జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా వెబినార్
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ 5వ తేదీన జరుపుకుంటున్నాం. పర్యావరణానికి అనుకూలమైన చర్యలు తీసుకోవడానికి, అవసరమైన అవగాహనను పెంచుకోవ డానికి ఆ రోజు కొన్ని చర్యలు చేపడతారు. ఇది యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ పోగ్రామ్ (UNEP) ద్వారా నడపబడుతుంది. మానవ పర్యావరణంపై ఐక్యరాజ్యసమితి 1972 జూన్ 5వ తేదీ నుంచి 16వ తేది వరకు సమావేశం అయింది. ఈ సందర్భంగా 1972లో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ద్వారా జూన్ 5ను ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా ప్రకటించబడింది. 1973లో మొదటి సారి ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపు కున్నాం. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఈ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జూన్ 5వ తేదీన వేర్వేరు నగరాలలో విభిన్న రీతులలో అంతర్జాతీయ వైభవంగా జరుపుకుంటారు.
కావున ‘ఫోరం ఫర్ ఎ బెటర్ హైదరాబాద్’ కూడా తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ మహానగరంలో ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా జూన్ 5న పర్యావరణ వేత్తలు, వారసత్వ కట్టడాల పరిరక్షణ నిపుణులు, అధ్యయన వేత్తలు, సామాజిక వేత్తలు, అధ్యాపకులు, విద్యార్థులు వివిధ వర్గాల వారితో పర్యావరణంపై సమావేశం ఏర్పాటు చేస్తుంది. నిష్ణాతులతో మాట్లాడించి పర్యావరణంపై సూచనలు, సలహాలు ఇప్పించడం జరుగుతుంది. ఇందులో ఫోరం ఫర్ ఎ బెటర్ హైదరాబాద్ ఏడాది వరకు చేసిన కార్యక్రమాలను విశ్లేషించి రూపొందించిన నివేదిక, సావనీర్, బుక్‍లెట్‍ను విడుదల చేస్తుంది. ఫోరం నిర్వహించిన ఏడాది కార్యక్రమాలను ముద్రణ రూపంలో ప్రచురించి పర్యావరణంపై అవగాహన కల్పిస్తుంటుంది.
అయితే ఈ సంవత్సరం యావత్ ప్రపంచం ‘కరోనా’ విపత్తును ఎదుర్కొంటుంది. కావున ఈ ఏడాది పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘ఫోరం ఫర్ ఎ బెటర్ హైదరాబాద్’ 20వ వార్షికోత్సవాన్ని మణికొండ వేదకుమార్ అధ్యక్షతన వెబినార్ (జూమ్ వీడియో) నిర్వహించనుంది. ఈ వెబినార్‍లో వివిధ దేశాల్లోని పర్యావరణ వేత్తలు, శాస్త్రవేత్తలు, సామాజికవేత్తలు, అధ్యాపకులు వివిధ రంగాలకు చెందిన వారు ప్రపంచ వ్యాప్తంగా వెబినార్‍లో పాల్గొననున్నారు.
‘ఫోరం ఫర్ ఎ బెటర్ హైదరాబాద్’ ఆధ్వర్యంలో
జూన్ 5న నిర్వహించనున్న వెబినార్ వివరాలకు పక్కన చూడగలరు. – దక్కన్ న్యూస్