‘‘ఆకలి వేయడం, తినాలని అనిపించడం రెండూ వేరు వేరు’’ అన్నారు డా.ఎన్.ఆర్.రావుగారు, కర్నూలు మెడికల్ కాలేజీ, విశ్రాంత సూపరింటెండెంటు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి, ఒక ప్రసంగంలో. మెదడులో ‘ఆహారం తీసుకోవాలి’ అనే ఒక ఇష్టాన్ని కలుగచేసే కేంద్రం ఉంటుంది. దానినే ఎపెటైట్ సెంటర్ అంటారు. మానసికంగా అలజడి, క్రుంగుబాటు, కలత, ఒత్తిడి ఇవన్నీ ఆ వ్యక్తి ఆహారం తీసుకునే కోరికపై ప్రభావం చూపిస్తాయి. ఇవేకాక అత్యంత ప్రధమ దశలో ఉన్న కేన్సర్ నుంచి ఉత్పన్నమయే కొన్ని మూలకాల వలన (ఉదా:Tumor necrosis Factor alpha) కూడా పైకి అకారణంగా ఉన్నప్పటికీ ఆ వ్యక్తికి ఆహారంపై ఆసక్తి, ఇష్టం తగ్గడానికి కారణమవుతాయి. ఇక ఆకలి వేయడానికి అంటారా? మనిషి జీర్ణవ్యవస్థ, దానితో పాటు, కాలేయం (liver), క్లోమం (pancreas) అనే భాగాలు సక్రమంగా ఉన్నప్పుడు 3-4 గంటల కొకసారి ఆకలి వేస్తుంది.
‘‘రుచి మెదడులో ఉండాలి కానీ, నాలికపై కాదు’’, అని నానుడి ఉంది. మనం తినే ఆహార పదార్థాలకు రంగు, సువాసన, రుచి ఈ మూడు లక్షణాలు తినేటందుకు గల ఆసక్తిని, తిన్న తరువాత జీర్ణమయ్యే విధానాన్ని ప్రభావితం చేస్తుంటాయి. ఆధునిక యుగంలో, చాలాసార్లు మనం ఆకలి కోసం కాకుండా ఏదో ఒక నెపంతో తింటూ ఉంటామన్నది అందరికీ తెలిసిన విషయమే.
ఆహారం ఇచ్చేది శక్తి. అలా శక్తిని ఇస్తూ, రుచిగా ఉండి, పైగా సులభంగా జీర్ణమౌతూ, మెదడులో ఉన్న ‘తినాలి’ అనిపించే కేంద్రాన్ని (Appetite Centre) తృప్తి పరచాలి. అలాంటి తృప్తితో పాటు రోగ నిరోధక శక్తి కూడా వస్తే ఇక దానికి మించినది ఏముంది? మధ్యయుగంలో ఐరోపా దేశస్థులు సముద్ర మార్గంపై తూర్పుదిశకు ప్రయాణించడానికి ముఖ్య కారణం సుగంధ ద్రవ్యాలే అని చరిత్ర చెప్తోంది. ప్రస్తుతం మానవాళి ఆరోగ్యంపై ఒక సూక్ష్మ జీవి చూపుతున్న ప్రాణాంతక ప్రభావం దృష్ట్యా రోగనిరోధక శక్తిని పెంచే మార్గాలను అన్వేషించక తప్పదు. ఈ నేపథ్యంలో ప్రత్యేక గుణాలున్న కొన్ని దినుసులను గురించి తెలుసుకుందాం.
వీటి ప్రముఖ లక్షణం అతి తక్కువ పరిమాణంతో రోగనిరోధకతను ఇవ్వడం. వాడేది తగుమాత్రం. ఆరోగ్య లాభాలు అధికం. రోగ నిరోధకత దృష్ట్యా వాటి విలువ అమూల్యం. ఏటా ఎన్నో పరిశోధనలు ఈ అంశాలను ప్రస్తావిస్తూనే ఉంటాయి.
2018, జర్నల్ ఆఫ్ మెడిసినల్ ప్లాంట్స్ స్టడీస్ ప్రకారం ఆసియా, ఆఫ్రికా, దేశాలలో వీటిని సర్వ సాధారణంగా తమ ఆహారంతో పాటు ప్రజలు విరివిగా ఉపయోగిస్తున్నారని తేలింది. ఒక వృత్తాకారపు గదుల పెట్టె. అందులో 7చిన్న గిన్నెలు. వాటిలో ధనియాలు, మిరియాలు, ఆవాలు, మెంతులు, జీలకర్ర, మినప్పప్పు, ఇంగువ. ఆ పక్కనే: వెల్లుల్లి, వాము, దాల్చిన చెక్క, అల్లం, పసుపు, పండు మిర్చి, ఎండుమిర్చి. ఇవన్నీ నిత్యం గృహిణులు ఉపయోగించే పోపుల పెట్టెలో లభించే రోగనిరోధక గుళికలే.
రవుల్ ఫియా సర్పంటినా నుంచి వింకా ఆల్కలాయిడ్స్ వరకు అంటే అధిక రక్తపోటు చికిత్స దగ్గర్నుంచి క్యాన్సర్ ట్రీట్మెంట్ వరకూ, అనాదిగా మనిషి మొక్కలపైన ఆధార పడుతూనే ఉన్నాడు. మొక్కల్లో దొరికే ‘ప్లేవనాయిడ్స్’ను వివరంగా పరిశోధన చేసిన పిమ్మట అనేక రకాల మందులను కనుక్కుని, రసాయనాలుగా తయారుచేసి, వాటిని మందులుగా వినియోగించడం జరిగింది. దీనిని గురించి తెలిపేదే ఫార్మసీ. ఆ మందులను మనిషి ఆరోగ్యం కోసం వినియోగించడం గూర్చి అధ్యయనం చేసే శాస్త్రం ఫార్మకాలజీ. ఈ వ్యాసంలో రోగ నిరోధకశక్తి గల దినుసులను గురించి మాత్రమే తెలుసు కుందాం.
పసుపు:
ఇందులో, కుర్కుమిన్ ఉంటుంది. ఇది మన దేహంలోని జీవ రసాయనిక క్రియను (Metabolic Rate)ను ఎక్కువ చేసి, హానికరమైన క్రొవ్వు పేరుకోకుండా సహాయపడుతుంది. డిప్రషెన్, అల్జైమర్స్, క్యాన్సరు వంటి అనేకమైన ప్రాణాంతక జబ్బులకు పసుపు నిరోధకారి అని కనుక్కున్నారు శాస్త్రజ్ఞులు. కీళ్లవాతం లేదా కీళ్ళ నొప్పుల కోసం గోరువెచ్చని నీటిలో పసుపు ఒక చెంచా వేసుకుని రోజుకు ఒకటి రెండు సార్లు తాగడం ఆ నొప్పులను ఉపశమింప జేస్తుందట. పసుపుకు ఉన్న ఏంటీ ఇన్‍ఫ్లెమేటరీ కుర్కుమిన్ శక్తి ఇది.
మరొక JohnHopkins Medicine Lite www.hopkinsmedicine.org – 5 Spices with Healthy Benfits వ్యాసంలో ఇచ్చిన వివరణ ప్రకారం, 18 నెలలపాటు పసుపును వాడిన తరువాత మెమొరీ టెస్ట్ స్కోర్‍లు పెరిగి, ఎంఆర్‍ఐ స్కాన్‍లో కాగ్నిటివ్ మెడిసిన్ మార్కర్స్ (Cognitive Medicine Markers) తగ్గడం కూడా గమనించారు కనుకనే దీన్ని వృధ్ధాప్య మతిమరుపుకు, ఆర్థ్రైటిస్‍కు నివారణోపాయంగా చెప్పారు.
అల్లం:
వికారం తగ్గించడం, అథిరోస్క్లిరోసిస్, అధిక కొవ్వు తగ్గించి హానికరమైన కొలెస్ట్రాల్ మరియు ట్రైగ్లిజరైడ్స్ను తగ్గించడంలో ఉపయోగపడుతుంది.
ఆవాలు :
1 స్పూన్ ఆవాలలో జీవ రసాయన క్రియను 25 శాతం పెంచేటి శక్తి ఉందట! అందుకే దీని వల్ల ఊబకాయం తగ్గుతుంది. ఆవనూనెలో MUFA : Mono Un-saturated Fatty Acids: Palmitic, Oleic, Elaidic Acid and Vacintic acids ఉన్నాయని అమెరికన్ జనరల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ AJ CN వారు కనుగొన్నారు. ప్రతి పోపులో, డెకరేషన్‍గా సైతం అదనపు రుచిని, ఆరోగ్యాన్ని మనకు అందించేవి ఆవాలు. చాలా కూరలకు, ఊరగాయలకు దీనిని వాడతారు.
నల్ల మిరియం :
ఒక చెంచా నల్ల మిరియాల పొడి, 20 నిమిషాల పాటు చేసే నడకతో సమానం అంటారు. అంటే నడక మానేయమని కాదు సుమా! మిరియాల గొప్పతనం గురించి చెప్పడానికి. ఇది నేరుగా మనిషిలో క్రొవ్వు కణాలపై పనిచేసి, వాటి నియంత్రణలో ఉపయోగ పడుతుందని, కొన్ని రకాల చర్మవ్యాధులకు చికిత్స కావచ్చని అంటారు. మిరియాల కషాయంతో, గొంతు నొప్పి, జలుబు నుంచి ఉపశమనం దొరుకుతుంది అన్నది అందరికీ తెలుసు. మిరియాలలో ఉన్న ఒక ధాతువు వలన మెదడుకు చేరవేయబడే నొప్పుల సిగ్నల్స్ క్రమబద్ధీకరణ అవుతాయని, అందుకే మిరియాలను కీళ్లవాతంలో కూడా వాడుతూ ఉంటారు. పిత్తాశయం (Gallbladder)లో రాళ్ళు తయారవ కుండా, దాని కదలికలను ప్రభావితం చేసేదిగా మిరియం పాత్ర గొప్పది (Chooecystogogue)
వెల్లుల్లి:
దీనికి యాంటీబ్యాక్టీరియల్ యాక్షన్ ఉందంటారు. దీనిలో ఉన్న ‘‘ఫైటోకెమికల్స్’’ అనే ధాతువుల వల్ల రక్త పోటు, మధుమేహం, ఊబకాయం మూడు కూడా నియంత్రణలో ఉంటాయి.
మినప్పప్పు:
ప్రతి 100 గ్రాముల మినప్పప్పులో 25మి.గ్రా. మాంసకృ త్తులు, 983మి.గ్రా పొటాషియం, 138 మి.గ్రా. కాల్షియం, 7.57 మి.గ్రా. ఇనుము, రిబోఫ్లావిన్ (0.254మి.గ్రా), థయామిన్ (0.273మి.గ్రా.), నియాసిన్ (1.447 మి.గ్రా.) ఉంటాయి. పీచు పదార్థాలు అదనం. విటమిన్ బి సహజంగా లభించే ఈ పప్పు దాదాపు ప్రతి రోజూ పోపులో వాడుకోవటం చూస్తాం.
జీలకర్ర:
ఒక చెంచాడు జీలకర్ర రసం తాగడం 3 పౌండ్ల బరువును తగ్గిస్తుంది అని ఒక స్టడీలో చెప్పారు. జీలకర్ర జీర్ణం కావడానికి మన శరీరంలో ఉన్న శక్తిని వినియోగించుకుంటుంది. కనుక ఊబకాయాన్ని తగ్గిస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. నిద్రలేమి నివారణ కూడ ఇది చేస్తుంది.
నల్ల జీలకర్ర అయితే బి విటమిన్ కలిగి ఉంటుంది. ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ ఎలర్జీలను నివారి స్తాయి. అనేకరకాల ఆటోఇమ్యూన్ రోగాలకు నల్ల జీలకర్ర చక్కటి తాళంచెవి అంటూ ఉంటారు. ఆస్త్మా, ఎలర్జీ వంటివి.
ధనియాలు, కొత్తిమీర :
వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. ఇవి పీచు పదార్ధాన్ని కలిగి ఉంటాయి. ఇది కాలేయ సంబంధమైన జబ్బులు నివారించి, మలబద్ధకాన్ని తొలగించగలదు. కొత్తిమీరలో (Linolol, Geranylacetate) లినొలాల్, జెరనిల్ ఎసిటేట్ అనే పదార్ధాలు జీర్ణపక్రియ లో చురుకుదనం ఇస్తాయి.
మెంతులు:
మధుమేహంలో మెంతులకు ప్రముఖ పాత్ర ఉందంటూ ప్రాచుర్యం కలిగింది. ఇందులో యాంటీ ఇన్‍ఫ్లెమేటరీ లక్షణాలున్నాయి అంటారు. పాలిచ్చే తల్లులకు బిడ్డ పాలు సరిగా ఉత్పత్తి కావడంలో వీటికి ప్రాధాన్యత ఉందని కొన్ని పరిశోధనలు చెపుతున్నాయి.
జాజికాయ:
ఇది కాలేయం లేదా లివర్‍కు ఆరోగ్యకారిణి.
నువ్వులు :
హార్వర్డ్ యూనివర్సిటీ 2010లో జరిపిన పరిశోధనలో విటమిన్ బి, ఐరన్‍లకు ఇవి భాండాగారాలు అని చెప్పారు.
దాల్చిన చెక్క :
ఇందులోని పాలీఫినాల్స్ ఆకలిని తగ్గించగలవు. యాంటీ ఆక్సిడెంట్స్గా, ఊబకాయ నివారణలో ఉపయోగపడతాయని చెప్తారు. ఈ దాల్చిన చెక్క మానవ శరీరంలో ‘‘ఇన్సులిన్ సెన్సిటివిటీ’’ని పెంచి, రక్తంలోని చక్కెరను నియంత్రణలో ఉంచి, హానికరమైన కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్లు తగ్గించి జబ్బులను నివారిస్తుంది. పిసిఓఎస్ PolyCystic Ovarian Disease స్త్రీ అండాశయంలో నీటి బుడగలు తగ్గించడంలో దీని పాత్ర ఉంది.
పండుమిర్చి:
ఇందులో ఉన్న కాప్సెసైన్ (Capsaicin) మన జీవ రసాయన క్రియను వేగ పరచి, తద్వారా హానికరమైన క్రొవ్వు పదార్ధాలను తగ్గిస్తుంది.
ఏలకులు:
వీటి నుంచి జింక్, విటమిన్ ఎ, సి, క్యాల్షియం, ఐరన్ దొరుకుతాయి. జీవ రసాయన క్రియను వేగవంతం చేస్తుంది. చర్మవ్యాధులు, కడుపు ఉబ్బరం తగ్గిస్తుంది. మధుమేహ వ్యాధిలో కూడా ఇది ఉపయోగకరం.
లవంగం:
ఇది యాంటీ ఫంగల్, యాంటీ సెప్టిక్, యాంటీ బ్యాక్టీరియల్ గా ఉపయోగపడుతుంది. Omega 3 Fatty Acids, పీచుపదార్థాలు, విటమిన్లు, ఖనిజ లవణాలు కూడ ఉన్నాయి. పంటి నొప్పులకు లవంగం వాడుక మనకు తెలుసున్నదే.
వాము ఆకు, గింజలు:
ఇది యూరిక్ యాసిడ్‍ను తగ్గిస్తుంది. అధిక రక్తపోటు తగ్గిస్తుంది. ఋతుస్రావ సమస్యలను నియంత్రణలో ఉంచుతుంది. ఇందులో కాల్షియం, ప్రొటీన్లు కూడా ఉంటాయి. అజీర్తి, కడుపు ఉబ్బరం కోసం వాము రసం తాగుట ఎన్నో దేశాల వంటింటి చిట్కా. ఇవేగాక తేనె, కరివేపాకు వంటివి మరెన్నో ఉన్నాయి.
‘‘పెరటి చెట్టు మందుకు కొఱ కాదు’’ అని అందుకే అన్నారేమో. అనగా ఏం తీసిపోవని అర్ధం కదా! కానీ ఆధునిక విజ్ఞానం ప్రకారం మందు అంటే దానిని వాడే విధానం, మోతాదు, మానవ శరీరంలో అది పొందే మార్పులు, ప్రాణప్రమాదమయే మోతాదు (over dose), వికటిస్తే వచ్చే లక్షణాలు, ఇవన్నీ తెలిసుండాలి. ఇది కాక, ఆ మందు ఎలా ఇవ్వాలో (route of administration) తెలియాల్సి ఉంది. ఎలా విసర్జన అవుతోంది కూడా తెలియాలి.
పైన చెప్పిన దినుసులలో వేటికీ మానవునికి హానికరం అయే బెడద లేదనే ఇప్పటి వరకూ జరిగిన పరిశోధనలు చెప్తున్నాయి. ఆరోగ్యం, రోగ నిరోధకత ఇచ్చేందుకు ఎంత పరిమాణంలో (బరువు గ్రాములలో), వేటితో కలిపి తీసుకోవాలి అన్న విషయంలో సాంప్రదాయ చిట్కాలనే ఆశ్రయించాలి. ఎలాగూ ఇది ‘వైద్యం, చికిత్స’ (Medicine, Treatment) కాదు కనుక రోజుకు ఒక్క దినుసును తగువిధంగా వాడి, వాటి మంచి ఫలితాలు పొందవచ్చు. కరోనా వైరస్ కాలంలో ప్రపంచ వ్యాప్తంగా పసుపును గోరు వెచ్చని నీటిలో కలిపి త్రాగడం మంచిదని ప్రకటించారు.
ఆరోగ్యం అంటే మేలుచేసేవి తినడం, హాని చేసేవి మానేయడం, క్రమశిక్షణతో వ్యాయామం చేయడం. శ్వాస, జీర్ణ వ్యవస్థలోని స్థానిక రోగనిరోధకత (Local Immunity), మానవ శరీరంలో సంక్లిష్టమైన కణముల పనితీరు చురుకుగా ఉంచడంలో వంట గదిలో ఉపయోగించే ఈ దినుసులు ప్రముఖ పాత్ర వహిస్తాయనడంలో సందేహం లేదు.
-నాగసూరి వేణుగోపాల్, 9440732392
-కాళ్ళకూరి శైలజ, 9885401882