చంద్రవదనకో చందన తాంబూలం ‘అధికమెట్టు’

మాహ్‍ లఖా బాయి జననమే ఒక వింత కత. ఆమె తల్లి ఆరు నెలల గర్భవతిగా మౌలాలీ దర్గా సందర్శనానికి మెట్లు ఎక్కుతున్నప్పుడు ఆ కష్టం భరించలేక గర్భవిచ్చిత్తి జరిగే సూచనలు కనిపించినై. అప్పుడు ఆమె భర్త పరిగెత్తి దర్గా దగ్గరికి వెళ్లి మొక్కుకుని ప్రసాదాన్ని తెచ్చి ఆమెకు తినిపించగానే ప్రమాదం తప్పిపోయి నెలలు నిండిన తర్వాత ఆడపిల్లను కనింది. ‘‘చాంద్‍ కా తుక్‍డా’’ లా ఉందని చాంద్‍ బీబీ పేరు పెట్టారు.
అట్లాంటి ఆ చంద్రవదన రెండు వందల ఏళ్ల క్రితం దానం చేసిన తన జాగీరు భూములే భాగ్‍లింగంపల్లి, కోరంటి, అడిక్‍మెట్‍, ఉస్మానియా యూనివర్సిటీ, ఇఫ్లూ, మౌలాలీ ప్రాంతాలు. ఆమె పూర్తిపేరు ‘‘మాహ్‍ లఖా బాయి చందా’’. ఉర్దూలో మాహ్‍ అంటే చందమామ. లఖా అంటే ముఖం. కవయిత్రిగా ఆమె కలం పేరు చందా. ఆమె కథ ఈ కథ చివరలో చెప్పుకుందాం.


నాల్గువందల ఏండ్ల క్రితం ‘‘భాగ్‍ లింగంపల్లి’’ కుతుబ్‍షాహీల కాలంలో దట్టమైన చింతచెట్లు ఉన్న అడివి ప్రాంతం. అది నవాబుల వేసవి విడిది. అక్కడ విడిది చేసిన నవాబులు, అమీరులు జింకలను వేటాడేవారు. అంతెందుకు ఒక అరవై సంవత్సరాల క్రితం వరకు మా చిన్నప్పుడు అక్కడ పెద్ద చింతలతోపు ఉండేది. పట్టపగలే పలుచని చీకట్లు కమ్ముకుని ఉండేవి. సాయంత్రం అయ్యేసరికి అది తాగుబోతులకు, తిరుగుబోతులకు అడ్డాగా మారేది. పోలీసులు పెద్ద టార్చిలైట్లు పట్టుకుని గాలింపులు, వేధింపులు జరిపేవారు. ఆ తర్వాత అక్కడ హౌజింగ్‍ బోర్డు కాలనీ ఏర్పడగానే ఆ జింకల వనం కాస్తా జనారణ్యంగా మారిపోయింది.
‘‘జమానా బదల్‍ గయా’’. కుతుబ్‍షాహీల కాలం నాటి ఆ ‘‘బాగ్‍’’ఇప్పుడు సుందరయ్య పార్కుగా మారిపోయింది.
బాగ్‍లింగంపల్లికి ఎడమవైపు ఇప్పుడు సూర్యనగర్‍ బస్తీ ఉంది. యాభై ఏండ్ల క్రితమే అప్పటి కమ్యూనిస్టు పార్టీ నాయకులు రాజ్‍బహద్దూర్‍గౌర్‍, జువ్వాద్‍ రజ్వీ, క్రిష్ణమూర్తిలు ఆ ప్రభుత్వ స్థలాలలో గుడిసెలు వేసి వారు కూడా స్వయంగా అక్కడే ఆ పేదలతో పాటు నివసించారు. రాజ్‍బహద్దూర్‍గౌర్‍ ఇంటి మీదున్న పేరు ‘‘చంబేలీ కే మండ్వే’’ అనగా మల్లె పందిరి అని అర్థం. ఆ ఇంటి పేరుతోనే మగ్దూం మెహియుద్దీన్‍ ‘‘దో బదన్‍’’ హిందీ సిన్మాకు ఒక పాట రాసాడు. ప్రముఖ హిందీ నటి షబనా ఆజ్మీ బాల్యం కొంత కాలం ఈ బస్తీ గల్లీలల్లనే గడిచింది. ఆ రోజులలో అది కమ్యూనిస్టుల కాలనీ.


సూర్యనగర్‍ రోడ్డు దాటగానే చిక్కడ్‍పల్ల్లి. చిక్కడ్‍ అనగా బురద. బంజారాహిల్స్లో కురిసిన జోరు వానలు వాగులుగా వరదలుగా క్రిందికి ప్రవహించి హుస్సేన్‍ సాగర్‍లో కలిసి కట్ట మీది నీళ్లు క్రిందికి మత్తడిగా దుంకితే లోతట్టు ప్రాంతం చిత్తడిగా మారి చిక్కడ్‍పల్లి ఐపోయింది. ఒకప్పుడు అక్కడి నివాసులందరూ గొల్లలే. అడుగు తీసి అడుగేస్తే పాదాలు ఆ అడుసులో కూరుకుపోయేవి. ఆ బురదలో కసబిసా తిరుగుతున్న బర్రెలతో ఆ ప్రాంతం ‘‘క్షీర సాగరం’’లా వర్థిల్లింది. ఆ పంకిలంలో వెలసిన పద్మాలే ఈనాటి మన త్యాగరాయగాన భవనం, సిటీ సెంట్రల్‍ లైబ్రరీలు. ఆ చిక్కడ్‍పల్లి బురదలో బర్రెనెక్కి అల్లరల్లరిగా తిరిగి లల్లాయి పదాలు పాడిన ఒక బాలకుడు తర్వాత కాలంలో ప్రముఖ కార్మిక నాయకుడు, కమ్యూనిస్టు నాయకుడుగా మారినాడు. అతని పేరు సత్యనారాయణరెడ్డి. ప్రస్తుతం హిమాయత్‍నగర్‍లోని కమ్యూనిస్టుపార్టీ భవనం మీద ఇతని పేరును మనం చూడవచ్చు. లులాయం అంటే సంస్కృతంలో దున్నపోతు అని అర్థం. దానిమీద కూచుని పాడే పాటలకే లల్లాయి పదాలు అని పేరు వచ్చింది.


బాగ్‍లింగంపల్లికి కుడివైపు ఉన్నదే మన కోరంటి దవాఖానా. దాని అసలు పేరు క్వారంటైన్‍ హాస్పిటల్‍. నైజాముల కాలంలో తెల్లదొరలు స్థాపించిన ‘‘ఉష్ణమండల వ్యాధుల పరిశోధనా కేంద్రం’’ అది. 1930లలో నగరంలో ప్లేగు వ్యాపించినప్పుడు రోగులందర్నీ అక్కడే నిర్బంధించేవారు. అదే క్వారంటైన్‍. ఆ పేరు పలకరాక పామరులు దానిని ‘‘కోరంటీ’’ అని పిలిస్తే పండితులమైన మనం కూడా అలవాటు పడి కోరంటి అనే అంటున్నాం.
ఆ సడక్‍ మీద సీదాగా వెళ్లితే అడిక్‍మెట్‍ ఏరియా వస్తుంది. దాని అసలు పేరు నవాబుల కాలంల అధిక మెట్ట. పూర్తిగా ఛడావ్‍ అంటే ఎత్తైన ప్రాంతం. తెల్లదొరలకు నోరు తిరగక, అధికమెట్ట అనలేక అడిక్‍మెట్‍ అనంగనే ఆ పదాన్నే మనం ఈనాటి వరకు పట్టుకుని వేలాడుతున్నాం. మక్కీకి మక్కీ, లిఖిర్‍ కే ఫకీర్లం మనం. ఈ అధిక మెట్టలోని ఒక భాగమే నేడు మనం చూస్తున్న ఉస్మానియా యూనివర్సిటీ మరియు ఇనిస్టిట్యూట్‍ ఆఫ్‍ ఫారిన్‍ లాగ్వేంజెస్‍లు. ఈ రెండింటి సమీపంలో ఉన్న మాణికేశ్వరనగర్‍ బస్తీ పూర్తిగా వడ్డెరుల బస్తీ. వందేళ్ల క్రితం యూనివర్సిటీ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలందరూ ఈ వొడ్డెరోళ్లే. హైద్రాబాద్‍ నగరం అంతా దక్కన్‍ పీఠభూమికి తలమాణికం గనుక రాళ్లకేం కొదువ? కొండలు పగిలేసినం అన్నట్లు శంషాబాద్‍ దగ్గరున్న గగన్‍పహాడ్‍ను తవ్వి ఆ రాళ్ళను ఎడ్లబండ్ల మీద తెచ్చి ‘అధికమెట్ట’ను అధిగమించి ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని నిర్మించిన ఘనత ఈ మాణికేశ్వరినగర్‍ వొడ్డరులదే! మయసభను నిర్మించిన వారి వారసులు వీరేనేమో!


యూనివర్సిటీ దాటంగనే కుడివైపు తార్‍నాక మరియు హబ్సీగూడ. ముళ్లకంచెను ఉర్దూలో తార్‍ అంటారు. నాకా అంటే పోలీస్‍స్టేషన్‍. అట్లా తార్నకా పేరు వాడుకలోకి వచ్చింది. నైజం కాలంల అబిసీనియా (ఇథోపియా) దేశం నుండి వచ్చిన వారిని హబ్సీలు అనేవారు. ఆ రోజులలో వారు నివసించే బస్తీనే నేటి హబ్సీగూడ. సరే ఇక ఈ ‘‘యాదోం కీ బారాత్‍’’ను వదిలిపెట్టి అసలు సంగతిలకు దిగుత.
ఉస్మానియా యూనివర్సిటీ నుండి ముక్కుసూటిగ పోతే మౌలాలీ దర్గా చేరుకుంటాం. పహాడీ షరీఫ్‍, జాహంగీర్‍ పీర్‍ దర్గా లాగే ఈ మౌలాలీ దర్గా కూడా ముస్లింలకు పవిత్ర స్థలం. మాహ్‍ లఖాబాయి జననమే ఒక వింత కథ అని ఆ కథను ప్రారంభంలోనే ప్రస్తావించాను కదా! చందా తల్లిరాజ్‍ కన్వర్‍బాయి. రాజపుత్ర వనిత. ఆమె ప్రభువుల కొలువులో ఆస్థాన నర్తకి. ఆమె తాజ్‍ అలీ షా ముస్లింను వివాహం చేసుకుంది. విచిత్రంగా అతను చిత్రకారుడు మరియు చరిత్రకారుడు కూడా! చందా మేనమామ సైన్యాధికారి, తల్లితండ్రులకు ఆమె ఏకైక సంతానం. అయితే నేం ‘‘లాఖోం మే ఏక్‍ హై’’. తల్లి, తండ్రి, మేనమామల ప్రతిభలకు ఆమె ప్రతిబింబమయ్యింది.
అహమ్మద్‍ నగర్‍, బీజాపూర్‍లను పరిపాలించిన ముస్లిం రాణిపేరు చాంద్‍బీబీ (1550-1599) అనేక యుద్ధాలు చేసిన వీరవనిత. బహుభాషావేత్త. సితార్‍ వాయించేది. చిత్రలేఖనం ఆమె అభిరుచి. మహాలఖా తల్లితండ్రులు తమ కూతురు చాంద్‍బీబీలా ఉండాలని ఆ పేరు పెట్టుకున్నందుకు ఆమె సార్థక నామధేయు రాలయ్యింది.


పదహారు సంవత్సరాలకే ఆమె సంగీత, సాహిత్య నృత్య, గానాలలో గొప్ప విదుషీమణి అయ్యింది. రెండవ నిజాం అలీఖాన్‍ దర్బారులో ఆస్థాన నర్తకిగా (తవాయిఫ్‍) 1802లో రంగ ప్రవేశం చేసి అతని మనస్సును గెలుచుకుంది. సుగంధానికి సువర్ణం పూసినట్లు లలిత కళలలోనే గాక యుద్ధకళలైన విలువిద్య, గుర్రపు స్వారీలలో కూడా ఆమె ప్రవీణురాలు. పురుషసైనికుడుగా వేషం ధరించి నవాబుతో పాటు ఆమె యుద్ధరంగాలకు వెళ్లేది. చిత్రలేఖనం, పుస్తక పఠనం ఆమె అభిమాన కాలక్షేపాలు. నిండుపున్నమిలో పండువెన్నెలలా కళాత్మకంగా, రసాత్మకంగా జీవించింది. ఒక నవాబు గారే గాక మహారాజా చందూలాల్‍, మీరాలం, అరస్తు జా, సర్‍ జాన్‍ మాల్కం లాంటి వారెందరో ఆమె కటాక్ష వీక్షణాల కోసం ‘‘షమా చుట్టూ తిరిగిన పర్వానాలే’’ (దీప శిఖ చుట్టూ తిరిగిన శలభాలు).
హమ్‍ సోఁచ్‍తే థే హమ్‍ హీ చాహ్‍తే హైఁ ఆప్‍కో
మగర్‍ ఆఫ్‍ కో చాహనే వాలోఁకా కాఫిలా నిక్‍లా
సోచ్‍తా హుఁ ఖుదాసే షికాయత్‍ కరూఁ
క్యాకహేఁ ఖుదాభీ ఆప్‍కో చాహనే వాలానిక్‍లా

‘‘నేనొక్కడినే నిన్ను ప్రేమిస్తున్నాననుకున్నా
కాని నిన్ను ప్రేమించేవాళ్లు కోకొల్లలు.
అల్లాతో మొర పెట్టుకుందామనుకున్నా
అయ్యో ఏం చెప్పను! ఆ అల్లా సహితం నిన్ను ప్రేమించేవాడే’’
ఆమె అందాన్ని మెచ్చి నిజాం నవాబు ‘‘మాహ్‍ లఖా’’ అను బిరుదు ప్రసాదించాడు. అనగా చంద్ర వదన’’ అని అర్థం. ఆమె కవిత్వం రాసేది. ఆమె ‘‘తఖల్లుస్‍’’ (కలంపేరు) ‘‘చందా’’. అట్లా అమె పూర్తిపేరు మాహ్‍ లఖా బాయి చందాగా మారింది. ఆమె కవితల సంకలనం పేరు ‘‘దివాన్‍’’. మొత్తం భారతదేశంలోనే మొదటిసారి ఉర్దూ కవియిత్రిగా పుస్తకం ప్రచురించిన ఘనత ఆమెదే.


ఆమె జీవితకాలం 1767-1824. ఆమె కళావతి మాత్రమే గాక విద్యావతి కూడా. ఆమె నివాసం సరస్వతి సన్నిధానం. తన ఇంట్లోనే ఒక పెద్ద గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసుకుంది. దక్కన్‍ చరిత్ర రాయటానికి ఒక చరిత్రకారుల బృందాన్ని నియమించింది. అనేక మంది పేద రచయితలకు, కవులకు, కళాకారులకు ఆర్థిక సహాయాలను అందచేసేది. ఫార్సీ, అరబ్బీ గ్రంధాలను ఉర్దూలోకి తర్జుమా చేయిం చింది. రెసిడెన్సీ ప్రేమకథకు నాయికా, నాయకులైన ఖైరున్నిసా, కిర్క్పాట్రిక్‍లకు ఈమె దగ్గరి స్నేహితురాలు.
ఆ విదుషీమణి అంద చందాలకు, తెలివి తేటలకు నిజాం గులాంగా మారి ఆ ‘‘చంద్రవదన చందన తాంబూ లాల ఖర్చు’’ కోసం ఒక జాగీరును మంజూరు చేశాడు. అదే బాగ్‍లింగంపల్లి నుండి మౌలాలీ దాకా ఆమె జాగీరు ప్రాంతం. ఆ భూములన్నీ ఆమె దానం చేసినందునే తర్వాత కాలంలో ఒక సుందరయ్య భవన గ్రంథాలయం, ఆంధ్ర మహా విద్యాలయం, యూనివర్సిటీ, సీఫెల్‍, ఆర్కైవ్స్ లాంటివి ఏర్పడినాయి. ఆమె సమాధి మౌలాలీ దర్గా గుట్ట క్రింద ఒక అందమైన పూదోటలో ఉంది. ఆమె వర్ధంతి నాడు ప్రతి ఏటా అక్కడ ‘‘మహెఫిల్‍ – ఏ – సమా’’ ముషాయిరా జరుగుతుంది. సంగీత నృత్యకార్యక్రమాలు కూడా జరుగుతాయి. నగరంలోని దివానా – పర్వానాలందరు ఆ దినం ఆమెను ‘‘యాది’’ చేసుకుంటరు.


ప్రముఖ జర్నలిస్టు జి.కృష్ణగారు ఒక ఆదివారం ఆబిడ్స్ ఫుట్‍పాత్‍పై పాతపుస్తకాలు వెదుకుతుంటే మహాలఖా స్వదస్తూరితో ఒక గ్రంథం కనబడిందట. దాని ధర చాలా ఎక్కువగా ఉండేసరికి ఇంటికి వెళ్ళి డబ్బులు తెచ్చేసరికి ఆ పుస్తకాన్ని ఎవరో పుస్తక ప్రియుడు పట్టుకపోయాడని తన ‘‘విలేఖరి లోకం’’ పుస్తకంలో వాపోయాడు.
దీపశిఖలాంటి తన సౌందర్యంతో హైద్రాబాద్‍ నగరాన్ని రగిలించి వెలిగించిన ఈ విదుషీమణి ప్రస్తుతం గాలి కూడా సడిచేయని, ఆకు కూడా కదలని ఆ నిశ్శబ్ద వాతావరణంలో ఆ పూదోటలో పెను విశ్రాంతిలో ఉంది. కృతజ్ఞతగా ఎప్పుడైనా వెళ్లి అశ్రుసిక్త నయనాలతో ఆమె సమాధిపై ‘‘గుప్పెడు గులాబీలను’’ నివాళిగా అర్పించండి.
కిర్గీజ్‍స్థాన్‍ ఒకప్పుడు సోవియట్‍ యూనియన్‍లో ఒక రిపబ్లిక్‍. 1990లో దానికి స్వాతంత్య్రం వచ్చాక రాజధాని అలాతూ స్క్వేర్‍లో లెనిన్‍ విగ్రహాన్ని తీసేసి వారి జాతీయ రచయిత చెంఘీజ్‍ ఐత్‍ మాతోవ్‍ విగ్రహాన్ని స్థాపించుకున్నారు. మరి మనం కూడా భాగ్‍లింగంపల్లి లోని సుందరయ్య పార్కు పేరును తొలగించి ‘‘మాహ్‍ లఖాబాయి చందా చమన్‍’’ అని కొత్త పేరు పెట్టుకుందామా?


(షహర్‍ నామా (హైద్రాబాద్‍ వీధులు – గాథలుపుస్తకం నుంచి)
-పరవస్తు లోకేశ్వర్‍,
ఎ: 91606 80847

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *