నులక చందయ్యలు

తెలంగాణ జానపద కళారూపాల్లో ఆశ్రిత జానపద కళారూపాల సంస్కృతి ప్రత్యేకమైనది. ఎందుకంటే ఈ కళారూపాలు ఒక కులాన్ని మాత్రమే ఆశ్రయించి ప్రదర్శిస్తాయి. ఆయా కళారూపాల కళాకారులను వృత్తి గాయకులు, భిక్షుక గాయకులు, ఉపకులాలు, ఆశ్రిత గాయకులు, పూజారులు, కుల గురువులు అనే పేరుతో జానపద పరిశోధకులు వ్యవహరిస్తున్నారు. ఈ కళారూపాలను పోషించే కులాలను పోషక కులమని, ప్రధాన కులమని, దాతృ కులమని అంటున్నారు. ఈ రకంగా ప్రతి కులానికి ఒక ఆశ్రిత కళారూపం నిర్మించబడి మనుగడ సాగిస్తున్నాయి. ఇదంతా ఏదో ఒకరోజు లేదా ఈ ఒక్క సంవత్సరంలో జరిగిన పక్రియ కాదు. జానపద సమూహం తమ మనుగడ కోసం తమ వంశోత్పత్తి మూల పురుషున్ని కీర్తించడానికి, తమ మూల సంస్కృతిని మననం చేసుకోవడానికి ఒక నియమిత వ్యవస్థను సృష్టించుకొని దాన్నే ఆచారంగా కొనసాగిస్తూ, ఒక వ్యవస్థ రూపకల్పన కు దారి తీసి ఉండొచ్చు. అందుకే ఆయా ఆశ్రిత కళారూపాల కళాకారులను పోషక కులానికి ఏ రకంగా మీరు హక్కుదారులు అయ్యారంటే,తమ పుట్టుకకు కారణమైన ఒక మౌఖిక కథను వినిపిస్తారు.ఆ కథను బట్టి ఒకప్పుడు పోషక కులంలోని అన్నదమ్ముల్లో, వీరు ఒకరైనప్పటికీ శాపం కారణంగా వేరుపడి, ఆ కులాన్నే ఆశ్రయిస్తూ, ఆ వంశం మూల పురుషున్ని కీర్తించే వృత్తిని స్వీకరించినట్లు కనిపిస్తుంది. మరికొన్ని కథల్లో పోషక కులం యొక్క మూల పురుషున్ని రక్షించడం కోసం సమయానికి పుట్టి ఆ తర్వాత ఆ కులానికే ఆశ్రితులు గా మారినట్లు కనిపిస్తుంది. మరి కొన్ని కథల్లో ఒకప్పుడు పోషక కులానికి గురువులుగా, పూజారులుగా వ్యవహరించిన వారే ప్రస్తుతం ఆ కులానికే ఆశ్రిత గాయకులుగా స్థిరపడి వారి దగ్గర హక్కులు కలిగి ఉన్నారు. ఈ రకంగా కుల గురువులుగా, పూజారులుగా వ్యవహరిస్తూ మాదిగ వారికి జాంబ పురాణాన్ని పఠనం చేసే సంప్రదాయం కలిగిన వారే నులక చందయ్యలు.
మాదిగ వారికి ఉండే ఆశ్రిత కళారూపాల్లో నులక చందయ్యలే కాకుండా బైండ్ల, డక్కలి, మాష్టి, చిందు అనే కళారూపాలు కూడా ఉన్నవి. కానీ ఇందులో గురు సంప్రదాయాన్ని పాటిస్తూ పురాణాన్ని కథాగానం చేసే పక్రియ కలిగిన వారు నులక చందయ్యలు.


నులక చందయ్యల పుట్టుక:  
నులక చందయ్యల కళాకారులైన మిరియాల రాజ వీరయ్య గారు, మిరియాల భాస్కర్‍ గారు చెప్పిన కథనం ప్రకారం జాంబవ పురాణాన్ని బట్టి అనంత, అద్భుత, తమంజ, తారజ, భిన్నజ, భిన్నాయక, అవయుక్త, అమంద, యుక్త, మహీరణ, విశ్వావసు, మాణ్యీరణ, విశ్వరాణా, అలంకృత, కృత, త్రేతా, ద్వాపర, కలియుగ అనే పద్దెనిమిది యుగాలు వర్ణించబడ్డాయి. ఇందులో జాంబవంతుడు సృష్టిలో భూమి, ఆకాశం, సూర్యచంద్రులు, నక్షత్రాలు ఏమీ లేని సమయంలో మొదటి యుగమైన అనంతా యుగంలో పవిత్రమైన శంఖం నుండి జన్మిస్తాడు. ఆయన పుట్టిన తర్వాత తామరాకులను సింహాసనంగా చేసుకుని తపస్సు చేస్తుంటాడు. ఈ రకంగా కొన్ని యుగాలు గడిచిపోయిన తర్వాత కళ్ళు తెరిచి చూసేసరికి భూమి ఆకాశం సూర్యచంద్రులు సృష్టి జరిగి, త్రిమూర్తులు జన్మించి బ్రహ్మకు బ్రహ్మలోకం, విష్ణువుకు వైకుంఠం, శివునికి కైలాసం ఏర్పడి త్రిమూర్తులకు కూడా పెళ్లిళ్లు జరిగిపోతాయి. అలాగే దేవతలకు బృహస్పతి రాక్షసులకు శుక్రాచార్యుడు గురువుగా ఉండి ముహూర్తాలు చూడడం, పెళ్లిళ్లు చేయడం జరుగుతుంది. అప్పుడు జాంబవంతుడు సృష్టిలో అందరికంటే ముందు జన్మించిన నాకే గురువు లేక పెళ్లి లేకుండా ఉన్నానని శివుని గురించి తపస్సు చేయగా, శివుడు సత్య వంతుడైన సహస్ర మహామునిని గురువుగా స్వీకరించమని చెప్తాడు. ఆ ప్రకారంగా జాంబవంతుడు సహస్ర మహామునిని గురువుగా నిర్ణయించుకొని, గురువుగా అంగీకరించమని శివుని కంటి నుండి ఉద్భవించిన పవిత్రమైన రుద్రాక్షలను పూజించి, వాటికి నూలు దారం కట్టి అతని మెడలో వేసి స్వీకరిస్తాడు. ఆ తర్వాత అతనితో నేను జలంలో పుట్టిన వాడినని, నా మాదిరిగా జన్మించిన కన్యలనే పెళ్లి చేయాలని కోరతాడు. అప్పుడు సహస్ర మహాముని తన మంత్రశక్తితో జలంలో జల వీర కన్యను, నాసిలో పుట్టిన దాసి కన్యను, కమలంలో పుట్టిన కమలాక్షి దేవిని పుట్టించి పెళ్లి చేస్తాడు. ఈ సహస్ర మహాముని సంతతియే జాంబవంతుని వంశస్థులకు అప్పటినుండి గురుస్థానంలో నియమింపబడ్డారు. వీరే లగ్న పత్రికలు రాస్తూ, ముహూర్తాలు చూస్తూ, జాంబ పురాణాన్ని పఠనం చేస్తూ, జాంబవ సంప్రదాయులై వస్తున్నారు. ఈ నులక చందయ్యలు గురువులుగా వ్యవహరించి నందుకు జాంబవ సంప్రదాయకులు అందరూ ప్రతిఫలంగా ముహూర్తాన్ని బట్టి సంభావన ఇవ్వాలని జాంబవంతుడు నిర్ణయిస్తాడు. ఆ రకంగా మాదిగ వారికి గురువులు గా వ్యవహరిస్తూ, ఇప్పటికీ తమకు సంక్రమించిన ఆచారాన్ని కొనసాగిస్తూ మనుగడ సాగిస్తున్నారు నులక చందయ్యలు.


మరొక కథనంలో జాంబవంతునికి అతి, మతి, జలగంధి అనే ముగ్గురు భార్యలేకాక రాజశేఖర అనే అప్సరసను కూడా పెళ్లి చేసుకుంటాడు. ఈ రాజశేఖర, జాంబవంతునికి సహస్ర మహాముని అనే పుత్రుడు జన్మిస్తాడు. ఇతను పుట్టీ పుట్టగానే ఓంకారం జపిస్తూ పెద్దవాడవుతాడు. ఒక రోజున త్రిమూర్తులను విందు భోజనానికి పిలిచిన జాంబవంతుడు ఆ కార్యక్రమాన్ని చూసుకొమ్మని సహస్ర మహామునికి చెప్తాడు. ఆ సహస్ర మహాముని త్రిమూర్తులకు మాత్రమే సరిపోయే భోజనం ఏర్పాటు చేస్తాడు. కానీ త్రిమూర్తులతో పాటూ ఇతర అనుచరులు చాలామంది భోజనానికి వస్తారు. మొదట అతను కొంత ఆందోళన చెందినప్పటికీ, సహస్ర మహా ముని ధర్మ నిష్ఠగల సత్యవంతుడు కావడంతో త్రిమూర్తులను తలచుకొని వారికోసం చల్లగరిగె లో పాలతో వండిన భోజనాన్ని త్రిమూర్తులను తలచుకొని అందరికీ వడ్డిస్తాడు. కానీ ఆ భోజనం త్రిమూర్తులతో పాటుగా అందరికీ తృప్తిగా సరిపోతుంది . ఇందుకు జాంబవంతుడు త్రిమూర్తుల మెప్పు పొందుతాడు. అప్పుడు జాంబవంతుడు సహస్ర మహాముని గొప్పతనాన్ని మెచ్చుకొని ఇకనుండి నా వంశానికి గురువుగా వ్యవహరించమని ఆశీర్వదించి, తన మెడలోని ఆత్మలింగాన్ని, అతని మెడలో వేసి గురువా! అంటూ దీవిస్తాడు. ఆ తర్వాత కాలంలో కామధేనువు విందు భోజనం విషయంలో శివుని ఆగ్రహానికి గురైన జాంబవంతుడు అతని కుటుంబం కలియుగంలో మాదిగ వారిగా పుట్టడం, సహస్ర మహాముని సంతతి నులక చందయ్యలుగా పుట్టి, మాదిగ వారికి గురువులుగా ఉంటూ లగ్న పత్రికలు రాస్తూ, పూజలు చేస్తూ, జాంబవ పురాణాన్ని పఠనం చేస్తున్నట్లు కనిపిస్తుంది. మౌఖిక కథలు ఏరకంగా ఉన్నప్పటికీ ఆచారం ప్రకారం నులకచందయ్యలు, తమకు జాంబవంతుడు నిర్ణయించిన గురు స్థానాన్ని నిలబెట్టు కుంటూ వారికి తగిన సూచనలను, లగ్న పత్రికలను రాస్తూ, శుభకార్యాలను చేస్తూ, పురాణ పఠనం చేస్తూ జీవిస్తున్నారు.


నులక చందయ్యలు మెడలో పవిత్రమైన పంచముఖ రుద్రాక్ష మాల, నుదటన విభూది ధరిస్తారు. వీరి దగ్గర ఉండే దస్త్రాలను అత్యంత పవిత్రంగా చూసుకొంటారు. ఈ దస్త్రంలోనే మాదిగ వారి జాంబపురాణంతో పాటు, వారి పూర్వీకుల ఇంటిపేర్లు వంశక్రమం, హక్కు గ్రామాలు వ్రాయబడి వుంటాయి. అంతేకాకుండా వీరి దగ్గర ఉండే రాగి శాసనం మీద కూడా పురాణం తోపాటు హక్కు గ్రామాలు లిఖించబడి ఉంటాయి. ఈ దస్త్రాలు కాగితం చుట్టగా చుట్టబడి, సుమారుగా 50 నుండి 60 మీటర్ల పొడవు ఉంటాయి. ఇవి నాలుగు తరాల నుండి నులక చందయ్యలకు సంక్రమిస్తున్నాయని, వీటిని స్థిరాస్తిగా భావించి భద్రంగా దాచుకుంటారు. రాగి శాసనాన్ని మాత్రం దేవుని మూలన ఉంచుకొని ప్రతిరోజు పూజించుకుంటారు. ప్రతి సంవత్సరం ఉగాది పండుగ రోజున తప్పనిసరిగా దస్త్రాలను శివుని ప్రతిరూపంగా భావించుకొని పూజిస్తారు. ఈ దస్త్రాల మీద ఉన్న హక్కు గ్రామాలు, ఒక ఇంటిలో తండ్రి తరువాత తన కొడుకులు పంచుకోవాలంటే, ఆ గ్రామాలను సమంగా పంచుకుంటారు. ఒకరికి నిర్ణయించిన హక్కు గ్రామాలకు మరొకరు వెళ్లడం, ప్రతిఫలం స్వీకరించడం చేయరు. మిగతా ఆశ్రిత కళారూపాల మాదిరిగానే వీరు కూడా నియమాలను పాటిస్తారు.


పూర్వం నులక చందయ్యలు తమ హక్కు గ్రామాలకు ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి దసరా పండగ తర్వాత త్యాగం కోసం ఎడ్లబండిలో బయలుదేరేవారు. ఆ రకంగా వెళ్లేప్పుడు తమకు వంశపారంపర్యంగా సంక్రమించిన రాగి శాసనం, జాంబపురాణం దస్త్రాలను తీసుకొని బయలుదేరేవారు. మొదట గ్రామంలోని మాదిగ కుల పెద్ద ఇంటి దగ్గరికి వెళ్లి, మీ కుల గురువులమని చెప్పి వారికి తెలియ పరచేది.మాదిగ పెద్దమనిషి కులం వారందరినీ ఏకం చేసి గౌరవంగా వారిని ఆహ్వానించి వారికి కావలసిన భత్యం సరుకులు ఇచ్చి పంపించే వారు. వీరు అదే గ్రామంలో ఒక చెట్టు నీడన బండి నిలుపుకొని ఆ రోజు వంట చేసుకొని మరుసటి రోజు ఆ గ్రామం పెద్దల దగ్గరికి వెళ్లేవారు. మాదిగ వారంతా గౌరవంగా గురువులకు ఇవ్వాల్సిన త్యాగం గురించి చర్చించుకొని గురువులకు సమ్మతమైన సంభావన చెప్పేవారు. అక్కడ పురాణాన్ని ఎన్ని రోజులు చెప్పమంటే అన్ని రోజులు చెప్పేవారు.
నులక చందయ్యలు తమ ముందర దస్త్రాల్లో ఉన్న జాంబ పురాణాన్ని ఆదికాండం,శివ పార్వతి కళ్యాణం, సత్య కామధేనువు కథ, అరుంధతి కళ్యాణం,బలభద్ర విజయంగా విభజించుకొని పద్యం, వచనంలో చెప్పేవారు. ఈ పురాణంలో మిగతా కులాల పుట్టుక కూడా ఉంటుంది కాబట్టి గ్రామంలోని ఇతర కులాల ప్రేక్షకులు కూడా పురాణాన్ని వినడానికి ఆసక్తిని చూపేవారని కళాకారుల మాటల్లో తెలుస్తున్నది. ఈ పురాణాన్ని ముగ్గురు కళాకారులు చెప్తారు. ఇందులో ఒకరు పురాణాన్ని చెబుతుండగా, మరొక ఇద్దరిలో ఒకరు మద్దెల, ఒకరు తాళాలు వాయిస్తూ వంత పాడతారు. మాదిగ పెద్దల వీలునుబట్టి రాత్రి సమయంలోనే ఎక్కువగా చెప్పేవారు. రాత్రి సమయంలో అయితే కళాకారులు ‘కందిలీ’ దీపాల వెలుతురులో చెప్పేవారు. ఆ తర్వాత కొన్ని రోజులకు కాగడాల వెలుతురులోను, పెట్రోమాక్స్ లైట్‍ వెలుతురులోను చెప్పారు.పురాణ పఠనం తర్వాత గ్రామంలో మాదిగ వారికి నులక చందయ్యలు విభూది పెట్టి, తీర్థప్రసాదాలు అందించి దీవిస్తారు. కానీ ప్రస్తుతం పురాణ పఠనం చేసే కళాకారులు తగ్గిపోవడంతో ఆ సంప్రదాయం అక్కడక్కడా కొందరి వద్దనే మిగిలి ఉంది. పురాణ పఠనం కంటే కళాకారులు గురు సంప్రదాయాన్ని పాటిస్తూ మాదిగ వారికి లగ్నపత్రికలు వ్రాయడం, కొత్త ఇండ్లకు వస్తే పూజలు చేయడం ప్రధానంగా చేస్తున్నారు.
ప్రస్తుతం నులక చందయ్యలు కొలనుపాక, నల్లగొండ, హైదరాబాద్‍, వేములవాడ, కామారెడ్డి, సిద్దిపేట దగ్గర రాఘవపురం, సిరిసిల్ల దగ్గర ముస్తాబాద్‍ లో ఉన్నారు. కానీ పురాణం పఠనంచేసే కళాకారులు మాత్రం తగ్గిపోయారనే మిరియాల రాజవీరు మాటల్లో తెలుస్తున్నది. కానీ అందరూ వారికుండే, ఆయా హక్కు గ్రామాలకు వెళ్లి శుభకార్యాలకు మాత్రమే ముహూర్తాలు నిర్ణయించి పూజలు చేస్తూ, తమ మూల సంస్కృతిని కాపాడుకుంటూ వస్తున్నారు.


-డా. బాసని సురేష్‍, ఎ : 9989417299

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *