బ్రిటీష్‍వాళ్లు సికింద్రాబాద్‍లో కంటోన్మెంట్ (మిలటరీబేస్) ఏర్పాటు చేయడంతో మద్రాస్ నుంచి బ్రిటీష్ వాళ్లతో తమిళులు కూడా హైదరాబాద్‍కు మకాం మార్చారు. రక్షణరంగ పరిశ్రమ, రైల్వే డిపార్టుమెంట్‍లో చేరేందుకు ఎక్కువ సంఖ్యలోనే తమిళులు ఇక్కడికి వచ్చారు. అ మాట కొస్తే కొండవీటి రెడ్డిరాజులు శైవులైనందున వీరి శత్రువైన రాచకొండ వెలమదొరలు వైష్ణవాన్ని స్వీకరించి ఎంతోమంది వైష్ణవ అయ్యంగార్లను రప్పించి, దేవాలయాల్లో పూజారులుగా నియమిండంతో క్రీ.శ.14 శతాబ్దంలోనే తమిళ బ్రాహ్మణులు తెలంగాణకు వలస వచ్చారు. బ్రిటీష్ వారితో పాటు వలస వచ్చిన తమిళులు విద్యావంతులైనందున నిజాం ప్రభువు కూడా వారిని ఆహ్వానించి మంచి ఉద్యోగాల్లో నియమించాడు. మిలటరీలో చేరిన తమిళలు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్టు, బొల్లారం, తిరుమలగిరి, అల్వాల్, లాలాగూడ రైల్వేస్టేషన్ కాలనీల్లో స్థిరపడినారు. సికింద్రాబాద్‍లోని కొన్ని కాలనీలు తమిళులు పేరు మీద ఏర్పడినాయి. వాటిలో సోమసుందరం వీధి, పరంజ్యోతి నగర్, పద్మారావునగర్ ముఖ్యమైనవి. ఇప్పటికీ సికింద్రాబాద్‍లోని మారేడుపల్లిలో ఎక్కువ మంది సంపన్నులైన తమిళులు నివసిస్తున్నారు.
హైదరాబాద్‍కొచ్చేసరికి తమిళులు ప్రభుత్వ కొలువుల్లో ఉండడంతో వారు కోఠి ఉమెన్స్ కాలేజీ, నారాయణగూడ, బడీచౌడీ, హర్దికల్ బాగ్, విఠల్‍వాడీలలో స్థిరపడినారు. అయితే బాగా ఆస్తిపరులైన తమిళలు మాత్రం బేగంపేట, బంజారాహిల్స్, మెహదీపట్నం, హుమాయున్‍నగర్‍లలో విశాలమైన ఇళ్లు కట్టుకొని ఉంటున్నారు. బ్రిటీష్ ఆర్మీ ప్రభావంతో ఇక్కడ స్థిరపడిన తమిళులు కొందరు క్రైస్తవమతాన్ని స్వీకరించి సెయింట్ థామస్ తమిళ చర్చిని సికింద్రాబాద్‍లో నిర్మించు కున్నారు. ఇక్కడ స్థిరపడిన తమిళుల విద్యాభివృద్ధికి ఎనలేని సేవ చేశారు. సోమసుందరం మొదలియార్. 1861లో సికింద్రాబాద్‍లోని మహబూబ్ స్కూల్‍ను ప్రారంభించారు. 1872లో సోమసుందరం లైబ్రరీని, రీడింగ్ రూంను ఏర్పాటు చేశారు. 1885నాటికి మహబూబ్ స్కూల్ స్థాయిని పెంచి నిజాంనవాబ్ మహబూబ్ ఆలీఖాన్ పేరు మీదుగా మహబూబ్ కాలేజీని ఏర్పాటు చేశారు. రాజా కందస్వామి మొదలియార్ పబ్లిక్ కంట్రాక్టర్‍గా గుర్తింపు పొందటమే కాక, మొదటి సాలార్‍జంగ్ ఆదరణను చవిచూశారు. నగర పాలనకు కూడా తోడ్పడిన కందస్వామి పేరు మీద కందస్వామి బాగ్, కందస్వామి మార్కెట్లు సుల్తాన్ బజార్‍లో వెలిశాయి.
1951లో సికింద్రాబాద్ కార్పొరేషన్‍గా ప్రకటించబడి, దానికి మొదటి మేయర్‍గా ఎన్నికైంది ఆర్.కె. వాసుదేవ మొదలియార్ అనే తమిళుడే. సికింద్రాబాద్ పరిసరాలు అభివృద్ధి చెందడానికి కృషి చేసిన తమిళ వ్యక్తి పద్మారావు మొదలియార్. ఆదెయ్య అనే వ్యక్తి హరిజనుల కోసం ఏర్పాటు చేసిన చిన్న పాఠశాల బాధ్యతను స్వీకరించి, రెసిడెన్సీ నుంచి నిధులు పొందాడు. ప్రస్తుతమున్న సర్ విలియమ్ బార్టన్ స్కూలున్న ప్రదేశం అదే. మహబూబ్ కాలేజీకి మూడు కొత్త బ్లాకులను అదనంగా నిర్మించాడు. సికింద్రాబాద్‍లోని క్రైస్తవేతర ఒకే ఒక బాలిక పాఠశాలకు కార్యదర్శిగా ఎన్నుకోబడిన పర్మారావు, తర్వాత బ్రిటీష్ రెసిడెంట్ జనరల్ నుంచి అధిక మొత్తంలో నిధులు పొంది, ఆ పాఠశాలను హైస్కూల్ ఫర్ గర్లస్ను ఏర్పాటు చేశాడు. అంతేకాదు, 1916లో మూసేసిన హిందూబాయ్స్ హాస్టల్‍ను మళ్లీ తెరిపించాడు. బోయిగూడలో ప్లేగువ్యాధి బాధితుల కోసం ఒక ఆరోగ్యశాలను స్థాపించాడు. ఛైల్డ్ వెల్ఫేర్ సెంటర్, లేడీ బార్టన్ క్లబ్‍లను కూడా స్థాపించాడు.
సహకారోద్యమాన్ని ప్రారంభించి సికింద్రాబాలో ఫ్రుడెన్షియల్ కో-ఆపరేటవ్ సొసైటీని స్థాపించగా, తరువాత అది ఒక బ్యాంకుగా, కన్యూమర్ స్టోర్‍గా, ఆటోమొబైల్ సొసైటీగా చిలుకలగూడ హూసింగ్ కార్పొరేషన్‍గా రూపు దిద్దుకుంది. బాయ్స్ స్క్వాట్ అసోసియేషన్ ఏర్పడటానికి కూడా పద్మారావు మొదలియార్ ఎంతో కృషి చేశారు. ఆయన ఆ ప్రాంతానికి చేసిన సేవలకు గుర్తింపుగా, సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పాత వాకర్స్ టౌన్‍ను పద్మారావు నగర్‍గా నామకరణం చేసింది. హైదరాబాద్‍లో స్థిరపడిన తమిళుల్లో రాజా బహదూర్ అరవముత్తు ఐయ్యంగార్ న్యాయవాదిగా పేరుగాంచాడు. హైదరాబాద్ కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకును స్థాపించింది ఈయనే. అంతేకాదు, గద్వాల సంస్థాన దత్తత స్వీకార కేసును నిజాంకు వ్యతిరేకంగా, జమద్రుద్ సినిమా టాకీసు ఆస్తి గొడవల్లోనూ వాదించి పేరు గడించాడు. గద్వాల కేసుతో నిజాం రాష్ట్రంలోని మిగితా జాగీర్దార్లు ఇతనికి చేరువైనారు. వృత్తినైపుణ్యంతో పేరుగాంచిన అరవముత్తును బ్రిటీష్ రిసిడెంట్, అండర్ సెక్రటరీగా నియమించాడు. బ్యాంకు స్ట్రీల్‍లో నున్న అమృత నివాస్/అమృత నగర్ ఇతని వల్ల రూపుదిద్దుకొన్నదే. మీర్జా ఇస్మాయిల్ హైదరాబాద్ ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు, నిజాం ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‍లో న్యాయ శాఖ మంత్రిగా నియమించబడినాడు అరవముత్తు. ఆయన సేవలకు గుర్తింపుగా అరవముత్తుకు రావు సాహెబ్, రావు బహద్దూర్, దివాన్ బహద్దూర్ లాంటి బిరుదులు దక్కాయి.
తమిళుల మధ్య ఐక్యతకు దేశిక సభ, కృష్ణ గానసభ లాంటి సంఘాలు ఏర్పడినాయి. ఇప్పుడు లిబర్టీ దగ్గరున్న బాలాజీ భవన్‍ను శ్రీదేశిక సభ అధ్యక్షుడిగా ఉన్న నరసింహ అయ్యంగార్ అనే న్యాయ వాది నిర్మించాడు. ఈ విధంగా ఇక్కడ స్థిరపడిన తమిళలు విద్య, సహకార, న్యాయ, బ్యాంకింగ్, వితరణ, ఇతర సేవారంగాలకు, సంస్కృతి, సంప్రదాయాలకు ఎంతో సేవ చేసి ఆకూ, వక్కలా హైదరాబాదీలతో, దక్కన్ సంస్కృతిలో ఇమిడిపోయారు.
– ఈమని శివనాగిరెడ్డి , 9848598446