పున్నమి నీడలలో
సెలయేటి నీటి జాడలలో
వెదురు పిల్లన గ్రోవై
మోగే
రాగాల వెల్లువలో
కాంతి అంతకంతకూ
పదునెక్కుతూ…
చిన్ననాడు
కాంతికి
కళ్ళముందు మెరిసే
కాకి బోడలా
యీ గోడలు
వెలుగుకి
వెలిగిపోతున్నాయి.
పురివిప్పిన నెమిలి
నాట్యం చేస్తుంది
భావాలు
అంత దూరమే
ప్రయాణించడానికి
నడిచి వెళ్ళె దార్లో
పలుకరించే నేస్తాలెన్నో
ఎగిరిపోతే
బోసిబోసైన
గాలి కబుర్లు ఇంకెన్నో
పుస్తకాలలో
బందీ అయిన అక్షరాలు
కాగితంపై బందీ అయిన
రేఖా చిత్రాలు
తమ తమ పొడుపు కథల్తో
మద్దెల వాయిస్తుంటాయి.
ఒక చూపులో
ఒక తూపులో
ఒక తోపులో
ఒక నిద్రలేని
క్షణంలో
ఒక బలహీన
హృదయపు
మూలుగులో
ఎన్నెన్ని
విషయాలు పోగై
బొమ్మ కడతాయ్!
దేనికదే ప్రత్యేకం
మళ్ళీ
అన్నీ కలిపి పాడే
బృందగానపు లిపి
కొత్తగా ఉంటుంది
రుచి
అభిరుచి
నెమ్మదిగా ఉండనివ్వవు
ఎప్పటికప్పుడే
తేల్చేస్తుంటాయ్
విషయాల్ని
తూర్పారాబడుతుంటాయ్
ప్రియురాలి చెయ్యి
నుదిటిపై కదిలినట్టుగా
హిమాలయాలు
విజయ గీతాలాపిస్తుంటాయ్
ఒక్కసారిగా
మొఖంలో
చిరునవ్వులు చిందులు వేస్తుంటాయ్
పతంగి ఎగిరేస్తూ
చర్కాకి దారం చుడ్తున్నాను
నా చుట్టూ పదిమంది
చర్కాతో దారం వొడుకుతున్నారు
నేను నింగిలో
తారలతో కళ్ళు కలిపినట్టు
మరో లోకంలో ఉంటాను
బ్యాండ్ మేళం
పెద్ద చప్పుడులో
నాపై నుండి వెళ్ళి పోతుంది
రకరకాల రంగుల బెలూన్లు
నా మనసు నిండా
ఎగుర్తూ ఉంటాయి
సంగీతం
సంగతులు బుర్రక్కెవు
వరసగా
తారలు నేలకొరుగుతుంటాయి
ఆమె నన్ను బిగ్గరగా
చుంబించి
ఆవలి గట్టుకు విసిరేసింది
నేను నీళ్ళలా
నేలపై కొట్టుమిట్టాడుతున్నాను
గాలి సలపదు
నా మెడలో
రెండు పెద్ద డ్రమ్ముల్లాంటి
తబలాలు వేలాడుతున్నాయి
కాకి
నా పక్కన పదేపదే అరుస్తూ ఉంటుంది
రానున్న చుట్టాలెవ్వరో
రాజుకున్న కుంపట్లను
నిండాబోర్లించేశారు
ఒక్కసారిగా
వేడి గుప్పుమంది
నేలపై
కొట్టు మిట్టాడుతుంటాను నేను
గాలిలో కొట్టుక వచ్చే
రాగంలా…
మజిలీలో
మరోమైదానం
అక్కడ గెంతుతూ గెంతుతూ
గడపొచ్చు
కొండలు పాకీ పాకి
దాన్నో అలవాటుగా
చేసుకున్నాను
రాత్రులలో
నిండా స్నానం చేసి
ఉదయం కల్లా
మల్లె మొగ్గనై
గాలితో కబుర్లాడుతూ
సరోవరం మెట్లపై
వొరిగిపోతాను
ఈ రాగానికి
ఇంకా కొనసాగింపు ఉందా!
దానికి
మరో ఎత్తుగడ కావాలి కాబోలు
దొర్లుతున్నట్టే
గెంతుతున్నట్టే
ఎగుర్తున్నట్టే
అనిపిస్తూ ఉంటుంది
సీసా మూతి పొడోగా
నా మెడ పొడుగా
అది ఓ మూలకు
చొచ్చుకు పోతుంది
కాళ్ళూ చేతులకూ
పనిలేకుండా ఐంది
ఆకుపచ్చ
పసుపు పచ్చ
రిబ్బెన్‍లు వృత్తాలుగా
ఎగురుతూ
నా చుట్టూ తిరుగుతుంటాయి
నా శరీరంలోంచి
అగ్ని ధారగా కురుస్తుంది
నాకు ఒక గొంతు ఉండాలి
ఇప్పుడు
అది పలికితే
నా చెవులకు శబ్దం సోకుతుందా?
పాడడానికి
రాగమేదైనా కుదుర్తుందా
లేక
ఇది నిశ్శబ్దమయమైన
భాండాగారమా?
లేక
విచిత్ర ధ్వనులతో
దద్దరిల్లిపోయే
శబ్దాగారామా?
ఒక విచిత్రమైన
సందర్భంలో నేను
చుట్టుపక్కల
ఏమేమి ఉన్నాయ్
ఓమానాన అంతు పట్టదు
ఒక్కోసారి
ఎగుడు దిగుడుగా ఉంటుంది
మరోసారి
ఏ బాదర బందీలేని
ప్రయాణం
ఎన్నిలోకాలు
చుట్టా లేమిటి
ఇవన్నీ తిప్పడం
ఆనవాయితీనా!
అక్కడెక్కడో దూరంగా
కొన్ని ఆకారాలు
అవేమిటో
స్పష్టంగా తెలియడం లేదు
పూర్తి అస్పష్టమూ కాదు
స్పష్టాస్పంటంగా
కదుల్తూ కదుల్తూ మళ్ళీ
చీకటిలో కల్సిపోతాయి
ఒక్కోసారి
వెలుగే వెలుగు
కళ్ళు మిరిమిట్లు గొల్పేటట్టు
వెన్నెలను
ఎండను
కలిసి పిసికి
పరిచినట్టు
మరో అనుభూతి
ఈ అనుభూతులకు లెక్కేమిటి?
అవి కోకొల్లలు
అనుభూతులు
అనుభూతులుగా లేవు
దొంతరలు దొంతరలుగా
రికామీ గాలిలా
ఇంకోసారి సుడిగాలిలా
మరోసారి యేటి అలలలా
ఒక్కోసారి సముద్ర తరంగాలలా
ఎటుపడితే
అటే
ఒక క్రమం లేదు
అలసట అన్నదీ లేదు
ఒక భావావేశమూ లేదు
బాధ అంతకన్నా కాదు
సంతోషం అన్నదీ ఉండదు
అంతా ఉండీ లేనట్టు
మెట్లు మెట్లుగా
కట్లు కట్లుగా
క్రమం తప్పి
ఈ బండి పోతూనే ఉంటుంది
ఇది బతుకు బండికాదు
వ్యధ సోద లేదు
ఉన్నది ఉన్నట్టే
లేని లేనట్టే
ఉండీ లేనట్టు..
ఒకోసారి
అంతా ఆగిపోతుంది
ఏమీ కదలదు
ఏమీ మెదలదు
ఏదీ పని చేయదు
క్రమంగా
మళ్ళీ కదలిక…
-బి. నరసింగరావు