భూమిపై నివసిస్తున్న 8.7 మిలియన్ జంతువృక్ష జాతులు ప్రదర్శించే వైవిధ్యాలను, సహజ విభిన్నతలను జీవ వైవిధ్యంగా అభివర్ణించవచ్చు. బిలియన్ల సంవత్సరాల పరిణామక్రమం, సహజ పక్రియలు మరియు మానవ ప్రభావ ఫలితంగా ధరణిపై అద్భుత జీవ వైవిధ్యం వెలసింది. జీవజాతుల మధ్య నెలకొన్న విభిన్నతల వలలో మనిషి కూడా ఒక భాగం మాత్రమే. భూమి తనకు మాత్రమే స్వంతం అనుకున్న మనిషి, తన స్వార్థం కోసం జీవ వైవిధ్యానికి నష్టం కలిగించుట అనాదిగా జరుగుతుంది. ఇలాంటి అవాంఛనీయ మానవ తప్పిదాల మూలంగానే వివిధ సందర్భాలలో కరోనా లాంటి వైరస్ మహమ్మారులు ప్రపంచాన్ని గడగడ లాడిస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జీవిలోని క్రోమోజోమ్‍లు, జీన్స్, డియన్‍ఏల ఫలితంగానే వివిధ జీవులు, వంగడాలు, జంతు జాతుల మధ్య వైవిధ్యతకు కారణమని గమనించాలి. మానవ నాగరికతకు ఆధారంగానే జీవవ నరులైన నదులు, చెరువులు, అడవులు, జలాశయాలు ఉపయోగపడుతున్నాయి. జీవ వైవిధ్యానికి విఘాతం కలిగినపుడు ఆహార ఉత్పత్తులు, పర్యాటకం, వస్త్రాలు, ఇంధనాలు, గృ హాలు, ఔషధ మ్నొక్కలు, కలప మరియు శక్తి వనరులు ప్రభావితం అవుతాయి. ప్రకృతి ప్రసాదించే జీవ వైవిధ్యం ద్వారానే ఆరోగ్యకర సమాజం, ఆర్థిక ప్రగతి, సక్రమ జీవన విధానం సాధ్యపడుతాయి.
ప్రపంచంలోని 750 కోట్ల జనాభాలో ప్రతి ఒక్కరికి ఒక విలక్షణత ఉంది. కోట్ల జనంలో ఏ ఇద్దరు సమానం కాదు. ఈ వైవిధ్యాన్ని ప్రకృతి మాత్రమే ప్రసాదించింది. విశ్వ మానవాళి ముఖ్యంగా ఐదు జాతులుగా విభజించబడ్డారు. వీటిలో కాకసోయిడ్ (శ్వేతజాతి), నెగ్రాయ్డ్ (నల్లజాతి), కాపాయిడ్ (బుష్‍మెన్), మంగోలాయిడ్ (ఓరియంటల్) మరియు ఆస్ట్రాయిడ్(ఆస్ట్రేలియా) మానవ జాతులు వస్తాయి. ప్రపంచవ్యాప్తంగా పంటలు పండించే వరి వంగడాలు 40,000లకు పైగానే ఉన్నాయంటే ఆశ్చర్యం కలుగక మానదు. వీటిలో ఒక్కొక్క దానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. జీవావరణ వ్యవస్థ అందించే జీవ వైవిధ్యమే సుస్థిరాభిద్ధి, పేదరిక నిర్మూలన, మానవాళి శ్రేయస్సులకు కారణమైందన గమనించిన అంతర్జాతీయ జీవ వైవిధ్య సమాజం 1993 నుండి ప్రతియేటా అంతర్జాతీయ జీవ వైవిధ్య దినాన్ని 29 డిసెంబర్ రోజున జరుపుకున్నారు. తరువాత 22 మే 1992 రోజున నైరోబి ఐక్యరాజ్యసమితి సదస్సులో తీసుకున్న తీర్మానం ప్రకారం 22 మే రోజున అంతర్జాతీయ జీవ వైవిధ్య దినాన్ని జరుపు కోవాలని నిర్ణయించింది. అంతర్జాతీయ జీవ వైవిధ్య దినం-2020 నినాదంగా ‘‘మనకు సమాధానాలన్నీ ప్రకృతే ఇస్తుంది’’ (అవర్ సొల్యూషన్స్ ఆర్ ఇన్ నేచర్)ని తీసుకొని జీవ వైవిధ్య ప్రాధాన్యతలను ప్రపంచవ్యాప్తంగా వివరించేందుకు ఈ ఉత్సవాలను వాడుకుంటారు.

మానవాళి ప్రమేయంతో జీవ వైవిధ్యానికి గండిపడి 25 శాతం వృక్షజంతుజాలాలు అంతరించి పోయే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు. ప్రతి గంటకు మూడు, ప్రతి రోజు 100-150, సంవత్సరంలో 80,000 వరకు జీవ జాతులు అంతరిస్తున్నాయనే వాస్తవం పలు హెచ్చరికలు చేస్తోంది. కెనడాలోని పోలార్ బేర్ జనాభా గత మూడు దశాబ్దాలలో 22 శాతం తగ్గుట జరిగింది. పంచవ్యాప్తంగా 80 శాతం ప్రజల వృక్ష సంబంధ ఆహారాన్ని, 1.6 బిలియన్ల జనులు అటవీ సంపదల ఆసరాగా జీవిస్తూ, 3 బిలియన్ల జనులకు మాంసకృత్తులను చేపల ఆహారం అందిస్తున్నాయి. జీవ వైవిధ్యానికి నష్టం కలిగించుట వలన జునోటిక్ (జంతువుల నుండి సంక్రమించే) వ్యాధులు మానవాళిని చుట్టు ముడతున్నాయి. చైనాలోని వూహాన్ నగరంలో గబ్బిలాల నుండి కరోనా సోకిందనే వార్తలను వింటున్నామని గుర్తు చేసుకోవాలి. జీవ వైవిధ్యానికి, జీవావరణ వ్యవస్థలకు నష్టం వాటిల్లే అనాలోచిత చర్యలకు మనిషి పూనుకున్నట్లయితే అనేక జాతులు అంతరించడం లేదా వాటి సంఖ్య తగ్గడం జరుగుతుంది. దురాశతో ప్రకృతికి లేదా పర్యావరణానికి విఘాతం కలిగించిన ప్రతి సందర్భంలో ఏదో ఒక అనారోగ్యకారక సూక్ష్మజీవి అవతరించి మానవాళికి పెను సవాలుగా మారుతున్నది.
భవిష్యత్తులో సమతుల్యతను పాటించే అవసరాన్ని సమాజంలోని పిల్లల నుండి వృద్ధులకు అనగాహన కల్పించాల్సిన కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టుటకు అంతర్జాతీయ జీవ వైవిధ్య దినాన్ని వేదికగా తీసుకోవాలి. జీవ వైవిధ్యాన్ని వివరించే కరపత్రాలు, గోడ పత్రికలు, ఇతర వివరాలను అందించే ముద్రణలను అన్ని భాషలలో అందరికీ అందించే ప్రయత్నాలు చేస్తారు. విద్యాలయాలు, ప్రదర్శనలు, సెమినార్లు, పత్రికలు, టీవీలు, డాక్యుమెంటరీలు, రేడియో ప్రసంగాల రూపంలో జీవ వైవిధ్య ప్రాధాన్యతలను వివరించే ఏర్పాట్లు చేయాలి. ఈ సందర్భంగా అంతరించే ప్రమాదమున్న జీవజాతులను కాపాడే అవసరాన్ని వివరిస్తూ,విద్యార్థినీవిద్యార్థులకు పలు అంశాలలో పోటీలను నిర్వహించి బహుమతులను అందించుట ద్వారా వారిలో జీవ వైవిధ్యమ పట్ల సంపూర్ణ అవగాహన కలుగుతుంది. జీవ వైవిధ్యాన్ని కాపాడేందుకు మాంసాన్ని తక్కువగా వాడటం, ప్రాంతీయ పండ్లను మరియు ఆహార పదార్థాలను తీసుకోవడం, ఆహారపదార్థాల వ్యర్థాలను తగ్గించడం, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించటం, వ్యర్ధాలను కంపోస్టుగా మార్చడం, ఆర్గానిక్ ఆహారాన్ని ప్రోత్సహించడం, పురుగు మందులు మరియు ఎరువుల వాడకాన్ని తగ్గించడం లాంటి జాగ్రత్తలను ప్రతి ఒక్కరు తీసుకోవాలి. పర్యవరణ సమతుల్యతను కాపాడే క్రమంలో మొక్కలు నాటడం, మొక్కలకు పాదులు తీయటం, పర్యావరణ హిత కార్యక్రమాలను చేపట్టవచ్చు. మానవాళి ఆహార ఆరోగ్యాలకు ఉత్ప్రేరకంగా పని చేసే జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవలసిన కనీస బాధ్యత మన అందరి భుజస్కంధాల మీద ఉన్నదని గుర్తు పెట్టుకోవాలి. ప్రకృతిని కాపాడితేనే మనిషికి పీల్చటానికి పరిశుద్ధ గాలి, తాగటానికి స్వచ్ఛమైన నీరు, తినటానికి పోషకాహారం అందుతుందని మరువరాదు. ప్రకృతి మనుగడకు మనిషి ప్రమేయం అవసరం లేదు, కాని మనిషి బతకడానికి ప్రకృతి దీవెనలు తప్పని సరియని తెలుసుకోవాలి.
-డా।। బుర్ర మధుసూదన్ రెడ్డి
ఎ : 99497 00037