ఆయన జీవితాన్ని సమున్నతంగా గెలుచుకున్న న్యాయ కోవిదుడు జనధర్మం కోసం అత్యున్నత న్యాయ పీఠాన్ని అధిరోహించిన బహుజనుడు. సత్వర న్యాయం కోసం పరితపించిన న్యాయమూర్తి. నిరాడంబర జీవితం ఆయన ఆచరణ. ఆయన జస్టిస్ నాంపల్లి కుమారయ్య, జగిత్యాల జిల్లా, (అప్పటి కరీంనగర్ జిల్లా) కొడిమ్యాల మండల కేంద్రంలో శాలివాహన దంపతులైన నర్సింలు లక్ష్మమ్మలకు ఆయన 15.6.1901లో జన్మించారు. పని చేస్తేనే బతుకుతెరువు అయిన కుటుంబంలో పుట్టి అంచెలు అంచెలుగా విద్యార్హతలు సాధించారు. కుమారయ్య ఏ తరగతిలో ఉన్న ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణుడు అయ్యేవాడు. ఆయన విద్యాదాహాన్ని గమనించిన తండ్రి ఆయనను కొడిమ్యాలలో ప్రాథమికవిద్య, కరీంనగర్‍లో ప్రాథమికోన్నత విద్య, వరంగల్‍లో ఉన్నత విద్యను ఆనాటి నిజాం ప్రభుత్వ పాఠశాలలో ఉర్దూ మీడియంలో చదివించారు. అనంతరం ఆయన ఆగకుండా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చేరి డిగ్రీ, న్యాయశాస్త్రం విద్యను అభ్యసించారు. అనంతరం జరిగిన హైదరాబాద్ సివిల్ సర్వీసెస్ పరీక్షకు రాసి ప్రథమ ర్యాంక్‍లో ఉత్తీర్ణులయ్యారు. హైదరాబాద్ సివిల్ సర్వీస్ అంటే ఇప్పటి ఐ.ఏ.ఎస్. లెక్క. హైదరాబాద్ రాజ్యంలో 1931లో ఆయన సివిల్ సర్వీస్‍కు ఎంపికయ్యారు. ఆ పరీక్షలో ఎంపికైన వారి జాబితాను అప్పటి ప్రధాన న్యాయమూర్తి సర్ నవాబ్ మిర్జాయార్ జంగ్ ఉన్నతాధికారులు సమర్పించి ఒకరిని జ్యుడిషియరీకి ఎంపిక చేయమని కోరారు. అందరి పరీక్షాపత్రాలను చూసిన ఆయన కుమారయ్యను జ్యూడిషియరీకి ఎంపిక చేరారు. జాబితాలోని మొదటి వ్యక్తికి తనకు నచ్చిన డిపార్ట్మెంట్‍ను ఎంపిక చేసికోవచ్చు. అందువల్ల కుమారయ్య రెవెన్యూ డిపార్ట్మెంట్ కావాలని కోరుకున్నారు. ప్రధాన న్యాయమూర్తి అయి వచ్చిన తర్వాత అయ్యన్ని న్యాయస్థానంకు పంపుతానని ప్రధాన న్యాయమూర్తి హామి ఇచ్చారు. కాని కుమారయ్య లక్నోలో ట్రైనింగ్ పూర్తి చేసికొని వచ్చేసరికి నవాబ్‍జంగ్ ప్రధాన న్యాయమూర్తిగా రాజీనామా చేసి హైదరాబాద్ వదలి వెళ్ళిపోయారు. అందువల్ల కుమారయ్య మున్సిఫ్ మెజిస్ట్రేట్‍గా 1935లో ఉద్యోగంలో చేరాల్సి వచ్చింది.
ఆ తర్వాత 1943లో అడిషనల్ జిల్లా మేజిస్ట్రేట్‍గా పదోన్నతి పొందారు. 1946లో జిల్లా మెజిస్ట్రేట్‍గా పదోన్నతి పొందారు. 1948లో సెషన్స్ జడ్జిగా, 1955లో హైదరాబాద్ హైకోర్టు కు జడ్జిగా పదోన్నతి పొందారు. అప్పటికి ఆంధప్రదేశ్ విలీనం కాలేదు. హైకోర్టులో జడ్జిగా చేరిన తర్వాత 1956లో ఆంధ్రరాష్ట్రం హైదరాబాద్ రాష్ట్రంలో విలీనం అయిన తర్వాత అడిషనల్ జడ్జిగా ఆంధప్రదేశ్ హైకోర్ట్లో పనిచేశారు. తిరిగి ఆంధప్రదేశ్ హైకోర్ట్కు 1957లో జడ్జిగా పదోన్నతిలో చేరారు. 1969లో చీఫ్ జస్టీస్ ఆఫ్ ఆంధప్రదేశ్ హైకోర్టుగా అత్యున్నత పదవిలోకి ఎక్కారు. జూన్ 15, 1971లోని ఆయన పదవీ విరమణ చెందారు.
ఆయన జడ్జిగా ఏ స్థాయిలో పని చేసినా న్యాయవాదుల వాదనని శ్రద్ధగా దయతో ప్రేమపూర్వకంగా విని తీర్పులు చెప్పేవారని ప్రసిద్ధి. ఆయన తీర్పుల్లో ప్రజలకు న్యాయం అందించాలన్న తపన కనిపించేది. అయితే అందుకోసం ఆయన తన పరిధులు దాటినట్లుకూడా లేదు. కేసులను త్వరితంగా పరిష్కరించడానికి కుమారయ్య తీవ్రంగా పరిశ్రమించేవారు. హైకోర్ట్ న్యాయమూర్తిగా నియమకం పొందాక కేసుల్ని త్వరితంగా పరిష్కరించేందుకు అవసరమైన చర్యల్ని చేపట్టి అందుకోసం కృషి చేసినారు. హైకోర్ట్లోని విభాగాలను పునర్వ్యవస్థీకరించారు. తన పదవీకాలంలో హైకోర్ట్లో కేసులు చాలావరకు తగ్గుముఖం పట్టాయి. ఆయన ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన కాలంలో రాష్ట్రంలోని దాదాపు అన్ని కోర్టులను తనిఖీ చేశారు. ఆ తర్వాత సమావేశాలు నిర్వహించి అవసరమైన సూచనలు అందచేసేవారు. సబార్డినేట్ కోర్ట్లు ఎలాంటి తప్పిదాలు లేకుండా కేసులను పరిష్కరించేందుకు ఆయన మౌఖిక సూచనలు చేసేవారు. అట్టి సూచనలతో హైకోర్ట్ 1970, 71లో ఒక పుస్తకాన్ని వెలువరించింది. ఆ పుస్తకాలు న్యాయమూర్తులకు ఇప్పటికీ ఉపయోగప డుతున్నాయి.
హైకోర్ట్ చీఫ్ జస్టిస్‍గా పదవీ విరమణ పొందిన తర్వాత 1979లో ప్రపంచ బ్యాంక్ ట్రిబ్యునల్ జడ్జిగా రెండు పర్యాయాలు పనిచేశారు. మూడోసారి అవకాశం వస్తే కూడా ఆయన ఇష్టపడ కుండా ఇంటి వద్దనే ప్రశాంత జీవనం గడపసాగారు.
కుమారయ్యకి తెలుగు, ఉర్దూ, మరాఠి, ఆంగ్లం భాషల్లో ప్రావీణ్యతగలదు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఆయన మొట్టమొదటి హైకోర్ట్ చీఫ్ జస్టిస్‍గా పనిచేసి రికార్డ్ సృష్టించారు. మారుమూల పల్లెలో కుమ్మరి కులం నుంచి ఇంతగా ఎదిగినవారు ఆ కాలంలో దాదాపుగా లేరు. హైకోర్ట్ జడ్జిగా దళిత బహుజనులు దాదాపు లేనికాలంలో ఆయన శ్రమించి అంచెలు అంచెలుగా ఎదిగారు. పేద కుటుంబం నుంచి వచ్చినందున పేద ప్రజలపట్ల అవ్యాజమైన అనురాగంతో ఉండేవారు. సత్వరంగా న్యాయం అందిస్తేనే న్యాయం జరిగినట్లు అని నమ్మే ఆయన ఆచరించి చూపారు. నిరాడంబర జీవితం ఆచరణకు మచ్చుతునకగా ఆయన ఉద్యోగ విరమణ సందర్భంలో చెప్పిన ‘‘ఈ ప్రపంచంలో ఎవరూ పరిపూర్ణులుకాదు. వైఫల్యాలు లేకుండా ఎవ్వరూలేరు. నా చర్యల వల్ల ఏదైనా మంచి జరిగితే అది భగవంతుని కృపవల్ల జరిగింది. ఏదైనా చెడుగానీ అపజయంగానీ సంభవించినట్లు అయితే అవి నా లోపాలవల్ల జరిగాయి’’ అన్న మాటలు గుర్తుకువస్తాయి.
జస్టిస్ కుమారయ్య తీర్పు చెప్పిన కేసుల్లో ఖాసీంరజ్వీ, అయక్ అలీ తప్పించుకున్న కేసు ముఖ్యమైనది. అట్లాగే సాలర్‍జంగ్ ఎస్టేట్ వ్యవహారాల కేసులను కూడా ఆయన పరిష్కరించారు. చీఫ్ జస్టిస్‍గా పనిచేస్తున్న కాలం తర్వాత తను అగ్రికల్చరల్ ఇన్‍కంటాక్స్ ట్రిబ్యునల్, ఎలక్షన్ ట్రిబ్యునల్‍కు వేజ్‍బోర్డ్, పబ్లిక్ సెక్యూరిటీ మేజర్స్ అడ్వయిజర్ బోర్డ్లకు వేరు వేరు కాలాల్లో చైర్మన్‍గా వ్యవహరించి పలు సామాజిక ప్రయోజనం గల జడ్జిమెంట్‍లు ఇచ్చారు. ప్రివెంటివ్ డిటెన్షన్ ఆర్ట్కు అడ్వయిజరీ బోర్డ్ మెంబర్‍గా కూడా పని చేశారు.
జస్టిస్ నాంపల్లి కుమారయ్యకి స్వయాన సోదరుడు నాంపల్లి రాజేశం ప్రఖ్యాత సోషలిస్ట్ నాయకుడు. ఆయన జార్జి ఫెర్నాండెజ్ మధులిమాయెతో సాన్నిహిత్య సంబంధాలు ఉండేవి. కొంతకాలం ఇంజనీర్‍గా హైదరాబాద్ రాష్ట్రంలో పనిచేశారు. చాలా సంవత్సరాలు ‘ఆకాశిక్’ అనే ద్విభాష (తెలుగు, ఇంగ్లీషు) పత్రికను సికిందరాబాద్ నుండి వెలువరించారు ఇటీవలనే ఆయన మరణించారు.
జస్టిస్ కుమారయ్యకు కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ఇచ్చి గౌరవించింది. ఆయనకు ఐదుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. సత్యం, న్యాయం అందించండం నిరాడంబర జీవితం ఆచరించడంలో ఈ బహుజన బిడ్డ తెలంగాణ వైతాళికుల్లో ఒకరు. ఆయన 96 సంవత్సరాలు జీవించి 2005లో అమరత్వం పొందారు.
– అన్నవరం దేవేందర్
9440763479