ప్రపంచ వారసత్వ కట్టడంగా ఎంపిక
కాకతీయుల కళావైభవానికి యునెస్కో గుర్తింపు
రాళ్లలో పూలు పూయించిన అలనాటి శిల్పి అపురూప కళాఖండమైన రామప్ప అస్తిత్వం నేడు అంతర్జాతీయంగా వైభవోపేతమైంది. భారతీయ శిల్ప కళాచరిత్రలో అతి విలక్షణమైన స్థానాన్ని చాటిన శైలి కాకతీయ శిల్పానిది. ఈ శైలిలో కూడా మరింత విశిష్టమైనది రామప్ప. రామప్ప గుడిగోడల రమణీయ మంజరులని మహాకవులు కీర్తించిన మదనికలు.. లలిత కళాభిమానులను మంత్ర ముగ్ధులను చేశాయి. ఈ శిల్ప సౌందర్యం ఒకరికి కవిత్వానుభూతి కలిగిస్తే.. మరొకరి హృదయంలో పాటై అలరించింది. జాయపసేనాని చేత నూతన నాట్యభంగిమలనే ఆవిర్భవింపజేసింది. యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపుపొందిన రామప్ప రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఈ ఖ్యాతి గొన్న తొలి నిర్మాణం.
ఇసుక పునాదులు! తేలే ఇటుకలు! రాయిని మీటితే రాగాలు! నల్ల రాతిపై సొగసైన మదనికలు! సూది బెజ్జం సందుతో అతి సూక్ష్మ శిల్పాలు! విభిన్న రూపాల్లో వందలాది ఏనుగుల బొమ్మలు! అదరహో అనిపించే శిల్ప కళా వైభవం.. ఇప్పటికీ అబ్బుర పరిచే అప్పటి ఇంజనీరింగ్ టెక్నాలజీ విశ్వవిఖ్యాతమైంది! అంతర్జాతీయ వారసత్వ కట్టడంగా యునెస్కో గుర్తింపు లభించింది! గత కొన్ని ఏండ్లపాటు తెలంగాణ రాష్టప్రభుత్వం సలిపిన అవిరళ కృషికి దక్కిన ఫలితం ఇది.
కాకతీయుల ఘనమైన శిల్పకళా వైభవానికి, అద్భుత నిర్మాణశైలికి ప్రతీక, 800 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన సుప్రసిద్ధ రామప్ప ఆలయం వైపు ఇప్పుడు విశ్వమంతా అబ్బురపడి చూస్తోంది. తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాలంపేటలోని రామప్ప ఆలయానికి అరుదైన గౌరవం లభించింది. రామప్పకు ప్రపంచ వారసత్వ సంపదగా ఐక్యరాజ్యసమితి విద్యా, విజ్ఞాన సాంస్కృతిక సంస్థ (యునెస్కో) గుర్తింపు లభించింది. చైనాలోని ఫ్యూజు వేదికగా యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీ (యూడబ్ల్యూహెచ్‍సీ) సమావేశం వర్చువల్‍గా జరిగింది. ఆదివారం (25.7.2021) సాయంత్రం 4:36 గంటలకు డబ్ల్యూహెచ్‍సీ ప్రతినిధులు రామప్పను ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలోకి చేర్చారు. రామప్పకు మద్దతుగా రష్యా సహా 17 దేశాలు ఓటు వేశాయి. రామప్పకు అరుదైన గుర్తింపు లభించడం పట్ల తెలంగాణ సహా దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.
ఇవీ ప్రమాణాలు..
సాంస్కృతిక సంపదను పరిరక్షిస్తూ ఆ వారసత్వాన్ని వచ్చే తరాలకు అందించడమే యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాల ఎంపిక వెనుక ముఖ్య ఉద్దేశం. అయితే ఓ నిర్మాణం, ప్రపంచ వారసత్వ కట్టడంగా ఎంపిక జరగాలంటే కొన్ని ప్రమాణాలున్నాయి. ఆ మేరకే యూడబ్ల్యూహెచ్‍సీ ఎంపిక చేస్తుంది. సదరు కట్టడం.. మానవ నిర్మాణ శైలిలో తనదైన ప్రత్యేకతను కలిగివుండాలి. ఓ తరం సంస్కృతికి సంబంధించి గానీ, ప్రత్యేకంగా ఓ కాలానికి సంబంధించి గానీ మానవ విలువల్లో వచ్చిన మార్పును ప్రతిబింబించేదిగా ఉండాలి. నాటి కళలకు సంబంధించిన భావనలు ప్రాముఖ్యతను కలిగి ఉండాలి. కట్టడం జీవితకాలానికి సంబంధించి ధరిత్రి చరిత్రకు ఉదాహరణగా ఉండాలి.
ఎంపిక విధానం..
ఇప్పటికే పలుమార్లు యునెస్కోకు నామినేట్ అయిన రామప్పకు ఈసారి ‘గుర్తింపు’ అంత తేలిగ్గా ఏమీ లభించలేదు. రామప్ప ఎంపిక పరంగా సమావేశంలో తీవ్ర నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రపంచ వారసత్వ జాబితాలోకి రామప్పను చేర్చడాన్ని నార్వే వ్యతిరేకించింది. రామప్పను ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తించేందుకు తొమ్మిది అంశాలను 2019లో పాలంపేటను సందర్శించిన పురావస్తు కట్టడాలు, క్షేత్రాల అంతర్జాతీయ మండలి (ICOMOS) ప్రతినిధులు తమ నివేదికలో ప్రస్తావించారు. తదుపరి సాంకేతిక నిపుణులతో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు ఈ అంశాలతో కమిటీకి ఆన్‍లైన్ ద్వారా, ప్రత్యక్షంగా వెళ్ళి పైన పేర్కొన్న విషయాలను వివరాలను చాలా దేశాల ప్రతినిధులకు ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా అందజేశారు. అయితే తక్షణమే రామప్పను వారసత్వ కట్టడంగా గుర్తించేలా రష్యా ప్రత్యేక చొరవ తీసుకుంది. 2019 నాటి ICOMOS నివేదికను 22.7 నిబంధన కింద రామప్పను కట్టడాల నామినేషన్లలో పరిగణనలోకి తీసుకునేలా చేసింది. అటు భారత్ కూడా దౌత్య పద్ధతిలో రాయబారం నెరిపింది. చారిత్రక కట్టడాలను ఎంపిక చేసేందుకు విచ్చేసిన 24 దేశాల ప్రతినిధులకు చారిత్రక కట్టడంగా రామప్ప విశిష్టత గురించి వివరించింది. ఇది ఫలితాన్నిచ్చింది.
రామప్పకు మద్దతుగా 24 దేశాల్లో రష్యా సహా ఇథియోపియా, ఒమన్, బ్రెజిల్, ఈజిప్ట్, స్పెయిన్, థాయ్‍లాండ్, హంగరీ, సౌదీ అరేబియా, సౌత్ ఆఫ్రికా తదితర 17 దేశాలు ఓట్లు వేశాయి. 2019లో భారత్ నుంచి యునెస్కోకు రామప్ప ఆలయం ఒక్కటే నామినేట్ అయింది. రామప్పకు మనదేశం నుంచి ఇతర కట్టడాలేవీ పోటీలో లేకపోవడమూ కలిసొచ్చింది. రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ గుర్తింపు కోసం కొన్నేళ్లుగా ప్రయత్నాలు సాగాయి. రామప్ప తొలిసారిగా 2012లో యునెస్కోకు నామినేట్ అయింది. తర్వాత 2013, 14, 19లో నామినేట్ అయింది. 2019 వారసత్వ కట్డడాల ఎంపిక కోసం 2020లో జరగాల్సిన యునెస్కో ప్రతినిధుల సమావేశం కరోనా కారణంగా ఈ ఏడాదికి వాయిదా పడింది.
భారీ కసరత్తు తర్వాతే…
ఏదైనా పురాతన కట్టడానికి ఐక్యరాజ్య సమితి విద్య, వైజ్ఞానిక, సాంస్కృతిక సంస్థ(యునెస్కో) ప్రపంచ వారసత్వ గుర్తింపు రావాలంటే.. దాని వెనక భారీ కసరత్తే ఉంటుంది. ఎన్నెన్నో అంకాలను దాటి వెళ్లాక గానీ, ఓ కట్టడానికి యునెస్కో గుర్తింపు రాదు. యునెస్కో ప్రపంచ వారసత్వ కన్వెన్షన్‍లో భాగస్వామ్యమైన దేశాలకు మాత్రమే.. కట్టడాల జాబితాతో కూడిన నామినేషన్లు పంపే వీలుంటుంది. యునెస్కో ఈ విధానాన్ని 1972లో ప్రారంభించగా.. భారత్ ఆ కన్వెన్షన్‍లో 1977 నవంబరు 14న చేరింది. ప్రస్తుతం 194 దేశాలు ఈ కన్వెన్షన్‍లో ఉన్నాయి.
ప్రభుత్వాలు తమ దేశంలోని వారసత్వ కట్టడాల జాబితాను.. మ్యాపులు, ఇతర వివరాలతో కలిపి తొలుత యునెస్కోకు పంపాల్సి ఉంటుంది. దీనికీ పలు క్రైటీరియాలు ఉన్నాయి. ఒకసారి జాబితాను పంపాక.. సంబంధిత కట్టడానికి సంబంధించిన మరిన్ని వివరాలను చేర్చవచ్చు. ప్రపంచ వారసత్వ కేంద్రం దాన్ని పరిశీలించి, ఏమైనా మార్పులు చేయాల్సి ఉన్నా.. అదనపు సమాచారాన్ని జోడించాల్సి ఉన్నా.. సలహాలు, సూచనలు చేస్తుంది. ఆ కేంద్రం అధికారులు నామినేషన్‍పై సంతృప్తి చెందితే.. దాన్ని సలహా మండలికి పంపుతారు. ప్రపంచ వారసత్వ మండలిలో మూడు అడ్వయిజరీ బోర్డులు ఉంటాయి. అవి.. అంతర్జాతీయ పురాతన కట్టడాలు, స్థలాలపై సలహా మండలి, అంతర్జాతీయ ప్రకృతి సంరక్షణ మండలి, అంతర్జాతీయ సాంస్కృతిక ఆస్తుల పరిరక్షణ, పునరుజ్జీవ కేంద్రం. ఈ మూడు మండళ్లు స్వతంత్రంగా పనిచేస్తాయి. ఇవి నామినేషన్లను క్షుణ్ణంగా పరిశీలిస్తాయి. వీలును బట్టి క్షేత్రస్థాయి లో పర్యటిస్తాయి. ఆ తర్వాత త మ నివేదికలను ప్రపంచ వారసత్వ కమిటీకి అందజేస్తాయి.
రాష్ట్ర ప్రభుత్వ కృషికి ఫలితం
రామప్ప ఆలయానికి వారసత్వ గుర్తింపు సాధించేందుకు తెలంగాణ ప్రభుత్వం 2015 నుంచి ప్రయత్నిస్తున్నది. ప్రభుత్వ కృషి ఫలితంగా 2019 సెప్టెంబర్‍లో యునెస్కో తరఫున ఐకోమాస్ ప్రతినిధి వాసుపోశానందన్ ఆలయాన్ని పరిశీలించి వెళ్లారు. ఆయన సూచనలతో 2020 సంవత్సరానికి ప్రపంచ వారసత్వ జాబితాలో చేరేందుకు భారత్ తరఫున రామప్ప దేవాలయం నామినేట్ అయ్యింది. గత నెలలో రాష్ట్ర మంత్రులు, అధికారుల బృందం ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులను కలిసింది. రామప్పకు వారసత్వ హోదా కల్పించే ప్రయత్నాలు ముమ్మరం చేయాలని నేతలు కోరారు. కట్టడం విశిష్టతలను తెలుపుతూ రాష్టప్రభుత్వం వీడియోలు, పుస్తకాలను రూపొందించింది. ఐకోమాస్ సూచన మేరకు రామప్ప సమీపంలోని రెండు ఆలయాలను ప్రధాన ఆలయ పరిధిలోకి తెచ్చారు. రాష్ట్రస్థాయిలో వివిధ శాఖలతో సమన్వయానికి కమిటీ వేశారు.
గుర్తింపుతో ప్రయోజనాలు ఇవీ
రామప్పకు ప్రపంచ వారసత్వ హోదాతో కాకతీయుల శిల్పకళా వైభవం ఖండాతరాలకు వ్యాపించనున్నది. భూగోళం నలుమూలల నుంచి పర్యాటకులు తరలివచ్చే అవకాశం ఉన్నది. కల్చరల్ ఎక్స్చేంజ్ (సాంస్కృతిక మార్పడి) జరుగుతుంది. ఆలయ పరిరక్షణకు యునెస్కో ఆర్థిక, సాంకేతిక సహకారం అందిస్తుంది. వరల్డ్ హెరిటేజ్ ఫండ్-1977 కింద ఆలయ అభివృద్ధికి నిధులు అందుతాయి. భూకంపాలు, వరదలు వచ్చినప్పుడు కట్టడానికి ప్రమాదం వాటిల్లితే పునరుద్ధరిం చేందుకు ర్యాపిడ్ రెస్పాండ్ ఫండింగ్ కూడా లభిస్తుంది. కట్టడం రక్షణకు యునెస్కో సాంకేతిక సహకారం, శిక్షణ ఇస్తుంది.
రామప్ప ఆలయంపై ఐకోమాస్ లేవనెత్తిన 9 లోపాలపై 2022లో మరో నివేదికను రాష్ట్ర ప్రభుత్వం సమర్పించాల్సి ఉంటుంది. ఆలయ సరిహద్దుల విస్తరణ, కామేశ్వరాలయం, రామప్ప చెరువు తదితర ప్రాంతాలపై మరింత స్పష్టత రానున్నది. ఐకోమాస్ సూచనల మేరకు రామప్ప ఆలయ పరిధిని మరింత పెంచే వీలున్నది.
కల సాకరమైన వేళ…
యునెస్కో అధికారులు చారిత్రక రామప్ప ఆలయాన్ని ప్రపంచ వారసత్వ ప్రదేశం (డబ్ల్యూ హెచ్‍ఎస్) స్థితిగతుల ప్రకారం సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేశారు. చారిత్రాత్మక ‘రామప్ప’ ఆలయం ప్రపంచ వారసత్వ ప్రదేశ హోదాను పొందింది. ఇది తెలంగాణ ప్రజల కల నెరవేర్చిన క్షణం అవుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల నుండి ప్రపంచ వారసత్వ ప్రదేశ హోదా పొందిన మొదటి ప్రదేశం రామప్ప ఆలయం.
ప్రపంచ వారసత్వ ప్రదేశం (డబ్ల్యూహెచ్‍ఎస్) హోదా వల్ల రాష్ట్రానికి చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఈ స్థితి తెలంగాణలో పర్యాటకాన్ని గణనీయంగా పెంచుతుంది. ఇది స్థానికుల జీవనోపాధిలో నిరంతర అభివృద్ధికి దారితీస్తుంది. ముఖ్యంగా పెట్టు బడులను ఆకర్షిస్తుంది. ఆర్థికేతర ప్రయోజనాలు చరిత్ర, సంస్కృతిని పరిరక్షించడం, సృజనాత్మకతను పెంపొందించడం. సంక్షిప్తంగా స్థానిక ఆర్ధికవ్యవస్థను పెంచుతుంది. స్థానిక, ప్రపంచ పర్యాటక రంగానికి దోహదపడుతుంది. ఇది ఉపాధి, ఆదాయ ఉత్పత్తికి దారితీస్తుంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ తరువాత ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఈ వారసత్వ సంపదపై ప్రత్యేక దృష్టి ప్టెడం వల్ల ప్రపంచపటంలో తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి ఫలించి తెలంగాణ ప్రజల కల నిజమైంది.
(మరింత సోర్స్ : ఇంటర్నెట్)
-సువేగా, ఎ : 9030 6262 88