హైదరాబాద్ రాజ్యంలో మొట్టమొదటి రేడియో స్టేషన్ దక్కన్ రేడియో. ఇది 1935 ఫిబ్రవరి 3న తన ప్రసారాలను ప్రారంభించిం ది. మొదట ఇది ప్రైవేటు బ్రాడ్‍కాస్టింగ్ స్టేషన్‍గా 200 వాట్స్ ట్రాన్స్మిటింగ్ పవర్‍తో మొదలైంది. ఉర్దూలో కార్యక్రమాలు ఉండేవి. ఆబిడ్స్లోని చిరాగ్ అలీ లేన్‍లోని ‘అజామ్ మంజిల్’లో ఇది నెలకొని ఉండింది. చిరాగ్ అలీ కుటుంబ సభ్యులే దీన్ని నిర్వహించే వారు. రేడియో ప్రసారాల సాంకేతికతను వినియోగించుకోవడంలో హైదరా బాద్, భారతదేశంలోని ఇతర నగరాలకు దీటుగా ఉండిందని దీన్ని బట్టి చెప్పవచ్చు.
దక్కన్ రేడియోను నాటి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ స్వాధీనం చేసుకొని జాతీయం చేశారు. ఖైరతాబాద్‍లో నూతన రేడియో స్టేషన్ ప్రారంభమైంది. 500 వాట్స్ నూతన ట్రాన్స్మీటర్ (730 కెహెచ్‍జెడ్) ను నెలకొల్పారు. దీన్ని మార్కోని కంపెనీ (ఇంగ్లాండ్) నుంచి కొనుగోలు చేశారు.
లైవ్ అప్‍డేటెడ్ న్యూస్ పోగ్రామ్స్ అందించేందుకు రెండో ప్రపంచయుద్ధ కాలంలో ప్రత్యేక బ్రాడ్‍కాస్ట్ స్టూడియోను సరూర్‍నగర్ లో నెలకొల్పారు. అదే ఏడాది నిజాం రాజ్యంలోని ఔరంగాబాద్‍లో నూతన రేడియో స్టేషన్ ప్రారంభమైంది. హైదరాబాద్ నుంచి 200 వాట్ ట్రాన్స్మీటర్‍ను అక్కడికి మార్చారు. అది జిల్లా స్థాయి రేడియో కేంద్రం. ఉర్దూ, మరాఠీలలో రేడియో కార్యక్రమాలను ప్రసారం చేసే వారు. 1948 డిసెంబర్ 1న అప్‍గ్రేడ్ చేయబడిన 800 వాట్స్ యూనిట్‍ను నిజాం ప్రారంభించారు.
1919లోనే సికింద్రాబాద్ బ్రిటిష్ కంటోన్మెంట్ ఒక కమ్యూ నికేషన్ వ్యవస్థను హైదరాబాద్ రాజ్యంలో ఏర్పాటు చేసింది. 1924లో ఇదే ప్రాంతం నుంచి గుర్తు తెలియని స్పార్క్ స్టేషన్ తన కార్యక్రమాలు ప్రారంభించింది. ఆస్ట్రేలియాకు చెందిన రేడియో మేగజైన్ దాన్ని విడబ్ల్యూటీ స్టేషన్‍గా పేర్కొంది.
దక్కన్ రేడియో నాటి నిజాం రాజ్య అధికార బ్రాడ్‍కాస్టర్‍గా ఉండేది. 1933లో దీన్ని ప్రారంభించిన సమయంలో ఉర్దూలో వార్తా ప్రసారాలు ఉండేవి. దక్కని దోల్క్ కి గీత్, గజల్స్, ఖవ్వాలీ లాంటి కార్యక్రమాలు వచ్చేవి. ఆ కాలంలో సినిమా పాటలు ఉండేవి కావు. గౌహర్ జాన్, జానకిబాయ్ (అలహాబాద్), జోహ్రాజాన్ (ఆగ్రా) లాంటి గాయకుల డిస్క్లు కొన్ని లభ్యమయ్యేవి. ఈ నేపథ్యంలో స్థానిక కళాకారులే తమ మధుర స్వరాలతో దక్కన్ రేడియో శ్రోతలను అలరించేవారు. రేడియో స్టేషన్ ఆరంభంతో స్థానికంగా ప్రతిభా వంతులైన గాయకులు, వాద్య కళాకారులు ఎంతో మంది అడిషన్ కోసం తమ పేర్లను నమోదు చేయించుకునే వారు. ఆ కాలంలో బాగా పేరొందిన రోషన్ అలీ అనే సంగీతవేత్త దక్కన్ రేడి యో మొదటి సంగీత దర్శకుడు. తదనంతర కాలంలో ఎంఎ రవూఫ్ దక్కన్ రేడియోలో స్టూడియో ఎగ్జిక్యూటివ్‍గా చేరారు. ఆయన ప్రఖ్యాత గజల్ కళాకారుడు. ఆ తరువాత ఆయన స్టేషన్ డైరెక్టర్‍గా కూడా సేవలం దించారు. బాంబేలో నిర్మితమైన కొన్ని సినిమాలకు ఆయన సంగీత దర్శకత్వం వహించారు. తోఫా, బసేరా లాంటివి వీటిలో ఉన్నాయి. మొయిజుద్దీన్ మరో ప్రఖ్యాత గజల్ గాయకుడు. ఆయన నిజాం రెండో కుమారుడు మొజ్జుం జా బహదూర్ ప్యాలెస్‍లోని ఆస్థాన గాయకుల్లో ఒకరిగా ఉండేవారు.
మొదట్లో మొహర్రం నెలలో రేడియో ప్రసారాలు ఉండేవి కావు. ఆ తరువాత ఆ నెలలో మొదటి 13 రోజులు మాత్రం ప్రసారాలు నిలిపివేసేవారు. ఆ తరువాత కూడా నెల అంతా పాటల కార్యక్రమాలు ఉండేవి కావు. స్థానిక పత్రికల నుంచి వార్తల సమాచారం సేకరించేవారు. ముఖ్యమైన వార్తలను ప్రసారం చేసే వారు. నిజాం రాజ్యానికి సంబంధించిన వార్తలే ఎక్కువగా ఉండే వి. 1935 తరువాత దక్కన్ రేడియో కొన్ని చక్కటి పాటల డిస్క్లను సమకూర్చు కోగలిగింది. వాటిని శ్రోతలకు వినిపించే వారు. సినిమా సంగీతం తక్కువగానే వచ్చినప్పటికీ దానికి చక్కటి ఆదరణ ఉండేది.
అప్పట్లో దక్కన్ రేడియో, డిపార్ట్మెంట్ ఆఫ్ వైర్లెస్ కింద ఉండేది. ఆ విభాగానికి నవాబ్ అలీ యవార్ జంగ్ బహదూర్ నేతృత్వం వహించేవారు. ఆ తరువాత ఆయన వైస్‍ఛాన్సలర్, అంబాసడర్, గవర్నర్‍గా సేవలందించారు. యావార్ మంజిల్, ఖైరతా బాద్‍లలో కొత్త స్టూడియోలు నెలకొల్పబడ్డాయి. సరూర్‍నగర్‍లో ఒక పెద్ద యాంటెనా ఏర్పరిచారు. జంట యాంటెనాలపై ఉండే ఎర్రలైట్లు ఎంతో దూరం వరకు కనిపించేవి. రేడియో కార్యక్రమాల నిర్వహణలో నైపుణ్యాలు సాధించేందుకు ఒక వ్యక్తిని బీబీసీ (లండన్)కు కూడా పంపించారు. బీబీసీ తరహాలో ప్రసారాలు ఉండాలని నవాబ్ అలీ యవార్ జంగ్ భావించారు. అందుకు అనుగుణంగా వైర్ రికార్డర్స్ వంటి నూతన ఉపకరణాలను కొనుగోలు చేశారు.
రేడియో స్టేషన్‍ను నిజాం స్వాధీనం చేసుకున్న తరువాత చిరాగ్ అలీ కుటుంబ సభ్యులు ఒకరి తరువాత ఒకరు సంస్థను వదిలివెళ్ళారు. సంగీతానికి ప్రాధాన్యం పెరగడంతో స్థానిక కళాకారులు ఎలాంటి రుసుము తీసుకోకుండానే కార్యక్రమాలు చేసేవారు. ఉస్తాద్ ఫయాజ్ కాన్, ఉస్తాద్ బడే గులామ్ అలీ ఖాన్, హీరా బాయ్ బరోదెకర్, ఆమె సోదరి సరస్వతి రానె లాంటి వారు దక్కన్ రేడియోలో తమ కార్యక్రమాలు నిర్వహించారు. ఉస్తాద్ అబ్దుల్ కరీంఖాన్ అప్పట్లో రెండు సార్లు హైదరాబాద్ నగరాన్ని సందర్శించి దక్కన్ రేడియోలో తన కార్యక్రమాలను నిర్వహించారు. ఉస్తాద్ ఖయ్యూమ్ హుసేన్ ఖాన్ (సారంగి), పండిట్ వెంకట్ రావు (హార్మో నియం), అంబ ప్రసాద్ (హార్మోనియం), షేక్ దావూద్ (తబలా), జిఎన్ దంతాలె (జల్‍తరంగ్, ఓకల్), శంకర్ లాల్ మాస్టార్జీ, వసు మతి దంతాలె, అంబదాస్ ఆప్టె, విఠల్ రావు, ఎస్‍బి దేశ్‍పాండే లాంటి గాయకులు దక్కన్ రేడియోలో తమ కార్యక్రమాలను నిర్వ హించారు.
అప్పట్లో హైదరాబాద్ నగరంలో విద్యుద్దీకరణ లేదు. రేడియో సెట్ ఎంతో ఖరీదైనదిగా ఉండేది. అది సగటు మనిషికి అందు బాటులో ఉండేది కాదు. రేడియో సెట్ ఉన్న వారి ఇంటికి వెళ్ళి ఆ యా కార్యక్రమాలను వినేవారు. తదనంతర కాలంలో విద్యుద్దీకరణ జరిగింది. సాధారణ ప్రజానీకం సినిమా పాటల పట్ల మక్కువ చూపడంతో అవి కూడా రేడియోలో వచ్చేవి. ఈ ప్రాంతంలో తెలుగు, కన్నడ, మరాఠా మాట్లాడే వారు కూడా ఉండడంతో ఆయా భాషల్లో నిర్దిష్ట రోజుల్లో కార్యక్రమాలు అందించేవారు.
ఆనాటి కార్యక్రమాలు ఎలా ఉండేవో తెలుసుకునేందుకు మచ్చుకు ఒక రోజు షెడ్యూల్ చూడవచ్చు. డిసెంబర్ 31, 1941 నాటి కార్యక్రమాల వివరాలివి.
ఉదయంపూట:
5.30 ఖయాల్, సుద్ సారంగ్
5.50 గజల్, తేరీ ఖుషి సె అగర్ గమ్ మే భీ ఖుషీ న హుయ్ (జిగర్)
6.00 ఆమ్ పసంద్ మౌసెకి
6.20 మరాఠీ పాద్ ఔర్ భజన్
6.40 గజల్
7-7.30 బచ్చోం కా పోగ్రామ్
7.30 ఖతమ్ సాల్ – తఖ్‍రీర్
7.45 ఖయాల్ మాల్‍కోన్స్
8.00 ఉర్దూ వార్తలు
8.25 ఆంగ్ల వార్తలు
8.50 ఆమ్ పసంద్ మౌస్‍కి
9.10 కర్నాటిక్ ఆనంద్ భైరవి
10 దువే సలామతి
ఇలా కొనసాగిన దక్కన్ రేడియో భారతదేశంలో విలీనం సందర్భంలోనూ ప్రాధాన్యం సంతరించుకుంది. 1948 సెప్టెంబర్ 17న లాయక్ అలీ మంత్రివర్గం రాజీనామా చేసింది. అదే రోజున సాయంత్రం 5 గంటలకు కాల్పుల విరమణకు ఆదేశిస్తున్నట్లుగా నిజాం తన రేడియో సందేశంలో పేర్కొన్నారు. కాల్పుల విరమణను భారత ప్రధాని నెహ్రూ అంగీకరించలేదు. హైదరాబాద్ రాజ్యాన్ని భారతదేశంలో విలీనం చేస్తున్నట్లుగా సంతకాలు చేసిన తరువాతే లొంగుబాటు పక్రియ పూర్తవుతుందని స్పష్టం చేశారు. 1950 ఏప్రిల్ 1న దక్కన్ రేడియోను భారత ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. 1956లో దాన్ని ఆల్ ఇండియా రేడియోతో విలీనం చేశారు.
-దక్కన్ న్యూస్,
(వివిధ బ్లాగ్‍ల సమాచారం ఆధారంగా)