రాజుల కాలంలో రాజు చెప్పిందే వేదం. అరెస్టులు నేరారోపణలు, శిక్షలు అన్నీ రాజే చేసేవాడు. వాళ్ళ అధికారానికి ఎలాంటి పరిమితులు లేవు. వాళ్ళకు తోచింది చేసే అవకాశం వుండేది. అనుమానం మీద, నేరారోపణల మీద శిక్షలు విధించేవాళ్ళు. దాని ఫలితంగా స్వేచ్ఛ లేకుండా పోయింది. నిరంకుశత్వం పెరిగిపోయేది. కొన్ని శతాబ్దాలుగా ఈ పరిస్థితులు కొనసాగాయి.
ఈ పరిస్థితుల్లో 1215వ సంవత్సరంలో ‘మాగ్నాకార్టా’ వచ్చింది. అందులోని ముఖ్యాంశం ఎలాంటి బలపరిచే సాక్ష్యాలు లేకుండా, ఒక వ్యక్తి వాంగ్మూలం ఆధారంగా, విశ్వసనీయ సాక్ష్యాలు లేకుండా ఏ అధికారి కూడా ఏ వ్యక్తిని భవిష్యత్తులో విచారణకు నిలబెట్టకూడదు. ఎవరి స్వేచ్ఛనైనా హరించాలంటే దానికి న్యాయబద్ధమైన ఉత్తర్వులు కానీ, తీర్పుకానీ వుండాలి.
మాగ్నాకార్టులో పొందుపరిచిన విషయాలకు మన రాజ్యాంగకర్తలు కూడా అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. ఆ విషయాలను పొందుపరుస్తూ ఆర్టికల్స్ ని రాజ్యాంగంలో ఏర్పాటు చేశారు. మగ్నాకార్టుతో బాటూ విశ్వజనీన మానవ హక్కుల ప్రకటన కూడా మన రాజ్యాంగ నిర్మాతలని ప్రభావితం చేసింది. మన దేశం గణతంత్ర దేశంగా ఏర్పడక ముందే అది అమల్లో వుంది.
మానవ హక్కులని మన రాజ్యాంగంలో ప్రత్యేకంగా చెప్పలేదు. వాటి గురించి ప్రత్యేకంగా పేర్కొనలేదు. కానీ మన ప్రాధమిక హక్కులన్నీ మానవ హక్కులే. అదే విధంగా విశ్వజనీన ప్రకటనలోని చాలా విషయాలని మన రాజ్యాంగంలోని నాలుగవ ప్రకరణలో పొందుపరిచారు. అవే ఆదేశిక సూత్రాలు. అయితే వీటి అమలు కోసం కోర్టుకి వెళ్ళడానికి అవకాశం లేదు.
కేసు కోర్టుకి వచ్చిన తరువాత దాని మీద న్యామూర్తికి ఎక్కువ నియంత్రణ వుంటుంది. నిష్పాక్షిక విచారణ జరిగేవిధంగా చూడాల్సిన బాధ్యత న్యాయమూర్తిపై వుంటుంది. కేసు విచారణ రాజ్యాంగంలోని హక్కులకి అనుగుణంగా, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా జరగాలి. ఆ విధంగా జరగనప్పుడు అది లోపభూయిష్టమైన విచారణగా పరిగణించబడుతుంది.
కోర్టు విచారణ ప్రధాన ఉద్దేశ్యం – సత్యాన్ని తెలుసుకోవడం. ఈ తెలుసుకునే క్రమంలో కోర్టులు నిష్పక్షపాతంగా వుండాలి. ఈ నిష్పక్షపాతం అనేది అందరిపట్ల వుండాలి. వాళ్ళు ముద్దాయిలు కావొచ్చు. బాధితులు కావొచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే సమాజం పట్ల నిష్పక్షపాతంగా వుండాలి. అందరూ కోరుకునేది అదే. విచారణ అనేది నిష్పక్షపాతంగా రాజ్యాంగంలోని అధికరణ 21కి అనుగుణంగా వుండాలి.
నిష్పక్షపాత విచారణకు రెండు ఉద్దేశ్యాలు వున్నాయి. అవి ముద్దాయికీ, అదే విధంగా ప్రాసిక్యుషన్కి నిష్పక్షపాతంగా వుండాలి. అదే విధంగా న్యాయమూర్తికి రెండు ప్రధానమైన విధులు వున్నాయి. మొదటి దాని ప్రకారం అమాయకులకి శిక్ష పడకుండా చూడాలి. అదేవిధంగా తప్పు చేసిన వ్యక్తి శిక్షనుంచి తప్పించుకొని పోకుండా చూడాలి. రెండూ ముఖ్యమైన విధులే!
మొదటిది ఎంత ముఖ్యమో రెండవది అంతే ముఖ్యమైనది. నేరవిచారణలో నేరం నిరూపణ అయ్యేవరకు ముద్దాయిని అమాయకునిగా పరిగణించాలి.
మన క్రిమినల్ జ్యురిస్ప్రుడెన్స్ ప్రకారం ఆరు ముఖ్యమైన సూత్రాలు వున్నాయి. ఈ ఆరింటితో బాటు కొత్తగా మరొకటి చేరింది. అవి..
- నేరం నిరూపణ అయ్యేంత వరకు ముద్దాయిని అమాయకునిగా పరిగణించాలి.
- నేరనిరూపణ భారం ఎప్పుడూ ప్రాసిక్యూషన్ పైనే వుంటుంది. తాను అమాయకుడినని రుజువు చేసుకోవాల్సిన బాధ్యత ముద్దాయిపై వుండదు.
- నేర నిరూపణ అనుమానానికి అతీతంగా వుండాలి. అంటే ఆ విధంగా ప్రాసిక్యూషన్ రుజువు చేయాల్సి వుంటుంది.
- ప్రాసిక్యూషన్ కథనంలో సహేతుకమైన సంశయం వుంటే సంశయలబ్ధి ముద్దాయికే లభిస్తుంది.
- భారతీయ శిక్ష్మాస్మతిలోని సాధారణ మినహాయింపుల విషయంలో ముద్దాయి కేసు ప్రభలతని రుజువు చేస్తే సరిపోతుంది. ప్రాసిక్యూషన్ మాదిరిగా అనుమానానికి అతీతంగా రుజువు చేయాల్సిన అవసరం లేదు.
- 99 మంది ముద్దాయిలు తప్పించుకున్నా పర్వాలేదు. కానీ ఒక్క అమాయకుడికి శిక్ష పడకూడదు.
కాలక్రమంలో ఈ చివరి సూత్రానికి కొంత మార్పు వచ్చింది. ఇప్పుడు మారిన జ్యురీస్ ప్రుడెన్స్ ప్రకారం – అమాయకుడికి శిక్ష పడకుండా చూడాల్సిన బాధ్యత న్యాయమూర్తిపై ఎలా వుందో, తప్పు చేసిన వ్యక్తి శిక్ష నుంచి తప్పించుకోకుండా చూడాల్సిన బాధ్యత కూడా న్యాయమూర్తిపై వుంటుంది.
నేరనిరూపణ జరిగే వరకు ముద్దాయిని నిరపరాధిగా పరిగణించాల్సి వుంటుంది. అది ముద్దాయి మానవ హక్కు. మౌలికమైన హక్కు. ఈ భావన, ఈ హక్కు దర్యాప్తు నుంచి నేరనిరూపణ జరిగే వరకూ వుండాలి. దీని అర్థం నేరనిరూపణ చేయాల్సిన బాధ్యత ప్రాసిక్యూషన్‌పై వుంటుంది. ఈ విషయం మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. బాధితులకి కష్టం కలిగే విధంగా, సమాజానికి నష్టం వాటిల్లే విధంగా ఈ నిబంధన వుందని చాలా మంది వాదిస్తూ వుంటారు.
అయితే ఈ వాదనలో, ఈ అభిప్రాయంలో ఎలాంటి పసలేదు. ఎందుకంటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌ని, సాక్ష్యాధారాల చట్టాన్ని ఏ ఒక్కరికో లబ్ది చేకూర్చే విధంగా తయారు చేయలేదు. ఆ ఇద్దరికే కాదు సమాజానికి తగు న్యాయం జరిగే విధంగా తయారు చేశారు. నేరనిరూపణ భారం ప్రాసిక్యూషన్‌పై వుండకూడదని నేరం తాను చెయ్యలేదని రుజువు చేసుకోవాల్సిన బాధ్యత ముద్దాయిపై వుండాలన్న వాదన తరుచూ వస్తుంది. మరీ ముఖ్యంగా తీవ్రమైన నేరాలు, హీనమైన నేరాలు జరిగినప్పుడు ఈ వాదన వస్తుంది. అయితే ఈ వాదనతో ఏకీభవించలేం.
మన దేశంలోని చాలా మంది నేరస్తులు నిరుపేదలు, దిక్కూదివాణంలేని వ్యక్తులు. వాళ్ళు తాము నేరం చేయలేదని రుజువు చేసుకోవడంలో విఫలమవుతారు. అలాంటి సందర్భాల్లో న్యాయమూర్తి వాళ్ళకి శిక్ష విధించాల్సి వస్తుంది. దాని వల్ల అమాయకులకి పెద్ద ఆపద వస్తుంది.
కేసుని ఎదుర్కొనే శక్తిసామర్థ్యాలు మన దేశంలోని చాలామందికి లేవు. తమపై మోపిన నేరారోపణలని ఎదుర్కొనే సామర్థ్యం మనదేశ ప్రజలకి రాలేదు. ఇక ‘రాజ్యం’ విషయానికి వస్తే అది శక్తివంతమైంది. నేరాన్ని రుజువు చేసే క్రమంలో రాజ్యం శక్తిని మనం చెప్పలేం. రాజ్యానికి ఎన్నో వనరులు వుంటాయి. పోలీసులు, ప్రాసిక్యూషన్ వ్యవస్థలాంటి ఎన్నో సంస్థలూ, వ్యక్తులూ రాజ్యం వద్ద వున్నాయి. మామూలు ప్రజల వద్ద లేవు.
అందుకని నేరం నిరూపణ అయ్యేంత వరకు ముద్దాయిని నిరపరాధిగా చూడాలన్న సూత్రం ఆవశ్యకత ఎంతో వుంది. అది ముద్దాయికి డాలుగా ఉపయోగపడుతుంది. శక్తివంతమైన రాజ్యాన్ని ఎదుర్కోవడానికి అది కవచం మాదిరిగా కూడా ఉపయోగపడుతుంది. ఈ రెండింటికీ మధ్య సమతూకాన్ని చూడాల్సిన బాధ్యత న్యాయమూర్తిపై వుంటుంది.
నరేందర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ (2004) క్రిమినల్ లా జర్నల్ 2842 కేసులో సుప్రీంకోర్టు నిరపరాధి అన్న భావనని మానవహక్కుగా అభివర్ణించింది.
పవన్ క్రిష్ణలాల్ వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ కేరళా (1995 ఎస్సిసి 187) కేసులో కూడా ఇదే విషయాన్ని తిరిగి చెప్పింది. ఇది భారత రాజ్యాంగంలోని అంతర్భాగం అని కూడా ఈ తీర్పులో పేర్కొంది.
సివిల్ కేసుల్లో తీర్పులని కేసులోని ప్రభావితాన్ని బట్టి ప్రకటిస్తారు. కానీ క్రిమినల్ కేసుల్లో అలాకాదు. ఇదే విషయాన్ని భారతీయ సాక్ష్యాధారాల చట్టంలోని సె.101 అదేవిధంగా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని సె.161 (2) కూడా చెబుతుంది.
సె.101 ప్రకారం ఏదైనా విషయం గురించి తీర్పు చెప్పమని ఎవరైతే వస్తారో ఆ విషయాన్ని రుజువు చేయాల్సిన బాధ్యత వారిపైనే వుంటుంది. ముద్దాయి నేరం చేశాడని, శిక్ష వేయాలని ‘రాజ్యం’ అభియోగం దాఖలు చేస్తుంది. కాబట్టి దాన్ని రుజువు చేయాల్సిన బాధ్యత రాజ్యంపైనే వుంటుంది.
తాను నేరం చేయలేదని రుజువు చేసుకునే పరిస్థితి ముద్దాయిపై ఏర్పరిస్తే అది ఏకపక్షం అవుతుంది. న్యాయబద్ధం కాదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21కి వ్యతిరేకం. అది మానవ హక్కుల ఉల్లంఘన అవుతుంది.కొన్ని శాసనాల్లో, కొన్ని సందర్భాల్లో ముద్దాయి నేరం చేశాడన్న నిజమనే భావనకి వచ్చే విధంగా మార్పులు తీసుకొని వచ్చారు. అది సమంజసం కాదు. స్థూలంగా చెప్పాలంటే నేరం నిరూపణ అయ్యేంత వరకు ముద్దాయని నిరపరాధిగానే పరిగణించాల్సి వుంటుంది. అది మానవ హక్కు. రాజ్యాంగ హక్కు.
-మంగారి రాజేందర్ (జింబో)
ఎ : 9440483001