నల్లగొండ జిల్లా, నార్కెట్ పల్లి మండలం అవురవాణి గ్రామశాసనం:
రాజ్యం : పశ్చిమ(కళ్యాణి)చాళుక్యులు
రాజుః త్రిభువనమల్ల విక్రమాదిత్యుడు
శాసన కాలం: శక సం.1016, క్రీ.శ.1094 సం.సూర్యగ్రహణ సమయం
శాసన లిపి: తెలుగు,
శాసనభాష: తెలుగు
శాసనోద్దేశం: సామంతరాజు, మహామండలేశ్వరుడుః మల్లయరాజులు దానశాసనం
అవురవాణి గ్రామం తూర్పు శివారు, కల్వర్టు దగ్గరలో 9 అంగుళాల వెడల్పు, 9అడుగుల ఎత్తైన నల్లశానపు రాతిస్తంభం
శాసనపాఠం:
మొదటివైపుః
(శాసనప్రారంభంలో శివలింగం, సూర్యచంద్రులు, ఆవు, దూడల బొమ్మలున్నాయి.)
స్వస్తి సమధిగత ప
0చమహాశబ్ద మ
హా మణ్డలేశ్వ
ర………………
…………….
చాళెక్యాభజి
రణ సుజనమనో
రంజనం శత్రుమ
ళభంజన దినానా
త మనోభివాంచృనః
వరాహలాంఛన ను
మాది సమస్త ప్ర
శస్తిసహితం శ్రీ
మన్మహామణ్డలేశ్వరజి
మల్లయరాజులుజి
సక వర్ష 1016
సం. నగునేంది
రెండోవైపుః
శ్రీముఖ సంవ
త్సర సూర్య
గ్రహణ నిమిత్తము
జఱకు దేబమి
0దితీ వారి అవిఱు
వాణ్డి పొలమునం
ది ఉత్తరము చే
మేను దాని పిఱుం
దంనేను చే మఱ్తురు
నిరినేలయు దామ
య పఱింగవులకు
సర్వనమస్యముగా-
గాళ్ళు గఱిగి ధారాపూ
ర్వకము దయసేసితి
మి
అవురవాణి అని ఇపుడు పిలుస్తున్న గ్రామానికి అవురొండి అని మరొకపేరుకూడా వుంది. ఈ అవురొండే ఇటీవల గ్రామశివార్లో పడివున్న శాసనంలో అవిరువాణ్డిగా పేర్కొనబడివుంది. తెలుగులిపి, తెలుగుభాషలో రాయబడి, 80పంక్తులలోవున్న ఈ శాసనం కళ్యాణీచాళుక్యచక్రవర్తి త్రిభువనమల్లుని ఏలుబడిలో సామంతుడైన కందూరి మల్లికార్జునుని దానశాసనం. శకసం. 1016లో అంటే క్రీ.శ.1094లో సూర్యగ్రహణ నిమిత్తం మల్లయరాజులు దామయ పఱింగవులకు కాళ్ళుకడిగి సర్వ నమస్యంగా 1 మర్తురు నీర్నేల(తరి) భూమిని దయచేసినట్లు ఈ శాసనం తెలుపుతున్నది.

ఇందులో రాజుగారిని గురించిన బిరుదగద్య దురవ గాహకంగా వుంది. నిజానికి కందూరి మల్లికార్జునచోడుని పేరుమీద క్రీ.శ.1098లో వేయబడిన పాముల పాడు, వల్లాల శాసనాలు రెండే లభిస్తున్నాయి. ఇది మూడవది. మల్లరాజులే మల్లికార్జునుడు కావాలి. ఈ శాసనం వేయబడిన సంవత్సరాన్నిబట్టి మల్లికార్జునచోడుడు 1094నాటికే మహామండలేశ్వరుడైనాడనుకోవాల్సివుంటుంది. అంతేగాక ఉదయనచోడుడు క్రీ.శ.1144లో వేయించిన పరడశాసనం
(న.జి.శా. సం.48)లో తమతండ్రి మల్లపురాజులం గారికి ధర్మువుగా ఆమనగల్లులో మల్లసముద్రం అనే చెరువును తోడించినట్లు పేర్కొబడింది. అట్లే శాసనభాషకూడా కందూరివారి శాసనాలభాషతో సరిపోల్చవచ్చు. రామలింగాలగూడెం (మార్కండేశ్వరాలయ) శాసనంలో ‘కావలియ బ్రహ్మయ్యకు గాళ్ళు గడిగి ధారాపూర్వకం సేసి యాచంద్రస్థాయిగా దయచేసియిచ్చిరి’ అని వుంది. ఇవే మాటలతో పోలిన మాటలు అవిరువాణ్డి శాసనంలో కూడా దాన సందర్భంలో ‘మఱ్తురు నిరినేలయు దామయ పఱింగవులకు సర్వనమస్యముగా – గాళ్ళు గఱిగి ధారాపూర్వకము దయసేసితిమి’ అని రాయబడ్డాయి. ఈ శాసనంలో ‘మ’ అనే అక్షరం ఎక్కువచోట్ల ‘రొ’ వలె రాయబడి వుంది. పరిశోధనాత్మకమైనది ఈ లిపి. ఈ శాసనం రాసినది కరణం నందేన.
-శ్రీరామోజు హరగోపాల్,
ఎ : 9949498698