మట్టిపాత్రల తయారీ


పల్లెలే భారతదేశపు పట్టుకొమ్మలు అన్నారు మహాత్మా గాంధీ. మనది ప్రధానంగా వ్యవసాయక దేశం. వ్యవసాయం – దానికి అనుబంధంగా వున్న ఉత్పత్తి పరికరాలన్నీ చేతివృత్తుల వారి శ్రమఫలితమే. గ్రామీణ జీవన విధానంలో చేతివృత్తులదే ప్రధాన పాత్ర.
వడ్రంగం, కమ్మరం, చేనేత, మేదరి, ఆభరణాల తయారీ, గృహనిర్మాణం, పాదరక్షల తయారీ వంటి అనేక చేతివృత్తులతో గ్రామీణ జీవితం పరస్పర సహానుభూతితో ప్రశాంతంగా, ఆనందంగా ఉండేది. అలాంటి చేతి వృత్తులలో మట్టి పాత్రలు చేయడం ప్రధానమైనది. ఈ వృత్తి చేసేవారిని కుమ్మరులు అంటారు.
వ్యవసాయ దారులు పండిన పంటను నిలువ చేయడానికి, ఇతర అవసరాలకు ఉపయోగించే పెద్దపెద్ద గోళాలు, కొట్టెలు, బింకులు, బానలు, వంటపాత్రలైన కుండలు, మూకుళ్ళు, చట్టీలు, నీళ్లు నిలువ చేయడానికి, చల్లపరిచేందుకు కూజాలు, రంజన్లు, రాత్రి వెలిగించడానికి బుడ్డీలు, దీపాలు, ప్రమిదలు, పచ్చళ్లు నిలువ చేయడానికి పచ్చడి కుండలు, కల్లు దుత్తలు, పూలను, మొక్కలను పెంచేందుకు కుండీలు, తొట్టెలు, సంగీత పరికరం ఘటం (మృదంగం) ఇలా వివిధ అవసరాలకు అవసరమైన మట్టి పాత్రలు వీళ్ళు తయారు చేస్తారు.


మట్టి పాత్రలు తయారు చేయు విధానం:
ఈ వృత్తి చేసే వారి ఇంటి నిర్మాణమే ఈ వృత్తికి అనుగుణంగా వుంటుంది. ఇంటిముందు సారె, ఇవి కాల్చడానికి అవసరమైన వాము ఉంటాయి. కుటుంబ సభ్యులందరూ స్త్రీలు, పిల్లలూ వీటి తయారీలో పాలు పంచుకుంటారు. మట్టి పాత్రల తయారీకి ముడి పదార్థం ఒండ్రుమట్టి. దీనిని బంకమట్టి అని కూడా అంటారు. ఇది క్షారస్వభావం కలిగి ఉంటుంది. దీనిలో పొటాషియం, కాల్షియం, మెగ్నిషియం, పాస్పర్‍, సోడియం, బోరాస్‍, మాంగనీస్‍, జింక్‍, కాపర్‍, ఐరన్‍, సిలికాన్‍ మొదలైనవి ఉంటాయి. ఈ లవణాల రసాయన చర్యలవల్ల మట్టి పాత్రలు కాల్చిన తరువాత గట్టిగా తయారవుతాయి. ఈ లవణాల కారణంగా ఒండ్రు మట్టిని అనేక విధాలుగా విభజిస్తారు. ఈ మట్టిని చెరువుల నుండి, కుంటల నుండి, పారే నీటి ఒడ్డు నుండి సేకరిస్తారు. దానిని ఆరబెట్టి, జల్లించి, దానిపైన నీళ్లు చల్లి మెత్తగా కాలితో తొక్కుతారు. మట్టి జిగటగా మారుతుంది. ఈ మట్టిని కుమ్మరి చక్రం (సారె) యొక్క మధ్యభాగంలో పెద్ద ముద్దలా పెట్టి చక్రాన్ని కర్రసాయంతో తిప్పి, మట్టిని చేతితో ఒత్తిడితో కదిలిస్తూ వివిధ ఆకారాలలో మలుస్తారు. పుల్లను, నీటిని ఉపయోగించి ఆయాపాత్రలకు మెరుగులు దిద్దుతారు. పూర్తయిన కుండను పదునైన ఇనుప చువ్వతోనూ, పదునైన కత్తితోనూ చక్రం నుండి వేరు చేసి జాగ్రత్తగా పక్కన పెడతారు. వాటిని నీడలో ఆరబెట్టి ‘సల్ప’ ‘గుండు’ అనే పరికాలతో ఆకృతులను ఇస్తారు. సృజనాత్మకత, నైపుణ్యం మీద ఆధారపడి ఇవి అందాన్ని సంతరించు కుంటాయి. తరువాత వాటిని వాములో కాలుస్తారు. ఇవి కాల్చడానికి సహజమైన కట్టెలు, పిడకలు, కంప ఉపయోగిస్తారు. ఏ ఇంధనాలు వాడరు. తరువాత వీటిని ఉపయోగించవచ్చు. ఈ మట్టి పాత్రలను ప్రపంచంలోనే అనేక దేశాలు ఉపయోగిస్తున్నాయి. ఈ ఆధునిక కాలంలో మట్టి పాత్రల వినియోగం పూర్తిగా పోయింది. గ్యాస్‍మీద, లోహ పాత్రల్లో వంట అనేక అనారోగ్యాలకు దారితీస్తుంది. ఇంధనాలు, లోహాలు పర్యావరణ సమతుల్యతకు హానిగా పరిణమించాయి. మట్టి పాత్రలను యంత్రాలతో చేస్తున్నారు. వివిధ సాంకేతికాభివృద్ధిలో భాగంగా చేతివృత్తులు దెబ్బ తిన్నాయి. గ్రామీణ జీవితం రూపురేఖలు మారిపోతున్నాయి.


మట్టిపాత్రలు ఇవాళ షోకేస్‍లలో బొమ్మలుగా మారి పోయాయి. పర్యావరణ చైతన్యం పెరుగుతున్న ఈ రోజుల్లో కొన్ని అవసరాలకైనా మట్టి పాత్రలను ఉపయోగిస్తున్నారు. వీటిని ఉత్పత్తి దారులైన కుమ్మరులు వద్ద కాకుండా నగరాలలో పెద్ద పెద్ద మాల్స్లో అధిక ధరలకు కొనుగోలు చేస్తున్నారు.
భారత ప్రభుత్వం ‘పర్యావరణ మిత్ర ఉత్పత్తి’గా మట్టికుండను గుర్తించింది. సెంట్రల్‍ పొల్యూషన్‍ కంట్రోలు బోర్డువారు ఎకోమార్క్ స్కీమ్‍ ప్రారంభించారు. ‘మట్టికుండ’ ఎకో మార్క్ లోగోగా ఎన్నుకోబడింది.


ప్రభుత్వం మట్టిపాత్రల వాడకాన్ని ప్రోత్సహించాలి. వీటి వినియోగం వల్ల ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ, భూగర్భ జలం పెంపుదల, సహజ వనరుల సంరక్షణ, భూసార సంరక్షణ మరియు గ్రామీణ ఆర్థికాభివృద్ధి సాధించవచ్చు. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, వృత్తిదారులు, ప్రజలు పరస్పర సహకారంతో వృత్తిని సంరక్షించడానికి సమిష్టి కృషి చేయడం సామాజిక బాధ్యతగా భావించాలి.


-జుగాష్‍విలి

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *