చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ మరియు బాలచెలిమి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాలచెలిమి గ్రంథాలయములు లాక్ డౌన్ కాలంలో బాలలకు మంచి వరములా ఉపయోగ పడుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలోని ఏర్గట్ల మండలంలో గల తడపాకల గ్రామంలో చిల్డ్రన్ ఎడ్యుకేషనల్ ఎకాడమి మరియు బాల చెలిమి ఆధ్వర్యంలో సుమారు రూ।। 45,000 విలువ గల పుస్తకాలను అందజేసి బాల చెలిమి గ్రంథాలయంను ఏర్పాటు చేయడం జరిగినది. గత మార్చి నెలలో ఈ గ్రంథాలయంనుప్రారంభించించడమైనది.
అభిప్రాయములు :
నిజామాబాద్ జిల్లాలో మారుమూల గ్రామమైన తడపాకల్‍లో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయడమేగాక ఎన్నో వేల రూపాయల విలువైన పుస్తకాలను అందజేయడం మా గ్రామ విద్యార్థులు చేసుకున్న అదృష్టం. లాక్‍డౌన్ కాలంలో మా వాలంటరీలచేత విద్యార్థులకు పుస్తకాలను అందజేయడం జరిగినది. ఇంటి వద్దనే విద్యార్థులు పుస్తకాలను చదువుతున్నారు. బాలచెలిమి వారికి ప్రత్యేక ధన్యవాదాలు. – శ్రీ పత్తిరెడ్డి ప్రకాష్, గ్రామ సర్పంచ్
వేసవి సెలువులలో మిత్రులతో కలిసి ఎండలో ఏవేవో ఆటలు ఆడే వాళ్ళం. కాని ఇప్పుడు మేము బాల చెలిమి గ్రంథాలయంలో నున్న అనేక పుస్తకాలను నేను ఇంటి దగ్గరికే తెచ్చుకుని చదువుతున్నాను. ఎంతో ఆనందముగా, సరదాగ అనిపిస్తుంది. ఎన్నో చక్కని విషయాలను కూడా నేర్చుకున్నాను. యీ పుస్తకాలను చదవడం ద్వారా నేను కొంత వరకు విషయ పరిజ్ఞానాన్ని నేర్చుకున్నానని అను కుంటున్నాను. బాలచెలిమి వారికి ధన్యవాదాలు. -సూర్యతేజ, 9వ తరగతి, తడపాకల
మా గ్రామంలో బాలచెలిమి ఆధ్వర్యంలో నెలకొల్పబడిన బాలచెలిమి గ్రంథాలయం నాకు ఎంతగానో ఆనందానిచ్చినది. ముఖ్యంగా లాక్‍డౌన్‍లో మేము ఇంటి వద్దనే నుండి ఎన్నో పుస్తకాలను చదవడం జరిగినది. ముఖ్యంగా సైన్స్కి సంబంధించిన విషయాలు, మహాత్ముల కథలు, చరిత్ర విషయాలు ఇలా ఎన్నో పుస్తకాలను చదివి చాలా విషయాలని నేను నేర్చుకున్నాను. బాలచెలిమి వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. – ఎల్. రజిత, 10వ తరగతి, తడపాకల
పుస్తకాలు విలువైన సమాచారాన్ని, విషయ జ్ఞానాన్ని అందజేస్తాయి. తడపాకల గ్రామంలో బాలచెలిమి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న బాల చెలిమి గ్రంథాలయం విద్యార్థులకు ఒక గొప్ప వరం లాంటిది. ఎన్నో గొప్ప పుస్తకాలు ఈ గ్రంథాలయంలో పొందుపర్చడం జరిగినది.
లాక్‍డౌన్ మరియు వేసవి సెలవుల్లో విద్యార్థులు ఈ గ్రంథాలయంలో నున్న పుస్తకాలను ఇంటి వద్దనే చదవడం చాలా అభినందించ దగ్గ విషయం. మా విద్యార్థులు ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడానికి యీ బాలచెలిమి గ్రంథాలయం ఎంతగానో దోహదపడుతుంది.
-డి. ప్రవీణ్ శర్మ, ఎ : 955357669