‘దండకడియం’ అతని కవిత్వం ఒక నిరలంకారపద్యం


తెలంగాణ నేపథ్యంతో, తెలంగాణ జీవితాన్ని ప్రతిబింబించేలా, తెలంగాణ పదబంధాలతో సాహిత్య సృజన చేయడం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత ఎక్కువగా జరుగుతోంది. ఈ సోయి ఎక్కువగా యువకవుల్లో కనిపిస్తోంది. ఇది ఒక మంచి పరిణామం. అలాంటి యువకవుల్లో ఈ మధ్య బాగా వినిపిస్తున్న పేర్లలో తగుళ్ళ గోపాల్‍ ఒకటి. ఈ మధ్యనే రంగులద్దిన వాక్యాలలోకి అంటూ తన 55 కవితలని ‘దండకడియం’గా ధరించి మన ముందుకొచ్చాడు. గోపాల్‍ కవిత్వాన్ని చదువుతుంటే జీవితచిత్రాల్ని సజీవంగా ప్రతిఫలింపజేసే, సహజ స్పందనల్ని అంతే సహజంగా ఆవిష్కరించే ఒక సహజకవిలా అనిపిస్తున్నాడు. తెలంగాణలోని విలక్షణమైన మట్టివాసన, కష్టాల చరిత్ర, సాంస్కృతిక వారసత్వం గోపాల్‍ కవిత్వానికి మూలధాతువులు. గోపాల్‍ కవిత్వం నిండా మానవీయ స్పర్శ ఉంది. అనుభవాలను అక్షరాలుగా మలిచే విద్య ఉంది. అవే పఠితకు అనుభూతి కేంద్రాలవుతాయి, ఆ అక్షరాల దారిగుండా వెళ్ళి తనని తాని వెతుక్కునేలా చేస్తాయి. మానవ సంబంధాల సున్నితత్వం, దుఃఖానికి సంబంధించిన గాఢమైన వ్యక్తీకరణ అతని కవిత్వంలో అడుగడుగునా కనిపిస్తుంది. ఇవన్ని అతనిలోని ఆర్ద్రత వల్లనే సాధ్యమ య్యిందేమో. అందుకే ఆర్ద్రత, అనుభవాల అక్షరాకృతే అతని కవిత్వమనొచ్చు. గోపాల్‍ కవిత్వం సజీవ జానపద సంగీతంలా, శ్రమ సంస్కృతి సంకేతంలా, గ్రామీణ జీవనగీతంలా ఉంటుంది. తాను పుట్టిపెరిగిన మట్టివాసననే తన కవిత్వంలో చొప్పించాడు. అతడు మట్టిలోంచి మొలకెత్తిన కవిత.


ఇంతకీ గోపాల్‍ వయస్సు ముప్ఫైలోపే. ఆ ముప్ఫైలో జీవితాన్ని చూడగలిగిన, తెలుసుకోగలిగిన వయస్సు దాదాపుగా ఇరవైకి దగ్గరే అని చెప్పొచ్చు. అప్పటికే జీవితాన్ని కవిత్వంగా మలుస్తున్నాడు. అంటే అతని జీవితమే కవిత్వమని చెప్పొచ్చు. కవిత్వంతో జీవితాన్ని కళాత్మకంగా జీవిస్తున్నాడు. రసాత్మకం చేసుకుంటున్నాడు. శివారెడ్డి గారు తన ముందుమాటలో చెప్పినట్లు గోపాల్‍ బలమంతా అతని భాషే, అతని ఊరి భాషే. తెలంగాణ పదబంధాలతో నేటివిటీని చూపెట్టడడం అతని ప్రత్యేకత.


దండకడియం సంపుటిలో మొదటి కవిత(అమ్మదీపం)తోనే నేటికాలంలో మృగ్యమవుతున్న మానవసంబంధాలమీద అక్షరాస్త్రం సంధించాడు గోపాల్‍. సృష్టిలో ప్రతిప్రాణి తన సహజలక్షణాలని కోల్పోకుండా మనుగడ సాగిస్తుంటే, మనిషోక్కడే ప్రకృతినుండి పక్కకు జరిగి వికృతిగా మారుతున్న వైనాన్ని సరళంగా చెప్పాడు. ఇక రెండో కవిత ‘ఒకే ఆకాశాన్ని కప్పుకున్నవాళ్ళం’లో ఒకే ఆకాశాన్ని కప్పుకున్నం/ఒకే మట్టిని కప్పుకోవలిసినవాళ్ళం/ ఇది చాలదా? /మేం బంధువులం కావడానికి అన్న పంక్తులతో విశ్వజనీనతను, సార్వకాలికతను, సార్వజనీనతను తన కవిత్వంలో సాధించగలిగాడు.


గోపాల్‍ కవిత్వంలో ఎక్కువగా గ్రామీణ జీవితం, నోస్టాల్జియా, తాత్వికత, ఆశావాదం, భావుకత, అసమానతలు వస్తువులుగా కనబడుతున్నాయి.
పొద్దుపొద్దున్నే/తామరమొగ్గలను సిగలో ముడుచుకున్న/చెరువమ్మ ముఖం చూసినంకనే/సూరీడు ఏడుగుర్రాల బండికడుతాడు అని అలాగే కాంటాలు చిమ్మెటలు వేలాడే/పసుపుతాడు/ముక్కుపుల్ల లేని నిండు ముఖం/బువ్వచేతి కొంగు ఏసుకునే అమ్మ/ఒక నిరలంకార పద్యం అంటూ భావుకతని పొదగగలిన కవి గోపాల్‍. అంతేకాదు ఇది కల అని తెలుసుకున్నాక/కండ్లు ఆనకట్టలేసిన చెరువులౌతాయి అని ఆర్ద్రతనూ అక్షరమయం చేయగలుగుతున్నాడు.
మనిషిని ముట్టుకోకుండజేసిన/కులం గీతల్ని దాటి/మనుషులంతా ఇక్కడ/తామరపువ్వులై విచ్చుకుంటారు అంటూ ఆవేశంతో కాకుండా ఆశావాదాన్నే పలుకుతున్న గోపాల్కి కుర్చీల మెడలు వంచి/ఎత్తుకుపోయిన మెతుకుల్ని/ఎలా పట్టుకొచ్చుకోవాలో తెలుసు/రైతుల రక్తాన్ని కండ్లజూస్తున్న/ఏ సర్కారు ముండ్లనైనా/ఒడుపుగా ఎలా కాలబెట్టాలో తెలుసు/ఇంకెప్పుడైనా/రైతు ఊపిరి చెట్లకొమ్మలకు వేలాడితే/తోలు చెప్పుల సప్పుడే/దేశమంతా/జాతీయగీతమై మారుమోగుతుంది అంటూ ధిక్కార పద్యాన్ని వినిపించడం తెలుసు. ఈ కోవలో ఏది దొంగతనం, ఎవరు అసలు దొంగ అంటూ ప్రశ్నలు విసిరిన ‘వెలిమామిడి’ కవిత చదవాల్సిందే.


‘గంజి’ అనే కవితలో రెండే రెండు వాక్యాలతో (పట్టుబట్టలను గంజిలో అద్ది ఇస్త్రీ చేసే కొన్ని బతుకులు గుర్తొస్తాయి/పేగులమూటను నానబెట్టీ పలుగుపార పట్టే మనుషులు గుర్తొస్తారు) సమాజ అంతరాలను పట్టిచూపిన తీరు గోపాల్‍ సమాజాన్ని చదువు తున్నాడనడానికి సంకేతంగా చెప్పొచ్చు. అదే కవితలో తన పేదరికాన్ని చిత్రించిన తీరు పాఠకుడ్ని కదిలిస్తుంది. అది అతని పేదరికమే కాదు మరెందరిదో.


దుఃఖాన్ని మోస్తూ తిరగడమే జీవితం అంటూ తాత్విక చింతనని కనబరుస్తూనే భరించలేనంత దుఃఖమని/చెట్టునో, చెరువునో వెతుక్కునే నిరాశాజీవులకి దుఃఖాన్ని వినే మనుషులు ఎక్కడో ఒకరు ఎవరో ఒకరు ఉంటారని వాళ్ళముందు దుఃఖపుగంపని దించుకోవాలని ఆశావాదాన్ని నూరిపోస్తున్నాడు. రోజుకు ఒక్కసారైనా మాటల్ని కలుపుకొని తిందాం అంటూ తన కవిత్వంతో కౌన్సిలింగ్‍ ఇస్తున్నాడు. పొయ్యిమీద ఎసరు కాగుతుంటే/బియ్యంగింజలు చెప్పె గెలుపుపాఠం గంజి అంటూ సున్నితంగా మానసిక వికాసాన్ని కలగజేస్తున్నాడు.


జీవితమంతా పల్లెపట్టుల్లోనే గడిపినవాడిగా, అక్కడి శ్రమైక సౌందర్యాన్ని కళ్ళారా చూసినవాడిగా, ఆ ఈతిబాధలను అనుభవించినవాడిగా… గోపాల్‍ తన జీవితాన్నే కవిత్వం చేశాడు, కవిత్వానికి జీవం పోశాడు. అందుకే నిజమైన శ్రమ అంటే ఏంటో, నిజమైన ఉత్పాదకత అంటే ఏంటో అని ఎన్నో కవితల్లో సూతప్రాయంగా చెప్పుకుంటూ వస్తూ కవిత్వానికి మానవీయతను అద్దుతాడు. మచ్చుకు ఈ కింది పంక్తులను చూడండి.
ఈ ఇనుపగొడ్డలి/మా నాయనకు జిగిరి దోస్తు/మా ఇంట్లోని పేదరికాన్నంతా/కొంచెం కొంచెంగా నరుక్కుంటూ వచ్చింది/నాన్న మరణం చూడలేక/ఆ రోజే సగం విరిగిపోయింది/మొనదేలిన ఇనుపగొడ్డలి/ పెళుసులుపెళుసులుగా రాలి/నాన్నకు నివాళి నర్పించింది/ ప్రాణంగా చూసుకున్న దోస్తులేడని/మొద్దుబారి కూర్చుంది ఓ మూలకు.


అమ్మతనం గురించి చెప్తూ పాలుతాగే కొడుకు గుర్తుకొస్తే/పిల్లబాటల గుండా నడక పెంచినపుడు/అడ్డమొచ్చిన మట్టిపెళ్ళలన్ని/నీ పాదాలకు దండం బెడ్తవి అంటూ కరుణ రసాత్మకమైన దృశ్యకావ్యాన్ని కళ్ళముందు ఆవిష్కరిస్తాడు. మూడు రంగులు కలిసి/జాతీయ పతాకమైందే తప్పా/మన ముగ్గురమెపుడైనా/కలిసి నడిచామా? అని మన జాతి సమైక్యతను సూటిగా ప్రశ్నిస్తూనే మనుషుల్ని నరికే ఈ గోడను కూల్చడానికి/ఏ పలుగూపారా అవసరం లేదు/మానవత్వపు మొక్కను నాటితే/పగుళ్ళు వచ్చి కూలిపోతుంది అని మానవీయ సమైక్యతా మంత్రాన్ని బోధ చేస్తాడు. లక్షల పెట్టుబడులను పెట్టి/ర్యాంకుల పంటలను ఆశిస్తున్నారు గానీ/ఆ పొలంలో ఏ పంట పండుతుందో/ఒక్కసారైనా ఆలోచిస్తే ఈ కడుపుకోతలు ఆగేవేమో అంటూనేటి తల్లిదండ్రుల కోసం హితవాక్యం పలుకుతాడు.
తన బాల్యం, తనలాంటి వాళ్ళ బాల్యం అంతా కష్టాలతోనే గడిచిందని, పేదరికాన్నే అనుభవించిందని ప్రతీకాత్మకంగా ఇలా అంటాడు కాళ్ళను ముందలేసుకొని/ముండ్లు తీయడంతోనే/గడిచిపోయింది బాల్యం. ఇప్పుడు పేదరికాన్నుండి తప్పించుకున్న నేటి ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఒక మనిషి సాటి మనిషిని పట్టించుకోనంత ఒంటరి అవుతున్నాడని, ఇంతటి సంక్లిష్ట జీవితం కంటే కష్టాలని అనుభవించిన ఆ బాల్యమే అందమైందని అందరిలో ఉంటూనే/ఒంటరితనాన్ని మోస్తున్న ఇప్పటి నొప్పికన్న/ఈ తుమ్మముల్లు నొప్పి/ఏమంత పెద్దది గాదు అని వాపోతున్నాడు. ఏ భాష రాని వాళ్ళు ఉండొచ్చుగానీ/కన్నీటి భాష/అర్థంకాని వాళ్ళు ఉండరేమో/నాలుక భాషలు/మనిషి నుండి మనిషిని/దూరంగా విసిరేస్తాయి గాని/నరనరాలు పలికే కన్నీటి భాషోక్కటే/మనుషుల మధ్య ఖాళీని పూరిస్తుంది అంటూ ఆర్ద్రంగా చెప్పినా నిజానికి ఇదే గోపాల్‍ కవిత్వ భాష. ఆ గుండెతడి పోనంతవరకు ఇలాంటి కవిత్వాన్ని సృజించగలుగుతూనే ఉంటాడు. తన కవిత్వాన్ని మట్టిపరిమళం చేయడమే కాదు తాను మట్టిబిడ్డనే అన్న స్పృహను కోల్పోనివాడు. ఉదాహరణకి తన తాతను జనం పొగిడినప్పుడల్లా తన తనువు పులకించిందని చెప్పటానికి ఈ మట్టిపెయ్యి మీద/గడ్డిపూలు మొల్చినట్టుంటది అంటాడు.


ఇప్పుడు నేను/దుఃఖనదిని దాటుకుంటూ వచ్చిన/నునుపుదేలిన అక్షరాన్ని అంటూ సారవంతమైన అక్షరాలనే కవిత్వంగా పండిస్తున్న అక్షరహాలికుడు గోపాల్‍. అతని కలంహలం మరెంతో గొప్ప సాహితీ వ్యవసాయం చేసి అందమైన అక్షరపంటల్ని పండించాలని కోరుకుందాం.


కవిత్వసంపుటి: దండకడియం
కవిపేరు: తగుళ్ళగోపాల్‍
పేజీలు: 164 వెల: రూ. 150
ప్రతులకు: నవతెలంగాణ, నవచేతన బుక్‍ స్టాలల్లో లభ్యం
ఫోన్‍ నంబర్‍ -9505056316

  • రాపోలు సీతారామరాజు
    దక్షిణాఫ్రికా
    +27 727747549

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *