ప్రకృతే నియంత్రిస్తుంది! 7 ప్రకృతే శాసిస్తుంది!! విజ్ఞానశాస్త్ర ప్రయోగాలు వెన్నెల్లో విహారం కాదు!!


(గత సంచిక తరువాయి)
త్యాగాలతో కూడుకున్న సూర్యకేంద్ర సిద్ధాంతం!

సూర్యకేంద్ర సిద్ధాంతం వెలుగు చూసి నాలుగు శతాబ్దాలు కావస్తున్నా, భూకేంద్ర సిద్ధాంతాన్ని, ఏడేడు లోకాల్ని నమ్మే (అ) బుద్ది జీవులున్న ప్రపంచమిది. రాకెట్‍ను ప్రయోగించే ముందు దాని నమూనాను ఏడుకొండల వాడికి సమర్పించే శాస్త్రజ్ఞులున్న వ్యవస్థ మనది. క్రీ.పూ. అరిస్టాటిల్‍ నుంచి మొదలుకొని భూకేంద్ర సిద్ధాంతాన్ని ముందుకు తెచ్చిన టాలమీ (క్రీ.శ.100-170 – అలెగ్జాండ్రియా – ఈజిప్టు) దాకా, సూర్య కేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాధించిన 15వ శతాబ్దం వరకు ఈ ఆలోచన కల్గి వుండడంలో అర్థం వుండవచ్చు! కాని, నేటికి ఈ ఆలోచన వుండడమే కాక, మానవులపై గ్రహాల ప్రభావమని, గ్రహణాలు దైవ సంబంధమని ప్రచారం చేసే ప్రసార సాధనాలు, పత్రికలు, ప్రచారకులున్న అలౌకిక వ్యవస్థలోనే మనమంతా బతుకీడుస్తున్నాం. టాలమీ భూకేంద్ర సిద్ధాంతం తప్పని, సూర్యుని కేంద్రంగానే మిగతా గ్రహాలు (బుధ, శుక్ర, అంగాకరక, బృహస్పతి, శని గ్రహాలు మాత్రమే నాడు కనుగొన్నారు) తిరుగుతాయని నికోలాస్‍ కోపర్నికస్‍ (1473- 1543 – పోలండ్‍ గణిత, ఖగోళ శాస్త్రజ్ఞుడు) అంతగా అభివృద్ధి చేయని టెలిస్కోప్‍ సహాయంతో నిరూపిస్తే, కాదు కాదు, సూర్యుడే భూమి చుట్టూ తిరిగే గ్రహమని, చంద్రుడు కూడా సూర్యుడితో సమానమైన స్వయం ప్రకాశిత గ్రహమని నమ్మే కాథలిక్‍ చర్చ్ కోపర్నికస్‍ ప్రతిపాదనపై విరుచుక పడింది. ఈ ఆలోచనను వ్యతిరేకిస్తే దైవదూషణంగా, మత వ్యతిరేకతగా (heresy) ముద్రవేసి శిలువ వేయడం, మరణదండన విధించడం జరిగేది. ఈ మరణదండన నుంచి కోపర్నికస్‍ తప్పించు కున్నా, తన సిద్దాంతం తప్పని ఆయన మరణించే ముందు బలవంతంగా చర్చ్ రాయించింది. అదే సమయంలో కోపర్నికస్‍ రచనలు ప్రచురించబడడం గమనార్హం.


తర్వాత కొన్ని దశాబ్దాలపాటు ఈ విషయంగా పట్టింపు లేకుండా పోయినా, తిరిగి బ్రూనో, (1548-1600 – ఇటలీ, గణిత, ఖగోళ, తత్వశాస్త్రవ్తే) కోపర్నికస్‍ సూర్యకేంద్ర సిద్ధాంతమే నిజమని ప్రచారంలోకి తెచ్చాడు. మతాధిపత్యం బలంగా వున్న ఇటలీ ప్రభువులు బ్రూనోకు మరణదండన విధించి, కోపర్నికస్‍ పుట్టిన రోజననే నడివీధిలో కట్టెకు కట్టి కాల్చి చంపారు. తర్వాత అదే ఇటలీకి చెందిన గెలీలియో (1564-1642 – ఇటలీ భౌతిక, ఖగోళ జిజ్ఞాసి, ఆధునిక ఖగోళశాస్త్ర పితామహుడు. చర్చ్లో పాధర్‍) పై ఇద్దరి సిద్ధాంతాలే నిజమని, స్వయంగా అభివృద్ధి చేసుకున్న టెలిస్కోపుతో నిరూపించాడు. గ్రహాల గమనాల్ని క్షుణ్ణంగా వీక్షించి శుకగ్రహం (Venus) యొక్క వివిధ ఆకృతులను, బృహస్పతి (Jupiter) యొక్క ఉపగ్రహాలను, పాలపుంత (milkway)లో గల నక్షత్ర రాశులను ప్రతక్షంగా చూసి, ఇతరులకు చూయించాడు.


ఇలా గెలీలియో ఖగోళం గూర్చిన అనేక వాస్తవాల్ని ఆధారాలతో చూపడంతో చర్చ్ కొంచెం వెనక్కి తగ్గి 1633లో మరణశిక్షకు బదులుగా జీవిత ఖైదీగా శిక్షవేసింది. పోతే ఆయన తెలివితేటలకు, జ్ఞానసంపదకు, ప్రపంచ వ్యాపితంగా వచ్చిన గుర్తింపుకు తలొగ్గి, గృహనిర్బంధంగా మార్చారు. ఆయన గుర్తించిన లోలకం (Pendulum)తో భూమి బల్లపరుపుగా లేదని తేలిపోయింది.
చావుకు కూడా బెదరక, చివరి శ్వాసదాకా ఖగోళ వాస్తవాల్ని ఆవిష్కరించి ఆధునిక ఖగోళశాస్త్ర పితగా గుర్తింపు పొందిన గెలీలియో, చర్చ్కి కూడా భయపడక, దేవున్ని నేనెప్పుడు కలవలేదని, ఆయన నుంచి ఏమి నేర్చుకోలేదని ధైర్యంగా చెప్పడమేకాక, చర్చ్ నమ్మే దేవుడే తనకు విచక్షణను, తర్కాన్ని, తెలివితేటల్ని అందించి వినియోగించేలా చేసాడని అభివర్ణించాడు. అలాగే తన సమాధిపై భూమి చలిస్తూనే వుంటుంది (the earth does move) అని రాయాలని కోరాడు. అలానే రాయబడింది కూడా!


గెలీలియో మతవ్యతిరేకిగా మారాడని, రోమ్‍ కాథలిక్‍ చర్చ్ విచారణ సందర్భంగా, నాటి 185వ మతపెద్ద కిస్ట్రియానో బంటితో ‘పవిత్ర మతం మనుషులు ఎలా స్వర్గానికి పోవాలో చెపుతుందేగాని, స్వర్గం ఎలా వెళ్ళిపోవాలో (లేదని) చెప్పదు అని ధైర్యంగా వాదించాడంటే శాస్త్ర పరిజ్ఞానం పట్ల ఎంత దృఢ సంకల్పం గలవాడో తెలుస్తుంది. మనం ఇంకా నాలుగు శతాబ్దాల తర్వాత కూడా మత మౌఢ్యంలో నిండా మునుగుతూనే వున్నాం.
గెలీలియో జ్ఞాన సంపదకు, ధైర్యానికి ఐన్‍స్టిన్‍ వీరాభిమానిగా మారి, వాస్తవమైన జ్ఞానం అనుభవం ద్వారా వస్తుందని, అనుభవంతోనే పూర్తి అవుతుందని ప్రస్తావించడం గమనార్హం.


ఈ విధంగా సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని ఆవిష్కరించడానికి శాస్త్రజ్ఞులు ఎన్ని త్యాగాలు చేసారో తెలిసికూడా, ఇంకా మూఢనమ్మకాల నుంచి చదువుకున్నవారు, అత్యధికంగా ఉపాధ్యాయులు బయటపడని స్థితి. గెలీలియో ప్రతిపాధనలతోనే కెప్లర్‍ గ్రహచలనా సిద్ధాంతాల్ని (celestial), వాటి దీర్ఘ వృత్తకక్ష్య (elilipse) సిద్ధాంతాన్ని ఆవిష్కరించాడు. ఈయనే జీసెస్‍ పుట్టుక సం।।ని తేదీలతో సహా నిరూపించాడు. ఇప్పుడు వాడబడుతున్న గ్రిగేరియన్‍ కేలండర్‍ దీని ఆధారంగానే మొదలైంది. ఈయన అతి బీద కుటుంబం నుంచి వచ్చాడు.


మత మౌఢ్యంలేని పాఠ్యప్రణాళిక –
ఓ తండ్రి రూపకల్పన:

ఫ్రెంచ్‍కు చెందిన పాస్కల్‍ (1623-1662 – గణిత శాస్త్రజ్ఞుడు). అత్యంత తెలివిగల బాలుడిగా (Child prodigy) గుర్తించిన ఆయన తండ్రి పాస్కల్‍ను పాఠశాలకు పంపకుండా హేతుబద్ద, శాస్త్రీయ పాఠ్య ప్రణాళికల్ని రూపొందించి, ఇంటివద్దనే చదివించాడు. చిన్ననాటి నుంచే తెలివైన వాడిగా గుర్తింపు పొందిన పాస్కల్‍, ఆటోమొబైల్‍ రంగానికి అనేక సాంకేతికాల్ని రూపొందించాడు. హైడ్రాలిక్‍ రంగంలో, వాహనాల బ్రేకులకు ఈయన సిద్ధాంతాన్నే ఉపయోగించి యంత్రాల్ని వాడడం, వాహనాల్ని నడపడం జరుగుతుంది. వీటినే పాస్కల్‍ సూత్రంగా అంటాం. ఇలాంటి శాస్త్రీయ ఆలోచనగల లౌకిక కుటుంబం, తండ్రి అనారోగ్యంతో పాస్కల్‍ మతాన్ని అవలంభించాల్సి వచ్చింది. ఆయన సోదరి నన్‍ (nun)గా మారింది. 21వ శతాబ్దాంలో కూడా ఏ తండ్రి చేయని సాహసం పాస్కల్‍ తండ్రి చేయడం గొప్ప విషయం కాదా!
మనం పదేపదే ప్రస్తావించే ఆపిల్‍ పండు నేలపై పడడం, దానికి భూమి ఆకర్షణ శక్తే కారణమని గుర్తించిన న్యూటన్‍ది వ్యథాభరిత జీవితమే. పుట్టుకతోనే తండ్రిని కోల్పోవడం, తల్లి మరొకరిని పెళ్ళి చేసుకోవడంతో అమ్మమ్మ పెంపకంలో పెరిగిన న్యూటన్‍ అనేక ఆవిష్కరణలకు కారకుడయ్యాడు. ప్రతీపనిలో పరస్పర విరుద్ద చర్యలుంటాయని (opposite forces), వాటినే న్యూటన్‍ గమన సూత్రాలుగా చదువుకొంటాం. నేటి రాకెట్‍ ప్రయోగాలకు ఈ సూత్రమే ఆధారం. పెళ్ళికూడా చేసుకోలేని ఈయన జీవితమంతా కష్టాల మయమే!


ఈ త్యాగధనుల వరుసలో చెప్పుకోతగ్గ 20వ శతాబ్దపు ప్రఖ్యాత శాస్త్రజ్ఞుడు జర్మనీకి చెందిన ఐన్‍స్టిన్‍ (Albert Einsten, 1879-1955). ఈయన కూడా తండ్రి మరణంతో బడి మానాల్సి (dropout) వచ్చింది. ఐన్‍స్టిన్‍ బక్కపల్చగా వుండడంతో తోటి పిల్లలందరు గెలి చేసేవారు. దీంతో పాఠశాలంటే అయిష్టత ఏర్పడింది. పాఠశాలమాని మేనమామ పెంపకంలో గణిత భావాల్ని నేర్చుకొని నేరుగా పాల్‍టెక్నిక్‍ ప్రవేశానికి అర్హత పరీక్ష రాయగా, రసాయన, జీవశాస్త్రాలలో, ఫ్రెంచ్‍ భాషలో ఫెయిల్‍ కావడంతో తిరిగి పాఠశాల విద్యను పూర్తి చేయాలని సంబంధిత ఉపాధ్యాయులు చెప్పారు. అయినా గణితంలో, భౌతికశాస్త్రంలో సాధించిన మార్కులకు ఆశ్చర్యపోయిన అధికారులు, పాఠశాల సబ్జెక్ట్యును తిరిగి పూర్తి చేయాలనే షరతులతో పాల్‍టెక్నిక్‍లో సీటిచ్చారు. పన్నెండేళ్ళ వయస్సులోనే రేఖాగణిత భావనలపై ప్రతిభ కనపర్చిన ఐన్‍స్టిన్‍, భౌతిక శాస్త్రంలో అనేక అద్భుతాలకు కారకుడయ్యాడు. భూమికి, ఇతర గ్రహాలకు, సూర్యునికి మధ్యన గల సంబంధం ఎలక్ట్రోమాగ్నెట్‍ క్షేత్రమని, వాటి మధ్యన అవినాభావ సంబంధం (Theory of Relativity) వుంటుందని, అవి మూడు గమన సూత్రాలపై (Laws of motions) ఆధారపడుతాయని నిర్ధారించాడు. శక్తికి, ద్రవ్యరాశికి, కాంతి వేగానికి గల సంబంధాన్ని సులభమైన సూత్రీకరణతో (E=mc2) వివరించిన ఆధునిక యుగపు గొప్ప శాస్త్రజ్ఞుడు. ఉపాధ్యాయులచే ‘దేనికి పనికి రావని’ ముద్రపడిన ఐన్‍స్టిన్‍ పట్ల బెంగ పెట్టుకున్న తండ్రి మరణం ఐన్‍స్టిన్‍పై తీవ్ర ప్రభావం చూపింది.


ప్రఖ్యాత హాస్యనటుడు చార్లి చాప్లిన్‍ కాలిఫోర్నియా సందర్శించినప్పుడు, హాలివుడ్‍లో జరిగిన లైట్‍షోలో ఐన్‍స్టిన్‍ కలవగా, వేలాదిమంది చుట్టుముట్టుతే, ‘నాగూర్చి బాగా తెలుసు కాబట్టి నాకు జనాలు జేజేలు కొడుతున్నారు, నీ గూర్చి వారికేమి తెలియదు కాబట్టి నీకు కూడా జేజేలు కొడుతున్నారు అంటూ ఛలోక్తులు విసిరితే, దాని అర్థమేంటని ఐన్‍స్టిన్‍ అడగ్గా, ‘ఏమిలేదు’ (nothing) అంటూ సమాధాన మిచ్చాడు చాప్లిన్‍.
తాను చనిపోయిన తర్వాత, తన మెధడుపైగాని, శరీరంపైగాని ఎలాంటి పరిశోధన చేయవద్దని, అసలు ఆలోచించవద్దని, అలాగే తనను ఆరాధించవద్దని కోరిన ఆ మహోన్నతుడి మెధడును ఆయన మరణించిన (18.4.1955) జరిగిన పోస్టుమార్టం సందర్భంగా ఎవరికి తెలియకుండా థామస్‍ హర్వే అనే పథాలోజిస్టు దొంగిలించడం గమనార్హం!
జీవితం ఓ సైకిల్‍ లాంటిదని, అది పడిపోకుండా వుండాలంటే, నిరంతర చలనంలో వుండాలనే జీవిత నగ్న సత్యాన్ని చెప్పిన నేటి మేధావి ఐన్‍స్టిన్‍.


శవాలతో సహవాసం:
పై శాస్త్రజ్ఞులంతా గణిత, భౌతిక, ఖగోళ శాస్త్రజ్ఞులు కాగా, ఇప్పుడు ఓ వైద్యుడు చేసిన సాహసాన్ని చూద్దాం. బ్రిటన్‍కు చెందిన విలియం హార్వే (1578-1657) తండ్రి సాధారణ వ్యవసాయదారుడు, మంత్రతంత్రాలపై, మంత్రగత్తెలపై (witch) ఇప్పుడున్నట్లు గానే నాడు నమ్మకాలుండేవి. అలాంటి కాలంలో మానవ శరీరంలో రక్తప్రసరణ వ్యవస్థ ఎలా జరుగుతుందో తెలుసుకోవాలని, చాటుమాటుగా శ్మశానాల నుంచి శవాల్ని తెచ్చుకొని, వాటి అంతర్గత వ్యవస్థల్ని క్షుణ్ణంగా పరిశీలించి, రక్తం గుండె ద్వారా శరీర భాగాలకు ధమనుల ద్వారా ప్రవహిస్తుందని నిరూపించాడు. అప్పటి వరకు ఎలాంటి నాళాలు లేకుండా కేవలం గుండె నుంచి ఊపిరి తిత్తులకు రక్తం ప్రవహిస్తుందని నమ్మేవారు. 1634లో మంత్రగత్తెలు అని ముద్రపడిన కొంతమందికి మానసిక వైద్యాన్ని అందించి మంత్రాలు లేవని నిరూపించాడు. నేటి పోస్టుమార్టం పద్దతిని హార్వేనే ఆవిష్కరించాడు. కీటకాల జీవిత చక్రాన్ని అధ్యయనం చేసిన హార్వే మత మౌఢ్యాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. అదే గ్రీక్‍లోనో, రోమ్‍లోనో అయితే మరణదండనకు గురయ్యేవాడు.


శాస్త్ర పరిశోధనలో కొన్ని మైలురాళ్ళనే ఇక్కడ చర్చించడం జరిగింది. శాస్త్రజ్ఞుల కృషి, త్యాగాలు నేటి ఆధునిక సమాజానికి బాటలు వేసాయి. మానవునికి ఎనలేని సౌకర్యాల్ని కల్గించాయి. ఇంకా ఎన్ని రకాల సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయో చెప్పలేం కాని, మానవుడు వీటి నేపథ్యాల్ని గుర్తించక, అడ్డగోలుగా సంపాధనకు మరిగి, ఇదంత తన కృషి ఫలితమని విర్రవీగి యావత్‍ సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నాడు. దీన్ని విడమరిచి చెప్పే విద్యావిధానం నేడు కావాలి. దీనికై మేధావులు, ఉపాధ్యాయులు కృషి చేయాలి.


నోట్‍ : 1. ఆర్కిమెడిస్‍ గెలీలియో, న్యూటన్‍, ఐన్‍స్టిన్‍ లాంటి శాస్త్రజ్ఞుల కృషిని విద్యార్థులకు కథలుగా చెప్పాలి. ఉపాధ్యాయులు విధిగా చదవాలి.
2.పరిశోధనలకు ఎన్ని ఇబ్బందులుంటాయో ఎత్తి చూపిన సినిమా ‘ఏక్‍ డాక్టర్‍కి మౌత్‍ (Death of a Doctor).
(వచ్చే సంచికలో భూగోళమే ఓ సువిశాల పరిశోధన క్షేత్రం చూద్దాం!)

  • డా।। లచ్చయ్య గాండ్ల,
    ఎ : 9440116162

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *