సమాచార సాంకేతిక రంగంలో – బహుముఖ ప్రయోజనకారి


బిగ్‍డేటా…!!


దారిద్య్రరేఖకు దిగువనున్న వర్గాల ప్రజలందరినీ పేదరిక విషవలయం నుండి వెలుపలికి తీసుకొచ్చేందుకు దేశంలోని ప్రజలందరి యొక్క వ్యక్తిగత అర్హతలు, ఆయా పథకాల నియమ నిబంధనల సమాచారాన్ని క్రోడీకరించి వారందరికీ విభిన్న రకాల సంక్షేమ పథకాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విజయవంతంగా అమలు చేస్తూ, దేశం నుండి పేదరిక మహమ్మారిని తుదముట్టించేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నాయి.


అమెజాన్‍, ఫ్లిప్‍కార్ట్, స్నాప్‍డీల్‍ వంటి ఎలక్ట్రానిక్‍ వాణిజ్య వేదికలు (E-Commerce Platforms) తమ వినియోగ దారుల నుండి ఇష్టాలు మరియు భాగస్వామ్యాల (Likes & Shares) రూపంలో వెలువడే వారి ప్రతిస్పందనలకు సంబంధించిన సమాచారాన్ని నమోదుచేసుకుని తదను గుణంగా, వారికి సేవలు అందిస్తూ భారీ స్థాయిలో లాభాలు ఆర్జించడం మనందరం చూస్తూనే ఉన్నాం. ‘ఫేస్‍బుక్‍, ట్విట్టర్‍, యూట్యూబ్‍, కూ’ లాంటి సామాజిక మాధ్యమాలు కూడా వినియోగ దారుల ఇష్టాయిష్టాలను తెలుసుకొని, తదనుగుణంగా తమ సంస్థల నిర్వహణలో మెళకువలు పాటిస్తూ కోట్లాదిరూపాయల లాభాలు ఆర్జిస్తున్నాయి. అంతేకాకుండా భూవాతావరణంలో సంభవించే మార్పులకు సంబంధించిన సమాచారాన్ని అనుక్షణం నమోదు చేసుకుంటూ, వాటి పర్యవసానాలను నిరంతరం, నిశితంగా పరిశీలిస్తూ ఎల్‍నినో, లానినా, కరువులు, భూకంపాలు, వరదలు, సునామీల్లాంటి ప్రకృతి విపత్తుల నుండి ప్రపంచవ్యాప్తంగా నున్న విభిన్న వాతావరణ కేంద్రాలు ప్రజలను కంటికి రెప్పలా కాపాడుతున్నాయి. ఇవి మచ్చుకు కొన్ని ఉదా।।లు మాత్రమే. అయితే ఇలా విభిన్న సంస్థలు ఎలా తమ ప్రయాణాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నాయని తరచిచూస్తే, మనకు లభించే ఏకైక సమాధానమే ‘‘బిగ్‍డేటా’’. ‘‘ఇందుండు డందుగలదని సందేహం వలదన్నట్లు’’ ప్రతీ రంగంలోనూ బిగ్‍ డేటా విస్తృత ప్రయోజనాలందించే కల్పవృక్షంగా విరాజిల్లుతోంది. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన బిగ్‍డేటా గురించి మనం కూడా తెలుసుకుందామా!!


బిగ్‍డేటా అంటే?
మనం కంప్యూటర్‍తో ఏవైనా క్రియలను నిర్వహించేటపుడు అక్షరాలు, అంకెలు, విభిన్న సంకేతాల రూపంలో ఉత్పత్తి కాబడే వాటిని సమాచారం (Data) అంటారు. ఈ సమాచారమంతా (Data) ఎలక్ట్రిక్‍ సంకేతాల రూపంలో కంప్యూటర్‍లో నిల్వచేయబడి, ప్రసారం చేయబడుతుంది.
పెద్ద మొత్తంలో సమాచారాన్ని (డాటా) ‘బిగ్‍డేటా’ (Bigdata also data, But with huge size) అంటారు. కాలం గడిచే కొద్దీ దీని పరిమాణం కూడా విపరీతంగా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి బిగ్‍డేటా అత్యధిక పరిమాణం (Huge Volume) మరియు అత్యంత సంక్లిష్టతలతో (Complexity) కూడి ఉంటుంది. అందువల్ల దీనిని సాంప్రదాయ గణన యంత్రాలు నిల్వచేయడం, ప్రసారం చేయడం లాంటి పక్రియల్ని సమర్థవంతంగా నిర్వహించలేవు.


బిగ్‍డేటా – దానిలోని రకాలు బిగ్‍ డేటా క్రింద పేర్కొన్న విధంగా 3 రకాలుగా ఉంటుంది.
నిర్మాణాత్మక సమాచారం (Structured Data) :
ముందస్తుగా (Preset) ఒక స్థిరమైన ఆకృతిలోకి మార్చి, క్రమపద్ధతిలో అమర్చిన సమాచారాన్ని నిర్మాణాత్మక సమాచారం అంటారు. ఇది ఒక పట్టిక రూపంలో అడ్డు మరియు నిలువు వరుసలు (Rows & Columns)ను కల్గి ఉంటుంది. ఈ రకమైన సమాచారంలోకి సులభంగా ప్రవేశించి (Access) మనకు కావలసిన సమాచారాన్ని పొందవచ్చు. ఈ రకమైన సమాచారాన్ని నవీకరించడం గానీ లేదా తొలగించడం గానీ చాలా తేలిక. అంతేకాకుండా దీనిని సాంప్రదాయ దత్తాంశనిధి అయిన అనుసంధాన దత్తకోశ నిధి (Relational Database management System – RDMS)లో ఫైల్స్ మరియు రికార్డస్ రూపంలో నిల్వచేయవచ్చు.
ఉదా: ఎస్‍క్యూఎల్‍ (SQL-Structured query language)) డేటాబేస్‍, ఎక్సెల్‍ షీట్స్, ఆన్‍లైన్‍ పత్రాలు (Online firms), జీపీఎస్‍ లేదా ఆర్‍ఎఫ్‍ఐడీ ట్యాగ్స్


నిర్మాణాత్మకం కాని సమాచారం (Unstructured Data) :
ముందస్తుగా (Preset) ఒక క్రమపద్ధతిలో అమర్చని, స్థిరమైన ఆకృతి లేనటువంటి సమాచారాన్ని నిర్మాణాత్మకం కాని సమాచారం (Unstructured Data) అంటారు. దాదాపు 80 నుండి 90 శాతం నిర్మాణాత్మకం కాని సమాచారం ప్రపంచ వ్యాప్తంగా నున్న విభిన్న రకాల సాంకేతిక సంస్థల నుండి ఉత్పత్తి అవుతుంది. నిర్మాణాత్మక సమాచారంతో పోలిస్తే దీని పరిమాణం కాలం గడిచే కొద్దీ శరవేగంగా పెరుగుతుంది. అయితే దీనిని సాంప్రదాయ బద్ధంగా వినియోగించే అనుసంధాన దత్త కోశనిధిలో నిల్వచేయలేము. No sql డేటాబేస్‍, డేటాలేక్స్, డేటావేర్‍హౌసెస్‍ లాంటి వాటిలో నిలవచేయవచ్చు. ఈ రకమైన సమాచారంలో అక్షరాలు (letters), చిత్రాలు (images), దృశ్యరూపకాలు (videos) లాంటివి ఉండడం వల్ల, సాధారణ సాఫ్ట్వేర్స్ సహకారంతో, నిర్మాణాత్మక సమాచారం (Structured Data)లో లాగా దీనిలోకి సులువుగా ప్రవేశించడం (Access), వెతకడం (Search), ప్రసారం (Process), విశ్లేషణ (Analysis) లాంటి కార్యక్రమాలు చేయడం అంత సులువు కాదు. ఇలాంటి సమాచారం విశ్లేషణకు కృత్రిమ మేధ సహకారం తీసుకుంటారు. ఈ రకమైన సమాచారంలో ఎన్నో విలువైన విషయాలు ఉంటాయి. అత్యున్నత వాణిజ్య సంస్థలు తమ కీలక వ్యాపార నిర్ణయాలకు సంబంధించిన ప్రకటన చేసేటప్పుడు విలువైన సమాచారాన్ని ముందస్తుగా పరిశీలించడం జరుగుతుంది.
ఉదా : ఈ మెయిల్స్, సామాజిక మాధ్యమాలు మొబైల్‍, కమ్యూనికేషన్‍ మరియు విభిన్న శాస్త్రసాంకేతిక సంస్థల నుండి వెలువడే సమాచారం.


పాక్షిక నిర్మాణాత్మక సమాచారం (Semi-Structured data) :
డేటాకు ఉండవలసిన ఎలాంటి లక్షణాలు లేకుండా, కేవలం ఒక నిర్మాణాన్ని (Structure) మాత్రం కలిగి ఉన్న సమాచారాన్ని ‘‘పాక్షిక నిర్మాణాత్మక సమాచారం’’ అంటారు. దీనికి నిర్మాణాత్మక మరియు నిర్మాణాత్మకం కాని సమాచారం యొక్క రెండింటి లక్షణాలు ఉంటాయి. ఈ సమాచారాన్ని యథాతధంగా కాకుండా, కొన్ని మార్పులు చేర్పుల అనంతరం అనుసంధాన దత్తకోశ నిధిలో నిల్వచేయలేము. మంచి స్థిరమైన నిర్మాణం (Well defined structure) లేకపోవడం వల్ల దీనిని పోగ్రామ్స్ ద్వారా సులువుగా ఉపయోగించుకోలేము. అయితే ఈ సమాచారానికి ట్యాగ్స్ (Tags) మరియు ఎలిమెంట్స్ వంటి లక్షణాలు ఉండడం వల్ల దీనిని సులువుగా విశ్లేషించవచ్చు. ఈ సమాచారంలో అడ్డు మరియు నిలువు వరుసలు ఉండవు. ఉదా।। ఎక్స్ఎంఎల్‍ (XML) ఫైల్స్, జిప్‍ ఫైల్స్, వెబ్‍పేజెస్‍.


బిగ్‍ డేటా లక్షణాలు :
పరిమాణం (Volume) :
బిగ్‍డేటా పేరులోనే బిగ్‍ అన్నపదం ఉంది. అనగా దీని పరిమాణం పెద్దదిగా ఉంటుంది. డేటా యొక్క పరిమాణం, డేటా యొక్క విలువను నిర్ధారించడంలో కీలకపాత్ర పోషిస్తుంది. ఏదైనా ఒక సమాచారం బిగ్‍డేటానా, కాదా అన్నది దాని పరిమాణం (Volume)పైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి పరిమాణం అనేది బిగ్‍డేటా యొక్క ముఖ్యలక్షణంగా చెప్పవచ్చు.


భిన్నత్వం (Variety) :
బిగ్‍డేటా ఏకరూపాన్ని కలిగి ఉండదు. దీనిలో నిర్మాణాత్మకం (Structure), నిర్మాణాత్మకం కాని (Unstructure), పాక్షిక నిర్మాణాత్మకం (Semi Structure) వంటి భిన్నత్వం ఉంటుంది. గతంలో స్ప్రెడ్‍షీట్స్ (Spread Sheets) మరియు డేటాబేస్‍ (Database)లు మాత్రమే సమాచారానికి వనరులు (Sources)గా ఉండేవి. కానీ ప్రస్తుతం ఇమెయిల్స్, ఫోటోస్‍, వీడియోలు, ఆడియోలు, పీడీఎఫ్‍ (PDF)లు వంటి భిన్నమైన లేదా వైవిధ్యమైన సాధనాల నుండి డేటా లభిస్తోంది. ఇలా విభిన్న వనరుల నుండి లభించే నిర్మాణాత్మకం కాని (Unstructure Data) సమాచారాన్ని నిల్వచేయడం (Store), కావలసిన సమాచారాన్ని వెతికి పొందడం (Mining) మరియు విశ్లేషణ (Analysis) చేయడంలో కొన్ని సమస్యలున్నాయి.


వేగం (Velocity) :

ఎంత వేగంగా విభిన్న వనరుల నుండి సమాచారం (Data) ఉత్పత్తి అవుతుంది అన్న విషయాన్ని ఇది తెలుపుతుంది. వాణిజ్య సంస్థలు, అప్లికేషన్‍ లాగ్స్ (Application logos), నెట్‍వర్కస్, సామాజిక మాధ్యమ సంస్థలు, సెన్సర్స్ (Sensors), మొబైల్‍ సాధనాలు మొదలగు వాటినుండి బిగ్‍ డేటా అన్నది నిరంతరంగా మరియు అపరిమితంగా ఉత్పత్తి అవుతూనే ఉంది. ఇలా ఉత్పత్తి అయిన బిగ్‍డేటాను, విభిన్న వ్యక్తులు మరియు సంస్థల యొక్క అవసరాలకు అనుగుణంగా ఒక క్రమపద్ధతిలో వేరుచేసి (Process) అందిస్తారు.


వైవిధ్యం (Variability) :
సమాచారంలో నిరంతరాయంగా కలుగుతున్న మార్పులు లేదా వైవిధ్యాన్ని గురించి ఇది తెలుపుతుంది. అపరిపక్వ (Raw Data) సమాచారాన్ని అర్థం చేసుకోవడం, అందులోని విభిన్న పదాలకు అర్థాన్ని విశదీకరించడంపై Variability ప్రధానంగా దృష్టికేంద్రీకరిస్తుంది (The ways in which the big data be used and formatted). డేటా అనేది నిరంతరాయంగా మారుతూ ఉంటే, అది డేటా యొక్క నాణ్యతపై ప్రభావాన్ని చూపిస్తుంది.


ప్రామాణికత (Veracity) :

ఇది డేటా యొక్క ప్రామాణికత్వం లేదా ఖచ్చితత్వాన్ని సూచిస్తుంది. బిగ్‍డేటా విషయాని కొస్తే డేటా యొక్క నాణ్యతే కాకుండా, ఆ డేటా ఏరకానికి (Type) చెందినది ఎలా ప్రాసెస్‍ చేయబడింది, ఎక్కడి నుండి (Source) తీసుకోబడింది అన్న అంశాలు విశ్వసించదగినవిగా ఉండాలి.
ఇందుకోసం మన దగ్గరున్న బిగ్‍డేటాలో పక్షపాతం (bias), వైపరీత్యం (abnormality) లేదా అసమానత (inconsistency), నకిలీ (Duplication), అస్థిరత (Valatility) లాంటి లక్షణాలను నియంత్రించగలిగితే బిగ్‍డేటా యొక్క ప్రామాణికత మెరుగుపడుతుంది.


విలువ (Value) :
సాధారణంగా ‘‘ఎక్కువ పరిమాణంలో లభించిన సమాచారం లేదా బిగ్‍ డేటాకు’’ ఎలాంటి ప్రాముఖ్యత ఉండదు. అయితే అందులో ఉన్న సమాచారానికి కొన్ని మార్పులు, చేర్పులు చేసినట్లయితే దానికి ఒక నిర్దిష్టమైన రూపం వస్తుంది. అలాంటి నిర్దిష్టసమాచారాన్ని విభిన్న రకాల వ్యాపార సంస్థలు, వ్యక్తులు తమ అవసరాలకోసం ఉపయోగించుకుంటారు. తద్వారా ఆ సమాచారానికి ‘‘విలువ’’ పెరుగుతుంది.


బిగ్‍డేటా – విశిష్టత :
130 కోట్ల జనాభా ఉన్న భారత్‍ లాంటి దేశంలో బిగ్‍డేటా పరిశ్రమ ఎదుగుదలకు అపరిమితమైన అవకాశాలున్నాయి. ఇటీవల నాస్‍కామ్‍ (NASSCOM) నిర్వహించిన అధ్యయనం ప్రకారం ఇండియాలో డేటా అనలిటిక్స్ ఇండస్ట్రీ 2025 నాటికి 16 బిలియన్‍ డాలర్ల మార్క్ను చేరుకుంటుందని అంచనా.


బిగ్‍ డేటా అనువర్తనాలు :
ప్రభుత్వ పాలనా రంగంలో బిగ్‍డేటా ఈ క్రింది విధంగా కీలకమైన పాత్రను పోషిస్తుంది.


భద్రతా సంస్థలు మరియు పోలీస్‍శాఖ :
భత్రా సంస్థలు (Security Agencies) సైబర్‍ దాడులను నిరోధించడానికి, సెక్యూరిటీ విభాగాల పనితీరును మెరుగుపరచు కోవడానికి, కార్డ్ సంబంధిత మోసాలను పసిగట్టడానికి (Detect Card Related Fraud Cases), పోలీస్‍ శాఖ నేరగాళ్ళ కార్యకలాపాలను అంచనావేయడానికి ప్రధానంగా క్రైమ్‍ అండ్‍ క్రిమినల్‍ ట్రాకింగ్‍ నెట్‍వర్క్ అండ్‍ సిస్టమ్స్ నందు బిగ్‍డేటాను వినియోగిస్తారు.


విద్యారంగం :

విద్య యొక్క నాణ్యతను మెరుగుపరచడానికి బిగ్‍డేటాను వినియోగిస్తారు.


విపత్తు నిర్వహణ :
విపత్తులను అవగాహన చేసుకొని వాటికి సరైన నివారణ చర్యలు సూచించేందుకు బిగ్‍డేటా ఉపయోగపడుతుంది.


ఆర్థికరంగం :

ఈ రంగంలో బిగ్‍డేటా ద్వారా బహుళ ప్రయోజనాలున్నాయి. ప్రధానంగా భీమారంగంలో వినియోగదారులకు మంచి నాణ్యతతో కూడిన సేవలు అందిస్తూ, జాప్యం లేకుండా వారి యొక్క ఫిర్యాదులు పరిష్కరించవచ్చు. బ్యాంకింగ్‍ రంగంలో ఆర్థికపరమైన లావాదేవీలను క్రమపద్ధతిలో నిర్వహించవచ్చు. ఆర్థిక సంస్థల యొక్క నష్టాలను తగ్గించి, వారికి అనుకోకుండా సంభవించే ఆపదలను (Risks) నివారించవచ్చు. పన్ను ఎగవేతదారులపై తగు నిఘా ఉంచడం ద్వారా పన్ను ఎగవేతను అరికట్టవచ్చు. ఉత్పత్తి మరియు ధరల గణాంకాల ఆధారంగా స్థూలదేశీయోత్పత్తి (జీడీపీ)ని లెక్కించవచ్చు. తామర తంపరగా పుట్టుకొచ్చే షెల్‍ కంపెనీలను నిరోధించవచ్చు. మనీలాండరింగ్‍కు అడ్డుకట్ట వేయడం ద్వారా తీవ్రవాద సంస్థలకు నిధులు అందకుండా చర్యలు తీసుకోవచ్చు.


వైద్య ఆరోగ్యరంగం :
బిగ్‍డేటాను వైద్య ఆరోగ్యరంగంలో ఈ క్రింది విధంగా వినియోగించవచ్చు. రాబోయే వ్యాధులను ముందస్తుగా అంచనా వేయవచ్చు. సంక్రమించిన రోగాలకు తగు చికిత్స మరియు మందులు సూచించవచ్చు. రోగియొక్క క్లినికల్‍ డేటా ఉపయోగించుకొని రోగియొక్క ఆరోగ్యం విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు. కఠినమైన వ్యాధినిర్ధారణా పరీక్షలు (Critical Diagnostic Tests) మరియు నూతనంగా సంక్రమించే వ్యాధులకు తగు చికిత్స పద్ధతులు కనుగొనడానికి పరిశోధన మరియు అభివృద్ధి (R & D) సంస్థలో బిగ్‍డేటాను వినియోగిస్తారు.


ఆహార మరియు వ్యవసాయ రంగం :

ఆహార మరియు వ్యవసాయ రంగంలో మంచి నాణ్యత కలిగిన విత్తనాలను ఎంపిక చేయడానికి, వాతావరణంలో వచ్చే మార్పులను పసిగట్టడంలోనూ, నీటి పారుదల మరియు సమర్థవంతమైన నీటి యాజమాన్య పద్ధతుల వినియోగంలోనూ పంటల నాశించే వివిధ రకాల తెగుళ్ళను గుర్తించవచ్చు.


స్మార్ట్ గవర్నమెంట్‍ :

సత్వర నిర్ణయాలు తీసుకోవడం, ప్రజలకు కావలసిన సేవలు సకాలంలో అందజేయడం, ప్రభుత్వ విధానాలు ప్రజలు తెలుసుకొని, వాటిలో ప్రజలు భాగస్వామ్యం వహించేందుకు, జవాబుదారీతనంతో వ్యహరించేందుకు ప్రభుత్వ పాలన ఎంతో పారదర్శకంగా ఉండాలి. ఈ నిర్ణయాలన్నీ ఈ-గవర్నెన్స్ ద్వారా సులువుగా అమలు చేయవచ్చు. ఇందుకు బిగ్‍డేటా ఎంతో తోడ్పడుతుంది. అదేవిధంగా ప్రజల్లో కూడా సృజనాత్మకత, సాధికారత, సమ్మిళితత్వం (inclusivity) భాగస్వామ్య భావనలు, బిగ్‍డేటా వల్ల అభివృద్ధి చెందుతాయి. ఈ గవర్నెన్స్, స్మార్ట్ గవర్నెన్స్ సాకారంలో కీలక పాత్ర పోషిస్తుంది.


డిజిటల్‍ ఇండియా :

డిజిటల్‍ ఇండియాలో భాగమైన బ్రాడ్‍బాండ్‍ కనెక్టివిటీ, ఈ-క్రాంతి పథకం ద్వారా ప్రజలకు ఎలక్ట్రానిక్‍ ఆధారిత సేవలు అందజేయడం, ఓపెన్‍ డేటా ప్లాట్‍ఫామ్‍ను ప్రోత్సహించడం, అదే విధంగా డిజిటల్‍ లాకర్‍, ఈ-సైన్‍, మైగన్‍డాట్‍ ఇన్‍ (Mygov.in) లాంటి 9 విభాగాల ద్వారా సేవలదించడంలో ‘బిగ్‍డేటా’ కీలకపాత్ర పోషిస్తుంది.


ఆధార్‍ :

దేశంలోని కోట్లమంది ప్రజల గుర్తింపు పత్రంగా వినియోగించ బడుతున్న ఆధార్‍ కార్డ్ రూపకల్పన లోనూ, జన్‍ధన్‍- ఆధార్‍ – మొబైల్‍ (Jamtirinity) పథకాల అమలులోనూ ‘బిగ్‍డేటా టెక్నాలజీదే’ ప్రధాన పాత్ర అని చెప్పవచ్చు.


బిగ్‍ డేటాను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలు:
బిగ్‍డేటాను ప్రోత్సహిం చేందుకు ప్రభుత్వం కూడా అనేక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ‘‘నీతి ఆయోగ్‍’’ దేశంలోని ప్రైవేటు సంస్థలతో కలిసి జాతీయ సమాచార మరియు విశ్లేషణ వేదిక (National data & Analytics plattform) ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తోంది. ఇది పౌరులు, విధానకర్తలు మరియు పరిశోధకులకు కావలసిన సమాచారాన్ని అందించే ఏకైక వనరుగా వ్యవహరించనుంది.
భారత్‍ ఆడిట్‍ మరియు అకౌంట్‍ విభాగాన్ని బలోపేతం చేసేందుకు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ ప్రభుత్వరంగ సంస్థల్లో ఉత్పత్తి అయ్యే డేటానంతా సమగ్రపరిచి, విశ్లేషించేందుకు అనువుగా భారత కంప్ట్రోలర్‍ అండ్‍ ఆడిటర్‍ జనరల్‍ (కాగ్‍), సమాచార నిర్వహణ మరియు విశ్లేషణా కేంద్రం (Centre For Data Management and Analytics)ను ఏర్పాటు చేసింది.


భారత గణాంక మరియు పథక అమలు మంత్రిత్వశాఖ (Ministry of statistics and program implementation ) ‘నేషనల్‍ డేటా వేర్‍ హౌస్‍ అండ్‍ అఫిషియల్‍ స్టాటిస్టిక్స్’ అన్న సంస్థను స్థాపించాలన్న యోచనలో ఉంది. సాంకేతిక పరిజ్ఞానం మరియు బిగ్‍డేటా, విశ్లేషణా సాధనాలను వినియోగించి స్థూల అర్థశాస్త్ర గణాంకాలను ఈ సంస్థ ద్వారా మెరుగుపరచాలని గణాంక మంత్రిత్వశాఖ ప్రయత్నిస్తోంది.
భారత వ్యవసాయ మంత్రిత్వశాఖ దేశవ్యాప్తంగా నున్న వ్యవసాయ శాఖ ఆస్తులను మ్యాపింగ్‍ చేయడానికి ఇస్రోతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
స్మార్ట్ఇండియా, డిజిటల్‍ ఇండియా, డిజిటల్‍ ఎకానమీ
(ఉదా।। భీమ్‍ యాప్‍ (App) మొ।।నవి. దేశంలో బిగ్‍డేటాను వినియోగించి సుపరిపాలన (good governance) అందించేందుకు ప్రభుత్వం చేపట్టిన కొన్ని ప్రత్యేక చర్యలని చెప్పవచ్చు.


బిగ్‍డేటా వినియోగంలో ఎదురయ్యే సవాళ్ళు :
సాంకేతిక సమస్యలు :

అత్యధిక జనాభా కలిగిన భారత్‍ లాంటి దేశంలో ప్రజల నుండి సేకరించిన డేటాను నిలవచేసేందుకు కావలసిన మౌలిక సదుపాయాలను కల్పించడం ఎంతో వ్యయప్రయాసలతో కూడుకొన్న వ్యవహారం. కంప్యూటర్‍ స్టోరేజ్‍ యూనిట్లు మరియు సర్వర్లు పెద్ద మొత్తంతో డేటాను నిల్వచేయడం వల్ల ఒత్తిడి అధికమై అవి సక్రమ పనితీరును కనబరచక మొరాయించే అవకాశం ఉంది.


డేటా భద్రత :
ఆధార్‍ పత్రాలను జారీచేయడం కోసం ప్రభుత్వం మరియు వివిధ రకాల అవసరాల నిమిత్తం బ్యాంకులు, మొబైల్‍ నెట్‍వర్కస్ నిర్వహణా సంస్థలు, మరియు సామాజిక మాధ్యమ సంస్థలు దేశంలోని పౌరుల నుండి సేకరించిన డేటా బయటకు విడుదలయ్యి దుర్వినియోగం కాకుండా, సురక్షితంగా భద్రపరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కొన్ని సామాజిక మాధ్యమ సంస్థలు తమ వినియోగ దారుల డేటాను అక్రమంగా కొన్ని వ్యాపార సంస్థలకు అందజేశారన్న అపవాదు వినిపిస్తున్న నేపథ్యంలో యూరోపియన్‍, అమెరికాల తరహాలో మనదేశంలో కూడా డేటాను భద్రపరిచేందుకు అవసరమైన చట్టాలు రూపొందించి, నియమనిబంధనలను కఠినతరం చేయాలి.


చివరిగా :

బిగ్‍డేటా వల్ల ఎన్ని ప్రయోజనాలున్నాయో, తగిన రక్షణ చర్యలు తీసుకోకపోవడం వల్ల వచ్చే దుష్పరిణామాలు అంతకంటే ఎక్కువ ఉన్నాయి. ఈ నేపథ్యంలో సమాచార గోప్యత (Data Privacy)ను పరిరక్షించేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలి. అందులో భాగంగా సమాచార భద్రతా చట్టాల (Data Protection Laws)ను మరియు సైబర్‍ సెక్యూరిటీని బలోపేతం చేయాలి. సమాచార చౌర్యాన్ని నిరోధించేందుకు బ్లాక్‍చైన్‍ టెక్నాలజీ, వర్చువల్‍ రియాలిటీ లాంటి సాంకేతికతలను వినియోగించాలి. అప్పుడే ప్రజలకు పూర్తిస్థాయిలో బిగ్‍డేటాద్వారా మంచి నాణ్యత కలిగిన సేవలను అందించవచ్చ నడంలో ఎలాంటి సందేహం లేదు.


-పుట్టా పెద్ద ఓబులేసు,
ఎ : 9550290047

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *