సామాన్య జనజీవనంలో నుండి ఆవిర్భవించి వర్ధిల్లినవి జానపద కళలు. ఇవి స్వయంభువులు. సామాన్య ప్రజల ఆశలకూ, ఆశయాలకూ, ఆలోచనలకూ, ఆవేదనలకు ప్రతిబింబాలు కావడం వల్ల ఇప్పటికీ సజీవంగానే నిలిచి ఉన్నాయి. జానపద కళలు మన సంస్కృతికి, సంప్రదాయాలకు ప్రతీకలు కాబట్టి ఎంతకాలం మన ఆలోచనల మీద ప్రభావాన్ని చూపుతాయో అంతకాలము అవి నిలిచి వుంటాయి. జానపద కళలలో యక్షగాన వాఙ్మయము అతి ప్రాచీనమైనది. దీనిని ప్రజాసాహిత్యమని చెప్పవచ్చు. ఇతివృత్తం పౌరాణికాలు గానీ, సాంఘికాలుగానీ, ఏదైనప్పటికీ ఆబాల గోపాలాన్ని అలరించింది. అంతేకాదు భారత, భాగవత, రామాయణాలలో ఉన్న గొప్పతనాన్ని, విలువలను సామాన్యమానవుని అనుభవంలోకి తీసుకు వచ్చి, సాహిత్యపు వైశిష్ట్యాన్ని చవి చూపాయి.
యక్షగానమనగా యక్షులచేత గానం చేయబడేది అని అర్థం. యక్షులంటే పూజనీయులు, శ్రేష్టులనీ, యక్షగానమంటే శ్రేష్టమైన గానమనీ అర్థంతో చెప్పుకోవచ్చు. యక్షగానం దేశీయ ఛందోబద్దమైన నాటకం. బ్రౌణ్య నిఘంటువు యక్షగానాలను పాటగా పేర్కొన్నది. అప్పకవి దృష్టిలో యక్షగానమంటే పాటలుగల ప్రబంధం. యక్షగానాలు శ్రీనాథుని కాలంలో చాలా ప్రచారంలో ఉండేవి.
‘‘కీర్తింతు రెద్దాని కీర్తి గాంధర్వులు
గాంధర్వమున యక్షగాన సరణి’’
అన్నదానిని బట్టి ఈ విషయం స్పష్టమవుతుంది. 12వ శతాబ్దానికి చెందిన పాల్కురికి సోమనాథుడు యక్షగాన ప్రదర్శన విధానం గురించి వర్ణించాడు. చెన్నశౌరి రాసిన సౌభరిచరితమే తెలుగులో మొదటి యక్షగానమని చెప్పవచ్చు. కానీ ఈ గ్రంథము అలభ్యము. దొరికిన ఆధారాలను బట్టి కందుకూరి రుద్రకవి రాసిన సుగ్రీవ విజయమే తొలి తెలుగు యక్షగానమని స్పష్టమగుచున్నది.
యక్షగానంలో పౌరాణిక ఇతివృత్తాల కన్నా కాల్పనికాలు ఎక్కువగా కనిపిస్తాయి. యక్షగాన ప్రదర్శనలు జనపదాల్లోకి చొచ్చుకొని పోవడం వల్ల ప్రజలు పౌరాణిక ఇతివృత్తాలను విస్మరించి కల్పనలనే వాస్తవమని భ్రమపడే అవకాశం ఏర్పడింది.
ఈనాటికీ యక్షగానం సజీవంగా నిలిచి వున్నదంటే దానికి కారణం తెలంగాణ యక్షగాన పితామహుడు చెర్విరాల భాగయ్యగారు. వీరు మెదక్ జిల్లా గుమ్మడిదల నివాసి. వీరు 34 పైగా యక్షగానాలు రచించారు. వీరి యక్షగానములు రచనా పక్రియలో, వస్తు తత్త్వములో వైవిధ్యమును ప్రదర్శించినవి. ప్రసిద్ధమైన పాత్రలకు కల్పితమైన ఇతివృత్తాలు చేర్చి భాగయ్యగారు ఎన్నో యక్షగానాలు రాశారు. అందులో డాంగ్వే యోపాఖ్యానము, అల్లీరాణికథ, కనకతార చరీతము, గులేబకావళి కథ, రంభా రంపాల, జయంతపాలము. మొదలైన కల్పిత యక్షగానాలు ప్రదర్శింపబడి తెలుగునాట ఎంతగానో ప్రజాదరణ పొందాయి. భాగయ్యగారు రాసిన కల్పిత కథల్లో జయంతజయపాలము ఒకటి.
చోళదేశాన్ని పాలించే రథాంగ మహారాజు కుమారుడు జయపాలుడు. వీరి మంత్రి రత్నాంగుడు. ఇతని కుమారుడు జయంతుడు. జయంత జయపాలులు ప్రాణస్నేహితులు. వీరిద్దరి మధ్య స్నేహాన్ని చెడగొట్టడానికి నియమించబడిన వేశ్య భువనసుందరి. జయపాలుని భార్య ప్రభావతి. ఈమెకు మేదరి వెంకన్నతో అక్రమ సంబంధము ఉంటుంది. ప్రభావతి భర్త నిద్రించిన తర్వాత మేదరి వెంకన్న వద్దకు వెళ్తుంది. ఆలస్యమైనందుకు మేదరి వెంకన్న కోపపడగా, ప్రభావతి తన భర్త వచ్చాడని చెప్తుంది. వెంకన్న ప్రభావతికి ఖడ్గమిచ్చి తన భర్తను చంపుమనగా, చంపేసి ఆ నేరాన్ని సాధువుపై మోపి దుఃఖిస్తుంది. ప్రభావతి మాటలు నమ్మి రాజభటులు సాధు వేషంలో ఉన్న జయంతుని బంధించి చెరసాలలో వేస్తారు. ప్రభావతి సోదరుడైన చంద్రశేఖరుడు నిజాన్ని గ్రహించి జయంతుని విడిచి పెడతాడు. ప్రభావతి ఒకరోజు రాత్రి మేదరి వెంకన్న ఇంటికి పోవుచుండగా పట్టుకొని, చంద్రశేఖరుడు వారిరువురిని బంధించి శిక్ష వేస్తాడు.
జయంతుడు, జయపాలుని అస్థికలను మూటకట్టుకొని తన భార్య భానుమతి దగ్గరు వెళ్తాడు. శయన మందిరములో నిద్రిస్తుండగా భానుమతి చేయి జయపాలుని అస్థికల మీద పడగా జయపాలుడు పునర్జీవితుడవుతాడు. లేచి శయ్యమీద ఉన్న జయంతున్ని చూసి కోపంతో కంఠం నరికివేస్తాడు. భానుమతి జయపాలున్ని దూష్తింది. భానుమతి కాళీమాత వరప్రభావం వల్ల జయంతుని బ్రతికిస్తుంది. జయపాలుడు తన తప్పును తెలుసుకొని జయంతుని క్షమించమంటాడు.
ఈ యక్షగానంలో అడుగడుగునా ఉత్కంఠను రేకెత్తించే సన్నివేశాలు కనబడతాయి. కథలోని మలుపులు ప్రేక్షకులను ఆశ్చర్యంలో ముంచెత్తుతాయి. ఈ యక్షగానం స్నేహానికీ, పాతివ్రత్యానికీ, నీతికీ ఎప్పటికైనా విజయం సిద్దిస్తుందనీ గొప్ప సందేశాన్నిచ్చింది. కాల్పనిక ఇతివృత్తాలలో ఊహకందని సన్నివేశాలు కనిపిస్తాయి. అవి రచయిత అసంకల్పితంగా సృష్టించాడనడానికి అవకాశం లేదు. ఎందుకంటే ప్రతి సన్నివేశానికి ఒక ప్రయోజనం కనిపిస్తూనే
ఉంటుంది.
- డి. రాజు
ఎ : 998951554