‘ఫోరం ఫర్‍ ఎ బెటర్‍ హైదరాబాద్‍’ ఆధ్వర్యంలో 150 మందిని కాపాడిన చింతచెట్టు కింద స్మారక సమావేశం


సెప్టెంబర్‍ 28 (మంగళవారం)న అఫ్జల్‍గంజ్‍లోని ఉస్మానియా జనరల్‍ హాస్పిటల్‍ ఆవరణలోని చింత చెట్టుకింద ‘ఫోరం ఫర్‍ ఎ బెటర్‍ హైదరాబాద్‍’ ఆధ్వర్యంలో ‘సెంటర్‍ ఫర్‍ దక్కన్‍ స్టడీస్‍’, ‘దక్కన్‍ హెరిటేజ్‍ ట్రస్ట్’, ‘దక్కన్‍ హెరిటేజ్‍ అకాడమీ’ భాగస్వామ్యంతో – మణికొండ వేదకుమార్‍ అధ్యక్షతన స్మారక సమావేశం జరిగింది. 1908 సం।।లో వచ్చిన మూసీ వరదల్లో ఆస్థి, ప్రాణ నష్టం సంభవించింది. వేల మంది ఆ మూసీ వరదల్లో నీటి ప్రవాహానికి కొట్టుకుపోయారు. అయితే కొందరు ఈ చింతచెట్టుపైకి ఎక్కి తమ ప్రాణాలను కాపాడుకున్నారు. అలా 150 మందిని కాపాడిన చింతచెట్టు జ్ఞాపకార్థం గత 13 సంవత్సరాల నుండి ‘ఫోరం ఫర్‍ ఎ ఫటర్‍ హైదరాబాద్‍’ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం స్మారక సమావేశం నిర్వహిస్తుంది. ఆ ఘటన జరిగి 113 సంవత్సరాలై సందర్భంగా ఈ ఏడాది కూడా సమావేశం నిర్వహించి మృతులకు నివాళి అర్పించింది. కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు మణికొండ వేదకుమార్‍ పాల్గొని ప్రసంగించారు.


1908లో మూసీ వరదల సమయంలో నిజాంగా మీర్‍ మహబూబ్‍ అలీపాషా ఉన్నారు. వరద పరిస్థితులను చూసి, ఇకపై మళ్లీ ఇలాంటి దుస్థితి తలెత్తకుండా చూడాలని ఆలోచించారు. 1914లో ఏడవ నిజాం ఉస్మాన్‍ అలీపాషా సిటీ ఇంప్రూవ్‍మెంట్‍ బోర్డు (సిబిఐ)ని ఏర్పాటు చేయించారు. నాటి సుప్రసిద్ధ ఇంజినీరు సర్‍ మోక్షగుండం విశ్వేశ్వరయ్యను పిలిపించి రెండు జలాశయాలు నిర్మించాలని, డ్రైనేజీ వ్యవస్థను ఆధునికీకరించాలని సూచించారు. వారి సూచనల మేరకు 1920లో ఉస్మాన్‍సాగర్‍, 1927లో హిమాయత్‍సాగర్‍లను నిర్మించారు. ఈ రెండు జలాశయాలు నగరానికి వరద ముప్పును తప్పించడమే కాకుండా మంచినీటి వసతిని కల్పిస్తున్నాయి. అలా నగర ప్లానింగ్‍కు ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు. పౌర వసతుల మెరుగుకు సిబిఐ ప్రత్యేక చర్యలు తీసుకుంది. పార్కులు, బహిరంగ స్థలాలు, ఆట స్థలాలు, స్లమ్‍ క్లియరెన్స్, హౌజింగ్‍ కాలనీల నిర్మాణం, మంచినీరు, డ్రైనేజీ వ్యవస్థల ఏర్పాటు, మూసీ నదికి రెండు పక్కలా రక్షణ గోడలను విలక్షణ శైలితో నిర్మించారు. అలా మూసీ తీరం వెంట హైకోర్టు, సిటీ కాలేజీ, ఉస్మానియా హాస్పిటల్‍, అసఫియా లైబ్రరీ లాంటి ఎన్నో అద్భుత కట్టడాలు రూపుదిద్దుకున్నాయని పేర్కొన్నారు. అప్పటి ప్రఖ్యాత ఇంజినీర్లు దలాల్‍, సర్‍ అలీ నవాబ్‍ జంగ్‍, కద్‍మైత్యార్‍ జంగ్‍ లాంటి వారు ఆయా పనుల్లో కీలకపాత్ర వహించారని వక్తలు తెలిపారు.


తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మూసీకి మహర్దశ తీసుకు వచ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‍, మున్సిపల్‍ మంత్రి కేటీఆర్‍ యుద్ధప్రాతిపదికన హైదరాబాద్‍ డ్రైనేజీ వ్యవస్థ, వరద నీటి వ్యవస్థకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‍ హైదరాబాద్‍ నగరానికి ప్రపంచంలోని పట్టణాలకు ధీటుగా గుర్తింపు పొందేందుకు ప్రత్యేక కార్యచరణతో ప్రణాళికలను రూపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఎన్నో సంవత్సరాలుగా కలుషితమైన నీటిని శుద్ధి చేయడానికి కొంత సమయం పడుతుంది. తమ వంతుగా ఎఫ్‍బిహెచ్‍ తరఫున మూసీ సుందరీకరణ కోసం కొన్ని సూచనలు చేయనున్నట్లు వక్తలు తెలియజేశారు. ప్రభుత్వం ఇప్పటికే మూసీ నదీ పరివాహక అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేసింది. గతంలో పర్యాటకులు, వర్తకులు నగరానికి వచ్చినప్పుడు మూసీ పరివాహక ప్రాంతాల్లో విడిది చేసి, ఆ నీటిని మంచినీరుగా తాగేవారు. ప్రభుత్వం చూపుతున్న ప్రత్యేక చొరవతో కొంత సమయం పట్టినా కూడా, మళ్లీ అటువంటి రోజులు వస్తాయని వక్తలు ఆశాభావం వ్యక్తం చేశారు.

  • దక్కన్‍న్యూస్‍, ఎ : 9030 6262 88

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *