సాహితీ మిత్రుడు జయప్రకాశ్, తెలంగాణ సాహిత్య అకాడమీ సౌజన్యంతో ‘కావ్యగానం’ పేరుతో ప్రసిద్ధ కవులతో ‘కావ్యగానం’ చేయిస్తున్నాడు. అందులో భాగంగా 14వ ‘కావ్యగానాన్ని’ నాతో చేయించాడు. కోర్టులు, పోలీస్టేషన్ల నేపథ్యంతో నేను రాసిన ‘హాజిర్హై’ని కావ్యగానం చేశాను. ఈ కవితా సంపుటి మీద ప్రముఖ కవి ఎన్ గోపి ఇండియాటుడే తెలుగు పత్రికలో చాలా మంచి వ్యాసం రాసి ఇది జంబో మాత్రమే రాయగలిగే కవితలు అన్నాడు. ఆ తరువాత న్యాయవాద మిత్రుడు కె. జితేంద్రబాబు మూసీ మాసపత్రికలో చాలా మంచి వ్యాసం రాశాడు.
ఈ విషయాలని ప్రస్తావించడానికి కారణం కవిత్వంలో కూడా చట్టం చెప్పవచ్చా? కోర్టులని, నేరన్యాయవ్యవస్థని ప్రతిబింబించేయ వచ్చా? అన్న చాలా మంది ప్రశ్నలకి జవాబులు లభిం చాయని సాహితీ మిత్రులు నాతో అన్నారు. కవిత్వంలో ఇదే మొదటిది అని కూడా కొంత మంది మిత్రులు అన్నారు. వచన కవిత్వంలో ఇది మొదటిది కావొచ్చు కానీ పద్య కవిత్వంలో ఇది వరలోనే చాలా మంది కోర్టులని, న్యాయ మూర్తులని, న్యాయవాదులని స్పృషిస్తూ కవిత్వం రాశారు. మిత్రుడు జితేంద్రబాబు అలాంటి వాటిని నా హాజిర్హై పుస్తకంపై వ్యాసం రాస్తూ ఉదహ రించారు. అందులోని పద్యాలు ఇవి.
ఏనాడు నెరగని యీనాటి కిటుగల్గె
ప్లీడర్లవాధముల్ పెక్కులగుచు
ఏనాడు నెరగని నీనాటి కిటుగల్గె
కోరుట తీరుపుల్ కొల్లలగుచు
నేనాడు నెరగని నీనాటి కిటుగల్గె
కూట సాక్ష్యంబులు కొల్లలగుచు
నేనాడు నెరగని నీనాటి కిటుగల్గె
పద్దరిజస్టరుల్ ప్రకటమగుచు
గీ।। చట్టములు కోడ్లు మరియు శిక్షాస్మృతులను
పోస్టుకార్డులు బంగీలు, పుస్తకములు,
ముందు పేపర్లు దను ధన మొందుటకునె
ప్రకటధనమది లేకున్న సుకము సున్న
చీపులో సాక్షికి చెప్పి చెప్పని యట్లు
తన కేసు రుజువంత ధనరవలయు
క్రాసులో సాక్షికి గడుహీనుగా జేసి
యెదిరి వాదమునేల జాదరవలయు
తనలోట్లురీయందు దనగూడదీయుచు
నదికారి దయజాల నందవలయు
కేసు గెల్చిన యెడగేకలు వేయుచు
బహుమానములు నేల బడయవలయు
గీ।। నోడిపోయి జడ్జికి యూహలేద
టంచు నప్పలునకు వేగనంపవలయు
జడ్జి దూషించ భూషించె జయమును నదె
యనుచు పార్టీల నమ్మించి యను ఏవలయు
ఇది ఒకనాటి కోర్టుల దృశ్యం. ఇప్పుడు కాలం మారింది. వివాదాలు మారి పోయాయి. మనిషిని వంగదీసే విధానం, మనిషిని లొంగతీసే విధానం కాలానుగుణంగానే మారింది.
ఇలాంటి దృశ్యాన్ని నేను రాసిన కవిత ‘ఒక కేసుచాలు’ అన్న కవితలో చూపిస్తాను.
అది
అన్నలికి కేసుపెట్టిన కేసే కావొచ్చు
అన్నం పెట్టలేదన్న మనోవర్తి కేసే కావొచ్చు
కట్నం అడిగిన కేసే కావొచ్చు
కానుకలు దొంగలించిన కేసే కావొచ్చు
తన్నులు తిన్న కేసే కావొచ్చు
తన్నిన కేసే కావొచ్చు
కన్ను కొట్టిన కేసే కావొచ్చు
కన్ను పీకిన కేసే కావొచ్చు
…
ఏదో ఒకటి
మనిషిని వంగ తీయడానికి
లొంగ తీయడానికి
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసిన జస్టిస్ చలమేశ్వర్ ఈ కవిత్వ పుస్తకాన్ని తేదిని ఈ కవితని ఉదహరిస్తూ 30.6.1997లో ఓ ఉత్తరం రాశారు. ఆ ఉత్తరం చివరలో ఇలా వుంటుంది.
గతవారం రోజులుగా నా జీవితంలో జరిగిన సంఘటనలతో చదవగానే నన్ను ఎక్కువగా ఆకట్టుకున్న కవిత
‘ఒక్క చిన్న కేసు చాలు
వాడి సున్నితత్వాన్ని బట్టి
వాడి మనస్తత్వాన్ని బట్టి
కేసులు నిలుస్తాయని పెట్టరు
కేసులు నిలవాలని పెట్టరు
కేసులు కేసుల కోసమే పెడతారు
మనిషిని వంగతీయడానికి పెడుతారు
మనిషిని లొంగ తీయడానికి పెడతారు’
ఇదంతా ఎందుకు చెబు తున్నానంటే చట్టానికీ సాహిత్యానికి వున్న సంబంధం చెప్పడానికి. ఈ రెండింటి గురించి ఆలోచిస్తే తెలుగులో రావిశాస్త్రి, చీనాదేవి, నందిగం క్రిష్ణారావు జింబో గుర్తుకొస్తారు. ఇంగ్లీషులో చాలా మంది రచయితలు గుర్తుకొస్తారు. వాళ్ళ రచనలూ గుర్తుకొస్తాయి.
చార్లెస్ డికెన్స్ రాసిన ‘పిక్నిక్ పేపర్’ నవలతో బాటు కాఫ్కా రాసిన ట్రయల్ గుర్తుకొస్తాయి. సర్ వాల్టర్ స్కాట్ డాస్టోవిస్కీ, టాల్స్టాయిలు గుర్తుకొస్తారు. భారతదేశ సాహిత్యాన్ని గమనించినప్పుడు బంకిమ్ చంద్ర చటోపాధ్యాయ, మణిశంకర్ ముఖర్జి, పిఎల్. దేశ్‌పాండేలు గుర్తుకొస్తారు. పైన చెప్పిన తెలుగు రచయితలు నలుగురు న్యాయవాద, న్యాయమూర్తి ఉద్యోగాలతో సంబంధం వున్న వ్యక్తులు. వీళ్ళే కాకుండా గుర్తుకొచ్చే మరో వ్యక్తి కెయన్వై పతంజలి. ఈయన వృత్తి జర్నలిజం.
సాహిత్యంలో డ్రామా ఉంటుంది. వేదన వుంటుంది. కోర్టుల్లో పోలీస్స్టేషన్లలో అంత కన్నా ఎక్కువ డ్రామా, వేదన, బాధా వుంటుంది. కోర్టులో విచారణకి మించి డ్రామా మరొకటి వుండదు. ఎవరైతే కోర్టుకి వస్తారో వాళ్ళే తమ కేసుని నిరూపించుకోవాల్సి వుంటుంది. ఈ పద్దతి మనదేశంలో వుంది. దీన్నే నిరోధి భావన (Adversial System) పద్దతి అంటున్నాం. ఈ పద్దతిలో శత్రుభావన ఎక్కువగా వుంటుంది. ఒకర్ని మించి మరొకరు కథని రంజు పట్టిస్తారు. బిగువుని, ఆసక్తిని రేకెత్తిస్తాయి. కథలు నవలల్లో కూడా ఇవి వుంటాయి. కొన్ని సార్లు ఫీలింగ్ మరికొన్ని సార్లు అనుకోని ముగింపు వుంటుంది.
మనం ఎన్నో ప్రసిద్ధమైన విచారణలని చూసివుంటాం. లేదా విని వుంటాం. ఆరుషీ తర్వార్ కేసు విచారణ ఆధారంగా హిందీ సినిమా వచ్చింది. అదే విధంగా నానావతి విచారణ ఆధారంగా రుస్తోమ్ అన్న సినిమా వచ్చింది. జెస్సికాలాల్ హత్య విచారణ. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో నవలలు, సినిమాలు మనకు కన్పిస్తాయి.
చాలా తీర్పులు ఓ కవితతో, ఓ కథతో మొదలవుతాయి. సాహిత్యానికి, చట్టానికి నేరన్యాయవ్యవస్థకి అవినావభావ సంబంధం ఉంది. చట్టం అనేది ప్రజల కోరిక ద్వారా వచ్చింది. వాళ్ళని పరిపాలించడానికి ఉద్దేశించబడింది. అన్ని శాసనాలు ఆ విధంగా వచ్చాయని అనుకోవడానికి వీల్లేదు. మనషుల అనుభవాల నుంచి అనుభూతుల నుంచి వచ్చేది సాహిత్యం. ఈ రెండూ కూడా సమాజాన్ని ఉద్దేశించి వచ్చినవే. వచ్చేవే. రెండింటి మధ్య వున్న సామీప్యం ఇదే.
సాహిత్యం అది కథ కావొచ్చు. నవల కావొచ్చు. కవిత కావొచ్చు. చట్టాల్లోని మంచినే కాదు చెడునూ, అందులో వున్న లోపాలని చూపిస్తాయి. న్యాయాన్ని అన్యాయాన్ని ఎత్తి చూపేదే సాహిత్యం. చట్టాలని నిర్వచించే వారికి, వ్యాఖ్యానించే వారికి అమలు చేసే వారికి పరిమితులు వుంటాయి. సాహిత్యానికి ఆ పరిమితులు వుండవు. అదే సాహిత్యపు గొప్పదనం.
చట్టాలతో, చట్టాల పేరుతో వ్యక్తుల స్వాతంత్య్రాన్ని హరించే విధానాన్ని, విచారణ పేరుతో వ్యక్తుల స్వేచ్ఛని కాలరాయడానికి కవిత్వంలో ప్రతిబింబించే పనిని ‘హాజీర్హై’లో నేను చేశాను.
కేసులు సంవత్సరాలపాటు నడుస్తాయి. వాయిదాల మీద వాయిదాలు పడుతుంటాయి. నరక సదృశ్యమైన నిరీక్షణ. ఎన్నో సంవత్సరాల ట్రయలనే శిక్షని ఎదుర్కొన్న తరువాత
రాబోయే శిక్ష ఏ పాటిది?
ట్రయలే
ఓ పెద్ద పనిష్మెంట్.
-మంగారి రాజేందర్ (జింబో)
ఎ : 9440483001