వాస్తవ దృశ్యాల్ని తెల్పిన డా।। కసప నరేందర్‍ పుస్తకాలు


శోధన, తెలంగాణ ఉద్యమ-పాట, కొత్తపల్లి జయశంకర్‍, గూడ అంజయ్య పుస్తకాల ఆవిష్కరణసభలో నందిని సిధారెడ్డి


నిజాం కాలేజీలో ఫిబ్రవరి 24న డా. కసప నరేందర్‍ రాసిన నాలుగు పుస్తకాల ఆవిష్కరణ సభ జరిగింది. పుస్తక ఆవిష్కరణ సభను నిజాం కళాశాల తెలుగు శాఖ మరియు తెలుగు అసోసియేషన్‍ ఆఫ్‍ తెలంగాణ వారు నిర్వహించారు.


పుస్తక ఆవిష్కరణ సభలో తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షులు డా.నందిని సిధారెడ్డి, ఓయూ రిజిస్ట్రార్‍ ప్రొ. సీహెచ్‍. గోపాల్‍రెడ్డి, నిజాం కళాశాల ప్రిన్సిపాల్‍ ప్రొ.లక్ష్మీకాంత్‍ రాథోడ్‍, ఓయూ తెలుగుశాఖ అధ్యక్షులు ప్రొ.సూర్యధనుంజయ్‍, తెలుగు అకాడమీ సంచాలకులు ఎ.సత్యనారాయణ రెడ్డి, తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి డా.ఏనుగు నరసింహారెడ్డి, తెలంగాణ ఎస్సీ, ఎస్టీ కమిషన్‍ చైర్మన్‍ డా.ఎర్రోళ్ల శ్రీనివాస్‍, కమిషన్‍ సభ్యులు డా.విద్యాసాగర్‍, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత డా.అంపశయ్య నవీన్‍, కాళోజీ పురస్కార గ్రహీత డా.అమ్మంగి వేణుగోపాల్‍, చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్‍ అకాడమీ చైర్మన్‍, దక్కన్‍లాండ్‍ సంపాదకులు మణికొండ వేదకుమార్‍ పాల్గొన్నారు.


డా. నరేందర్‍ రాసిన శోధన, తెలంగాణ ఉద్యమ-పాట, కొత్తపల్లి జయశంకర్‍, గూడ అంజయ్య అనే నాలుగు పుస్తకాల ఆవిష్కరణ సభ జరిగింది.
విశిష్ట అతిథిగా హాజరైన కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం గ్రహీత డా. అంపశయ్య నవీన్‍ మాట్లాడుతూ నరేందర్‍ తన నవలలపై చేసిన పరిశోధనలను గుర్తు చేసుకున్నారు. నరేందర్‍లో మంచి పరిశీలన దృష్టి ఉందని, మంచి సాహిత్య పరిశోధకుడు అని కొనియాడారు. ఒక్క పుస్తకం రాయడం కష్టమని, అలాంటిది నాలుగు పుస్తకాలు రాయడం మరింత కష్టమన్నారు.


గౌరవ అతిథులు తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి డా.ఏనుగు నరసింహారెడ్డి మాట్లాడుతూ నరేందర్‍ శోధనను, పాటను మరియు రెండు మొనోగ్రాఫ్‍లను ఒకే వేదికపై ఆవిష్కరించడం చాలా గొప్ప విషయం అన్నారు. నరేందర్‍లో కవి, పరిశోధకుడేకాదు మంచి విమర్శకుడు ఉన్నట్లు తెలిపారు. నరేందర్‍ రాసిన శోధన గ్రంథంలో నరసింహారెడ్డి రాసిన ముందుమాట గురించి చదివి వినిపించారు.


ఓయూ తెలుగుశాఖ అధ్యక్షులు ఆచార్య సూర్యధనుంజయ్‍ మాట్లాడుతూ అధ్యాపకులు నిరంతరం పరిశోధకులు అని కొనియాడారు. డా.నరేందర్‍ అధ్యాపకుడిగా ఉంటూనే నిత్య అన్వేషి, నిత్య పరిశోధకుడు అని ప్రశంసించారు. ఆయనలో ఏదో ఒకటి సాధించాలనే తపన ఉందన్నారు. ఆయన రాసిన పుస్తకాల వెనుక ఎంతో కృషి దాగి ఉందన్నారు.


కాళోజీ పురస్కార గ్రహీత డా.అమ్మంగి వేణుగోపాల్‍ మాట్లాడుతూ తాను 1963-64లో నిజాం కళాశాలలో డిగ్రీ చదువుకున్నట్లు తెలిపారు. తనకు నిజాం కళాశాలతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. పుస్తకంలోని పాటలు, మన సంస్కృతి, సంప్రదాయాలను వివరించారు. తెలంగాణ ఉద్యమం- పాటలో పాటలను వివిధ విభాగాలు చేశారు. పాట పోషించిన తీరును పాట ఉద్యమానికి ఏ విధంగా దోహదపడిందో విశ్లేషించారు.


తెలంగాణ ఎస్సీ, ఎస్టీ కమిషన్‍ చైర్మన్‍ డా.ఎర్రోళ్ల శ్రీనివాస్‍ మాట్లాడుతూ చరిత్ర చాలా ముఖ్యమైందని, ఆ చరిత్రను గద్యరూపంలో రాయడం చాలా కష్టమైందన్నారు. అదే చరిత్ర కవికి పాట రూపంలో చెప్పడం చాలా సులభం అన్నారు. తెలంగాణ ఉద్యమం గురించి పాటలో చెప్పడం తెలంగాణకు ఉన్న గొప్ప నేపథ్యం అని కొనియాడారు. తెలంగాణ ఉద్యమ చరిత్ర పాటల వల్ల ఎక్కువగా నేర్చుకున్నామని ఆయన తెలిపారు. తెలంగాణ అంటే ఒక చరిత్ర. తెలంగాణ అంటే ఒక పాట అన్నారు. తెలంగాణ పాటలో బాధ ఉంటుందని, దుఃఖం ఉంటుందని, చైతన్యం ఉంటుందన్నారు. తెలంగాణ ఉద్యమం – పాట పుస్తకం గర్వకారణం అన్నారు.
ప్రముఖ రచయిత, తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షులు డా.నందిని సిధారెడ్డి మాట్లాడుతూ నవల పేరు ఇంటి పేరుగా ఉండటం చాలా గర్వకారణమని, ఆ క్రెడిట్‍ అంపశయ్య నవీన్‍కు దక్కుతుందన్నారు. ఒక్క పుస్తకం రాయడం కష్టమవుతున్న తరుణంలో నరేందర్‍ పుస్తకాలు రాయడం అభినందనీయం అన్నారు. తనకు తెలిసినంత వరకు జయశంకర్‍ కొత్తపల్లి జీవితచరిత్రపై పుస్తక రూపంలో రాయడం ఇదే మొదటిసారి అన్నారు. శోధనలో వాస్తవ దృశ్యాల్ని చెప్పడం గర్వకారణం అన్నారు.


రచయిత డా.కసప నరేందర్‍ మాట్లాడుతూ నాలుగు పుస్తకాలు రాయాలని రాసినవి కాదన్నారు. మూడు పుస్తకాలకు తెలుగు అకాడమీ అవకాశం ఇచ్చిందన్నారు. శోధన వ్యాస సంపుటిలో కవులకు సంబంధించిన వివిధ అంశాలను తీసుకొని రాసినవన్నారు. ఇవి విద్యార్థులకు, సాహిత్యకారులకు ఉపయోగపడతాయన్నారు..

విద్యార్థుల సృజన అభినందనీయం : నల్లగొండ జిల్లా అదనపు కలెక్టర్‍ వనమాల చంద్రశేఖర్‍
ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు కథారచనలో రాణించడం ఎంతో అభినందనీయమని జిల్లా అదనపు కలెక్టర్‍ వనమాల చంద్రశేఖర్‍ అన్నారు. చిల్డ్రన్స్ అకాడమీ, బాల చెలిమి సంయుక్త ఆధ్వర్యంలో మణికొండ వేదకుమార్‍ సంపాదకత్వంలో వెలువడిన ‘‘నల్లగొండ జిల్లా బడి పిల్లల కథలు’’ పుస్తకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. ఈ పుస్తకంలో బాల రచయితలు పెద్ద పెద్ద కథలు రాశారని, ప్రతి కథలో నైతిక విలువలు ఉన్నాయని తెలిపారు. భవిష్యత్తులో ఇటువంటి కథలు విద్యార్థులు సన్మార్గంలో పయనించేలా ఉపయోగపడగలవని తెలిపారు. ఈ కథల సంకలనంలో జిల్లా పరిషత్‍ హైస్కూల్‍ చండూర్‍, వట్టిమర్తి హైస్కూల్‍, మిర్యాలగూడ బాలికల ఉన్నత పాఠశాల, వల్లాల తెలంగాణ రాష్ట్ర మోడల్‍ స్కూల్‍, నేతా పురం హైస్కూల్‍ మొదలగు పాఠశాలల పిల్లల కథలు ఇందులో చోటు చేసుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్గొండ జిల్లా కథా సంకలనం కన్వీనర్‍ కోమటి రెడ్డి బుచ్చిరెడ్డి తోపాటు ప్రముఖ కథా రచయిత మేరెడ్డి యాదగిరిరెడ్డి, పెరుమాళ్ళ ఆనంద్‍, సాగర్ల సత్తయ్య, బండారు శంకర్‍ తదితరులు పాల్గొన్నారు.

  • సృజన్‍, 9030 6262 88

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *