।। వయస్సులో చనిపోయాడు. మిగతా సర్వేని తన సహాయకుడైన లెప్టినెంట్ విలియం వెబ్‌కు (Webb) అప్పజెప్పాడు. (తరువాయి వచ్చే సంచికలో)
– డా।। లచ్చయ్య గాండ్ల, 9440116162