కరోనా ప్రపంచవ్యాప్తంగా పరిణమించిన ఉపద్రవం

తడకమళ్ల వివేక్‍ రిటైర్డ్ టీఎస్‍పీఎస్సీ మెంబర్‍ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ

తడకమళ్ల వివేక్‍ జనరల్‍ అడ్మినిస్ట్రేషన్‍ డిపార్ట్మెంట్‍ యొక్క విజిలెన్స్ విభాగంలో సుమారు ఒక దశాబ్దం పాటు పనిచేశారు. వాణిజ్య పన్నుల విభాగంలో అదనపు కమిషనర్‍ హోదాకు ఎదిగారు. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పరోక్ష పన్ను సంస్కరణలో భాగంగా కొత్త పన్ను పాలన, వ్యాట్‍ రూపకల్పన, ప్రవేశపెట్టడంలో, అడ్వాన్స్ రూలింగ్‍ వంటి పన్ను పరిపాలనలో కొత్త కార్యక్రమాలను ప్రవేశపెట్టడంలో వీరు కీలక పాత్ర పోషించారు. రాష్ట్ర ఖజానాకు, సంక్షేమం మరియు అభివ•ద్ధి విధానాల మెరుగుదలకు అనేక సూచనలు సలహాలు అందించారు.


నేషనల్‍ ఇన్స్టిట్యూట్‍ ఆఫ్‍ పబ్లిక్‍ ఫైనాన్స్ అండ్‍ పాలసీ, ఇంజనీరింగ్‍ స్టాఫ్‍ కాలేజ్‍ ఆఫ్‍ ఇండియా మరియు అనేక రాష్ట్ర ప్రభుత్వ విభాగాలకు విజిటింగ్‍ ట్రైనింగ్‍ ఫ్యాకల్టీ. సెంటర్‍ ఫర్‍ ఆల్టర్నేటివ్‍ వివాద పరిష్కారం మరియు విద్య (కేడ్రే) వ్యవస్థాపక అధ్యక్షుడు. టీఎస్‍పీఎస్‍సి సభ్యులుగా పనిచేసి రిటైర్‍ అయ్యారు. దక్కన్‍ ల్యాండ్‍కు వారు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలోని కొన్ని ముఖ్యాంశాలు.


కరోనాలాంటి విపత్కర పరిస్థితికి కారణాలు ఏవని అనిపిస్తుంది?

దీనికి ఒక కారణమంటూ ఉండదు. దీనిని ఇప్పుడు ప్యాండమిక్‍ అంటున్నాము. ప్యాండమిక్‍ అంటే మొత్తం ప్రపంచవ్యాప్తంగా పరిణమించిన ఒక ఉపద్రవం లాంటిది. కాబట్టి ఈ ఉపద్రవానికి ఖచ్చితమైన దేశమని కానీ, ఖచ్చితమైన కారణమని కానీ చెప్పలేము. ఇప్పుడు వస్తున్న సమాచారం మేరకు ఎక్కడో పరిశోధనలో చిన్న పొరపాటు వల్ల జరిగిన తప్పిదం వల్లనో, తగిన జాగ్రత్తలు తీసుకోక పోవడం వల్లనో సంభవించిన ఉపద్రవంలాగా దీన్ని అందరూ పరిగణిస్తున్నారు. అయితే ఇందులో బయోలాజికల్‍ వార్‍ కూడా లేకపోలేదని కొంత అనుమానం. డబ్ల్యూహెచ్‍వో పాత్ర కూడా ఇందులో కొంత అనుమానాస్పదంగా ఉన్నట్లు మనకు తెలుస్తుంది. సమగ్రమైన విచారణ తరువాతనే అసలు జరిగింది ఏమిటి అనేది తెలిసే అవకాశం ఉంది.


కరోనాని ఎదుర్కోవడంలో వైద్య, సాంకేతిక వైజ్ఞానిక రంగంలో ఎలాంటి కృషి చేయాలి?
చాలా వరకు భారతదేశంలో ఉన్న నైపుణ్యం అంతా పాశ్చాత్య దేశాలకు వెళ్లిపోతుంది. వైరాలజీ ఇనిస్టిట్యూట్స్ కానీ, ఆప్థాలమోజిస్టస్ కానీ, వైద్యులు కానీ, ఇతర రంగాల్లోని బయలాజికల్‍ సైన్స్, ఫిజికల్‍ సైన్స్ కావచ్చు ఎవరైనా కూడా చాలా వరకు అభివృద్ధి చెందిన దేశాలవైపే చూస్తున్నారు. ఐఐటి గ్రాడ్యుయేట్స్, ఇండియన్‍ ఇనిస్టిట్యూట్స్ సైన్స్లో ఉత్తీర్ణులైన ప్రతిభావంతులైన మన యువత అంతా పాశ్చాత్య దేశాల వైపు వెళ్తున్న సందర్భాలని మనం చూస్తున్నాం. రాబోయే రోజుల్లో సోకాల్డ్ బ్రైన్‍డ్రైన్డీని మనం ఆపవల్సిన అవసరం ఉంది. మన ప్రతిభని మన దేశానికి ఉపయోగించుకొనే విధంగా ఒక విధానపరమైన నిర్ణయాలు తీసుకు రావల్సిన అవసరం కూడా ఈ కరోనా సందర్భంలో ఏర్పడింది.


కరోనా పుట్టుకకు ప్రకృతి వైపరీత్యాలు కారణమా?

చైనాలోని వూహాన్‍లో ఉన్న వెట్‍ మార్కెట్‍ నుంచి జంతువుల ద్వారా వచ్చిందనే ప్రచారం జరుగుతుంది. కొన్ని సాంస్కృతిక పరమైన అంశాలు కూడా దీనికి జోడై ఉండవచ్చు. ల్యాబరేటరీలో ఒక రీసెర్చ్ యొక్క యాక్సిడెంటో లేక డెలివరేట్‍ అయినా కావచ్చు అనేది నా అభిప్రాయం. ఇది మానవాళికే పెద్ద హెచ్చరిక.


ప్రజలు, ప్రభుత్వాలు ఏ మేరకు ఈ విపత్కర పరిస్థితిని తట్టుకుని ముందుకెళ్తున్నాయి?
ప్రభుత్వాలకి ఇదొక పెద్ద సవాలు. ఎందుకంటే ఆర్థికంగా చాలా సమస్యలు ఉన్నాయి. ఎకనామిక్‍ ఆక్టివిటీ ఏం లేదు. లాక్‍డౌన్‍ పరిస్థితుల్లో అందరూ ఇళ్లలోనే ఉండిపోవాల్సిన పరిస్థితి ఉంది. ఒక దేశంలో గూడ్స్ అండ్‍ సర్వీసెస్‍ అంటే మ్యాన్‍ఫ్యాక్చరింగ్‍ కానీ, సేవలు కానీ లేకపోతే ఆ సేవా రంగాలన్నిటిలో ఉత్పత్తి లేకపోవడం. వీటి వల్ల దేశానికి కావాల్సిన ఆర్థిక వనరులు చేకూరే పరిస్థితి లేదు. కాబట్టి ఇది ఒక గొప్ప ఆర్థిక సంక్షోభం. పెద్ద హ్యూమన్‍ క్రైసిస్‍ కూడా. ప్రభుత్వాలకు ఇవాళ ఉన్న ఎన్నో బాధ్యతలతో పాటు ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడ వలసిన బాధ్యత కూడా ఉంది. ఏ ప్రభుత్వానికైనా తమకు తాముగా దీన్ని అధిగమించే పరిస్థితి భారంగా కనిపిస్తుంది. అయినప్పటికీ భారత ప్రభుత్వం గానీ, ఇటు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గానీ దీన్ని చాలా వరకు నియంత్రణ చేయడానికి తీసుకుంటున్న చర్యలు ఇప్పటి వరకు అందరికీ కూడా సంతృప్తికరంగా ఉన్నాయి. ప్రజల ఆర్థిక పరిస్థితి చూస్తే ముఖ్యంగా బలహీనవర్గాల ప్రజలు, రోజువారి కూలీ సంపాదన చేసుకునే వాళ్ళ ఆర్థికపరిస్థితి చాలా దుర్భరంగా ఉంది. ప్రభుత్వాలు దారిద్య్రరేఖకు దిగువున ఉన్న ప్రజలను ఆదుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఇలాంటి విపత్కర పరిస్థితి ప్రభుత్వానికి, ప్రజలకు అందరికీ పెద్ద సవాలు. ఈ సవాలును ఎదుర్కోవడానికి సమిష్టిగా కృషి చేయాల్సిన తరుణమిది.
ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన బడ్జెట్‍లు చూసినట్లైయితే సైన్స్ & టెక్నాలజీకి చాలా వరకు పెద్దపీట వేసే పరిస్థితులు మనకు కనపడవు. ఎందుకంటే సైన్స్ &  టెక్నాలజీ రంగం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు బ్యాంకు కాదు. కానీ ఇది ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన అంశం. ఈ కరోనా నేపథ్యంలో ప్రభుత్వాల నేపథ్యాలు కూడా మారాలి. రీసెర్చ్ ఇనిస్టి ట్యూట్లకు, సైంటిస్ట్లకు చాలా పెద్ద ఎత్తున ప్రోత్సహకాలు ప్రకటించడం, రీసెర్చ్కు కావల్సిన వాతావరణం ఏర్పరచడం అనేది కరోనా మన ముందు నిలబెట్టిన ప్రశ్న.


అంతర్జాతీయంగా కూడా ఆయాదేశాలు కరోనా వ్యాప్తిని ఎందుకు సమర్ధవంతంగా ఎదుర్కొలేక పోతున్నాయి?
అందరూ మొదట్లో తేలిగ్గా తీసుకున్నట్లు కనిపిస్తుంది. అందుకే ఒక ఉపద్రవం (డిజాస్టర్‍) వచ్చినప్పుడు వారి రెస్పాన్స్ టైం అనేది చాలా కీలకమైన అంశం. అంటే మన ప్రతి స్పందన. ప్రతిస్పందన అనేది కొంచెం ఆలస్యం అవ్వడం వల్ల అలా జరిగింది. అసలే వైరస్‍ కాబట్టి చాలా త్వరగా వ్యాప్తి చెందింది. దీన్ని అంచనా వేయడంలో ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాలే కొంచెం వెనుకంజ వేయడం, పసిగట్టలేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. డబ్ల్యూహెచ్‍వో (వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్‍) కూడా సరైన సమయంలో సూచనలు, సలహాలు చేయకపోవడం వలన ఈ ఉపద్రవం ఈ విధంగా పరిణమించింది.


ఆర్థిక, సాంకేతికంగా అభి వృద్ధి చెందిన దేశాలు దీనిని ఎదుర్కోవడంలో విఫలమయ్యాయి? చిన్న చిన్న దేశాలు ఎలా బయటపడ్డాయి?

ఈ అంశం చాలా ఆశ్చర్యకరం. ఏ దేశంలో అయితే వైద్య పరికరాలు బాగా అందుబాటులో ఉన్నాయని, నిపుణులైన వైద్యులు ఉన్నారని మనం అనుకుంటున్నామో అలాంటి దేశాల్లోనే ముఖ్యంగా ఫ్రాన్స్, ఇటలీ, స్పేయిన్‍ లాంటి వెస్ట్రన్‍ దేశాలలోనే కరోనా మరణాలు ఎక్కువగా సంభవించాయి. ఇలా ఎందుకు జరిగిందో అనేదానికి కొన్ని అంశాలు చెప్పుకోవాలి. మొదట్లో దీన్ని కాస్త నిర్లక్ష్యం చేయడం. దీని తీవ్రతను గుర్తించలేక పోవడం, సకాలంలో స్పందించకపోవడం. డబ్ల్యూహెచ్‍వో కూడా సరైన సమయంలో సమాచారాన్ని ఇవ్వకపోవడం, ఇచ్చినా అభివృద్ధి చెందిన దేశాలు పెడచెవిన పెట్టడం, నిర్లక్ష్యం చేయడం లాంటివి జరిగాయేమో అని అనిపిస్తుంది. ఇంకో విషయం చూసినట్లయితే జాగ్రఫీ కూడా దీనికి కొంత వరకు కారణమని చెప్పవచ్చు. భూమధ్యరేఖకు మీద ఉన్న చాలా దేశాలు, భారతదేశం లాంటివి 25 నుండి 30 డిగ్రీల అక్షాంశాల మీద ఉన్న దేశాలన్నిటిలో కూడా ఈ కరోనా వ్యాప్తి తక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది. మిగతా దేశాల్లో ఎక్కువ ప్రభావం ఉన్నట్లు కనిపిస్తుంది.


ప్రపంచ ఆర్థిక రంగంలో మార్పులు ఎలా ఉండ బోతున్నాయి?
ఇప్పుడు చరిత్రలో ఒక దశగా యిది ‘ప్రీ కోవిడ్‍ పోస్ట్ కోవిడ్‍’ అనే కొత్త నిర్వచనాన్ని ముందుకు తీసుకు రావల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పోస్ట్ కరోనా ప్రపంచం చాలా భిన్నంగా ఉండ బోతుంది అనేది ఇప్పుడు నిపుణుల అంచనా. ఆర్థిక రంగం మొత్తం రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉండబోతుందో అనేదానిపైన భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. ముఖ్యంగా వర్క్ ఫ్రం హోం కల్చర్‍ బాగా పెరుగుతుంది. డిజిటల్‍ ట్రాన్‍సెక్షన్స్ పెరగవచ్చు. ముడిసరుకు రవాణా లాంటి రంగాలు అలాగే వుంటాయి. మ్యాన్‍ ఫ్యాక్చరింగ్‍ సెక్టార్‍ మళ్లీ పుంజుకోవల్సిన అవసరం ఉంది. సర్వీస్‍ సెక్టార్‍లో మార్పులు రాబోతున్నాయి. డోర్‍ డెలివరీ సిస్టమ్స్ లాంటివి చాలా పెద్ద ఎత్తున రాబోయే రోజుల్లో ఉండవచ్చు. కరోనా ఇప్పుట్లో తగ్గే అవకాశాలు ఏమీ లేవు. బహుశా 2022 కానీ 2023 వరకు కూడా దీని ప్రభావం ఎంతో కొంత ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ రెండు మూడు సంవత్సరాలలో మొత్తం ఆర్థిక వ్యవహారాలు పెద్ద ఎత్తున మారబోతున్నాయి. ప్రజలు బయటికి వెళ్ళవలసిన అవసరం లేకుండా టెక్నాలజీ ద్వారా గిగ్‍ ఎకానమీ, గిగ్‍ వర్కర్స్ (డోర్‍ డెలివరీ వ్యక్తులు) లాంటి రంగాల్లో ఎక్కువ ఉపాధి అవకాశాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఆర్థిక వ్యవస్థ మొత్తం ఫ్రీ కోవిడ్‍ – పోస్ట్ కోవిడ్‍లాగా మళ్లీ మనం ఒక విభజన రేఖ గీయాల్సిన పరిస్థితి వచ్చింది.


ప్రపంచ దేశాల మధ్య సంబంధాలపై కరోనా ఎలాంటి ప్రభావాన్ని చూపబోతుంది?
చాలా కీలకమైన అంశం. ఒకవైపు అడ్వాన్స్గా డెస్పెక్ట్ వెఫెన్స్ ప్రతి దేశం ఇప్పటికే డెవలప్‍ చేసి పెట్టుకున్నాయి. న్యూక్లియర్‍ ఆమ్స్ ఆంబినేషన్స్ డెవలప్‍ చేసి పెట్టుకున్నాయి. వీటితో ప్రపంచమే నాశనమయ్యే పరిస్థితి. అలాంటి యుద్ధాలు ఇప్పటికీ లేవు. ఓన్లీ డెటరేట్స్ కోసం ఎవరికి వాళ్లు ఈ వెపన్రీని మ్యాన్‍ ఫ్యాక్చరింగ్‍ చేసుకుంటున్నారు. ఈ కరోనా నేపథ్యంలో చూసినట్లయితే రాబోయే రోజుల్లో ఒక దేశం ఇంకొక దేశంమీద ఆధిపత్యం సంపాదించు కోవడానికి బయో లాజికల్‍ వార్స్ వంటివి ఏమైనా ఉపయోగించే అవకాశాలు ఉంటాయా అనేది చాలా జాగ్రత్తగా పరిశీలించాల్సిన అంశం. ఇలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు మానవజాతి మనుగడకే ఒక పెద్ద ముప్పు రాబోతుంది. కాబట్టి ఈ విషయంలో బయోలాజికల్‍ వార్స్, కెమికల్స్ వార్స్ విషయంలో దేశాల మధ్యన ఒక సుహృద్భావన వాతావరణం ఉండి, వాళ్ళు ఒకరిని ఒకరు అర్థం చేసుకుని ఈ అంశాలపైన ఒక అవగాహనకు రావడం చాలా అవసరం. కాబట్టి బయోలాజికల్‍ ఫీల్డ్లో జరుగుతున్న రీసెర్చ్కానీ, ఆ డేటా కానీ, సోకాల్డ్ బిగ్‍ డేటా అనాలసిస్‍ అందరికీ అందుబాటులో ఉండే దిశగా అన్ని దేశాలు పరస్పరంగా సహకరించుకోవాలి. ఇవి మానవాళికే ముప్పు కాబట్టి అందరూ దీనిపై ఏకాభిప్రాయానికి వచ్చి ఎట్టి పరిస్థితిలోనూ మనం దీన్ని ఉపయోగించు కోకూడదనే నిర్ణయానికి రావడం అనేది చాలా అవసరం.


వలస కార్మికుల ఇబ్బందుల పరిష్కారానికి ఏం చేయాలి?

లాక్‍డౌన్‍ చాలా సడెన్‍గా చేయడం వల్ల వలస కార్మికుల పరిస్థితి దుర్భరం అయింది అనేది నిర్వివాదమైన అంశం. రోజూ చాలా హృదయవిదారకరమైన దృశ్యాలు చూస్తున్నాం. వందల మైళ్లు దినసరి కూలీలు, ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి వెళ్లిన మైగ్రెంట్‍ లేబర్స్. వీళ్లంతా కూడా నడిచి వెళ్ళడం, చిన్న చిన్న పిల్లలు నాల్గు అయిదు సంవత్సరాల పిల్లలు వందల మైళ్లు నడిచి వెళ్లే క్రమంలో కొంతమంది మృతి చెందడం అనేది చాలా బాధాకరమైన విషయం. వలస కార్మికుల విషయంలో కార్మిక చట్టాల్లో చాలా మార్పులు తీసుకురావాలి. వలస కార్మికులు ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వచ్చినప్పుడు ఆ యాజమాన్యం తప్పనిసరిగా వారికి కావల్సిన బీమా సౌకర్యం, ఆరోగ్య విషయంలో వారు తీసుకోవల్సిన చర్యలు తప్పకుండా పాటించాలి. ఒకసారి కార్మిక చట్టాలన్నీ తిరిగేసి వాటిలో ఎక్కడెక్కడ లోపాలున్నాయో వాటన్నిటిని సవరించి మార్పులు తీసుకురావల్సిన అవసరం ఉంది.


పర్యావరణ పరిరక్షణకు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి?

ఎకాలజీ నిపుణులు చెపుతున్న దాన్ని బట్టి వాతావరణం బాగా క్లియర్‍ అయిపోయింది. కార్బన్‍ కంటెంట్‍ చాలా తక్కువైంది. దీనికి కారణం పెట్రోల్‍ లాంటి ప్యూయెల్‍ ఉపయోగం చాలా తగ్గింది. భూతాపం కూడా బాగా తగ్గింది అనేది స్పష్టంగా తెలుస్తుంది. చాలా నదులు తమకు తామే మళ్లీ ప్రక్షాళన జరిగి నదులల్లో ఉండే నీళ్ల నాణ్యత కూడా బాగా పెరిగింది. ఈ మధ్య వస్తున్న సోషల్‍ మీడియా సమాచారాన్ని బట్టి చూస్తే వారణాసిలో గంగా నది చాలా క్లియర్‍గా కనిపిస్తుంది. మన హైదరాబాద్‍ హుస్సేన్‍సాగర్‍లో కూడా అంతకు ముందు ఉన్న దుర్గందం లేదని మనకు తెలుస్తుంది. ఈ రకంగా నేచర్‍ తనకు తాను క్లెంజింగ్‍ ప్రాసెస్‍ చేసుకుంటుందని మనకు తెలుస్తుంది. దీనికి కారణం ఏమిటంటే ఒకటి ఎకాలజీలో ఒక ప్రిన్సిఫుల్‍ రెటాఫ్‍ రెన్యువల్‍. ఎంతవరకు ఎకాలజీని ఇంఫాక్ట్ చేస్తున్నామో ఆ ఇంఫాక్ట్ చేసే క్రమంలో మళ్ళీ నేచర్‍ తనకు తానుగా ఫ్యూర్‍ఫై చేసుకోవడానికి అవసరమైన సమయం దానికి ఇవ్వకపోవడం వల్ల ఇలాంటి చాలా పరిణామాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు హ్యూమన్‍ యాక్టివిటీ బాగా తగ్గడం వల్ల ప్రకృతి తనకు తాను ఫ్యూరిఫికేషన్‍ చేసుకుంది. ఇవాళ కరోనా నుంచి మానవాళి నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే ప్రకృతితో కలిసి జీవించటమా లేకపోతే ప్రకృతిని ఎదురించి జీవించటమా అనేది ఇవాళ మనం తేల్చు కోవాల్సిన అంశం. ప్రకృతిని అర్థం చేసుకుని ప్రకృతి యొక్క స్పేస్‍ (ఎన్విరాన్‍మెంట్‍ క్యారింగ్‍ కెపాసిటీ) ఏదైతే ఉందో దాన్ని అబ్జర్వ్ చేసుకో గలుగుతుంది. ఇది ముఖ్యమైన అంశం. ఈ విధంగా సహజ వనరులు కొల్లగొట్టడం మిగతా కెమికల్స్ని కార్భన్‍మోనాక్సైడ్‍, కార్భన్‍ డైఆక్సైడ్‍ లాంటి వాటిని వాతావరణంలోకి వదలడం. ఇవన్నీ మనం ఒక నియంత్రణలో వుంచి నట్లయితే రాబోయే రోజుల్లో ప్రకృతిని అర్థం చేసుకుని మన ఎకనామిక్‍, సోషల్‍ యాక్టివిటీస్‍ని ప్లాన్‍ చేసుకోగలిగితే ఇలాంటి ఉపద్రవాలు వచ్చే అవకాశం ఉండదు. ఎకాలజీ పాయింట్‍ ఆఫ్‍ వ్యూలో చూసినట్లయితే నేచర్‍ ఓవర్‍ డ్రాప్ట్ని తగ్గించుకోగలిగితే ప్రపంచ స్థాయిలోనే భూతాపాన్ని తగ్గించవచ్చు. ఫారిన్‍ కాన్ఫెరెన్స్లో కూడా భూతాపాన్ని తగ్గించడానికి ఒక ఒప్పందం ఏర్పడింది. కొన్ని దేశాలు వాటిని పెద్దగా పట్టించు కోలేదు. ముఖ్యంగా ట్రంప్‍ ఒక దశలో గ్లోబల్‍ వార్మింగ్‍ అనేదే లేదని ఒక అభిప్రాయాన్ని వెల్లిబుచ్చాడు. అలాంటి దృక్పథం ఉన్న వాళ్ళందరికి ఇది ఒక హెచ్చరిక. కాబట్టి రాబోయే రోజుల్లో అంతర్జాతీయ సంస్థల్లో ఎకాలజీపై జరుగుతున్న చర్చల ఫలితాల్ని గానీ, తీసుకొనే నిర్ణయాల్నీ గానీ చాలా సమర్థవంతంగా, నిజాయితీగా అమలు చేయవలసిన సందర్భం ఇది.


ముందు ముందు ప్రభుత్వాలు వైద్య, ఆరోగ్యంపై ఎలాంటి ప్రణాళికలు రూపొందిస్తే బాగుంటుంది?

మన వైద్య రంగానికి మనకున్న జనాభాకు చాలా వ్యత్యాసం ఉంది. కావల్సినంత మంది వైద్యులు, నర్సులు, సదుపాయాలు లేవనేది నిర్వివాదమైన అంశం. ట్రెడిషనల్‍గా ఉన్న నాలెడ్జ్ అంటే యునాని, ఆయుర్వేదం, హోమియోపతి, అలోపతి అన్నింటిని కలిపి ఆయుష్‍ అంటాం. వీటి నాలెడ్జ్ని కూడా మనం రాబోయే రోజుల్లో ప్రజల ఆరోగ్యానికి పెద్ద ఎత్తున ఉపయోగించాల్సిన అవసరం ఉంది. ఇన్ఫెక్షన్‍ లాంటివి చాలా వరకు అలోపతిలోనే కంట్రోల్‍ అవుతాయని అంటారు. చిన్న చిన్న జబ్బులకు ప్రత్యామ్నాయ మందులతో నయం చేసి ప్రజలకు రిలీఫ్‍ ఇవ్వగలమా అని ఆలోచించాలి. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, దేశ స్థాయి వరకు ఆర్‍ఆర్‍క్యూ హాస్పిటల్స్ ఉన్నాయి. కానీ తగినంత స్థాయిలో లేవు. పడకల సంఖ్య కూడా మన జనాభాకి, ఇంటర్నేషనల్‍ స్టాండర్డ్కు తగ్గట్టు లేవు. ప్రత్యామ్నాయ మందు ఆలోచించాలి. ఒకప్పుడు చైనాలో బేర్‍ఫుడ్‍ డాక్టర్స్ అనే కాన్సెప్ట్ ఉండేది. మన దగ్గర ఎంబీబీఎస్‍ డాక్టర్‍ గ్రామాల్లోకి వెళ్ళి పని చేయడు. ఎందుకంటే తను చదివిన చదువుకు అక్కడ పని లేదు అనుకుంటాడు. బీఎస్సీ స్థాయిలో పబ్లిక్‍ హెల్త్ లాంటి కోర్సులు ప్రవేశపెట్టి, వారికి మంచిగా శిక్షణ ఇచ్చి వారికి కావాల్సిన స్టాండర్డస్ అన్ని ఇండియన్‍ మెడికల్‍ కౌన్సిల్‍ ద్వారా పెట్టి వాళ్లని గ్రామస్థాయిలో అపాయింట్‍ మెంట్‍ చేయడం వల్ల ప్రజలకి అందుబాటులో వైద్యం ఉంటుంది. ఈ విధంగా కొత్త కోర్సును కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది.


మానవ సంబంధాలు ముఖ్యంగా కుటుంబ వ్యవస్థపై దీని ప్రభావం ఎలా ఉంటుంది?

కరోనా మళ్లీ మనిషిని ఆలోచించే విధంగా చేసింది. సోకాల్డ్ ర్యాట్‍రేస్‍ తెల్లారి లేచింది పరుగో పరుగో అనే సందర్భాన్ని నుంచి మళ్ళీ నేను ఎక్కడునున్నాను, ఎక్కడికి పోతున్నాను అనే ఒక ప్రశ్నను మన ముందు ఉంచింది. ట్రెడిషనల్‍గా మనమందరం అనుకుంటున్న కుటుంబ వ్యవస్థ (ఫ్యామిలీ వాల్యూస్‍)లో ఉండే డిజిటల్‍ డిస్టెన్స్ గానీ, పరుగుల సందర్భంలో వచ్చి ఏర్పడిన దూరం గానీ, వాటన్నిటినీ కూడా ఇది చెరిపేసింది. ఇన్ని రోజులు కుటుంబం మొత్తం కలిసి ఉండడం వల్ల బంధాలు గట్టిగా ఏర్పడ్డానికి మంచి అవకాశం. కొన్ని కుటుంబాల్లో మరీ ఎక్కువ కాలం కలిసి ఉండడం చిన్న చిన్న కలహాలు లాంటివి కూడా ఏర్పడి ఉండవచ్చు. దీన్ని ఒక పాజిటివ్‍ కోణం నుంచి చూసినట్లయితే కుటుంబ వ్యవస్థ దృఢం కావడానికి మనిషికి మళ్లీ ఒక అవకాశం కల్పించింది.


రేపటి ప్రపంచం ఎలా ఉండబోతుంది? ఎలాంటి పాఠాలు నేర్చుకోవాలి?

పోస్ట్ కరోనా భిన్నంగా ఉంటుందని ఖచ్చితంగా చెప్పగలం. కరోనా నుంచి నేర్చుకున్న పాఠాలు ఇన్వెర్డ్ లుకింగ్‍ గానీ, ఇంట్రాస్పెక్షన్‍గానీ, దాన్నుండి వచ్చిన ఇన్‍సైడ్స్ గానీ అవి రాబోయే రోజుల్లో ఎంతవరకు క్యారీ అయి మన జీవితంలో భాగం అవుతాయో, భాగం చేసుకుంటామో, అంటే మితంగా భుజించడం, ఆడంబరాలకు పోకుండా ఉండడం, పెద్ద పెద్ద పార్టీలు చేసుకోక పోవడం. కానీ ఇలా చాలా వరకు సమాజం కోసం చేస్తున్న చాలా పనులు సోషల్‍ ప్రెషర్స్ వల్ల ఆలోచింప జేస్తాయి. ఇంత ఫ్లాసీ లైఫ్‍, ఇన్ని ఆడంబరాలు అవసరం లేదు. మనిషి జీవించడానికి ఇంత చాలు అనే ఒక రకమైన ఇన్‍సైడ్‍ వచ్చి ఆ ఇన్‍సైడ్‍ ద్వారా దాన్ని రాబోయే రోజుల్లో కూడా అవలంభిస్తాడేమో అనేది వేచి చూడాల్సిన అంశం.


మన దేశ ఫెడరల్‍ వ్యవస్థ రేపు ఎలా ఉండబోతుంది?

ఫెడరల్‍ వ్యవస్థ అంటే అటు రాజకీయంగా ఇటు ఆర్థికంగా చూడాలి. రాజకీయంగా చూసినట్లయితే ఫెడరల్‍ వ్యవస్థ చాలా పటిష్టంగానే ఉంటుంది. కానీ ఆర్థికంగా చూసినట్లయితే కేంద్ర రాష్ట్రాలు పరస్పరం బాగా సహకరించు కోవాల్సిన సందర్భం అయింది. రాజ్యాంగంలో పొందుపరిచిన ఫైనాన్స్ కమీషన్‍ కేంద్రానికి రాష్ట్రానికి మధ్య ఉండే ఒడంబడికలు గానీ కేంద్రం రాష్ట్రాలకు ఇవ్వాల్సిన నిధుల విషయంలో గానీ, ఎఫ్‍ఆర్‍బీఎం చట్టాలు గానీ, కొంత కాలం ఖచ్చితంగా అమలు చేయాలా లేక వాటిలో ఉండే నిబంధనలను ఏమైనా సడలించాలా అనే ఒక ప్రశ్న కూడా ఈ కరోనా మన ముందుకు తీసుకు వచ్చింది. ఎఫ్‍ఆర్‍బీఎం చట్టాలు చూసినట్లయితే రాష్ట్రాలకు జీడీపీలో 3శాతం కన్నా ఎక్కువగా బారోయింగ్‍ చేయకూడదని చట్టం చెప్తుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చట్టాల్ని యధాతథంగా అమలు చేయడం వల్ల ఆర్థికంగా మళ్లీ పుంజుకోగలమా. ఆర్‍బీఐలోని నిధులు ప్రభుత్వానికి తక్కువ వడ్డీ రేటుకు ఇచ్చి ఎకానమీని మళ్లీ బూస్ట్ చేయడానికి ఏమైనా చర్యలు తీసుకుంటుందా చూడాలి. ఇలాంటి ఉపద్రవాలు వచ్చినప్పుడు. మానవాళి ఉపద్రవాలు ఉన్నప్పుడు రాజకీయాల్ని పక్కన పెట్టి మొదట మనిషిని కాపాడవల్సిన అవసరం చాలా ముఖ్యం. కాబట్టి ఇందులో రాజకీయాలు చేస్తారని అనుకోలేం. కేంద్రంలో ఒక పార్టీ ప్రభుత్వంలో ఉన్నా, రాష్ట్రంలో మరో పార్టీ ప్రభుత్వంలో ఉన్నా ఇది మానవాళికి సంబంధించిన అంశం కాబట్టి రాజకీయాల ప్రసక్తి ఉండబోదు. రాష్ట్రం ఉంటేనే కేంద్రం ఉంటుంది. ఏ ఎకనామి యాక్టివీ అయినా రాష్ట్రంలోనే జరగాలి. రాష్ట్రంలోని పరిశ్రమలు గానీ, సేవా రంగం గానీ, వ్యవసాయరంగం గానీ వీటికి కావల్సిన ప్రోత్సహకాలు అన్నింటిని కూడా కేంద్ర ప్రభుత్వం చాలా పెద్ద మనసుతో ఇప్పుడున్న నిబంధనలను కొంత మేరకు సడలించి రాష్ట్రాలను ఆదుకోవాల్సిన అవసరం ఉంది.


 (సచిన్‍, మల్లేష్‍ – దక్కన్‍ ఛానల్‍ ఇంటర్వ్యూ ఆధారంగా)
– కట్టా ప్రభాకర్‍
8106721111

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *