అమ్మదేవతల కొలువు


అడివిలో నివసించే మనుషులకు, వ్యవసాయం చేస్తున్న వారికి భూమి అమ్మ. పిల్లలకు జన్మనిస్తున్న స్త్రీలను, పంటలనిస్తున్న భూమిని పోల్చుకున్నారు. ఇద్దరికి వున్న సంతానశక్తిని చూసి అచ్చెరువు పొందిన పురామానవులు భూమిని స్త్రీగా, అమ్మగా, స్త్రీని అమ్మదేవతగా చేసుకున్నారు. జంతువులలో, చెట్లలో, మనుష్యులలో పునరుత్పత్తి శక్తులను గమనించిన మానవులు వాటి ప్రజనన(ఫెర్టిలిటి) శక్తికి అబ్బురపడిపోయారు. సంతానం కోరి, పంటల్ని కోరి, ఉత్పత్తి కేంద్రాలైన స్త్రీలను, భూమిని, జంతువులను, చెట్లను ఆరాధించారు. అడివిని కోరిన తిండి యివ్వమని, రక్షణ కల్పించమని, ఎల్లప్పుడు తన ఒడిలో దాచుకొమ్మని ప్రార్థన చేస్తారు. వాళ్ళకు అడివి తెలుసు, అడివిలోని జంతువులు, చెట్లు చేమలు, పండ్లు, వేర్లు, గడ్డలు తెలుసు. వానలు, కొండ కాలువలు, నీటిగుండాలు, మట్టి, రాళ్ళు అన్నీ తెలుసు. చెట్టుని, పుట్టని, గుట్టని, జంతువుల్ని, పిట్టల్ని, వాగుని, వంకని, బువ్వనిచ్చే భూమిని, పెద్దల్ని గిరిజనులు గౌరవించారు, ఆదరించారు. వాటన్నిటికి మహిమలున్నాయని భావించారు. భౌతిక జీవనం నుంచే, సామాజిక జీవితం నుంచే భావనలు పుట్టుకొచ్చాయి. ప్రకృతి ప్రేమికులైన ఆదిజనులు ప్రక•తిసిద్ధమైన వాటినన్నిటికి మానవాతీత ఆరోపణలు చేసుకున్నారు. ఆరాధనలు మొదలుపెట్టారు.


ఆదిమానవులు నివసించిన తమ ఆవాసాలలో వేసిన రాతిచిత్రాలలో స్త్రీని చిత్రించిన తీరు అపురూపం. ఖమ్మం జిల్లా రామచంద్రాపురం దగ్గరలోని నీలాద్రి రాతిచిత్రాలలో స్త్రీరూపానికి బదులుగా యోని (Vulva)ని చిత్రించారు. వాటిని మొదట పెట్రోగ్లైఫ్స్గా చెక్కి, ఎరుపు రంగుతో చిత్రించారు. చిత్రించడానికి వాడిన త్రిభుజాకారపు గుర్తు ఏదో లిపిలోని అక్షరంలెక్క వుంది. అట్లాంటివి గుర్తులు ఈ రాతిచిత్రాలలో ఎక్కువచోట్ల గమనించాను. క్యూనిఫారం లిపిలో స్త్రీ అని అర్థానికి వాడిన త్రిభుజాకారపు అక్షరచిహ్నం (ఫాంట్‍) నీలాద్రి రాతిచిత్రాలలోని త్రిభుజాకారపు గుర్తులు ఒకటే విధంగా ఉన్నాయి. త్రిభుజశీర్షం నిటారుగా కాక ఒకవైపునుండడం గమనించాలి. త్రిభుజాకారాన్ని స్త్రీత్వానికి, స్త్రీ సంతానోత్పత్తిని సూచించడానికి వాడడం ఆచారంగా వుంది. శ్రీయంత్రం కొన్ని త్రిభుజాల సమ్మేళనం. ఇప్పటికి త్రిభుజాకారపు రాయిని ‘మైసమ్మ’గా కొలువడం సిద్ధిపేట జిల్లా జనగాంలో మా చరిత్రబృందం గుర్తించింది. జనగామజిల్లా వెల్దండ గుట్టమీద కూడా చేయిచెక్కిన త్రిభుజాకారపు రాయి అమ్మదేవతగా కొలువులందుకుంటున్నది.


నీలాద్రి రాతిచిత్రాలలో రెండు చోట్ల స్త్రీ ప్రసవ చిత్రాలు కనిపించాయి. యోనిగుర్తులు, ప్రసవచిత్రాలు మాత•దేవత మూర్తులను గుర్తుకు తెచ్చాయి. క్రీ.పూ. నుంచి మధ్యయుగాల చివరదశ దాక తెలంగాణాలో నగ్నకబంధగా పిలువబడే మాత•దేవతాశిల్పాలు నాగార్జునకొండ, కీసర, సింగరాయకొండ, ఆలంపురాలలో, అనేక మధ్యయుగాలనాటి దేవాలయాలలో అగుపిస్తుంటాయి. ఇటువంటి యోనిచిత్రాలు, ప్రసవ దృశ్యాలను పచ్‍ మరి, బింబేట్కా వంటి రాతిచిత్రాల తావులలో, మధ్యయుగాల నాటి దేవాలయాల్లో కూడా చెక్కినారు. కడపజిల్లా చింతకుంట రాతిచిత్రాలలో కూడా చారిత్రకకాలానికి చెందిన లజ్జాగౌరి చిత్రం గీయబడిఉంది. ఆస్ట్రేలియాలోని రాతిచిత్రాలలో కూడా నగ్నకబంధ చిత్రం కనిపించింది. ఈ అమ్మదేవతల భావన అతి ప్రాచీనం.


పశుపాలకులైన పురామానవులు, వ్యవసాయం చేపట్టేవరకు తినదగిన ఆహారంలోనికి పండ్లు, వేర్లు, గడ్డలు, జంతువులు, చెట్ల రకాలు, గడ్డి ధాన్యాలు చేరాయి. అవి వాళ్ళకు పవిత్రమైనవి. ఈ పవిత్రత లేక అతీత భావనలు చోటు చేసుకుంటున్న కొద్ది ఆరాధనా రూపాలు అవతరించడం మొదలైంది. తాము నివసించే ప్రదేశాలు వారి మీద చూపిన ప్రభావాలన్ని వారి ఆరాధనా భావనలుగా మారుతూ వచ్చాయి. ద్రిమ్మరిజీవనంలో మాడ్చే ఎండలు, కొంపలు కూల్చే తుఫాన్లు, భయంకరమైన ఉరుములు, పిడుగులు ఆకాశం నుంచే వస్తున్నాయి. కనుక ఆకాశం దైవభావనలోనికి చేరింది.


మొదటి వ్యవసాయకులు స్త్రీలే అంటాడు గోర్డన్‍ చైల్డ్. భూమికున్న ఫలదీకరణ శక్తిని గుర్తించింది వారే. తమతో పోల్చుకున్నారు. సాగుచేయడం మొదలుపెట్టారు. కడుపులో బిడ్డను సాకినట్లే మొక్కల్ని సాకింది ఆడవాళ్ళే. తర్వాత కాలంలో స్త్రీలతో వృక్షారోపణం చేయించడం అట్లాంటిదే. కడుపుతో వున్న స్త్రీతో విత్తనాలు పాతించడం ఒక ఆచారం. ‘అమ్మదేవతలు దేవతలందరిలో ప్రథమస్థానం పొందారు. సాంఘిక నిర్వహణ స్వభావం మీద ఆధారపడి స్త్రీల పట్ల గౌరవం ఏర్పడింది. ఒకప్పుడున్న మాతృస్వామిక సమాజాలలో స్త్రీదే పెద్దరికపు స్థానం’ అంటాడు డేవిడ్‍ ఆర్‍ స్టార్‍ బక్‍ అనే అమెరికన్‍ ఆంత్రోపాలజిస్టు, ఆర్కియాలజిస్టు.


దేవుళ్ళలో దేవతల ఆధిక్యత, పూజారులలో పూజారిణుల పెద్దరికాలకు కారణం పైతృకత్వం కన్నా మాతృత్వం మిన్నగా గుర్తించడం వల్లనే. వేట-ఆహార సేకరణ దశలో మనిషి చేసిన ఉత్పత్తి అనేది లేదు. గింజలు, పండ్లు, చిన్న జంతువులు ఆహారంగా తీసుకునేటపుడు మనుషుల నడుమ శ్రమ విభజన లేదు. ఈటె కనుక్కొన్న తర్వాత మగమనిషికి వేట ముఖ్యమైన పని అయింది. స్త్రీలకు ఆహారసేకరణే ప్రధానమైంది. వేట జీవితమైన మానవజాతులలో స్త్రీలకు పూర్వపు చలన సమయం తగ్గిపోయింది. వేట నుంచి పశుపోషణ పురామానవుల జీవితంలో ఒక పరిణామం. అపుడు పశువుల కాపలా, పోషణ పురుషులకు మారింది. ఆవాసాల సమీపంలోనే స్త్రీలు విత్తనాలు నాటి సాగుచేయడం మొదలైంది. చిన్న, చిన్న ఆహారపంటల తోటల సాగు ప్రారంభం. తవ్వుకోలతో మొదలైన వ్యవసాయం నాగండ్లకు మారేసరికి వ్యవసాయం కూడా పురుషుల పాలైంది. స్త్రీ, పురుషుల మధ్య ఉత్పత్తిశ్రమల మారకం మాతృస్వామ్యం నుంచి పితృస్వామ్యానికి సామాజిక అధికారాలు మారిపోయాయి. ‘ఆహారసంపాదనలో భాగంగా రాతియుగం నాటి తవ్వుకోలతో విత్తనాల సేకరణచేసి, స్త్రీలు వ్యవసాయాన్ని మొదలుపెట్టారు. పశువులను (గుర్రాలు, ఎద్దులు) కట్టి నాగండ్లతో దున్నడం కనిపెట్టినాక పితృస్వామ్యం మొదలైందనవచ్చు’. రుగ్వేదంలో మనువు వ్యవసాయం మొదలు పెట్టినట్లు చెప్పబడ్డది.


స్త్రీని శక్తిగా ఆరాధించడానికి కారణం స్త్రీని ప్రకృతిగా గుర్తించడమే. స్త్రీ జగన్మాతగా అంగీకరించడానికి మూలం. పౌరాణికంగా దేవిని శివుని పరివారగణంలో చేర్చి చెప్తారు. కాని, మధ్యధరా తీరదేశాల్లో అమ్మదేవత అనుచరగణంగా పురుష దేవుడుంటాడు. ప్రతిచోట ఆమె పెండ్లికాని స్త్రీగానే పేర్కొనబడింది. పవిత్రగర్భధారణ ద్వారా ఆమెకు సంతానం. దేవీ ఆరాధనలో గోప్యమైన ఆచరణలు, పరిశీలనలు గమనించినపుడు అవి పెండ్లి వ్యతిరేకత, శృంగారాల చెరిపివేతలను బోధిస్తున్నాయనిపిస్తుంది. ఇటువంటివి తండ్రిపాత్రను తక్కువగా చూసేటి, తండ్రి ప్రాధాన్యతలేని సమాజాచరణలో భాగమనిపిస్తుంది. మనిషి ఈ భూమ్మీద వున్నంతకాలం తిండి, పిల్లల్ని కనడం ప్రాథమికమైనవే. మనిషి ఉనికికి సరిపోయినంత ఆహారాదులు తప్పనిసరి. బతుకు మీద పెద్దమనుషుల తాత్వికతనే తర్వాతి తరం అందిపుచ్చుకుని వస్తున్నది.


గిరిజనులు, పురజనులు విత్తనాలు అలుకు చల్లేటపుడు, మొలకలు వేసేటపుడు నిలిపిన ఒక రాయికి గాని, 5 రాళ్ళకుగాని కుంకుమ చల్లుతారు. అది బహిష్టు రక్తానికి సంకేతం. మొహంజొదారోలో దొరికిన అమ్మదేవతలుగాని, ఇతర దేశాలలో లభించిన వీనస్‍, మాల్టేస్‍ వంటి అమ్మదేవతలు ఎరుపురంగు పూతతోనే వున్నాయి. పురాణాలలో, ప్రతిమా లక్షణశాస్త్రాలలో దేవతల వర్ణనలో రక్తవర్ణమే ప్రధానం. ప్రపంచవ్యాప్తంగా బహిస్టవుతున్న లేదా గర్భంతోవున్న స్త్రీమూర్తులు ఎరుపురంగుతోనే చిత్రించబడివున్నారు. పెళ్ళైన స్త్రీలు మాత్రమే నుదుట సింధూరం ధరించడానికి కారణం వారు మాత్రమే సంతానార్హులు అని తెలుపడానికేనని ఆంత్రోపాలజిస్టుల అభిప్రాయం. ఎరుపు పునర్జీవనానికి గుర్తు కనుక అంతటా విస్తరించిన ఈ ఆచారం ఒక ప్రాధాన్యమైన తంతు.


ప్రాచీన భారతదేశంలో పెండ్లితంతులో స్త్రీని విత్తనక్షేత్రంగా సంబోధించి, పురుషుణ్ణి నీ విత్తనాన్ని నాటుమని అంటారు. మనుస్మృతి కూడా పురుషుణ్ణి విత్తనంగా, స్త్రీని క్షేత్రంగా పేర్కొంటున్నది. ఖురాన్‍ ‘మీయొక్క స్త్రీలు క్షేత్రాలు’ అంటుంది. తల్లిగర్భం భూగర్భం రెండు సమానమే. భూమి తల్లులకు తల్లి. వేదాల్లో భూమి మానవులకు తల్లి అని చెప్పబడ్డది. పర్షియన్‍ మతం ప్రకారం మనిషి భూమినుంచే పుట్టాడు. జర్మన్లు ‘భూమిని స్తుతించు, మానవుల తల్లిని’ అంటారు. మార్కండేయ పురాణంలో దేవి ‘ఓ దేవతలారా, ఉధృత వర్షాకాలంలో నా శరీరం నుంచి నేను జీవమున్న చెట్లు చేమల్ని కాపాడుతాను. అందుకే నన్ను ఈ భూమ్మీద ‘శాకాంబరి’ అని పిలుస్తారు’ అంటుంది. చరిత్రపూర్వ యుగంలోనే ఐరోపాలో భూమాత ఆరాధనలున్నట్టు చరిత్రకారులు రాసారు.


పోస్టుస్క్రిప్టు:
రాతిచిత్రకళా పరిశోధకులు ఇర్విన్‍ న్యూమెయిర్‍, బండి మురళీధర్‍ రెడ్డి నీలాద్రి లేదా బైనేటిబండలులోని ఈ రాతిచిత్రాలతావును తొలుత చూసారు. నీలాద్రి గుట్టలలో పడిగెరాళ్ళ కింద చిత్రించబడివున్న వందలాది ఎరుపురంగు రాతిచిత్రాలున్నాయి. ఇట్లా చెక్కుడుబొమ్మలు (పెట్రోగ్లైఫ్స్), ఎరుపురంగు చిత్రాలు ఒకేచోట కలిసివున్న శిలాశ్రయాలు (రాతి నెలవులు) అరుదైనవి. నీలాద్రి రాతిచిత్రాలు పురామానవుల ప్రాథమిక భావనలను గురించి లోతుగా అధ్యయనం చేయాలని ఎరుక చేస్తున్నట్టు అనిపిస్తున్నాయి. మరిన్ని లిపి చిహ్నాలకోసం నీలాద్రి చిత్రాలను పరిశీలించి, పరిశోధన చేయవలసిన అవసరం వుంది అనిపించింది. లిపులన్నీ తొలుత బొమ్మల నుంచి పరిణామం చెందినవే. ఇప్పటికీ చైనా, జపాన్‍ వంటి దేశాలు బొమ్మలలిపులు వాడుతున్నాయి. సింధూనాగరికత తవ్వకాల్లో లభించిన ముద్రలలోని లిపులు కూడా బొమ్మలనే పోలివున్నాయి.

  • శ్రీరామోజు హరగోపాల్‍,
    ఎ : 99494 98698

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *