గురి తప్పొద్దు

రోజు ఉదయించే సూర్యుడే అయినా ఏదో కొత్తదనం. రోజు నడిచే దారి అయిన ఏదో కొత్త ఉత్సాహం. రోజు వెళ్ళే కాలేజే అయిన తెలియని చైతన్యం… ఓయూ క్యాంపస్‍లోనే నేను పనిచేస్తున్న కాలేజీ ఆంధ్రమహిళాసభ. పేరు తగ్గట్టుగానే అందులో అందరూ సమైఖ్యవాదులే. కొంతమంది తెలంగాణవాదులు తప్ప. పదయిందంటే అటెండెన్స్ రిజిస్టర్‍ ఒక నిముషం కూడా ఆగకుండా ప్రిన్సిపల్‍రూమ్‍కు పరుగెత్తుతుంది. సమయానికి వెళ్లకపోతే రెడ్‍మార్క్ పడిపోతుంది.
గేటు దాటి లోపలికి గబగబా నడుచుకుంటూ వెళ్ళాను. నాకు లాగే అధ్యాపకులందరూ వచ్చి సంతకం చేసి వెళ్ళిపోతున్నారు. అప్పుడే భార్గవి మేడమ్‍ కూడా వచ్చింది. తను సంతకం పెట్టి నా చేయి పట్టుకొని పక్కకు తీసుకెళ్ళింది. ‘‘ఈ రోజు పేపరు చూశాను. నీ ఫొటో వచ్చింది. అదే నిన్న నువ్వు ఆర్టస్ కాలేజీలో దండవేసుకొని కూర్చున్న రిలేనిరాహారదీక్ష’’ అన్నది.


‘‘అవును మేడమ్‍’’ అన్నాను నేను ‘‘మరిచిపోయావా మన ప్రిన్సిపల్‍ మంజులగారు ఆంధ్రమినిస్టర్‍ బంధువు. నీ ఉద్యోగానికే ఎసరు వస్తుంది. చూసుకో’’ అంది భార్గవి మేడమ్‍.
‘ఇంకా ఎన్ని రోజులు భయాలు’ అన్న నా సమాధానికి జాగ్రత్తలు చెప్పి తన బ్లాకుకు వెళ్ళిపోయింది.
నేను నా స్టాఫ్‍రూమ్‍ వైపుకు నడుచుకుంటూ వెళ్ళాను. క్లాసు ఉన్నవాళ్లు వెళ్ళిపోయారు లేనివాళ్ళు కూర్చొని చర్చపెట్టారు. నేను లోపలికి ప్రవేశించగానే తెలంగాణ తల్లి వస్తుందని ఒక మేడమ్‍ అనగానే అందరు ఒక్కసారి గొళ్ళుమని నవ్వారు. నాకేం పట్టనట్టు నా కాబిన్‍కు వెళ్ళి టైమ్‍టేబుల్‍ చూసుకున్నాను. హమ్మయ్య పదకొండింటికి క్లాసు ఎంతో ఉత్సాహంతో వచ్చిన నాకు కొంత మనసులో బాధ కలిగింది. అయినా పైకి చిరునవ్వు నటిస్తూ, పుస్తకం రిజిస్టర్‍ చేతిలో పట్టుకొని లైబ్రరీవైపుగా నడిచాను.


రాములు అటెండర్‍ అప్పటికే వచ్చినట్టున్నాడు. పేపర్‍ చదువుతున్నాడు. నేను వెళ్ళగానే నా ఫొటో చూపించాడు. ‘బాగా వేశారు’ అన్నాను. లైబ్రరీ అంతా నిశ్శబ్ధంగా ఉంది. కొంతమంది విద్యార్థులు పేపర్‍ తిరగేస్తున్నారు.
‘రాములు నీతో మాట్లాడాలి’ అలా వెళదాము. అని లేచి వెళ్ళి కూర్చున్నాము. యాదమ్మ మా వెనుకాలే టీ పట్టుకొని వచ్చింది. మాకు టీ పోసి ఇచ్చింది.
‘అమ్మ తెలంగాణ వస్తదా!’ అన్నాడు రాములు.
‘ఈ సారి తప్పకుండా వస్తది దేవుడు కూడా ఆపలేడు’ అన్నాన్నేను.
‘‘తెలంగాణ వస్తే బాగుండమ్మ. మా కొలువులన్నీ గవర్న మెంట్‍ అవుతయి. చదువుకున్న పిల్లలందరికి కొలువులస్తయి.’’ అన్నది యాదమ్మ.
నిలువుగా తలూపాన్నేను.


‘‘రాములు రేపు మనం ఆర్టస్ కాలేజీలోకి వెళ్తున్నం’ సరేనా!’ అన్నాను.
‘సరే అమ్మా!’ రాములు.
‘నీ కొడుకును చూస్తే ముచ్చటేస్తుంది. చాల తెలివైనోడు.
ఉద్యమంలో కీలకంగా పనిచేస్తున్నాడు’ అన్నాను.
‘తొలిదశ తెలంగాణ ఉద్యమప్పుడు నేను గిట్లనే ఆశ పెట్టుకున్న. ఏది తెలంగాణ వచ్చిందా’ రాములు.
నిరాశపడకు రాములు. రేపు మనం అక్కడికి వెళ్ళి పిల్లలకు ధైర్యం ఇవ్వడానికి నీ అనుభవాలన్నీ చెప్పాలి. నీకప్పుడు టీచర్‍
ఉద్యోగం ఎందుకు రాలేదో చెప్పాలి. సరేనా అన్నాను.
కాలేజీలో ఆ రోజెంతో భారంగా గడిచింది.


× × ×
ఆర్ట్స్ కాలేజీని చూస్తే పోలీసుల మధ్య బందీ అయినట్టని పించింది. చెట్లు కూడా స్వేచ్ఛగా గాలిని పీల్చడం లేదు. ఎక్కడ చూసినా పోలీసుల గుంపులే. ఆకాశంలో సూర్యుడు ఎర్రబడు తున్నాడు. అనుకున్న సమయానికే ఆర్టస్ కాలేజీకి చేరుకున్నాము. అప్పటికే విద్యార్థులు రిలే నిరాహారదీక్షల్లో కూర్చున్నారు. మెడలో దండలు వేసుకున్నారు. వాళ్ళ కండ్లల్లో ఏదో తెలియని ధైర్యం, సాహసం కనిపిస్తున్నాయి. యువకులు తలుచుకుంటే కానిదే మున్నది. ఆర్టస్ కాలేజి మౌన ఋషిగా సంఘీభావం తెలుపుతున్నది. మేము వెళ్ళే సరికే ఆచార్యుల ప్రసంగాలు మొదలయ్యాయి. టెంట్‍ క్రిందకు వెళ్ళి నేను, రాములు ఒకవైపు పక్కన కూర్చున్నాము. అక్కడ వాతావరణమంతా ఉద్వేగభరితంగా ఉంది. విద్యార్థి బృందం పాటలు పాడటం మొదలుపెట్టారు.
‘వీరులారా వందనం
విద్యార్థి అమరులారా వందనం’
ఆ పాట వింటుంటే గుండె చెరువవుతుంది. నా పక్కన కూర్చున్న రాములు కండ్లల్ల నీళ్ళు తిరుగుతున్నాయి. తన కొడుకు శరత్‍ ఎక్కడని.. చూస్తున్నాడు వెంటనే నేను విద్యార్థి నాయకుడు రవిని అడిగి శరత్‍ గురించి వాకబు చేశాను. అసెంబ్లీముట్టడి కార్యాచరణ ఏర్పాట్లు చూస్తున్నాడని చెప్పాడు.
నేను మైకు దగ్గరకు వెళ్ళి ‘జై తెలంగాణ’ అన్నాను.


అందరూ జై తెలంగాణ అని నినదిస్తుంటే నా హృదయం ఉప్పొంగింది. మన నీళ్ళు- మన నిధులు మనకు కావాలంటే ఈ పోరాటం తప్పదు. తెలంగాణ సూర్యోదయాన్ని తప్పక చూస్తాము. ఆశ ఒక్కటే సరిపోదు తొలిదశ తెలంగాణ ఉద్యమంలో ఏం లోపాలు ఉన్నాయో వాటిని సరిచేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈసారి గురి తప్పొద్దు. ఆనాటి అనుభవాలకు సాక్షీభూతమైన రాములు ఇక్కడే ఉన్నారు. వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. రాములు వేదికవైపుగా నడిచిరాగా, అతడిచేతికి మైక్‍ ఇచ్చి నేను వచ్చి టెంట్‍ కింద కూర్చున్నాను.
‘‘అందరికి దండాలు. మిమ్ములందరిని ఇట్లా చూస్తుంటే నాకు మస్తు ఖుషిగా ఉంది. మరోపక్క ఫికర్‍ పట్టుకుంది. 69 నాటి ఉద్యమంల నేను పద్నాలుగేళ్ళ పోరన్ని! వరంగల్‍ మట్టి సాక్షంగా మా పోరాటం నడిచింది. అప్పుడు మా కంటే పెద్దోళ్ళు జయశంకరన్న, కాళన్న ముందుంటే వాళ్ళ ఎనకాల మేము పనిచేసేటోళ్ళం. రాత్రి సైకిలేసుకొని గోడలమీద నినాదాలు రాసేటోళ్ళం. మీటింగ్‍లు రాత్రిపూట పెట్టుకొనేటోళ్ళం. ఇగ సదువుడు బందుపెట్టినం. తెలంగానొస్తే కొలువులిస్తరని, ముందు తెలంగాణ దెచ్చు కోవాల్నని ఆరాటం ఉంటుండే. అప్పుడు నాకు బాగా యాదికుంది. పంద్రాగస్టు కంటే ముందే మా నాయకుడు కొల్లూరి చిరంజీవిని అరెస్టు చేసిండ్రు. కాళన్నని తీసుకెళ్ళి జైల్లో పెట్టిండ్రు. అయినా మేము ఆగలేదు. తెలంగాణ ప్రజాసమితి ఆధ్వర్యంల వెయ్యిమంది గలిసి తెలంగాణ జండా ఎగురేసినం, ఊరేగింపుగా బాట పట్టినం. పోలీసులు రెచ్చిపోయిండ్రు. బాష్పవాయువు ప్రయోగం జేసిండ్రు. లాఠీగోలి ఖాయింగే తెలంగాణ లాయింగే అనుకుంట ఉరుకుడు పెట్టినము. ఒక వరంగల్లునె కాదు యావత్‍ తెలంగాణనమంతా ఇదే పోరాటం. అప్పుడు నాయకుడు మర్రిచెన్నారెడ్డి ఉన్నడు. ఇప్పుడు కేసీఆర్‍ ఉన్నడు. కేసీఆర్‍ దీక్షతో తెలంగాణ జనమంత ఒక్కతాటిపైకి వచ్చిండ్రు. శ్రీకాంతాచారి త్యాగం ప్రతి గుండెకాయను తట్టిలేపింది. ఇక ఆగదు ఏదేమైనా తెలంగాణ వచ్చుడు వచ్చుడే అంటూ ముగించాడు రాములు. జై తెలంగాణ అన్నారు.


అంతట్లకే చుక్కారామయ్య సంఘీభావం తెలపడానికి టెంట్‍ దగ్గరకి వచ్చాడు. ఆయన సాయుధపోరాటం దగ్గరనుంచి నేటి దాకా తెలంగాణ ప్రజల వీరోచిత పోరాటాలను ఏకరువు పెట్టాడు. ఆ తర్వాత కొండలక్ష్మణ్‍ బాపూజీ వచ్చాడు. అక్కడ నుండి లేవాలని పించటం లేదు. మళ్ళిపాటలు ఊపందుకున్నాయి.
‘లిసయిదల్లా హారతి
కాళ్ళ గజ్జల సమ్మతి
తెలంగాణ లడాయికి
కదులుతున్న ఇమ్మతి’
సాయంత్రం సూర్యుడు మరింతగా ఎర్రబడ్డాడు. రాములు నేను మెల్లగా ఇల్లు బాటపట్టాము.


× × ×
తెల్లవారగానే ఆగమాగం తయారయి, ఇంత తిని ఆర్టస్ కాలేజీ బాటపట్టాను. మనసంతా అక్కడే ఉంది. అక్కడ చేరగానే నాకు ఆశ్చర్యమేసింది. మీడియాను లోపలికి రానియకుండా ప్యారామిలిట్రీ దళాలు చీమలదండులా ఉన్నాయి. ఎక్కడచూసిన పెద్దవాహనాలు, ఎవ్వరిని లోపలికి అనుమతించడం లేదు. నాకు తెలిసిన వేరే దారిగుండా ఎసిసి గేటు దగ్గరగా వెళ్ళి దూరంగా నిల్చొని చూస్తున్నాను. ఆర్టస్ కాలేజీ నుండి యువ కిశోరాల గట్టి అరుపులు వినిపిస్తున్నాయి. ఏరులై పారినట్లు, అలుగు దుంకినట్లు, సింహాలై గర్జిస్తూ పెద్ద సంఖ్యలో ఎన్‍.సి.సి పెద్దగేటువైపుగా నడుచుకుంటూ నినాదాలు చేస్తూ వస్తున్నారు. వీరిని గమనించి పోలీసులు ఎన్‍సిసి గేటు మూసేసి కయ్యానికి సిద్ధంగా ఉన్నారు. బారీకేట్లతో మూసేసారు. రాములు ఎప్పుడు వచ్చాడో తెలియదు. నా వెనకాల నిలబడి తను గమనిస్తున్నాడు. వాతావర ణమంతా వేడిక్కుతుంది. విద్యార్థులకు, పోలీసులకు మధ్య ఘర్షణ, తోపులాట. విద్యార్థులు పోలీసుల మీద రాళ్ళు రువ్వుతున్నారు. పోలీసులు ఆకాశంలో గన్నులు పేల్చారు. పరిస్థితంతా అదుపు తప్పుతున్నట్టపిస్తుంది. వ్యూహం ప్రకారం గుంపులుగుంపులుగా విడిపోయి విద్యార్థి బృందాలు అసెంబ్లీ పొడవునా ఉన్నారు. అప్పటికే అసెంబ్లీ దగ్గర ఉన్న గుంపును పోలీసులు అరెస్ట్ చేశిండ్రని రాములు నాతో చెప్పాడు. అందులో శరత్‍ కూడా ఉన్నడట. శరత్‍కు ఏమి కాదని నేను ధైర్యం చెప్పాను.


పోలీసులు కాల్పులు జరుపుతున్నరు. విద్యార్థులు పోలీసులను జై లెక్క చేయకుండ తెలంగాణ నినాదాలు చేస్తూ ఆవేశం కట్టలు తెచ్చుకుంటున్నారు. ఒక్కసారిగా పెద్దసౌండ్‍ వచ్చింది. వాతావరణ మంతా మంచు గప్పినట్టయింది. రాములన్నడు అమ్మ చున్నితో ముక్కుమూసుకో ఇది టియర్‍గ్యాస్‍. నేను రాములు జాగ్రత్తపడ్డము. విద్యార్థులు కూడా కొంతమంది ముక్కులకు ఖర్చీపులు కట్టుకున్నారు. గ్యాసు ఎక్కువ వదిలిన చోట ఏడెనిమిది మంది విద్యార్థులు స్పృహకోల్పోయి పడిపోయారు. నేను రాములు ధైర్యం చేసి అంబు లెన్స్కు ఫోన్‍చేసినం. మెళ్ళగా అక్కడికి పోయి వాళ్ళను ఆంధ్రమహిళా సభ కాలేజీకి గేటు తీసి లోపల పడుకోబెట్టినం. వాళ్ళ పరిస్థితిని చూస్తుంటే నా కళ్ళండ్ల నీళ్ళు తిరిగాయి. ఈ లోపల విద్యార్థి నాయకుడు రవి వచ్చాడు. ఆయన వెంట మెడికల్‍ విద్యార్థులు వచ్చి వైద్యం చేశారు. హమ్మయ్య అనిపించింది. వీళ్ళకేం కాదు. ప్రాణాలను కాపాడగలిగామన్న సంతృప్తి. అక్కడ నుండి ఇంటికి చేరుకున్న తరువాత టీవి పెట్టి చూస్తే నేను వచ్చిన గంటకే ఇంటర్‍ విద్యార్థి యాదయ్య ఎన్‍.సి.సి గేటు దగ్గర కిరోసిన్‍ పోసుకొని అంటించుకున్న దృశ్యం…. నమ్మలేక పోతున్నాను. కన్నీళ్ళు ఆగడం లేదు. అయ్యో! ఇట్లా ఎందుకు జరిగింది. పోరాడాలి గాని ఈ ఆత్మహత్య లెందుకు. పరిస్థితులన్ని ఉధృతంగా మారినయి. మా కాలేజీ ఎన్‍.సి.సి గేటు దగ్గరకే ఉండటంతో వారం రోజులు సెలవులు ఇచ్చారు. నాలో సంఘర్షణ ఎక్కువవుతుంది. క్రమం తప్పకుండా ఆర్టస్ కాలేజీకి వెళ్ళడం ద్వారా అక్కడి వాతావరణంతో మమేకమయిపోయాను. లెక్చరర్స్ ఫోరమ్‍ ఏర్పడి కార్యచరణ ఉధృతం చేస్తునే ఉంది. నమస్తే తెలంగాణ పేపరును అక్షరం వదలకుండా చదువుతున్నాను. ఉద్యమం ఇక ఆగదని అర్థమైంది. టీవీల్లో పేపర్లలో ఎక్కడ చూసినా రాస్తారోకోలు, వంటావార్పులు, సకలజనులు సమ్మెలు ధూమ్‍ధామ్‍లు ఉస్మానియాలో, కాకతీయ యూనివర్సిటీలలో విద్యార్థులు కార్యాచరణలు జేఏసి వ్యూహాలు. వరుసగా కాలేజీకి సెలవులు వచ్చాయి.వరుస బంద్‍లతో మూడు నాలుగునెలలు అసలు పాఠాలు ఏమి జరగలేదు.


చాలా రోజుల తర్వాత కాలేజీకి వచ్చాను. ఆ రోజు నా పి.హెచ్‍.డి సెలక్షన్స్ కోసం ఇంటర్వ్యూ జరుగుతుంది. పర్మిషన్‍ తీసుకోవడానికి ప్రిన్సిపల్‍ రూమ్‍కు వెళ్ళాను. టాపిక్‍ ఏంటి అన్నారు. తెలంగాణ కథానిక అన్నాను. వేరే టాఫిక్‍ దొరకలేదా అన్నారు.. ఆ రోజు వెళ్ళి ఈ టాపిక్‍ ఎందుకు తీసుకున్నానో కమిటీ ముందు వివరంగా జెప్పాను. తెల్లవారి యధావిధిగా కాలేజీకి వెళ్ళాను రాములు నా దగ్గరికి వచ్చి చెప్పాడు, ఓయు నుండి నిన్న విద్యార్థులు వచ్చిండ్రమ్మా. ఆంధ్రమహిళా సభను తెలంగాణ మహాసభగా మార్చిండ్రు. ప్రిన్సిపల్‍ రూమ్‍కున్న అద్దాలన్ని, కాలేజీలో ఉన్న కుర్చీలన్నీ పగులగొట్టిండ్రు. అని చెప్తుండగనే ప్రిన్సిపల్‍ పిలుస్తున్నారని యాదమ్మ వచ్చి జెప్పింది. నేను వెళ్ళాను. ఏంటి నిన్న పిల్లలు వచ్చి గోల గోల చేశారు. నువ్వైనా కంట్రోల్‍లో పెట్టద్దా! అన్నారు ప్రిన్సిపల్‍. పరిస్థితులన్ని చేయిదాటి పోయాయి మేడమ్‍. అన్నాన్నేను.


పిల్లల్ని పంపించి అల్లరి చేయించింది నువ్వేనని అందరి కంప్లేంటు.
‘నువ్వు రేపటి నుండి కాలేజీకి రావలసిన అవసరం లేదు’ ప్రిన్సిపల్‍.
ప్రిన్సిపల్‍ రూమ్‍ నుండి మౌనంగా బయటికి వచ్చాను. రాములుకు విషయం చెప్పి బయటకు కదిలాను. నేను వెళ్ళిపోతుంటే భార్గవీ మేడమ్‍ నావైపు జాలిగా చూసింది. పూర్తిగా అంకితమవ్వాల్సిన సమయం వచ్చింది. మనసులో అనుకోకుండా ఆర్టస్ కాలేజీ బాట పట్టాను…


డా.ఎం.దేవేంద్ర,
9490682457

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *