వలస బతుకులు

‘‘ఏమే’’ అంటూ బార్య తులసమ్మ వైపు చూస్తూ పలకరిం చాడు ఆమె పెనిమిటి చంద్రయ్య. అతనలా పిలువగానే ‘‘ఏందయ్యా’’ అంటూ అతనివైపు చూస్తూ మారడిగింది. ‘‘పొయ్యి కాడ ఎంతసేపు కూలవడ్తవ్‍, వంట జల్ది కానియ్యరాదే సుతారం జెయ్యక, ‘‘అంటూ గొనిగాడు తలపై చేతితో రుద్దుకుంటూఅతను చూడనికె దుక్కలా కరుకుదేలి చామన చాయతో వుంటాడు కోలమొఖంతో నెత్తికి సమరు లేక ఎర్ర బారింది
‘‘ఏందయ్య అట్ట ఆత్రిస్తవ్‍, నాకేమన్న నాల్గు చేతులున్నయా, ఇదేమన్న మిషినా, మనదేమన్న గ్యాసుపొయ్యా’’ అంటూ అతనివైపు గుడ్లురిమి చూస్తూ అసహనంతో పలికింది.
తులసమ్మ సూడ నల్లని కురులు, కాటుక కళ్ళు ముత్యాల పళ్లు, ఎరుపు తెలుపు మట్టి రంగువన్నే తో జిగేలుమని మెరిసిపోతుంది
‘‘ఒయబ్బో మాటకు మాటేస్తదిరయ్య బుక్కమల్పక జర కానియ్‍ అవుతల పొద్దుపోతుంది, బుక్కెడు బువ్వ తిని పనికుర్కాలే’’ అని ఆమెవైపు నింపాదిగా చూస్తూ పలికాడు.
‘‘సిడెం ఆగరాదు ఎందుకు నీకు పరిగడ్పు దేవులాట, తిండి చింత తప్ప, పిల్లలున్నరు నాల్గురాల్లు ఎనకేస్కుందామన్న ఆలోచన వుందా లొట్టెడుతాగాలే, ఉన్నకాడ్కి ఊడ్సుక తినాలే బరివత్తల పండాలే ఇగ ఇల్లెందుకు పొల్లెందుకు. నువు సంసారం జేస్తే సక్కదనం కుల్కుతుంది… ‘‘అంటూ అతనివైపు అసహనంతోనే తన అక్కసు ఎల్లగక్కింది.
‘‘ఓర్నితల్లి పొద్దుపొద్దుగాల నీ రాషంగంకున వార్దెంగుదు, పనికి ఆల్చమైతుందంటే కాలికి గజ్జెగట్టి కయ్యిన లేస్తవ్‍ కుక్కోలె.’’ అంటూ నసిగాడు.
‘‘జర్రాగరాదు చేస్తున్నగదా, గింతకుమునుపే చాయ్‍ చేస్తే గిలాసడు తాగితివి, నేనేమన్న వూకె కూకున్ననా లేశ్నసంది చేస్తనేవుంటి కూలవడి కూలవడి రెక్కలిసే.’’ ఆమె గండిపడిన చెరువులా వాగుతనే వుంది. అతను తనని కాదన్నట్టు బీడి ముట్టించుకొని తాగవట్టిండు కాలుగాలిన పిల్లోలె.
‘‘నా యెన్కెమ్మటే తిర్గకుంటే పెద్ద మేస్త్రికి పోన్నన్న జేయవైతివి ఆడాడా పనులు బందువెడుతుర్రట. పట్నమంతా ఒకటే కలకలం జనం సుత అప్పటిలెక్క తిర్గుతలేరు ఏందో మాయదారి రోగం పట్నానికొచ్చిందట’’అంటూ వీస్తూ పోయి పలికింది
‘‘ఏందే నువ్వు నీ అపశకునం మాటలు’’ అంటూ అతను ఆశీర్కపోయి చూశాడు
‘‘అయ్యో ఉన్న మాటంటే అట్టుల్కిపడ్తవ్‍ నాకేమెర్క నేను సూడబోయిన్నా’’ అంటూ ఆమె పెనిమిటి వైపు గుడ్లప్పగించి చూసింది
‘‘ఈ ఫోన్‍ కలుస్తలేదే ఎన్నిసార్లు చేసినా బిజి బిజి వొస్తుందేమే’’ అసహనంగా పలికిండు అతడు.
‘‘ఆయనకి నువ్వొక్కన్వే పన్యవ్‍ నీ కోసమే ఎదురుజూస్తుండు ఎప్పుడొస్తడు పిలగాడ అని ఊకే ఫోన్‍ గెల్కకుంట రప్పున సైటుమీదికి పొయ్యిరాపోరాదు నీకు ఒనరు గాకుంటే నేను రాన’’ అంటూ అతని వైపు వారగా చూస్తూ పలికింది. ‘‘ఊకే శల్పట్లాడకు పోతగాని’’ అంటు కదలబోయాడు.
అప్పుడే మేస్తిరి వాళ్లదగ్గరకొచ్చి నాడు. వెదకబోయిన తీగ కాలికి తగిలినట్టు,’’ ఇగో తులసమ్మ మీరు ఇంతకుముందు పోయిన సైటుమీదికి పోండ్రి ఆడ పని అయిపోతే నాకు ఫోన్‍ చేయుండ్రి, మిగుల్తే రేపుగూడ ఆడికే ఎల్లుండ్రి. ఇగో చంద్రయ్య పని తొందరగ వొడగొట్టు’’ అంటూ ఆతను పలికిండు.ఆమాటకు వారు ‘‘ఇంకెవలు వస్తుండ్రు మేస్త్రి’’ అని అడిగారు మేస్త్రి ని. అందుకతను ‘‘మీరిద్దరు మీతోపాటు ఇంకిద్దరు వొస్తరు జర జల్ది జల్ది పని కానియుండ్రి.’’ అని అతను అక్కడినుండి కదలబోయాడు. ‘‘మేస్త్రి పోతంగని గిన్ని పైసలు జూడుండ్రి’’ అంటూ అతనినే తదేకంగా చూస్తూ. ‘‘మొన్ననే ఇస్తిగదయ్యా’’ అని అతననగానే ‘‘అదికాదు మేస్త్రి ఇంట్ల సరుకులు వొడిసినయ్‍, నువ్‍ ఇచ్చిన దాంట్ల ఇంటికిన్ని పంపిస్తి, పిల్లలున్నతాన కూకోనితింటే కొండలాగుతయా’’ అని ఆశగా పలికింది తులసమ్మ. ‘‘సరే లేవ్వయ్య దానికేం తక్వలేదు గాని ముందైతే పనికెల్లుండ్రి’’ అని అతను కదిలాడు ‘‘సరే మేస్త్రి..’’ అంటూ వారు గదిలోకి కదిలారు.
‘‘అమ్మో చాయ్‍ పొయ్యే’’ అంటూ పిల్లలిద్దరు వొచ్చిర్రు. ‘‘గిప్పుడు చాయేందిరా గింత అన్నం తిని బడికి పోరి నాయినా’’ అంటూ ఆమె పలికింది పిల్లల యిద్దరిని వొడిలోకి తీసుకుంటూ ‘‘మాకు బడి లేదే’’ అంటూ హుషారుగా పిల్లలు పలికారు. ‘‘అప్పుడే శెలవులొచ్చినాయిరా’’ అంటూ యింతగా పిల్లల వైపు చూసింది ఆమె.’’ఇగో ఒకపూట బడేగాని అక్కడేందో కరోనా వచ్చిందట సార్లు బడికొచ్చి పోతరు మమ్ములమట్కు ఇంటిపట్టున్నే ఉండమన్నరు మేం పోవొద్దట బడికి, ‘‘అని వారనగానే’’ ఒశే ఏందల్లా విచిత్రము, బాగుందిగా సక్కదనం పిల్లలు లేన్ది సార్లు వచ్చేంజేస్తర్రా బడికి’’ అంటూ వింతగా అడిగింది ఆమె.
‘‘ఏమో గది మాకు తెల్వదు సార్లు చెప్పిర్రు మీకు చెప్తున్నం’’ ఆనందంతో పిల్లలు పలికారు.


‘‘సరేగాని ఎండపొద్దు నాయినా అటిటు తిర్గకుండ్రి ఎండకు పానం గావరైతది ఇంటిపట్టున్నే ఉండుర్రి’’ అంటూ మురిపెంతో పిల్లల ముద్దాడింది. ‘‘సరేనే అమ్మా ముందైతే గింత చాయ్‍ పొయ్యి’’ అని ఆమె నే అమాయకంగా చూస్తూ పలికారు.
‘‘జర్రాగురా తలిస్తే ఆగవ్‍ శిడం, ఓపికపట్టు మాకు సద్దులు కావాలే పొయ్యి మీద అన్నం కూరుంది జర్రాగితే చాయ్‍ గరం చేసి పోస్తగని మిమ్ముల కాదంటనా నా చిట్టి బంగారి ఇగ్గో అక్క నువ్వు పక్కింటికి పొయ్యి టి.వి.సూడుపోరి.’’ అని కొడుకు తల నిమురుతూ అనగానే పిల్లలిద్దరు ఉరికి టి. వి. సూస్తుర్రు పక్కింటి పిల్లలతో కలిసి ఆ ఇంటామే రేకలవారకముందే ఇండ్లల్ల పనికిపోయింది…
వారు అన్నం తిని పనికి పొయ్యారు సాయంత్రం ఐదు గంటలకు మేస్తిరి సైటుమీదికి వచ్చిండు పని మొత్తం తెప్పరిల్లి పరీచ్చగా పరిశీలించి చూసిండు. వారు పనిలో మునిగారు ఏదన్న వొంక పెడ్తడో ఏమో, పనికేంది ముతోంకరా ముక్కొంకరా’’ అని లోలోన అనుకోసాగారు,
‘‘ఇగో తులసమ్మ ఇను ఓ నాల్గు దినాలు పని బందు పెట్టాల్నట గదేందో కరోనా మహమ్మారి మన దేశానికొచ్చింది. దానికి మందు లేదు అదిగన ఎవరికి సోకినా ఇగ సావే, బతికుంటే బల్సాకైనా తిని బత్కొచ్చు ముందైతే రేపటిసంది మీరు పని బందు పెట్టి ఇంటిపట్టున్నే ఉండండి అటిటు తిర్గకండి ఇగో మన ఇంటిసారు కొన్ని పైసలిచ్చిండు పురా మొత్తం ఇయ్యాలే కర్సులమట్కు ఇస్తున్న ఎట్నో అట్ట ఎల్లదీస్కోరి ఏమన్నుంటే తతిమ్మ పైసలు అన్ని కులాయించినంక ఈ నాల్గుదినాలు గడ్సినంక మల్ల పనికొస్తరు గదా అప్పుడు చూద్దాం’’ అంటూ అతని చేతిల కర్సులకని కొన్ని పైసలిచ్చిండు.
‘‘అన్ని రోజులు ఎట్ల ఎలదీస్కోవాలే మేస్తిరి మిమ్ములనే నమ్ముకున్నం అమ్మ పిల్లల కాదంటారా పిల్లలు తల్లిని కాదంటారా, ఏదో పెద్ద మనసుతో సూడాలే ఆమే దీనంగ పలికింది.
‘‘ఇగో తులసమ్మగా యింటి వోనర్‍ యిస్తనేకదా నాచేతికొచ్చేది. నేనేమన్న రూపాయలు కట్టుకోని కూర్చున్ననా. మీలెక్కనే నేను, నాకొచ్చేదే కమీషన్‍ మీకు తెల్వనిదేముంది. ఎలాగొలా ఎల్లదీస్కోండ్రి. ఇగో రేషన్‍ కారట్వుంటే పన్నెండు కిలోల బియ్యం, గిన్ని పైసలు గూడ యిస్తదంట కర్సులకు నేను చెప్పేది చెప్పిన యిగ మీయిష్టం. అంటూ నింపాదిగా అక్కడినుండి కదిలాడు మేస్తిరి.
వారు పని ముగించి గులుగుకుంట అలసిన దేహాలతో ఇంటివైపు కదిలారు. ఆమె మై మర్సి నడుస్తోంది పోలీసుల గస్తి పెరిగింది, జనం షాపులు బందువెట్టి వారివారి ఇంటి పట్టున్నే ఉండండి అటిటు తిర్గకండి అంటూ జీపులో తిరుగుతూ మైకు శబ్దం చేస్తూ రోడ్డుపై పరుగులు తీస్తుంది. వారు యిల్లు చేరారు. వారిని చూడగానే పిల్లలు ఎగబడి ఎగ బడి పరుగున వచ్చి వారిని చుట్టుకున్నారు. తులసమ్మ పిల్లల రూపం జూస్తాలికి మతిని పుర్రె తొలుస్తుంది ‘‘ఉన్న పైసలు గీడనే గిప్పుడే కర్సయితే యిరవై రోజులు ఎట్ల ఎలదీస్కోవాలే ‘‘అంటూ గొనుగుతూ తిన్నగా మళ్ళీ తనంతట తానే పెనిమిటితో అతనివైపు చూస్తూ పలికింది. ‘‘నీయవ్వ ఎందుకే కొంపలు మునిగినట్టు అట్ట బాదపడతవ్‍. గీ శర మనకు వొక్కరికే నా, లోకమంత ఎట్లుంటే మనం గట్లనే. ఊరంత వొకదారయితే వులిపికట్టెదొకదారి అన్నట్టూ శింత జేయకు. పైన పరమాత్ముడుండు ఆయినే సూస్కుంటడు’’ అంటూ ఆమెకు దైర్యం మాటలు పలికిండు ‘‘అదికాదయ్యా నా బాద మనం ఎట్లన్న వుంటం. ఉప్పిడో సప్పిడో తిని బత్కొచ్చు పాలపండ్లోతిగ పిల్లలున్నరు లేవంగనే అమ్మా చాయ్‍ అంటరు. ఎప్పుడుపడితే అప్పుడు ఆకలి అంటూ తిని లేగలెక్క గంతులేస్తరు ఆటకాయి పోరలు ఆళ్ల ఆకలి దూప సూడొద్దా చెప్పు. ‘‘పిల్లల జుసుకొని బాధలన్నీ మర్శిపోయి బతుకాలే ఉన్న ఊరిలో పని కరువని వలస బాట పట్టి పట్టన మొస్తే ఏం ఎలగబెడుతున్నం ఆళ్ళే ఉట్టి కట్టుకొని ఊరేగుతారు. మనం సూసి సూసి కళ్ళు కాయలు గాసినయి ‘‘అంటూ వొనుకుతున్న గొంతుకతో పలికింది పెనిమిటి వైపు దిగులుగా చూస్తూ. ఆమె మాటలకు అతనూ గుమ్మం ముందు దిగులుతో కూలవడ్డడు ‘‘ఏమే ఆళ్లు పెద్దోళ్ళు మన కాలు జారితే కష్టం నోరు జారితే అంతకు పదిరెట్లు నష్టం, కూలికొచ్చి నం ఏడయినా మన బతుకులు గింతే ఉచుబ్బులకు ఉచ్ఛ తాగితే నోరంతా గత్తు వాసన గొడ్తది గాని అత్తరు వాసనొస్తదా ఇంకెన్ని సూడాల్నో గని కానియ్యే పిల్లల ఆకలి దూప సూడొద్దా ‘‘ అంటూ బీడీ ముట్టించి బుక్క దమ్ము గుంజుతూ కూలవడ్డడు ఆమె పనిల మునిగింది.


పిల్లలు టివి చూడనికె పక్కింటికి పొయ్యిండ్రు. ఆమె వంటచేస్తుంది ఇద్దరూ అన్నం తిని పిల్లల దరికి చేరి టివి చూడనికె ఎల్లిండ్రు అప్పటికే పని ముగించుకొని ఇల్లు చేరిన భారతమ్మ తలకు జండుబాం రాసుకొని మూలుగుతూ కుస్కు కుస్కున దగ్గుతూ మంచంల వొరిగింది. అమె ఆయసపడుతూ తిన్నగా ఊపిరి తీయసాగింది. ఆమె ఇద్దరు పిల్లలు తల్లిని చూడకుండా గుడ్లప్పగించి టీవి చూస్తూ కూలబడిపోయారు అమె ఆలతు జూస్న తులసమ్మ ‘‘ఏందేపొల్లా ఏమైందే పొద్దున బాగనే వుంటివి పొద్దు పుచ్చే యాల్లకు మంచం బట్నవ్‍ ఎట్టుందే తిన్నవా ఏమన్న టిపిని చెయక పోయినావ్‍’’ అంటూ ఆమెను పలకరించింది ‘‘ఒళ్ళంత వొకటే నొప్పులు రేపు ఒక సూది ఏపించుకుంటక్క’’ అంటూ తిన్నగా పలుకుతూ ఊపిరి తీయసాగింది
‘‘ఏందో మాయదారి జరం సూస్త సూస్తనే పట్టుకుంది. ఒళ్ళంత పీల్చి పిప్పి జేసింది’’…
‘‘ఏం జరిగింది పిల్లా జర గా ముచ్చట జెప్పు’’
‘‘చెప్పనికే ఏముందక్క’’
‘‘అదెందే అట్లంటవ్‍’’ అంటూనే అనుమానం తో ఆమెవైపు తీక్షణంగా చూసింది. చంద్రయ్య వుండబట్టలేక నూట నాలుగు కు పోన్‍ చేసిండు
‘‘ఎన్నిరోజులు అయ్యింది సుస్తీ జేసి’’
‘‘సారు నాల్దినాలు అయ్యింది’’
‘‘ఏం పనికి పోతవ్‍’’
‘‘సారు ఇగో ఓ పెద్ద సారు ఇంట్ల పనిజేస్త
అది లంకంత కొంప ఆడా నల్గురు పనొళ్లమున్నం, గాళ్ల దాంట్లో నేనొదాన్ని
అదిసరే ఆయనేం పని జేస్తడు
ఆయనకి పెద్ద పెద్ద యాపారాలు ఉన్నాయ్‍
ఆయినెప్పుడు బయటి దేశాలు తిరుగుతాడు
గీ మజ్జే పోయిండ
పోకేం పోయిండు
మల్ల ఎప్పుడొచ్చినా
అగో గిమజ్జనే ఉగాది ముంగల వోచిండు
వొచ్చినప్పుడు మంచిగానే వుండు గానీ గియ్యన్ని ఇసయాలు ఎందుకడుగుతుంద్రు సారు’’
‘‘అమ్మ ఆ సారూకు కరోనా రోగం అంటుకుంది.’’
‘‘ఎంది’’
‘‘ఆ మేం చెప్పేది నిజం అతనికి కరోనా
అదే నీకు అంటుకుంది’’
‘‘ఏంది సారు మీరనేది’’
‘‘అవునమ్మా, అది సరే ఆ సారు ‘‘ఇల్లు ఎక్కడవుంది’’
‘‘అగ్గో అట్ట కనిపించే పెద్ద బంగ్లా ఆయిన కొడుకు గీమజ్జనే అమెరికా నుంచి వొచ్చే’’ ‘‘కొంపదీసి ఆచినబాబుకు వుందా… వుండే వుంటది.. ముందు నిన్నూ గాంధీ ఆసుపత్రికి చికిత్స కోసం తిస్కపోతం ఆడా ఓనాల్దినలు వుండాలే’’
‘‘సారు నా పిల్లలు’’
‘‘నికేవరు లేరా’’
‘‘లేరు’’
‘‘అది మేం జస్కుంటం’’
కండ్ల నీళ్లు దెచ్చుకొని పిల్లల వైపు ఆశగా చూస్తూ అంది అమ్మ చిట్టీ చెల్లెలు భద్రం అంటూనే మూసుకున్న కళ్ళ మాటున మల్ల నేనొస్తనా నా పిల్లల జూస్తన అండ్లనే సస్తన, సస్తే నా పిల్లలకు దిక్కెవరు ఆళ్లు పసిపొరలు ఎవలు దగ్గరికి రాణిస్తారు. ముదనష్టపొడు తాగుడు మర్సుమంటే ఒకటే తాగి తాగి సచ్చి కుకునే, అట పానంతో వుండపాయే అండ వుండి కొండ పాకాలంటరు, అండలేని మనిషికి నీడ లేని బతుకే ‘‘ అని లోలోన బాధతో నిటూర్చింది కండ్లపొంటి దారగా కన్నీళ్లు కార సాగాయి. ఆమె దుఃఖంతో లోలోపల కుముల సాగింది.


‘‘నువెం పికరు జేయకే పిల్లా ఎట్ట అయ్యేదుంటే అట్ట అయ్యిది. అందరూ అమ్మ అయ్య వున్నొల్లే వున్నారా అంతా భగవంతునికి బారం నారుపోసినొడే నీరు పొస్తడు గానీ దైర్యంగ వుండు’’అంటూ చెమ్మ గిళ్లిన కళ్లతో పలికింది తులసమ్మ
‘‘ఇదుగో చూడమ్మా మీరు ఆ పిల్లల కనిపెట్టుకొని వుండుర్రి. ఏవురు మీది నల్లగొండ దగ్గర చిన్న గూడెం సారు.’’
‘‘అచ్చా అట్లనా
మీరు సిటీ విడిచి పోవద్దు మీరుకూడా ఇంటి పట్టునే వుండాలే బయట తిరుగొద్దు ఇది ఎనకట కలరా, గత్తరా అనీ పిలుస్తారు పేరు మారింది అదే కరోనా రోగం మందులేదు నివారణ ఒక్కటే మార్గం
కూలీనాలీ జేస్కుంటే నోటికింత ముద్ద ఎట్ట బతుకాలే
చూడమ్మా బతికుంటే బలుసాకు తిని బతుకొచ్చు పానం పోతే’’….
ఆమ్మో దీని పీనుగెళ్ళగి మహమ్మారి ఎంత మందిని మింగుద్దో దేష్ట ముండ ఎందర్ని సంపుకటింటడో ఏమయ్యో జర భద్రం గుండాలే తుమ్మితే వస్తదటగి నాల్దినలు బయట తిరుగాకుంట వుండాలంట.
సరెనే…. పిల్లలిద్దరు తల్లివైపు అమాయకంగా చూడసాగారు. ఆమె మొఖం పాలిపోయింది కండ్లు కంతలకు పోయాయి ఒళ్ళు వేడితో సెగలు గక్కుతుంది గొంతులో పట్టరాని ఆయసంతో గునుపు తీస్తుంది ఆ అవుస్త చూస్తున్న పిల్లలు తల్లడిల్లిపోయారు
కొంపదీశి ఇది ఆ రోగమైతే కాదుగా అని అనుమానంతోనే తన పిల్లలను తన దగ్గరికి రాకుండా దూరంగా ఉండుర్రి నాకు అంటుకున్న మహమ్మారి మీకు సోకుతుంది’’ అంటూ తిన్నగా పలుకుతూ చెయ్యితో అసుంటపోరి అన్నట్టుగా సైగ చేసింది. పిల్లలు ఇద్దరు తల్లిని చూసి కళ్ల నీళ్లు తెచ్చుకున్నారు చంద్రయ్య కు సగ కండ్ల నీరు కమ్మింది ‘‘పిల్లలకు తల్లి వుండాలి గాళ్ళ ఎట్లన్న సాకుతది మొగ మనిషి వుంటే ఏం లాభం లొట్టల కొట్కోని లొట్టెడు తాగి కట్టకు పంతరు పిల్లల ఆకలి దప్పులు చూస్తరా పాడా’’ అని లోలోపల నసిగిండు.
ఆంబులెన్స్ వచ్చి బారతమ్మ ఇంటిముందు ఆగింది మాస్కులు ధరించిన నల్గురు కిందికి దిగారు అందులో ఒక డాక్టరు ఇద్దరు స్రెట్చర్‍తో లోనికి వెళ్లి చూశారు. ముందుగా డాక్టరు నర్సు ఇరుగురు వెళ్లి ఆమెకు కరోనా వైరస్‍ ఉందా లేక మరేదైనా ఫ్లూ జ్వరమా అని తేల్చనికే వైరస్‍ గుర్తించే పరికరంతో ఆమెను ప్రాథమిక టెస్టు చేశారు. ఆమెకు కరోనా సోకినట్టు నిర్దారనైంది పిల్లలకు చూశారు వారికి లేదు వారిని ఇంటిపట్టున్నే ఉండమని బైటికి వెళ్లొద్దని చెప్పి చంద్రయ్యను వారిని కనిపెట్టమని చెప్పి ఆమెను గాంధీ హాస్పిటల్కు తరలించారు. పనిలో పనిగా పక్కిళ్లు కావడం చేత కూలినాలి చేసి బతుకుతున్న చంద్రయ్య , తులసమ్మలకు వారి పిల్లలకు చుట్టుపక్కలవారికి టెస్టులు చేసి లేదని నిర్దారించుకుని ‘‘మీరు మటుకు పద్నాలుగు రోజుల పాటు బయటికి రాకుండ ఇంటిపట్టున్నే ఉండమని చెప్పి వెళ్లిపోయారు
ఆమెను ఆసుపత్రికి తీసికొని పోతుంటే పిల్లలు గైయ్యిమంటూ ఒక్కసారిగా ఏడుపందుకున్నరు. చంద్రయ్య వారిని దగ్గరకు తీసికొని ఊకుంచ సాగిండు. పిల్లలు బిక్కుబిక్కుమంటు ఆ రాత్రంతా గడిపారు వారికి తులసమ్మ చంద్రయ్యలు అండగుండి తమ పిల్లలుగా తలచి బరోసానిస్తూ నాలుగు ధైర్యం మాటలు పలికారు.
విధి విచిత్రమైంది అది బలియమైంది దాని ముందు మనిషి ఆటలు సాగవు బారతమ్మను తీసుకెళ్లిన మూడ్రోజులకే చనిపోయింది హాస్పత్రి సిబ్బందే ఆమెకు దహన సంస్కారం చేశారు
పిల్లలిద్దరు అనాదలయ్యారు తల్లిదండ్రి లేక అయినవారు లేక నా అన్న దిక్కు దాపు లేక తోడుకోసం ఎతకసాగారు వలసకూలీలైన తులసమ్మ, చంద్రయ్యలు వారిని అక్కున చేర్చుకొని ఆ పిల్లల పాలిట ఆశాదీపమయ్యారు.


భూతం ముత్యాలు
ఎ : 9959546780

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *