ఉప్పు నీరు ఎందుకు చొచ్చుకొస్తుంది?


విశ్రాంత ఆచార్యులు డా. ఈదా ఉదయ భాస్కర్‍ రెడ్డి, పర్యావరణ శాస్త్ర విభాగం,
ఆంధ్రా విశ్వవిద్యాలయం అంతర్జాలంలో అందించిన వ్యాసం.


భూగోళంలో 71 శాతం మేర నీరు ఆవరించి వుంది. అందుకే భూమిని ‘నీటి గోళం’ అని అంటుంటాం. జీవరాశుల ఉనికికి నీరే ప్రధాన కారణం. సుమారు 65 నుంచి 75 శాతం మేర జీవుల దేహాల్లో నీరే వున్నది. మన దేహంలో ఒక శాతం మేర నీరు తగ్గినట్లైతే దాహార్తిని కలిగిస్తుంది. అదే 10 శాతం మేర తగ్గితే ప్రమాద ఘంటికలు మోగిస్తుంది. ఈ నీరే స్వేదం రూపంలో మానవుల్ని, భాష్పోత్సేకం ద్వారా మొక్కల్ని ఎండ వేడిమికి వడలిపోకుండా కాపాడుతుంది.
ఉష్ణానికి నీరు వాహకంగా ఉపయోగపడుతూ, సూర్యతాపం నుంచి భూగోళాన్ని కాపాడుతుంది. మొక్కలు కిరణ జన్య సంయోగ క్రియ ద్వారా తయారు చేసుకునే పిండి పదార్థానికి అవసరమయ్యే హైడ్రోజన్‍ మూలకాన్ని నీరే అందిస్తుంది. రాబోయే కొద్దిరోజుల్లో నీరే హైడ్రోజన్‍ ఇంధనంగా రూపు దిద్దుకుంటుందనడంలో అతిశయోక్తి ఏ మాత్రం లేదు. నీరు ముఖ్యంగా తాగడానికి, వంట చేయడానికి, వ్యవసాయానికి, పరిశ్రమలకు, మురికిని కడగడానికి అవసరమవుతున్న సంగతి తెలిసిందే.


ఉపయోగపడే నీరు కొంచెమే!
నీటి గోళమైన భూమిపై నీటి కష్టాలు అంటే నమ్మశక్యంగాఉండదు. కానీ ఇది పచ్చి నిజం. ఇందుకు ముఖ్యకారణం 97 శాతం ఉప్పు నీరుగా సముద్రాల్లోను, 2 శాతం ధ్రువాల్లో మంచు గడ్డల రూపంలో వుండి మొత్తం 99 శాతం మేర వినియోగార్హత కోల్పోవడమే. మనకు ఉపయోగపడుతున్న నీరు అత్యల్పం. భూమి మీద ఉన్న నీరంతా 100 లీటర్లుగా భావిస్తే మనకు ఉపయోగంగా వుండేది కేవలం 3 మిల్లీ లీటర్లు. అంటే, వంద లీటర్లకు అర టీ స్పూనంతన్న మాట! నీరు లేని జీవనాన్ని ఊహించుకోలేం.
అందుకే మన ప్రాచీన నాగరికతలన్నీ నదీ తీర ప్రాంతాల్లోనే రూపుదిద్దుకోవడం చూస్తాం. గత 2 వేల సంవత్సరాల కాలంలో ప్రపంచ జనాభా 50 రెట్లు పెరిగినా నీటి వనరుల్లో ఏ మాత్రం మార్పు లేదు. దీనికి తోడు పారిశ్రామిక, హరిత విప్లవాల వలన, నీటి వినియోగం అనూహ్యంగా పెరిగింది. అంతే కాకుండా, వున్న పరిమిత నీటి వనరుల్ని కలుషితం చేసి నీటి సమస్యను తీవ్రతరం చేసుకుంటున్నాం.


ఒకటికి 8 లీటర్లు కలుషితం
నీరు విశ్వవ్యాప్తంగా లభించే ఏకైక సహజ ద్రావకం. ఎన్నోరకాల మలినాల్ని తనలో కరిగించుకోగలదు. ఈ ధర్మమే నీటి నాణ్యతను దెబ్బతీస్తున్నది. దీనికి తోడు వ్యర్థాలను పలుచబర్చడం ద్వారా కాలుష్యాన్ని పరిష్కరించవచ్చు అనే మూఢ నమ్మకం.. అన్నీ కలిసి నదులు, సరస్సులు, సముద్రాలను తీవ్ర కాలుష్యానికి గురి చేస్తున్నాయి. ఒక లీటరు కలుషిత నీరు ఇంచుమించు 8 లీటర్ల శుద్ధ జలాన్ని కలుషితం చేయగలదు.
వీటన్నిటికి తోడు భూతాపం నీటి సమస్యను తీవ్రతరం చేస్తున్నది. సకాలంలో వర్షాలు రావు, వస్తే పడవలసిన చోట పడవు. పడితే అతివ•ష్టి, తుపాన్లు, వరదలు లేకపోతే అనావృష్టి, కరువు కాటకాలు, ఆకలి చావులు. ఒక్క మాటలో చెప్పాలంటే కలుషిత నీరు యుద్ధం కంటే ప్రమాదకారి. ఎక్కువ ప్రాణాల్ని బలిగొంటుంది. 80 శాతం జబ్బులు నీటి వనరుల ద్వారానే సంక్రమిస్తూ ప్రపంచస్థాయి చావుల్లో ప్రథమ స్థానంలో నిలిచాయి.
ప్రతి రోజు 6 వేల మంది పిల్లలు డయేరియా, మలేరియా మొదలగు వ్యాధులతో చనిపోవడానికి నీరే కారణమవుతోంది. దీనికి తోడు ఫ్లోరైడ్‍, నైట్రేట్‍, ఆర్సెనిక్‍ (పాషాణం), సైనైడ్‍, పాదరసం మొదలగునవి నీటి కాలుష్యాన్ని జటిలం చేస్తున్నాయి. పారిశ్రామికంగా ముందంజలో వున్న అమెరికా నీటి వనరుల్లో వెయ్యికి పైగా కాలుష్య కారకాలున్నట్లు తేలింది.


3 లీటర్లు తోడుకుంటే ఇంకుతున్నది లీటరే
నీటి కాలుష్యం, నాణ్యత లోపాలకు తోడుగా, 2025 నాటికి ప్రపంచ జనాభాలో మూడు వంతుల్లో రెండు వంతులు తీవ్ర నీటి కొరతను ఎదుర్కోబోతున్నారని ఐక్యరాజ్యసమితి అంచనా. మనదేశం విషయానికొస్తే.. ప్రపంచ జనాభాలో 19 శాతం ఉన్న మన జనాభా అవసరాలకు, ప్రపంచ నీటి వనరుల్లో మనకున్న 4 శాతం నీటి వనరులతో సరిపెట్టుకోవలసి వస్తోంది.
ప్రపంచంలోకెల్లా అత్యధిక వర్షపాతం గల ప్రదేశంగా గతంలో గణుతికెక్కిన చిరపుంజి ప్రాంతం సైతం, తీవ్ర నీటికొరతను ఎదుర్కొంటున్నది. రానురాను నీటికోసం పోరాటాలు తప్పవేమో అనిపిస్తోంది. మనకు సరఫరా అవుతున్న నీటిలో 68 శాతం వరకు ఆవిరి కావడమో లేక కారిపోవడమో జరుగుతున్నదని ఓ అంచనా. నీటి ఎద్దడి తీవ్రతను అధిగమించడానికి భూగర్భ జలాల్ని లోతుల్లోంచి వెలికితీసి దుర్వినియోగానికి పాల్పడుతున్నాం. భూగర్భం నుంచి మనం వెలికితీసే ప్రతి 3 లీటర్ల నీటికి, ఒక లీటరు వర్షం నీటిని మాత్రమే భూమిలోకి ఇంకించగలుగుతున్నాం.
ఇందువల్ల తీర ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటి భూమి కుంగిపోతోంది. భూగర్భ జలాలు ఉప్పు నీరుగా మారుతున్నాయి. పర్యవసానంగా భూమిలోపలి పొరల్లో శూన్యం ఏర్పడి తీర ప్రాంతంలోని జనావాస నిర్మాణాలు భూమిలోకి కుంగిపోతున్నాయి. చమురు, సహజ వాయువుల వెలికితీత మూలంగా కూడా మనరాష్ట్రంలో కృష్ణా.. గోదావరి బేసిన్‍లో భూమి కుంగిన సంఘటనలు ఉన్నాయి. భూమి కుంగడంతో పాటు భూగర్భ జలాల్లోకి సముద్రపు నీరు చొచ్చుకు రావటం సర్వసాధారణం. జల రవాణా మార్గాలు, మురుగు నీటి కాల్వల వల్ల కూడా ఉప్పు నీరు భూగర్భ మంచినీటిలో కలిసే ప్రమాదాలున్నాయి.


ఒకటికి 40 అడుగుల మేర ఉప్పు నీరు
వేగవంతమైన పట్టణీకరణ, పారిశ్రామికీకరణ, వ్యవసాయ, జనాభా పెరుగుదల, జీవనోపాధికై వలసలు సహజంగానే నీటి వనరులపై తీవ్ర ఒత్తిడి పెంచుతున్నాయి. దీనికితోడు వాతావరణ ఒడిదుడుకులు, వర్షాభావ పరిస్థితులు నీటి లభ్యత, నాణ్యతలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. పర్యవసానంగా లెక్కకు మిక్కిలి బోరుబావులను తవ్వి లోతు నుంచి ఎక్కువ నీరు తోడేస్తున్నారు. దానివల్లా భూగర్భజల మట్టం గణనీయంగా పడిపోతోంది. ఆ మేర పీడనం తగ్గడంతో సమీపంలోని సముద్రపు నీరు మంచినీటితో కలుస్తోంది.
దాంతో ఈ నీరు తాగటానికి, వ్యవసాయానికి, పరిశ్రమలకు (మత్స్య పరిశ్రమ, ఉప్పు తయారీ పరిశ్రమలకు మినహాయించి) పనికిరావటం లేదు. భూగర్భంలోని మంచినీటి మట్టం ఒక అడుగుమేర తగ్గినట్లైతే, సుమారు 40 అడుగుల మేర ఉప్పు నీరు అనూహ్యంగా పైకి ఎగబాకి భూగర్భంలోని మంచినీటిని ఉప్పు నీరుగా మారుస్తుందని ఒక అంచనా! నీటి కొరత నీటి నాణ్యతను, ఆ కలుషిత నీరు ప్రజల ఆరోగ్యాన్ని, నేల సారాన్ని, వ్యవసాయాన్నీ దెబ్బతీస్తోంది. ఏదైనా ఒక రంగానికి దారులు మూతబడుతున్నాయంటే, ఇంకో రంగానికి దారులు తెరుచుకుంటున్నాయి అని అనుకోవాలి.


తీర ప్రజల జీవనోపాధులపై ప్రభావం
ఇప్పటికే కొన్ని తీర ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర భూగర్భ జలాలు ఉప్పు నీరుగా మారినందున ఆయా ప్రాంతాల్లో రైతులు వ్యవసాయానికి స్వస్తి పలికి, చేపలు, రొయ్యల పెంపకానికి శ్రీకారం చుట్టారు. భూగర్భ జలాలు ఉప్పు నీరుగా మారినందున మత్స్యకారులే కాదు సమీప పట్టణ, నగరవాసులూ మంచి నీటిని కొనుక్కొని తాగవలసి వస్తున్నది. జల కాలుష్య నివారణ, శుద్ధి కార్యక్రమాలు, తాగునీటి సరఫరా పేరుతో కొత్త వ్యాపారాలు, పరిశ్రమలు, పలురకాల జీవనోపాధులు ఏర్పడుతున్నాయి.
సముద్రపు ఆహార ఉత్పత్తులు, ఎగుమతులు, వాణిజ్యం పెరగడం వలన జీవనోపాధులతోపాటు స్థూల జాతీయోత్పత్తి కూడా పెరిగి దేశ ఆర్థిక స్వావలంబనకు దోహదపడుతుందనటంలో సందేహం లేదు. ఆహారం లేకుండా ఓ 60 రోజులు ఉండగలమేమో గానీ, నీరు తాగకుండా 60 గంటలు ఉండటం అసాధ్యం. నీటిని సంరక్షించుకోవడానికి మన పూర్వీకులు ఆచరించిన పద్ధతులు, నేడు మనకున్న నవీన పద్ధతులను మేళవించి నీటివనరుల్ని సంరక్షించు కోవలసిన అవసరం ఎంతైనా వుంది. ఉమ్మడి వనరులాంటి నీటిని వాడుకోవడంలో ఆసక్తి, కాపాడుకోవడంలో అనాసక్తి జగమెరిగిన సత్యం. నీటి కొరతకు తోడు దుర్వినియోగం కూడా సమస్య జటిల మవడానికి కారణమవుతోంది.


ప్రకృతిలోనే పరిష్కారం!
నేడు నీటికి పాలతో సమాన ధర చెల్లించి కొంటున్నాం. ఇప్పుడు మనం వాడుకుంటున్న 700 క్యూబిక్‍ కిలోమీటర్ల నీరు కాక, ఇంకో 1000 క్యూబిక్‍ కిలోమీటర్ల నీరు మన దేశానికి కావలసి వుంటుంది. కొత్త నీటి వనరులను వెదుకుతూ… వున్న వనరుల్ని దుర్వినియోగ పర్చకుండా తెలివిగా, పొదుపుగా వాడుకోవాలి. మన పూర్వీకులు పాటించిన నీటి యాజమాన్య పద్ధతులు హర్షణీయం. అనుసరణీయం. ఎప్పుడు ఎక్కడ వర్షం పడితే అక్కడ పట్టి దాచుకో, వాడుకో. బకెట్‍ సాన్నం, బిందు సేద్యంలాంటి పద్ధతులు నీటిని బాగా ఆదా చేస్తాయి.
చాలా సమస్యలకు ప్రకృతే మనకు పరిష్కారం చూపుతుంది. ఇది ప్రకృతిని నిశితంగా పరిశీలిస్తే బోధపడుతుంది. ప్రకృతిలో, అడవులు, సరస్సులు, మైదాన భూములు, వర్షపు నీటిని పట్టి వుంచి మనకు నిరంతరాయంగా అందిస్తుంటాయి. వాటిని ధ్వంసం చేసి నీటి సమస్యల్ని మనమే సృష్టించుకుంటున్నాం. ఎడారి ప్రాంతవాసులకు తెలిసినంత నీటి యాజమాన్యం మరి ఇంకెవ్వరికీ తెలియదు. కనుక వారి పద్ధతులను గమనించాలి. ఆపై ఆచరణలో పెట్టాలి. బెంజిమన్‍ ఫ్రాంక్లిన్‍ చెప్పినట్లు బావుల్లో నీరు ఎండిపోయిన నాడు మనకు నీటి విలువ బాగా తెలిసివస్తుంది.

  • దక్కన్‍న్యూస్‍
    ఎ : 9030 6262 88

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *