కరోనా మహమ్మారి సమాజంలోని ప్రతి వ్యక్తిని, వ్యక్తి జీవితంలోని ప్రతి అంశాన్ని కుదిపేసింది. ఓ పక్క వైరస్ కోరల్లో చిక్కుతామన్న భయంతో ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని, మరో పక్క లాక్డౌన్ కారణంగా పని దొరకక పస్తులుంటూ కాలాన్ని వెళ్లదీస్తున్నారు. ఈ క్లిష్టమైన పరిస్థితులు కళాకారుల హృదయాలను మరింత కలిచి వేస్తున్నాయి. వారు కళను చూసే దృష్టిని మారుస్తున్నాయి. సామాజిక సమస్యలు, మహిళా సాధికారత వంటి అంశాలను ఆధారంగా పలు చిత్రాలు గీసి ప్రముఖ కళాకారిణిగా పేరుపొందిన అవనిరావు గండ్ర చిత్రాలలో ప్రస్తుతం కరోనా రక్కసే ముఖ్యమైన అంశం.
ప్రపంచాన్ని గుప్పెట్లో పెట్టుకొని ప్రాణాంతక వైరస్ సృష్టిస్తున్న పలు సమస్యల నేపథ్యంలో అవనిరావు ఏప్రిల్ 12, 2020 నుండి మే 12, 2020 వరకు ప్రతి రోజూ రోజుకో అద్భుతమైన చిత్రం చొప్పున 30 చిత్రాలను గీస్తున్నారు. వాటిని వెబ్సైట్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ పేజీలలోని ఐకాన్ ఆర్ట్ గ్యాలరీలో లైట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ టన్నెల్ – కోవిడ్ 19 అనే పేరుతో ప్రదర్శనకు పెడుతున్నారు. ప్రతి ఒక్కరికీ చిత్రంలోని భావం తేలికగా అర్థం అయ్యేందుకు ఆయా చిత్రాలకు ఓ కొటేషన్ను కూడా జత చేస్తున్నారు.
అవనిరావు విభిన్న కోణాలలో రకరకాల రంగులతో వివిధ రంగుల మిశ్రమాలతో చిత్రాలను తీర్చిదిద్దుతున్నారు. ఒక్కో మిశ్రమాన్ని ఒక్కో భావానికి ఉపయోగిస్తున్నారు. ఆమె చిత్రాలలో ఉపయోగించే నలుపు, తెలుపు రంగులు చీకటిని పారద్రోలి భవిష్యత్తులో వెలుగురేఖలు ప్రసరిస్తాయని, మంచి కాలం ముందుందనే సత్యాన్ని తెలిపే చిత్రాలు. ఆమె వేస్తున్న ప్రతి చిత్రానికీ ఏదో ఒక కోణంలో వైరస్ తో సంబంధం ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
అవి ప్రజలకు పలు భావాలను వ్యక్తం చేస్తున్నాయి. వ్యక్తి పరిశుభ్రత, మాస్కులు, లాక్డౌన్ ఇలా కరోనతో ముడిపడి ఉన్న ప్రతి అంశాన్ని తన చిత్రాలలో చిత్రించి ప్రజలలో అవగాహన కల్పిస్తున్నారు. కరోనా సోకకుండా మనం మాస్కులు వేసుకోవడం ఇప్పుడు కనిపిస్తున్నప్పటికీ మన హృద యాలకు ఎప్పుడో మాస్కులు వేసుకున్నామని అవి మనకు ప్రకృతి రమణీయతను కనపడ కుండా చేస్తున్నాయని ఆమె అంటున్నారు.
భూమి మీద ప్రకృతి వనరులు వేగంగా తరిగి పోతు న్నాయని, వాతావరణ కాలుష్యం విపరీతంగా పెరిగిపోతుందని, వీటి కారణంగా ఇంతకు మునుపే భయాందోళనలో చిక్కుకున్నామని అంటున్నారు. లాక్డౌన్ ప్రారంభమైన దగ్గర నుంచి తన ఇంటి తోటలోకి వివిధ రకాల పక్షులు వచ్చి గాలిని శుభ్రం చేసి వాతావరణాన్ని ఆహ్లాదం చేస్తున్నాయన్నారు. ప్రభుత్వాలు,వైద్యులు, వైద్యసిబ్బంది, పోలీసులు మరింత అంకితభావంతో పని చేసేలా చేస్తున్నాయని ఆమె అభిప్రాయపడుతున్నారు.
అవనిరావు గీసిన చిత్రాలలో ఒకటి నల్లని సూర్యుడు దాని కింద ఒక అందమైన తామర పువ్వు. నల్లని సూర్యుడు కరుణ ఎరుగని కరోనా వైరస్కు, అందమైన కమలం ఏమాత్రం స్వార్థంలేని ప్రకృతికి సంకేతాలు. నల్లని సూర్యుడు తన విషంతో ప్రపంచాన్ని నాశనం చేస్తుంటే తామరపువ్వు తన స్వచ్ఛమైన సువాసనతో గాలిని పరిశుభ్రం చేస్తున్నట్లు వర్ణిస్తుంది చిత్రం.
ప్రకృతి మృదు మధురమైన సంగీతాన్ని సృష్టించి వాతా వరణాన్ని ఆహ్లాదపరిచినట్టే కరోనా సృష్టిస్తున్న అత్యంత క్లిష్టమైన సమస్యలను కూడా రూపుమాపి మానవాళికి వెలుగు రేఖలను ప్రసరింప చేయడమే ఆమె చిత్రాల సారాంశం.
- అనిల్,
ఎ : 9030 6262 88