పాల్కురికి పేర్కొన్నపర్యాటక స్థలాలు

తెలంగాణ సాహిత్య చరిత్రలో మనకు కనిపించే అతి గొప్ప కవి పండితుడు పాల్కురికి సోమనాథుడు అనేది తెలుగు సాహిత్య లోకానికి తెలిసిన విషయమే. సోమనాథుని రచన ‘బసవ పురాణం’కు 1926లో ముందుమాట (విపులమైన పీఠిక) రాస్తూ ఆయన వరంగల్‍ జిల్లాలోని పాలకుర్తికి గ్రామానికి చెందినవాడు అని వేటూరి ప్రభాకర శాస్త్రిగారు రాశారు. ఇంతవరకు బాగానే ఉంది కాని సోమనాథుని కాలం గురించి మాత్రం ఐదు పేజీల చర్చ చేసి ఆయన క్రీ.శ.1132-1198 మధ్య కాలానికి చెందినవాడు అని అభిప్రాయపడ్డారు. ఇది చారిత్రక సత్యం కాదు. కాబట్టి నాటి నుండి సుమారు మూడు దశాబ్దాలపాటు పాల్కురికి సోమనాథుడు ఎప్పటివాడు అని వాదోపవాదాలు జరిగాయి.


1945లో మల్లంపల్లి సోమ శేఖరశర్మగారు ఒక వ్యాసంలో పాల్కురికి సోమనాథుడు క్రీ.శ. 1290-1320 ప్రాంతానికి చెందిన వాడు అని చారిత్రకా ధారాలతో నిరూపించాడు. కాకతీయ రాణి రుద్రమదేవి సామంతుడు, శత్రువు అయిన అంబదేవుడు క్రీ.శ.1290-91లో వేయించిన నీల గంగవర శాసనంలో సోమనాథుని సమకాలికులుగా అతని గ్రంథాలలో పేర్కొనబడిన రెంటాల మల్లినాథుడు, దోచమాంబలకు సంబంధించిన విషయాలను సోమశేఖరశర్మగారు ఆధారంగా చూపారు. ఇవే విషయాలను మరిన్ని చారిత్రకాధారాలతో సమన్వయం చేసి 1955లో ‘పాల్కురికి సోమనాథుడు ఎప్పటివాడు?’ అనే పుస్తకంలో నేలటూరి వెంకటరమణయ్యగారు సోమనాథుడు క్రీ.శ.1280-1340 ప్రాంతాలకు చెందినవాడు అని నిర్ధారించారు. దాంతో తెలుగు సాహిత్య చరిత్రలో ఒక మహా మేధావి కాలం విషయమై స్పష్టత వచ్చింది. అయినా ఇంకా ఈ మధ్య కొందరు ప్రముఖ తెలంగాణ సాహిత్య / చరిత్రకారులు సోమనాథుడు క్రీ.శ.12వ శతాబ్దానికి చెందినవాడని పేర్కొంటుండడం శోచనీయం.


పాల్కురికి సోమనాథుడు తెలుగు సాహిత్యంలో పలు కవిత్వ పక్రియలకు ఆద్యుడనే విషయం అందరికీ తెలుసు కాని ఆయన తెలుగులో యాత్రా కథనాలకు (యాత్రా చరిత్రలకు) కూడా ఆద్యుడని కొందరికే తెలుసు. ఆయన అతి గొప్ప రచన ‘శ్రీ పండితారాధ్య చరిత్ర’లోని పర్వత ప్రకరణం క్షుణ్ణంగా చదివితే అది ఎంత గొప్ప యాత్రా రచననో అర్థమవుతుంది.


పర్వత ప్రకరణం శ్రీశైల పర్వతం పైనున్న సందర్శనా స్థలాల గురించి వర్ణిస్తుంది. అలాంటి ‘కొన్ని స్థలాల’ను పేర్కొంటున్నాను అని చెప్తూ డా।।చిలుకూరి నారాయణరావుగారు 408 స్థలాల లిస్ట్ ఇచ్చారు – ‘శ్రీ పండితారాధ్య చరిత్ర’ ఉపోద్ఘాతంలో, 1939లో. వీటిల్లో 45 స్థలాలు మాత్రం పాల్కురికి సోమనాథుని మరో రచన ‘బసవ పునాణం’లోనివని పేర్కొన్నారు. నారాయణ రావు గారు నిజాయతీగా పేర్కొన్నట్లు ఆయన తన లిస్ట్లో ఎన్నో స్థలాలను పేర్కొనడం మరిచి పోయినట్లు నేను అనుభవ పూర్వకంగా గమనించాను.


క్రీ.శ.12వ శతాబ్దంలో బసవేశ్వరుడు వీరశైవం అనే మత శాఖ ఆవిర్భవించడానికి మూల కారకుడు. ఆయన జ్ఞాని అయింది, సమాధి అయింది మహబూబ్‍నగర్‍ జిల్లాలోని కూడలి సంగమేశ్వరంలో. ఆయనకు ఏకలవ్య శిష్యుడు మల్లికార్జున పండితారాధ్యుడు. ఈయన అదే జిల్లాలోని ఉమామహేశ్వర క్షేత్రంలో ప్రారంభమయ్యే నల్లమల పర్వతరాజాన్ని పెద్ద శివలింగంగా భావించి దాన్ని తన పాదాలతో తొక్కుతూ ఎక్కడానికి ఇష్టపడక తన శిష్యుడు దోనమ రాజయ్యను శ్రీశైల క్షేత్రమును, దాని పరివార ఆలయాలను దర్శించుకుని రమ్మని పంపించాడు. ఆయన శ్రీశైల ఉత్తర ద్వార క్షేత్రమైన ఉమామహేశ్వరంతో ప్రారంభించి సుమారు 400 తీర్థ క్షేత్రాదులను దర్శించినట్లు పర్వత ప్రకరణంలో ఉంది. వాటన్నింటిని క్రీ.శ.1167-68లో దోనమయ్య దర్శించాడో లేదోగాని పాల్కురికి సోమన మాత్రం క్రీ.శ.1280 ప్రాంతంలో తప్పకుండా దర్శించి ఉంటాడు. దర్శించనిది వాటి గురించి రాయలేడు గదా! ఆయన దర్శించిన స్థలాలు ఇప్పటికీ ఇంచుమించుగా అవే పేర్లతో ఉన్నాయి.పాల్కురికి సోమన స్ఫూర్తితో నేను పర్వత ప్రకరణంలో పేర్కొన్న తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన స్థలాలనన్నింటినీ తిరిగి చూశాను. నేను కూడా దోనమయ్య, సోమనలాగా ఉమామహేశ్వర క్షేత్రం నుండే నా పర్యటనను ప్రారంభించాను. ఆ క్షేత్ర అభివృద్ధికై అప్పటికే అర్థ శతాబ్దం క్రితం నుండి కృషి చేస్తున్న శ్రీ మర్యాద గోపాలరెడ్డిగారిని కలిసి, ఆయన శ్రీ గడియారం రామకృష్ణశర్మగారిచే 1974లో రాయించిన ‘శ్రీ ఉమా మహేశ్వర క్షేత్రము’ పుస్తకాన్ని తీసుకుని చదివి, తద్వారా ‘పర్వత ప్రకరణం’ ప్రాముఖ్యాన్ని తెలుసుకొని, దాని ఆధారంగా అందులో పేర్కొన్న అన్ని స్థలాలను సందర్శించాలని సమాయత్త మయ్యాను. కాని ఈ క్రింద పేర్కొన్న స్థలాలను స్థానికులు కూడా అప్పటికే మరిచిపోయారు.
1 ఉమామహేశ్వరంలోని పెద్ద వాద్యం (అర్ణవ ఘోషణం)
2 కుబేరేశ్వరం
3 సిద్ధేశ్వరం
4 కుర్వదారులు
5 గుప్త మల్లికార్జునం
6 శివపుర ద్వారం
7 చతుర్ముఖ బసవేశ్వరం

8 కన్యాసిద్ధనాథని బిలం, భవనం
9 మందాకిని
10 గోమాతృ పంచకం / నాగపంచి / మాతంగేశ్వరం
11 గుప్త మహేశ్వరం
12 చరుకేశ్వరం
13 సంధ్యా సమాధి
14 దేవహ్రదేశ్వరం / రామేశ్వరం
15 కాలహ్రదేశ్వరం
16 వేద పర్వతం / అశ్వమేధ శిలోచ్చయం
17 శ్వేతాద్రి / లింగశృంగం
18 గుండ శిఖరి
19 కిన్నెరేశ్వరం

ఈ స్థలాలన్నింటినీ నేను గుర్తించాను. ఇందుకు నేను ‘పర్వత ప్రకరణం’ పదేసిసార్లు క్షుణ్ణంగా చదివాను. ‘పర్వత ప్రకరణం’ ఆధారంగా దాని తర్వాత రెండు శతాబ్దాలకు రచించబడిన శ్రీ నాగలూటి శేషనాధాచార్యుని ‘శ్రీ పర్వత పురాణం’ చదివాను. స్కాంద పురాణాంతర్గత శ్రీశైల ఖండం, శ్రీ ఉమామహేశ్వర జీర్ణోద్ధారణ (జంగం కథ) తదితర గ్రంథాలు, శాసనాలను చదివాను. వాటిల్లోని ఆయా అంశాలను సమన్వయం చేయడానికి మాటి మాటికి అక్కడి మన్ననూరు కేంద్రంగా అనేక స్థలాలను అనుమానించి తిరిగాను, వెతికి వెలికి తీశాను. అయినా ఇంకా కొన్ని స్థలాలను మాత్రం ఇప్పటికీ తెలుసుకోలేక పోయాను. అవి ఇక ఎప్పటికీ తెలియవేమో! కారణం అవి వ్యవసాయ విస్తరణలో తమ ఉనికిని కోల్పోవడమో లేక పాల్కురికి వాటిని తెలుగులో కాక సంస్కృతీకరించి పేర్కొనడం వల్ల మనమిప్పుడు గుర్తించలేకపోవడమో జరిగి ఉంటుంది. అయితే అవి అంత ప్రధాన మైన స్థలాలు అయ్యుంటే నా తీవ్ర ప్రయత్నంలో తెలిసి ఉండేది. కొన్ని స్థలాలనేమో తెలుసుకోవడానికి వీలు లేకుండా పోయింది. కారణం అవి నాగార్జునసాగర్‍, శ్రీశైలం ప్రాజెక్టులలో మునిగి పోయాయి. అవి నల్గొండ జిల్లా ఏలేశ్వరం, మహబూబ్‍నగర్‍ జిల్లా మల్లే శ్వరం (కొల్లాపురం) ప్రాంతాల్లో ఉండేవి.


ఇక ప్రజలు, పండితులకు తెలియక నేను తెలుసుకొని పైన పేర్కొన్న స్థలాలు ప్రధానంగా ఉమామహేశ్వరం – మన్ననూరు పరిసర ప్రాంతాల్లోనే ఉన్నాయి. వీటిల్లో చాలా వాటిని దోనమ రాజయ్య స్వయంగా తిరిగి చూసినట్లు, మరి కొన్నింటినేమో మల్లికార్జున దేవుడు మారువేషంలో ఆయనను తిప్పి చూపినట్లు పాల్కురికి సోమన పర్వత ప్రకరణంలో వివరించాడు. పై స్థలాల్లో ఒక్కొక్కదాన్ని గూర్చి చూద్దాం – దోనమయ్య చూసిన క్రమంలోనే…


1. అర్ణవ ఘోషణం (పెద్ద వాద్యం)
ఉమామహేశ్వరపురాన్ని వర్ణిస్తూ పాల్కురి సోమన ఇలా పేర్కొన్నాడు.
‘అర్ణవ ఘోషణంబట్లహర్నిశము
ఘూర్ణిల్లు బహువాద్య ఘోషంబులదియు
నట్టి మాహేశ్వరోద్యత్పురవరము’

మహేశ్వరపురం ఎట్టిదంటే, ఆ పురంలో పగలు-రాత్రులంతా పెద్ద వాయిద్య, బహు వాయిద్య ఘోషలు విన్పిస్తుంటాయి అని పై ద్విపద పద్య పాదాల భావం. పెద్ద వాద్యం ఇప్పుడు శిథిలమై ఉమామహేశ్వర ప్రధానాలయం నుంచి పాపనాశనం అనే చిన్న జలపాతం వైపు నడుస్తుంటే ఎడమ పక్కన కన్పిస్తుంది. ఆ వాద్యం ఎంత పెద్దదంటే బహుశా అంత పెద్ద వాద్యం ప్రపంచంలోనే మరొకటి ఉండి ఉండదు. దాని పొడవు సుమారు నాలుగు గజాలుండగా, ఎత్తు రెండు గజాలుంది. ఇనుప కమ్మీకి ఏనుగు తోలును వాయిద్య పొరలుగా చుట్టినట్లు కన్పిస్తుంది. దీనిని క్రీ.శ.5వ శతాబ్దంలో ఇక్కడి నుంచే ఎదిగిన విష్ణుకుండి రాజులు చేయించినట్లుంది. వారి ఒక శాసనంలో ఈ ‘భేరి’ ప్రస్తావన ఉంది. శ్రీశైలంలో మోగే ఇలాంటి భేరి శబ్దం ఇక్కడి ఉమామహేశ్వరానికి, అక్కడి నుండి కీసర, ఇంద్రపాలనగరం (ఇవీ హైదరాబాదు శివార్లలో ఉన్న ఆనాటి విష్ణుకుండి రాజుల ప్రాంతీయ రాజధానులు) వరకు పరంపరగా విన్పించేటట్లు ఆ రాజులు ఏర్పాటు చేసుకున్నారని స్థానిక కథనం.


2. కుబేరేశ్వరం
దోనమయ్య ఉమామహేశ్వరున్ని చూసిన తరువాత కుబేరేశ్వర, సిద్ధేశ్వర మొదలైన అనేక లింగాలను, మహేశ్వర బిలాన్ని చూస్తూ వాటి అద్భుత నేపథ్యాలను తెలుసుకొంటూ ఆశ్చర్యచకితుడయ్యాడని పర్వత ప్రకరణంలో కింది విధంగా ఉంది.
‘శ్రీ కుబేరేశ్వర సిద్ధేశ్వరాద్య
నేక లింగములు మహేశ్వర బిలము
కనుగొంచునద్భుతాక్రాం తాత్ము డగుచు’

మహేశ్వర బిలము ఉమామహేశ్వర ఆలయానికి కుడి వైపున కొంచెం దూరంలోనే ఉంది. కుబేరేశ్వరాన్ని ఇప్పుడు ధనంబండగా పులుస్తున్నారు. ఇది రంగాపురం నుంచి ఉమామహేశ్వరం వైపు వెళ్తున్నప్పుడు ఫారెస్ట్లైన్‍ ప్రాంతంలో దారికి కుడివైపున కన్పిస్తుంది. ఇది ఒక పెద్ద పరుపు బండ. ఈ బండ తూర్పు కొసన కుబేరుని శిల్పం చెక్కి ఉంది. దీనికి ఉత్తరాన ఇటుకలతో నిర్మించిన కుబేరేశ్వ రాలయం ఉంది. కుబేరుడు ధనానికి ప్రతీక కాబట్టి ఆ ఆశతో ప్రబుద్ధులు ఈ ప్రాంతంలో విపరీతంగా తవ్వకాలు జరపడంతో కుబేరేశ్వర ఆలయ పునాదులు కూడా శిథిలమవుతున్నాయి.


‘శ్రీశైల ఖండం’ ఇక్కడి ఉమామహేశ్వర ప్రాంతం కుబేర స్థలం అని, అతని పట్టణం మొదటి పేరు మణిగిరి అని, తరువాత దాని పేరు చందప్రభ పట్టణంగా మారిందని తెలియజేస్తుంది. గుంటూరు జిల్లాలోని భట్టిప్రోలు శాసన ఫలకాల మీద ఉన్న కుబేరుని పేరును బట్టి, ఆదిలాబాదు జిల్లాలో కుబేరుని పేరు మీదున్న కుబీర్‍ పట్టణంలో కన్పించే పురావస్తు ఆధారాలను బట్టి కుబేరుడు అనే రాజు తెలుగు దేశాన్ని క్రీ.పూ.4వ శతాబ్దం ప్రాంతంలో పరిపాలించాడని తెలుస్తున్నది. అప్పటి మణిగిరి పట్టణం క్రీ.శ.4వ శతాబ్దం నుండి చందప్రభ పట్టణంగా మారిందని చంద్రగుప్తుని కూతురు చంద్రవతి కథ తెలుపుతుంది. ఈ నేపథ్యంలో ఇక్కడి ఆలయాలు చరిత్ర తొలి యుగంలో రూపుదిద్దుకొని ఇప్పటికీ శిథిలమాత్రంగానైనా నిలిచి ఉన్నాయని చెప్పవచ్చు.


3. సిద్ధేశ్వరం
పైన పేర్కొన్న ద్విపద పాదాలలో కుబేరేశ్వరం తర్వాత దోనమయ్య చూసింది సిద్ధేశ్వర లింగాన్ని అని ప్రస్తావించబడింది. ఈ సిద్ధేశ్వర ఆలయం హైదరాబాదు నుండి అచ్చంపేట మీదుగా శ్రీశైలం వైపు ప్రయాణిస్తున్నప్పుడు నల్లమల కొండల ప్రారంభంలో పారే ఒక వాగు కుడి ఒడ్డున ఉంది. 1975లో ఒక ఫారెస్ట్ రేంజర్‍ (అటవీ అధికారి) ఈ శిథిల ఇటుక ఆలయాన్ని చూసి శిథిలాలను అటూ ఇటూ తన్నుతూ శివలింగాన్ని కూడా తన్నగా అది విరిగి పోయిందట. ఆ తరువాత మనశ్శాంతి లేక ఆ రేంజర్‍ తన తప్పు తెలుసుకొని ప్రాయశ్చిత్తంగా శిథిల ఆలయ స్థానంలో ఒక షెడ్‍ను కట్టించాడట. అదే ఇప్పుడు ఉంది. చాలా చోట్ల ఉత్తరాభిముఖంగా ఉండే పానవట్టం ఇక్కడ తూర్పుకు అభిముఖంగా ఉంది. చతురస్రాకారంలో ఉన్న ఆ పానవట్టంలో ఒక ఫీట్‍ ఎత్తు లింగముంది. దానికి ఊర్ధ్వ పుండ్రాలున్నాయి. ఇదే సిద్ధేశ్వర లింగమై ఉంటుంది. ఎందుకంటే, సుమారు అర్థ శతాబ్దం కింద ఇక్కడ రోడ్‍ వేస్తునప్పుడు దొరికిన సిద్ధుల విగ్రహాలను ఇక్కడున్న ‘మూల మలుపు’ దగ్గర పోగేశారు. సిద్ధులు స్థాపించిన అరుదైన మరకత లింగం (చిగురు పచ్చనిది) 2010 వరకు కూడా అక్కడే ఉండేది. ఇప్పుడు కొన్ని సిద్ధుల విగ్రహాలు ఇక్కడికి సమీపంలో ఉన్న మన్ననూరు తూర్పునున్న ఒక వేపచెట్టు కింద ఉన్నాయి.


4. కుర్వ దారులు
సిద్ధేశ్వరం చూసిన తర్వాత దోనమయ్య ‘మల్లికార్జునము’ చేరుకోవడానికి సిద్ధేశ్వరం నుండి నేరుగా (అభిముఖుడుగా) అటువైపుగా ప్రయాణిస్తున్న యాత్రికుల బృందంతో కలిసి ఎదురుపడిన గుట్ట (కుర్వ)ను రెండుగా చీలిన దారుల ద్వారా పాకుతూ ఎక్కినాడని తెలిపే కింది పద్య పాదాలు పర్వత ప్రకరణంలో ఉన్నాయి.
‘…… మల్లికార్జునము
సన నభిముఖుడుగా సాతును నలరి
భోరున నగమధ్యమున దిగ జాగి
రతి కల్పవృక్షంబు ప్రాకెడు కల్ప
లతయును బోలె నల్లన కుర్వజేరి
యక్కజంబంద స్వర్గాపవర్గములు
నెక్కొని నిల్చిన నిశ్శ్రేణులట్లు
నెక్కొన్న యారెండు నిచ్చెనల్‍ గడచి’

పై పద్య పాదాలలో దోనమయ్య, యాత్రికులు కొండను సగం దాకా ఎక్కి కొంచెం దిగువ ప్రదేశానికి దిగజారారని, అక్కడ ఒక ఏటవాలు బాట కల్పవృక్షాన్ని పాకుతున్న కల్పలతలాగా కన్పించిందని, ఆ దారిలో కొంచెం ముందుకు ప్రయాణించగా అక్కడ స్వర్గాపవర్గాలకు చేరడానికి వేసిన నిచ్చెనలలాగా రెండు బాటలు కన్పించాయని, వాటిని వారు నిలువునా ఎక్కారని విపులీకరించబడింది.


యాత్రికులు కొండనెక్కారని సరళంగా చెప్పకుండా సోమనాథుడు పైన వివరించినంత పొడవుగా రచించడానికి కారణం ఆ కొండ మధ్యలో చాలా విశేషాలుండడం. ఒకటి, సోమనాథుడు పేర్కొన్నట్లుగానే దోనమయ్య ఎక్కిన కొండను స్థానికులు ఇప్పటికీ ‘కుర్వ’ గానే పిలుస్తున్నారు. ఆ కుర్వను సగం దూరం ఎక్కిన తరువాత ‘కుంచెన్‍ మలుపు’ అనే స్థలం వస్తుంది. ఇప్పుడు అక్కడి నుంచి కుడివైపు చూస్తే గుట్ట కింది నుండి రెండు బాటలు ఆ మలుపు వైపు కొంత దూరం ప్రయాణించి మధ్యలో కలిసిపోతుండడాన్ని గమనించవచ్చు. ఆ రెండు బాటలూ చిన్న రాతి గోడలవలె, పచ్చని చ్లె మధ్య సాగే తెల్లని పాపిటలవలె అందంగా కన్పిస్తున్నాయి – ఇప్పటికీ. ఇక కుంచెన్‍ మలుపు నుండి ఎడమ వైపు కుర్వ పైకి ప్రయాణించే బాటలో ప్రయాణిస్తే ‘మల్లికార్జునం’ వస్తుందని సోమనాథుడే పేర్కొన్నాడు.


5. గుప్త మల్లికార్జునము
దోనమయ్య కుర్వ దారుల్లో మల్లికార్జునం వైపే పయనించాడని ఇంతకు ముందు పేరాల్లో పేర్కొనడం జరిగింది. ఈ సందర్భంలో సోమన ఈ క్షేత్రాన్ని ‘మల్లికార్జునము’ అనే పేర్కొన్నాడు కాని పర్వత ప్రకరణంలోనే మరో చోట ‘గుప్త మల్లికార్జునము’ అని పేర్కొన్నాడు. ఇది కుంచెన్‍ మలుపుకు ఎడమ వైపున కొంత ఎత్తులో ఉంది. కుర్వను పూర్తిగా ఎక్కే పాతకాలపు (దోనమయ్య ఎక్కిన) బాట గుప్త మల్లికార్జున క్షేత్రం గుండానే సాగుతుంది. ఈ మల్లికార్జునం ఆలయం శ్రీశైల పూజారులు చదివే సాంప్రదాయ మహాసంకల్పంలో కూడా పేర్కొనబడుతుంది – దివ్య స్థానంగా. ఈ ఆలయం ఇప్పుడు శిథిలమైంది. చుట్టు పక్కలా పెద్ద పెద్ద చెట్లు పెరిగి ఎండాకాలంలో తప్ప ఇతర కాలాల్లో కన్పించకుండాపోతుంది.


కాకతీయుల కాలం (క్రీ.శ.1323) తర్వాత ఢిల్లీ సుల్తానుల సైన్యం చేతుల్లో ఈ క్షేత్రం ధ్వంసం అయ్యుంటుంది. ఎందుకంటే ఆ తరువాత శతాబ్ది కాలానికే ఈ క్షేత్ర పరిసరాల్లో ఉన్న ఒక గుండుపైనున్న శాసనంలో ఇక్కడి స్థానిక రాజులు అడవిని పెంచారు అని రాసి ఉంది. ఇది ఇలా ఉండగా ప్రస్తుత మన్ననూరు తండాకు తూర్పున ఒక కిలో మీటరు దూరంలో ‘మల్లప్పగుట్ట’ ఉంది. దానిపైన మల్లికార్జున ఆలయముంది. సోమన పేర్కొన్న ‘మల్లికార్జునము’ ఈ మల్లప్పగుట్ట కూడ కావచ్చు.


6. శివపుర ద్వారం
ఉమామహేశ్వరం కొండ పైన శివపురము, దానికి ద్వారము, తీర్థము ఉన్నాయని, అవన్నీ మహిమోపేతమైనవని వాటిని గురించి వింటూ, సంతోషిస్తూ దోనమయ్య మల్లికార్జునము వైపు సాగాడని సోమన ఇలా వర్ణించాడు.
‘ఘనమగు తన్నగాగ్రము శివపురము
మహిమయు తద్ద్వార మహిమయు లేర
మహిమయు వినుచు ధీమణి దోనమయ్య
మనమున హర్షించి…’

పై పాదాల్లో పేర్కొనబడిన శివపురం ఇప్పుడు లేదు గాని దాని ద్వారం మాత్రం ఇప్పుడు కుంచెన్‍ మలుపు దాటిన తరువాత రోడ్‍ పక్కన గుట్టదరి వైపు కన్పిస్తుంది. ఈ ద్వారానికి పూర్వ కాలంలో తలుపులు కూడా ఉండేవి. ఈ ద్వారం గుండా శ్రీశైలం లేదా ప్రతాపరుద్రకోటలోకి సాగే రాచబాటకు కాపలాదారులుగా పనిచేసిన వారు రాచమల్లు వంశంగా పేరొందినారు. (శ్రీశైల యాత్రికుల కోసం వారు తవ్వించిన బావి ఇక్కడికి ముఫ్పై కిలోమీటర్ల దూరంలో ఉంది. దాన్ని రాచమల్ల బావి అనే ఇప్పటికీ పిలుస్తున్నారు). ఈ తలుపుల ద్వారం ప్రాంతాన్ని ‘తలుపుల కుర్వ’ అని పిలుస్తున్నారు. ఇది దాటి మన్ననూరు వైపు సాగుతున్నప్పుడు మనకు అడ్డంగా ఒక ఏరు కలుస్తుంది. దాని ‘తీరం’లో ఒక శివాలయం, దానికి ఈశాన్యంలో ఒక గుండం, దాని ఒడ్డున ఒక శిథిలాలయం కన్పిస్తాయి. ఈ గుండం పాల్కురికి పేర్కొన్న బ్రహ్మగుండం, సమాధి తీర్థం అని స్థానిక చరిత్రకారులు కపిలవాయి లింగమూర్తి భావించారు కాని సమాధి తీర్థం మరోచోట ఉంది.  (తరువాయి వచ్చే సంచికలో)

– ద్యావనపల్లి సత్యనారాయణ,
ఎ : 94909 57078
(‘తెలంగాణ కొత్త విహార స్థలాలు’ పుస్తకం నుంచి)
ప్రతులకు: తెలంగాణ రిసోర్స్ సెంటర్‍, చంద్రం 490, వీధి నెం.12, హిమయత్‍నగర్‍, హైదరాబాద్‍-29.
తెలంగాణ. వెల: రూ.100

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *