విద్యార్థుల సృజనాత్మకతను వెలికితీయాలి : జిల్లా విద్యాశాఖాధికారి రమేష్‍కుమార్‍

  • పాఠశాలలకు రీడింగ్‍ క్లబ్స్ ఎంతో అవసరం : చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్‍ అకాడమి చైర్మన్‍ మణికొండ వేదకుమార్‍
  • ఉమ్మడి మెదక్‍లో ఘనంగా బాలచెలిమి 24వ ముచ్చట్లు కార్యక్రమం


బాల సాహిత్యమే బంగారు భవితకు బాటలు వేస్తుంది. బాలల్లో దాగియున్న సృజనాత్మకతను వెలికితీసి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడానికి సాహిత్యం ఎంతగానో ఉపయోగపడుతుంది. బాలల్లో చైతన్యం తీసుకురావడమే ధ్యేయంగా చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్‍ అకాడమి, బాలచెలిమి పిల్లల వికాస పత్రిక విశేషమైన కృషి చేస్తోంది. పిల్లలకు వైవిధ్యమైన విజ్ఞానాన్ని అందించేందుకు కవులు, రచయితలు, ఉపాధ్యాయులతో ప్రతి నెల రెండవ శనివారం ‘బాలచెలిమి ముచ్చట్లు’ నిర్విరామంగా నిర్వహిస్తోంది. ఇప్పటి వరకు 23 బాలచెలిమి ముచ్చట్లు కార్యక్రమాలను దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. ఒక్క హైదరాబాద్‍లోనే కాకుండా తెలంగాణలోని 31 జిల్లాల్లో ముచ్చట్లు నిర్వహిస్తున్నారు. బాల చెలిమి పిల్లల వికాస పత్రిక, చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్‍ అకాడమి సంయుక్తాధ్వర్యంలో బాలచెలిమి ముచ్చట్లు – 24 కార్యక్రమం ఫిబ్రవరి 18న మెదక్‍లోని న్యూ హైస్కూలులో జరిగింది. ‘బాలచెలిమి’ మెదక్‍ జిల్లా బడి పిల్లల కథలు – బాల కథకుల ఆలోచనలు, ఆవిష్కరణలు అనే అంశంపై జరిగిన సదస్సులో ఉమ్మడి మెదక్‍ జిల్లా బాల సాహితీవేత్తలు, కవులు రచయితలు, సాహిత్య సంస్థల నుంచి పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెదక్‍ జిల్లా విద్యాశాఖాధికారి రమేష్‍కుమార్‍, విశిష్ట అతిథిగా చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్‍ అకాడమీ చైర్మన్‍ మణికొండ వేదకుమార్‍, నోడల్‍ అధికారి మధుమోహన్‍, పలువురు ఉపాధ్యాయులు హాజరయ్యారు.


విద్యార్థుల్లో సృజనాత్మకత నశించిపోకుండా చూడాలి : జిల్లా విద్యాశాఖాధికారి రమేష్‍కుమార్‍

నేటి విద్యార్థుల్లో సృజనాత్మకత, కళాత్మకత నశించి పోతుందని, వాటిని కాపాడాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని జిల్లా విద్యాశాఖాధికారి రమేష్‍కుమార్‍ పేర్కొన్నారు. ఈ తరం పిల్లలు క్వశ్చన్‍కు ఆన్సర్‍ మాత్రమే చదువుతున్నారని, కానీ ఆ ఆన్సర్‍ ఎందుకు చదువుతున్నారో మర్చిపోయినట్లు తెలిపారు. ఒకప్పటి విద్యార్థులు పాఠశాలలో క్లాసులు విని ఇంటికొచ్చి బాగా ఆడుకునే వారన్నారు. అప్పట్లో టెక్టస్బుక్స్ చదవాల్సిన పని ఉండేదికాదని, గ్రంథాలయాలకు వెళ్లి పుస్తకాలు చదువుకొని జ్ఞానం పెంచుకున్నట్లు తెలిపారు. విద్యార్థులు నాణ్యమైన కథలు రాసి తమ భవిష్యత్‍కు బాటలు వేసుకోవాలన్నారు. విద్యార్థుల భవిష్యత్‍పైనే దేశ భవిష్యత్‍ ఆధారపడి ఉందని, చిన్నతనం నుండే విద్యార్థులు మంచి లక్ష్యం ఏర్పాటు చేసుకొని విజయం సాధించాలన్నారు.


మూడు దశాబ్దాలుగా రీడింగ్‍ క్లబ్స్ కోసం కృషి చేస్తున్నాం : చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్‍ అకాడమి చైర్మన్‍ మణికొండ వేదకుమార్‍

పిల్లల పట్ల తపన ఉండి వారిని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులు సంకల్పించడం గర్వకారణం అని చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్‍ అకాడమి చైర్మన్‍ మణికొండ వేదకుమార్‍ అన్నారు. ఉమ్మడి మెదక్‍ జిల్లా పేరు మీదనే బడి పిల్లల కథలు పుస్తకాలు తీసుకురావడం చాలా సంతోషంగా ఉందన్నారు. 33 జిల్లాల్లో బాలసాహితీవేత్తలందరినీ ఆహ్వానించడంతో దాదాపు నాలుగైదు వందల కథలు తమ వద్దకు వచ్చినట్లు తెలిపారు. వీటిని పది సంకలనాలుగా నెల రోజుల్లో తీసుకురాబోతున్నట్లు తెలిపారు. పిల్లలకు అదనంగా చదివే పఠనం పట్ల ఆసక్తి కలిగించడానికి రీడింగ్‍ క్లబ్స్ అనేవి పాఠశాలల్లో ఉండాలనేది తమ అభిమతమని, గత మూడు దశాబ్దాల నుండి చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్‍ అకాడమీ, చిల్డ్రన్స్ ఫిల్మ్ సొసైటీ ప్రయత్నాలు చేసినట్లు తెలిపారు. ప్రపంచ తెలుగు మహాసభల్లో దీనిపై ఒక నిర్ణయానికి వచ్చి బాలసాహిత్యానికి రెండు సెషన్లు కేటాయించినట్లు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల బాలసాహితీవేత్తలు వేదికమీద పాలుపంచుకొని, బాలసాహిత్యం ఎలా ఉండాలి, ఇతర దేశాల్లో బాలసాహిత్యంపై తీసుకుంటున్న మార్పులు మొదలైన వాటిపై చర్చించినట్లు తెలిపారు. మన రాష్ట్రంలో ఎటువంటి బాలసాహిత్యం వస్తుంది, ఎటువంటి ప్రచురణలు రావాలి, పిల్లల్లో ఆసక్తి ఎలా కల్పించాలి, ఎలాంటి పబ్లిషర్స్ ఉండాలి, ఎటువంటి బొమ్మలు గీయాలి మొదలైన వాటిపై చర్చ జరిగినట్లు తెలిపారు. ఇరు రాష్ట్రాల నుండి చక్కని బాలసాహిత్యం రావడానికి అవకాశం ఉందని, దాన్ని ఒక మూవ్‍మెంట్‍లాగా కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలిపారు.


బాలల్లో చైతన్యం తీసుకురావడమే ధ్యేయంగా 1990-91లో పిల్లల మాసపత్రిక ‘బాలచెలిమి’ని తీసుకొచ్చినట్లు తెలిపారు. బాలచెలిమి ముచ్చట్లు పేరుతో ఇరు రాష్ట్రాల్లో ఉన్న రెండువందల మంది రచయితలతో ఇప్పటి వరకు 23 బాలచెలిమి ముచ్చట్లు కార్యక్రమాలు దిగ్విజయంగా నిర్వహించినట్లు తెలిపారు. ఈ ముచ్చట్లను ఎక్కువగా హైదరాబాద్‍లో నిర్వహించామని, మిగతా అన్ని జిల్లాల్లో కూడా బాలచెలిమి ముచ్చట్లు కార్యక్రమాలు నిర్వహించేలా ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. అందరి ఆలోచనలను పంచుకొని ఎటువంటి రచనలు ఉండాలని ఒక అవగాహనకు వచ్చినట్లు తెలిపారు. పుస్తకాలు తెచ్చేముందు కథలను ఎంపిక చేయడానికి మొదటిసారిగా 10 జిల్లాల ఎక్స్ఫర్టస్తో ఒక కార్యశాలను నిర్వహించి, 882 కథల నుండి బెస్ట్ అనుకున్న కథలనే ఎంపిక చేసి సంకలనం రూపంలో తీసుకొచ్చినట్లు తెలిపారు. అనంతరం తెలంగాణ జిల్లాల నుండే ఆర్టిస్టులను ఆహ్వానించి వారితో కార్యశాల నిర్వహించి పుస్తకాలకు అందమైన బొమ్మలు గీయించినట్లు తెలిపారు. 2020 డిసెంబర్‍లోగా తెలంగాణలోని 33 జిల్లాల్లో బాలచెలిమి గ్రంథాలయాలను ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తున్నామని, ఇప్పటికే మూడు జిల్లాల్లో గ్రంథాలయాలను ప్రారంభించామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలు లేదా శాఖ గ్రంథాలయాల్లో బాలచెలిమి గ్రంథాలయం అదనంగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఏ పుస్తకాలైతే పిల్లలకు ఉపయోగం ఉంటుందో అలాంటి పుస్తకాలను మాత్రమే ఉంచుతామన్నారు. రెండు నెలల క్రితం భూదాన్‍ పోచంపల్లి, ఖమ్మం జిల్లాలోని జల్లిపల్లి ప్రభుత్వ పాఠశాల, నిజామాబాద్‍ జిల్లాలోని తడపాకలో గ్రంథాలయాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నాలుగో గ్రంథాలయాన్ని పెద్దపల్లి జిల్లాలోని నందిమేడారంలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దేవరకొండలో కూడా మరో గ్రంథాలయాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. 33 జిలాల ప్రభుత్వ గ్రంథాలయాల్లో బాలచెలిమి గ్రంథాలయాలను పెట్టుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు ఆయాచితం శ్రీధర్‍ గతంలోనే చెప్పారని వేదకుమార్‍ వివరించారు. గ్రంథాలయాల నిర్వహణ అంటే పుస్తకాలు అలమారలో పెట్టి, చదివించి ఆసక్తి కల్పించడమే కాదని, అవి ఒక వికాస సెంటర్లుగా వృద్ధి చెందాలన్నారు. కథలపట్ల ఆసక్తి కల్పించడానికి ఒరియంటేషన్‍, ఎక్స్ఫర్ట్లతో కథలు చెప్పించడం జరుగుతుందన్నారు. లైబ్రరీ కేంద్రంగా కథలమీద అవగాహన మరియు పేయింటింగ్‍, సింగింగ్‍ మొదలైన టాలెంట్‍ను గుర్తించి వారిని అన్ని విధాలుగా ప్రోత్సహించనున్నట్లు తెలిపారు. పిల్లలు సైతం తమ ప్రతిభను నిరూపించుకోవడానికి మంచి అవకాశం ఉందన్నారు. హిందీ, మలయాళం, బెంగాళీ, మరాఠీ, గుజరాత్‍ రాష్ట్రాల్లో చాలా చక్కని బాలసాహిత్యం వస్తుందన్నారు. మంచి బాలసాహిత్యాన్ని సమాజానికి అందించడమే తమ ధ్యేయం అన్నారు. గ్రామం నుంచి వచ్చిన పిల్లలకే ఎక్కువ శక్తి సామర్థ్యాలు ఉంటాయని, అందులో పట్టణం పిల్లలు కొంచెం వెనుకబడి ఉంటారన్నారు. ప్రభుత్వ పాఠశాలలను తాను ఎక్కువగా గౌరవిస్తానన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్‍, అబ్దుల్‍ కలాం.. వీళ్లందరూ కుగ్రామాల నుండి వచ్చినవారేనన్నారు. గ్రామాల్లో చదువుకున్న పిల్లలు ఏ విషయంలోనూ తీసిపోరన్నారు. రాష్ట్రంలో అత్యంత ఎక్కువగా అర్హులైన ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నట్లు తెలిపారు. మన పాఠశాలలను ఇంకా బలోపేతం చేసుకుంటే విద్యా వ్యవస్థ బలపడు తుందన్నారు. ఇతర చదువులతోటి విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసం పెరుగుతుందన్నారు. గ్రామాల్లో ఉన్నాం.. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్నాం.. అని ఏ ఒక్క విద్యార్థి అనుకోవద్దని, ప్రభుత్వ విద్యా వ్యవస్థ చాలా గొప్పదన్నారు. దేశంలో ఉన్నతస్థాయిలో నిలిచినవారందరూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివినవారేనని గుర్తు చేశారు.


ప్రతి కథ ఆత్మవిశ్వాసం ఇస్తుంది : నోడల్‍ అధికారి మధు మోహన్‍

మెదక్‍ జిల్లా ఏర్పడిన తర్వాత మంచి కార్యక్రమాలు నిర్వహించడం గర్వకారణం అని, టీమ్‍వర్క్తో ముందుకువెళ్తే విజయం సాధిస్తారని నోడల్‍ అధికారి మధుమోహన్‍ పేర్కొన్నారు. ప్రతి కథలో నీతి అనేది ఉంటుందని, ఆ కథ నుండి ఆత్మవిశ్వాసం పెంపొందించు కోవచ్చన్నారు. రేడియోలో గతంలో కథలు వచ్చేవని, అవి చాలా బ్రహ్మాండంగా ఉండేవన్నారు. టెక్నాలజీ పెరిగిన నేపథ్యంలో అలాంటి కథలకు స్థానం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర విద్యాశాఖ అధికారులు విద్యార్థులచేత కథలు చదివించాలని 2009లో సీసీ విధానం ప్రవేశపెట్టినట్లు తెలిపారు. విద్యార్థి కథ చదివి, ఆ కథలోని సారాంశాన్ని అర్థం చేసుకొని, కథలోని భావం రాయమంటే పిల్లలు రాస్తున్నారన్నారు.


మంచి కథలు చదివి గొప్ప స్థాయిలో నిలవాలి : ఉపాధ్యాయులు; రాజేంద్ర
అప్పట్లో కథలు విన్నవాళ్లు మంచి అలవాట్లను అలవర్చుకొని జీవితంలో గొప్ప స్థాయిలో నిలిచారని ఉపాధ్యాయులు రాజేంద్ర పేర్కొన్నారు. కథలు, సాహిత్యం పట్టించుకోనివాళ్లు దురలవాట్లకు అలవాటుపడి చాలా ఇబ్బందులు పడినట్లు తెలిపారు. నేడు కూడా కథలు వినడానికి చాలా మంది విద్యార్థులు సిద్ధంగా లేరని, వాళ్లు కథలు వినేలా ఉపాధ్యాయులు బాధ్యత తీసుకోవాలన్నారు.


ర్యాంకులు, మార్కులే జీవితం కాదు : బాలసాహితీవేత్త, రిటైర్డు ఉపాధ్యాయులు శర్మ
విద్యార్థి జీవితంలో ర్యాంకులు, మార్కులు మాత్రమే సరిపోవని, అవే ప్రధానం కాదని బాలసాహితీవేత్త, రిటైర్డు ఉపాధ్యాయులు శర్మ పేర్కొన్నారు. జీవితంలో విద్యార్థులు నిలబడటానికి అనేక నైపుణ్యాలు అవసరం అని, ముఖ్యంగా ఈ జనరేషన్‍ పిల్లలు చాలా దురదృష్ట వంతులని, వాళ్లకు కథలు చెప్పేవాళ్లే లేరన్నారు. జీవితంలో వచ్చిన సమస్యలను గ్రామాల్లో నివసించేవాళ్లే సమర్థంగా ఎదుర్కొని పరిష్కరిం చుకుంటారన్నారు. అలాంటి కథలవైపు పిల్లలను తీసుకెళ్లేందుకు తాము కృషి చేస్తున్నట్లు తెలిపారు. కథల్లో వారి సమస్యలు, వారు పరిష్కరించుకునే విధానం ఇవన్నీ ఉంటాయన్నారు.


అన్ని జిల్లాలు తనవే అని భావించడం గర్వకారణం : తెరసం అధ్యక్షురాలు కవిత

పుస్తక పఠనం అంటే తనకు చిన్నతనం నుండి ఎంతో ఆసక్తి ఉందని, అందుకే తాను కవితలు, కథలు రాసినట్లు తెరసం అధ్యక్షురాలు కవిత తెలిపారు. సమాజంలో నిజాయితీగా బతకాలన్నా, క్రమశిక్షణ కలిగి ఉండాలన్నా పుస్తకంలోని కథలు చదవాలన్నారు. అందుకు ఉపాధ్యాయులు చిత్తశుద్ధితో కృషి చేయాలన్నారు. పుస్తకం అనేది తరాలకు నిలిచిపోయే ఆస్థి అని, అన్ని జిల్లాలు తనవే అని భావించి వేదకుమార్‍ పది జిల్లాల కథల పుస్తకాలు తీసుకురావడం చాలా గర్వకారణం అన్నారు.
ఈ కార్యక్రమంలో బాలచెలిమి రాష్ట్ర కన్వీనర్‍ అశోక్‍, ఉమ్మడి మెదక్‍ జిల్లా కన్వీనర్‍ రాజేశం, సైన్స్ ఆఫీసర్‍ రాజిరెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు అంజద్‍ ఆలీ, కార్యక్రమ నిర్వహకులు అంజాగౌడ్‍, రవి, సత్యనారాయణ రెడ్డి, మాధవరెడ్డి పాల్గొన్నారు.

  • జుగాష్‍విలి
    ఎ : 9030 6262 88

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *