కాల ప్రవాహంలో కరిగిపోయిన కమ్మని కథలు మళ్లీ ఇపుడెందుకు అని ఎవరైనా ప్రశ్నిస్తే ఒకే ఒక చిన్న మాట సెలవిస్తాను ‘‘గుజ్రే జమానా – కరే దివానా’’.
‘‘దీపాలు వెలిగె, పరదాలు తొలిగె’’ అన్నట్లు నవాబ్ ఫక్రుల్ ఉల్ ముల్క్ ‘‘దౌలత్‌ఖానా’’ (నివాసం) ఇరాం మంజిల్‌లో తరచుగా పెద్ద ఎత్తున దావత్‌లు (విందులు) జరిగేవి. ఆ డిన్నర్ పార్టీల ఏర్పాట్లు చూడముచ్చటగా బహు పసందుగా ఉండేవి. పున్నమి వెన్నెల రాత్రులు రగిలి వెలిగి రాగ రంజితంగా రసరమ్యంగా అతిథుల హృదయాలలో హమేషా ‘‘యాద్గార్ మహెఫిల్’’గ నిలిచిపోయేవి.
హైద్రాబాద్‌కు కొత్తగా వచ్చి ఉద్యోగాలలో చేరిన బ్రిటిష్ అధికారులందరూ నవాబు గారి ఇరాం మంజిల్‌కు వెళ్లి అతిథుల రిజిస్టర్లో తమ పేర్లను నమోదు చేసుకునేవారు. రిజిస్టర్ ఆ భవనం మెయిన్‌గేట్ రిసెప్షన్లో ఉండేది. నవాబు గారు నెలకోసారి దానిని పరిశీలించి కొత్తగా ఎవరెవరు వచ్చారో తెలుసుకునేవారు.
ఇక డిన్నర్ పార్టీలకు ఆహ్వానాలు పంపేటప్పుడు ఈ కొత్తగా వచ్చిన వారిని మరియు పాత అధికారులను దివాన్‌ను, ఒకరిద్దరు వజీర్లను (మంత్రులను) పాయగా, ఉమ్రావ్ లాంటి ఉన్నత వంశాల వారిని ఆహ్వానించేవారు. ఆ ఆహ్వానం ఒక్కరికేగాక మొత్తం కుటుంబ సభ్యులకు పంపబడేది. ప్రతి ఆర్నెల్లకోసారి బ్రిటిష్ రెసిడెంటు గార్ని కూడా ఆహ్వానించేవారు.
ప్రతి డిన్నర్ పార్టీకి సుమారు వంద మందిని ఆహ్వానించేవారు. మూడు వారాలు ముందుగానే ఆహ్వానాలు పంపబడేవి. వాటికి జవాబులుగా ఎవరెవరు వస్తున్నారో లేదా క్షమించమని ప్రార్థిస్తునో ఉత్తరాలు వచ్చేవి. ఇక ఆ ఖచ్చితమైన సంఖ్య ప్రకారం ‘‘టేబుల్స్ ప్లాన్’’ జరిగేది. నవాబు గారి మనవడి ఆధ్వర్యంలో ఒక ‘‘ముసాహిబు’’ ఆ పని చూసుకునేవాడు. విశాలమైన బాంక్వెట్ హాల్లో ఒకే వరుసలో సరిపోయేంత స్థలం వదులుతూ విడివిడిగా టేబుళ్లను, కుర్చీలను ఏర్పాటు చేసేవారు. వారి వారి హోదాలు, అంతస్తులకు తగిన వరుసక్రమంలో ఆ ఏర్పాట్లు ఉండేవి. ప్రతి టేబుల్‌పై అతిథుల పేర్లు గల నేమ్ప్లేట్లను పెట్టేవారు. అలాగే ప్రతి టేబుల్‌పై ప్రింట్ చేయబడిన మెను ఉండేది.
డిన్నర్ రాత్రి ఎనిమిది గంటలకు ప్రారంభమయ్యేది. అతిథులందరు వచ్చిన తర్వాత ముఖ్య అతిథి రెసిడెంట్ ఆఖరికి వచ్చేవాడు. గేటు వద్దనే ఆయనకు స్వాగతం పలుకుతూ మిలిటరీ బ్యాండు సెల్యూట్ చేసేది. ఆయన లోపలికి రాగానే మెట్ల వద్ద నవాబుగారు తన కుటుంబ సభ్యులందరితోనూ, వచ్చిన అతిథులందరితోనూ, వారి వారి అంతస్థులు, హోదాల ప్రకారం నిలుచుని రెసిడెంట్గారికి స్వాగతం పలికేవారు. సముచిత గౌరవంతో అక్కడే ఉన్న రిసెప్షన్ గదిలోకి తీసుకెళ్లి ముందు వెల్కం డ్రింకు సర్వ్ చేసేవారు. అసలైన డ్రింకు పార్టీ భోజనానంతరం ఉండేది. వెల్కం డ్రింక్ సరఫరా అయిన తర్వాత అతిథులందరికి చిన్న చిన్న కార్డులు ఇచ్చేవారు. అందులో వారి పేరు, టేబుల్ సంఖ్య సూచించబడేది. దాని ప్రకారమే అతిథులు టేబుళ్ల వద్దకు చేరుకుని ఆసీనులయ్యే వారు.
సరిగ్గా 8-30 గంటలకు మిలిటరీ బ్యాండు సంగీతం వినిపించగానే అందరూ బాంక్వెట్ హాలుకు చేరుకునే వారు. అక్కడి వాతావరణం తళుకులీనే షాండిలీయర్లతో రంగు రంగుల కొవ్వొత్తులతో సొగసైన దీపాలతో ధగధగా మెరిసిపోయేది. హాలుకు నలుమూలలా పెద్దపెద్ద నిలువె•త్తు అద్దాలు అమర్చటం వలన దీపాల కాంతి పరావర్తనం చెంది గది అంతా జగజ్జేయమానంగా కాంతులీనుతూ వెలిగిపోయేది. ప్రతి టేబుల్ వద్ద ఒక బట్లర్ శుభ్రమైన డ్రస్సుతో, తలపై టర్బన్‌తో, చేతులకు పాలిథిన్ గ్లోవ్స్‌తో సేవలకు సిద్ధంగా నిలబడేవాడు. ఆడవారి టేబుల్స్‌పై నజరానాగా ఒక అత్తరు సీసా, ఎర్ర గులాబీ పువ్వు అమర్చబడి ఉండేది. అతిథులు ముందుగా మెను పరిశీలించేవారు. సాధారణంగా మెను పదార్థాలు ఇలా ఉండేవి.
చికెన్ లేదా తాబేలు మాంసం సూపు, చేపల వేపుడు, రొయ్యల షోర్వా, అంచుకు దోసకాయల చల్లటి ముక్కలు, కోడి మాంసం, పచ్చిబఠాణీలు వేసిన బాతు మాంసం, శుభ్రమైన పుట్టగొడుగుల మసాల సాలన్, ఇక పూర్తి వేపుడు కూరలలో టర్కీ బాతు మాంసం, లేత జింకమాంసాలు విధిగా ఉండేవి. అంతేగాక తప్పనిసరిగా పుల్కాలు, పరోటాలు, పూరీలు, బిర్యానీ, తెల్ల అన్నం, దాల్చా, గడ్డ పెరుగు కూడా ఉండేవి. ఇక మీఠా వచ్చేసరికి క్యాబినెట్ పుడ్డింగు, ఐసుక్రీంలు, కాఫీ లేదా తాజాపండ్ల రసాలు. విందు ముగిసినట్లు హోత చెయ్యి ఎత్తగానే మళ్లీ బ్యాండు మేళం వినిపించబడేది. అందరూ లేచినిలబడి గాడ్ సేవ్ ది కింగ్, గాడ్ సేవ్ ది నిజాం అని కోరస్‌గా అనేవారు.
డిన్నర్ ముగియగానే పురుషులందరూ దివాన్ఖానా (డ్రాయింగ్ రూం)లో చేరి విస్కీ, బ్రాందీలు చప్పరిస్తూ బాతాఖానీలో పడేవారు. స్త్రీలు జనానాలోకి వెళ్లి ఒకర్నొకరు పలకరించుకుని ముట్టుకుంటే పట్టుకునే ముచ్చట్లలో మునిగి పోయేవారు. అట్లా సరిగ్గా పదకొండు గంటలకు విందు ముగిసేది. అయినా కొంతమంది రంగేళీ రాజాలు బిలియర్డస్, స్నూకర్, పత్తాలాడుతూ రసరమ్య రాత్రులను రగిలించి వెలిగించేవారు.
ఇరాం మంజిల్‌లో రంజాన్, బక్రీద్ పండగలొస్తే చాలు ఇక పండగే పండగ. ఆ వైభోగం చూడటానికి రెండు కండ్లు చాలవు. వినటానికి రెండు చెవులు చాలవు. బక్రీదు (ఈదుల్ ఫితర్) పండుగకు అల్లాకు ఖుర్బానీ ఇవ్వటానికి నవాబు గారు తన జాగీరు నుండి ఏకంగా ఒక గొర్రెల మందనే తెప్పించేవాడు. ఆ గొర్రెల మంద నగరానికి చేరటానికి సరిగ్గా ఒక నెల పట్టేది. ఆయన పండుగకు ఒకరోజు ముందు తన అల్లుళ్లకు, కొడుకులకు తలా మూడు నాలుగు గొర్రెలను పంచి ఇచ్చేవాడు. తన వంతు గొర్రెలను బలి ఇచ్చి (ఖుర్బానీ) మధ్యాహ్నపు భోజనాలకోసం లేత మాంసంతో ఘుమఘుమలాడే రుచికరమైన దమ్కా బిర్యానీ వండించేవాడు. ఇంట్లోని సేవక బృందంతో సహ అందరూ దానిని ఇష్టంగా, సుష్టుగా ఆరగించేవారు.
పండగరోజు ఉదయాన్నే కుటుంబసభ్యులు అందరు కొత్త బట్టలు ధరించి వరుస క్రమంగా వచ్చి తలవంచి సలాంలు చేసి ఈద్ ముబారక్‌లు చెప్పేవారు. పెద్దల కడుపు భాగం వరకు వంగి సలాం చేయటం గౌరవమర్యాదలతో కూడిన సంప్రదాయం. అందరూ బాగా అలంకరించుకుని కొత్త బట్టలకు అత్తరు పూసుకుని గుమగుమలతో గుభాళించే పుష్పాల మాదిరి వచ్చేవారు. పెళ్లికాని పడుచులు పువ్వుల పొట్లాలుగా, ఫూల్చెఢీలుగా, గుల్దస్తా, గుల్బదన్ల్లా అటుఇటు తిరుగుతు యువకుల హృదయాలను లుఠాయించి బర్బాద్ చేసేవారు. నవాబుగారు వారందరికి పండుగ ఇనాంగా అష్రఫీలను ఇచ్చేవారు. ఒక అష్రఫీ 24 వెండి రూపాయలతో సమానం. ఒక అష్రఫీ తులం బరువు ఉండేది. కుటుంబ సభ్యుల తర్వాత మధ్య తరగతి సిబ్బంది ‘‘మాసాహిబులు’’ లాంటి వారు కుటుంబ సభ్యుల యుక్తంగా దర్శనం చేసుకుని నజర్లు సమర్పించేవారు. బదులుగా నవాబుగారు వారికి విలువైన వస్తువులను లేదా సిల్కు బట్టలను కానుకగా ఇచ్చేవారు. చివరగా నౌకర్లు, చాకర్లు వచ్చేవారు. వారి వెంబడి వారి పిల్లలు కూడా ఉండేవారు. వారందరికి కొత్త బట్టలను, రూపాయి బిళ్లలను, గాజులను బహుమతులుగా ఇచ్చేవారు. వచ్చిన వారందరికీ అంతస్తుల భేదం లేకుండా పాన్ ఇచ్చి అత్తరు పూసేవారు.
ఈద్ ముబారక్‌ల కార్యక్రమం అవుతున్నంతసేపు అవతల దేవుడీ పైభాగం నౌబత్ఖానాలో నౌబత్ వాయిద్యాలు శుభసూచకంగా మోగుతుండేవి. సాజిందాలు (వాయిద్యకారులు) తమ షెహనాలులు, సారంగీలతో శ్రోతలకు వీనుల విందులు చేసేవారు. హిందు, ముస్లిం ప్రజలందరు నవాబులకు సలాములు చేసి బక్షీసులు అందుకోవటం కోసం ఒక దేవుడీ నుండి మరొక దేవుడీకి పరుగులు తీసేవారు. అంతటా పండుగ వాతావరణం గుభాళించేది.
నవాబుల ఇళ్లల్లో ‘‘మిరాసనీ’’ స్త్రీలు ఉండేవారు. ఆడిపాడటమే వారి వంశపారంపర్య వృత్తి. వీరు పండగరోజులలో సంగీతనృత్య గానాదులతో అందర్నీ రంజింపచేసేవారు. ఇరాం మంజిల్‌లో పండగల సందర్భంలో ఈ మిరాసనీ స్త్రీలేగాక మోహబూబ్కీ మెహందీ నుండి మరికొంత మంది ‘‘తవాయిఫ్‌లు’’ (భోగం స్త్రీలు) వచ్చి ‘‘మెహఫిల్’’ జమాయించేవారు. ఆనాటి సాంఘిక వ్యవస్థలో ఆ ‘‘కళావంతులకు’’ గౌరవనీయమైన స్థానం ఉండేది.
ఫక్రుల్ ఉల్ ముల్క్ నవాబు మాత్రం అందరికన్నా భిన్నంగా తన జీవితమంతా ఏకపత్నీ వ్రతుడుగానే గడిపాడు. ఆయన బేగం సాహెబా 1902లో కాలం చేసింది. రెండు ఎకరాల విశాలమైన భాగ్ భగీచా నడుమ అందమైన మక్బరా (సమాధి) నిర్మించాడు. ఇండో ఇరానియన్ వాస్తు శైలిలో, మొత్తం ఎరగ్రానైట్ రాతి కట్టడం అది. అది ఆయన పాలిటి ‘‘తాజ్ మహల్’’.
‘‘ఆకుపచ్చ ఆకులు చెట్టుకు అలంకారాలు
పసుపుపచ్చ పండుటాకులు మోతబరువు
కొమ్మకు అతుక్కుని ఎంతకాలం వేలాడుతావు
ఆకురాలు కాలం వచ్చింది ఇక రాలిపోరాదా’’.
(షాద్ కాళోజీ రామేశ్వర్రావ్)
ఫక్రుల్ ఉల్ ముల్క్ నవాబుగారు 77 వసంతాలను సందర్శించి 1934లో అల్లాకు ప్రియమైనాడు. ఎన్ని పనుల ఒత్తిడి ఉన్నా ప్రతి సాయంకాలం భార్యను స్మరించుకుంటూ ఆ మక్బరా ప్రాంగణంలోనే సంచరించేవాడు. ఆయన వారసుల సమాధులన్నీ అక్కడే ఉన్నాయి.
‘‘ధూళి నుండి జన్మించాను. చివరికి
ధూళిలో ధూళిగా మారాను’’.
ఈ పర్షియన్ కవితా చరణాలు ఆయన సమాధి శిలాఫలకంపై సందర్శకులు సందర్శించవచ్చును. ఈ మక్బరా సంజీవరెడ్డి నగర్ దాటి ఎర్రగడ్డ వైపు ప్రయాణిస్తుంటే దారిలో ఎడమ వైపు ఉంది. మన ఉరుకుల పరుగుల జీవితంలో కొంచెం తీరిక చేసుకుని ఎప్పుడైనా అందులోకి తొంగి చూద్దామా? ఇవన్నీ మనం చూడకపోతే, తెలుసుకోక పోతే ‘‘కోటి జన్మలెత్తినా కోతిగానే మిగిలిపోతాం.’’
(షహర్ నామా (హైద్రాబాద్ వీధులు – గాథలు) పుస్తకం నుంచి)
-పరవస్తు లోకేశ్వర్,
ఎ: 91606 80847