2018 నవంబర్ 13వ తారీఖున ఆచార్య రావుల సోమారెడ్డి మరణంతో తెలంగాణ ఒక ప్రముఖ చరిత్రకారుణ్ణి కోల్పోయింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కుగ్రామంలో రైతు కుటుంబంలో 1943లో జన్మించిన ఆయన అంచెలంచెలుగా ఎదిగి ఉస్మానియా యూనివర్సిటి నుండి యం.ఏ., పి.హెచ్.డి డిగ్రీలను పొందినాడు. ఆ తర్వాత 1970లో యూనివర్సిటీ లెక్చరర్‍గా జాయిన్ అయి మూడు దశాబ్దాలకు పైగా రీడర్, ప్రొఫెసర్, చరిత్ర శాఖ అధిపతిగా పనిచేసి విశేష అనుభవాన్ని గడించినాడు. మధ్య యుగాల ఆంధ్రదేశ సామాజిక, సాంస్కృతిక చరిత్రలో ప్రత్యేక పరిశోధనలు చేసి అనేక గ్రంధాల్ని రచించినాడు. ఆయన తన సిద్ధాంత వ్యాసం హిందూ, ముస్లిం మత సంస్థలు (క్రీ.శ. 1300-1600) పుస్తకాన్ని ప్రచురించి, విషయ నిపుణుడుగా ప్రసిద్ధి చెందినాడు. భారతదేశ చరిత్రలో మధ్యయుగాల చరిత్ర ప్రాధాన్యతను, బహమని, విజయనగర, కుతుబ్‍షాహిల పాలనా కాలాల నాటి రాజకీయ, ఆర్థిక, సాంఘిక, మత, సాంస్కృతిక, ఆధ్యాత్మిక అంశాల్ని నూతన కోణంలో విశ్లేషించి సృజనాత్మక లౌకిక వాద చరిత్రకారునిగా పేరుపొందినాడు. సామ్రాజ్యవాద, జాతీయ, మతతత్వ రచనా ధోరణుల్ని విమర్శనాత్మకంగా పరిశీలించి విలువైన పరిశోధనా గ్రంధాల్ని రచించినాడు. భారతదేశ మరియు ఆంధ్రదేశ చరిత్రను మత ప్రాతిపదికమీద కాకుండా శాస్త్రీయంగా, హేతుబద్ధంగా విశ్లేషించి మధ్య యుగాల నాటి హిందూ – ముస్లిం మత సంస్థలు, వాటి ప్రాముఖ్యతల్ని సోదాహరణంగా విశదీకరించి భావితరాల చరిత్రకారుల్ని ప్రభావితం చేసిన ఘనత సోమారెడ్డికి దక్కుతుంది.
మధ్యయుగ ఆంధ్రదేశాన్ని పాలించిన బహమని, విజయనగర, రెడ్డి, వెలమ, కుతుబ్‍షాహిల కాలంనాటి సామాజిక, సాంస్కృతిక, మత పరిస్థితుల్ని కూలంకశంగా చర్చించి అనేక నూతన అంశాల్ని ప్రామాణిక గ్రంథాలాధారంగా వెలికి తీసి హిందూయిజం, ఇస్లాం మతాల మధ్య నెలకొన్న సుహృద్భావం, అన్యోన్యతల్ని తన పరిశోధనా గ్రంథంలో వివరించినాడు. దేవాలయం, మఠం హిందూ మతంలో ప్రముఖ పాత్ర వహించినట్లే, మసీదు, కాన్‍ఖా, దర్గా, ఆషుర్‍ఖానాలు ఇస్లాం మతంలో కీలక పాత్ర వహించిన తీరుతెన్నుల్ని, దైనందిన సామాజిక రంగంలో వాటి పాత్రను నిష్పక్షపాతంగా వివరించినాడు. మధ్యయుగ ఆంధ్రదేశంలో (రాయలసీమ, కోస్తాంధ్ర, తెలంగాణ) ప్రాంతాల్లో మిశ్రమ సంస్కృతి విలసిల్లి, పరిణామం చెందిన విధానాన్ని విశ్లేషించి, లౌకికవాద సైద్ధాంతిక, భావజాల వ్యాప్తిని గురించి విపులంగా ఈ గ్రంథంలో చర్చించడం జరిగింది. ఉదాహరణకు, విజయనగరరాజులు మత పరంగా హిందువు లైనప్పటికి, సూఫీ మతాన్ని ఆదరించి ముస్లిం మత సంస్థలకు దానాలిచ్చినారు. అదే విధంగా బహుమని, కుతుబ్‍షాహి రాజులు ఇస్లాంను ఆచరించినప్పటికి హిందు మతసంస్థలకు అగ్రహారాలకు దానాల్చిన తీరును వివరించి రాజకీయ, పౌర సమాజాల్లో మత సామరస్యం విలసిల్లిన క్రమాన్ని హేతుబద్దంగా వివరించడం జరిగింది.
మధ్యయుగాల్లో ఆంధ్ర దేశ సమాజంలోని రెండు ప్రధాన మతాలైన హిందూయిజం, ఇస్లాం, సూఫీయిజంలు, వారి మత సంస్థల నిర్మాణం, సమాజంలో వాటి పాత్ర, రాజాదరణ, ప్రభుత్వానికి మతసంస్థలకు మధ్య నెలకొన్న సంబంధాలు, ఏ విధమైన మార్పులకు గురైనాయి అనే అంశాల్ని బేరీజు వేసి లౌకిక చరిత్ర రచనకు ఆచార్య సోమారెడ్డి పునాదులు వేసినాడు. మిశ్రమ సంస్కృతి కొనసాగడానికి దోహదపడిన మత, ధార్మిక, ఆధ్యాత్మిక అంశాలైన ఉత్సవాలు, తిరునాళ్ళు, ఉర్సులు, మొహర్రంల పాత్రను, మతసామరస్యం సహజీవనం కొనసాగిన తీరును సోదాహరణంగా వివరించడం జరిగింది. తన మూడు దశాబ్దాల ఎకడమిక్ జీవితంలో ఆయన డజన్‍కుపైగా పుస్తకాల్ని, 50కి పైగా పరిశోధనా వ్యాసాల్ని రచించినాడు. వాటిలో ముఖ్యంగా మధ్యయుగ ఆంధ్రదేశంలో మత పరిస్థితులు, సంస్థలు, Hindu-Muslim Religions Institutions, Agrarian Conditions in pre-colonial Andhra Desa, Socio-Economic Conditions in Medieval Andhra Desa, Industries in pre-colomial Andhra Desa పేర్కొనదగినవి.
1970-80 దశకాల్లో జాతీయ వాద దృక్పథంతో చరిత్ర రచనలు ప్రధానంగా రాజులు యుద్ధాలు, రాజకీయ పాలనా అంశాల్ని మాత్రమే పేర్కొన్నాయి. దానికి భిన్నంగా ఆచార్య సోమారెడ్డి మధ్యయుగ ఆంధ్రదేశంలోని సామాజిక సాంస్కృతిక, ఆర్థిక చరిత్రను రచించినాడు. ప్రధానంగా ఆంధ్రదేశంలో వ్యవసాయ సంబంధాలు, భూస్వామ్య వ్యవస్థ, వెట్టిచాకిరి విధానం, వర్తకవాణిజ్యాల వ్యాప్తి, చేతివృత్తులు, పరిశ్రమల స్థాపన, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కుటీర పరిశ్రమలు, మధ్య యుగాల నాటి వలసలు వాటి ప్రభావం ఉత్పత్తి, కులాలు, వాటి ప్రాధాన్యత, సూఫీయిజం, భక్తి ఉద్యమాల ప్రభావం, మిశ్రమ సంస్కృతి ఆవిర్భావం, పరిణామం లాంటి అంశాలపై విశేషంగా పరిశోధనలు జరిపిన ఘనత సోమారెడ్డికి దక్కుతుంది. ఉస్మానియా చరిత్ర శాఖ అధిపతిగా యూనివర్సిటి గ్రాంట్స్ కమిషన్, న్యూఢిల్లీ నుంచి పలు పరిశోధనా ప్రాజెక్టులను చేపట్టి 1994-2003 వరకు జాతీయ అంతర్జాతీయ సదస్సులను నిర్వహించినాడు. ఆయన హయాంలో నిర్వహించిన సెమినార్స్ ప్రొసీడింగ్స్ను ప్రచురించి జాతీయ అంతర్జాతీయ గుర్తింపును పొందినాడు. చరిత్రశాఖలో బోధనతో పాటు ఆయన పరిశోధనా గైడ్‍గా వ్యవహరించి అనేక యం.ఫిల్, పియచ్‍డి సిద్ధాంత వ్యాసాల్ని తయారు చేయించినాడు. ప్రసిద్ధ పరిశోధకుడిగా సోమారెడ్డి ప్రాంతీయ నాగరికత, సంస్కృతి పరిణామ క్రమాన్ని పరిశీలించడంలో భిన్న మతాలు, సంస్కృతులు, సామాజిక ఆర్థిక వ్యవస్థలు, విభిన్న జాతులు, ఆచార సంప్రదాయాలు ఏ విధంగా తోడ్పడినాయి అనే అంశాల్ని హేతుబద్ధంగా వివరించినాడు. మధ్యయుగ ఆంధ్రదేశంలో మిశ్రమ, లౌకిక సంస్కృతి విలసిల్లిన తరుణంలో ఆర్థిక సంబంధాల ప్రాముఖ్యత, సామాజిక చలనం, సామాజిక మార్పులకు దోహదపడిన శక్తులు వాటి ప్రాముఖ్యతను, ప్రభావాన్ని శాస్త్రీయంగా, ఆధారసహితంగా విశ్లేషించడం ఆయన ప్రత్యేకత అని చెప్పవచ్చును. ప్రస్తుత పరిస్థితుల్లో హిందూత్వవాదులు భారత దేశ చరిత్ర, సంస్కృతుల్ని ప్రధానంగా మధ్యయుగాలకు సంబంధించిన అనేక అంశాల్ని వక్రీకరించడం జరుగుతుంది. ఈ తరుణంలో ఆచార్య సోమారెడ్డి రచనలు ఆంధ్రదేశ సమాజంలో మతసంస్కృతి, ఆచార వ్యవహారాల పాత్రలపై లోతైన పరిశోధన జరిపి హేతుబద్ధంగా చరిత్ర రచన చేసి యువ చరిత్రకారులకు ఆదర్శంగా నిలిచినాయని చెప్పవచ్చును.
ఆచార్య సోమారెడ్డి ప్రతిభను గుర్తించి భారత ప్రభుత్వం ఆయన్ని ఇండియన్ హిస్టారికల్ రికార్డ్సు కమిషన్ సలహా సంఘం సభ్యునిగా నియమించింది. అదే విధంగా ఉస్మానియా యూనివర్సిటీలో ఆర్టస్ కళాశాల ప్రిన్సిపాల్, చీఫ్‍వార్డెన్ లాంటి అనేక ఉన్నత పదవుల్ని చేపట్టి పలువురి ప్రశంశల్ని పొందినాడు. ఇండియన్ హిస్టరీ, సౌత్ ఇండియన్ హిస్టరీలలో క్రియాశీలక పాత్ర నిర్వహించి పలు పరిశోధనా పత్రాల్ని సమర్పించాడు. అకడమిక్, అడ్మినిస్ట్రేటివ్ రంగాల్లో తనవంతు పాత్రను నిర్వహించి ఉస్మానియా యూనివర్సిటీకి పేరు ప్రఖ్యాతులు తెచ్చినాడు.
-అడపా సత్యనారాయణ