ఆకాశవాణి హైదరాబాద్‍ కేంద్రం

 • సంగీత సేవలో దక్కన్‍ రేడియో
 • ఫిబ్రవరి 13న ప్రపంచ రేడియో దినోత్సవం


క్రికెట్‍ మ్యాచ్‍, భద్రాచలం రాములోరి కల్యాణం మనం ఒకప్పుడు ఎలా వినే వాళ్లం.. గుర్తుందా.. ఇంటర్నెట్‍, టీవీలు, ఓటీటీలు ఇవేవీ లేని రోజుల్లో రేడియో ఒక్కటే వార్తలను, వినోదాన్ని అందించిన ఏకైక సాధనంగా ప్రజల మన్ననలు చూరగొంది. రేడియో ఎన్నో సంచలనాలు సృష్టించింది. స్వాతంత్ర పోరాటంలో, గోవా సంగ్రామంలో, పలు ప్రజా ఉద్యమాల్లో రేడియో ప్రజలకు బాగా చేరువైంది. రోజూ నాలుగు పూటలా పలు భాషల్లో వార్తలను ప్రసారం చేస్తూనే, పాటలు, జానపద గీతాలు, శాస్త్రీయ-లలిత సంగీతం, వ్యవసాయ కార్యక్రమాలు, క్విజ్‍, కథానిక, సినిమా ఆడియోలు ఇలా అన్నింటినీ సమపాళ్లలో ప్రసారం చేసిన రేడియో ప్రజల మనసును ఆకట్టుకుంది. ఓ రెండు దశాబ్దాల క్రితం వరకు పెద్దా చిన్నా అందరికీ అత్యంత ఇష్టమైన వ్యాపకం రేడియో వినటం. స్వాతంత్య్రం వచ్చే నాటికి మన దేశంలో 6 ఆకాశవాణి కేంద్రాలు మాత్రమే ఉండేవి. అవి: బొంబాయి, కలకత్తా, ఢిల్లీ, మద్రాసు, తిరుచిరాపల్లి, లక్నో కేంద్రాలు. ప్రస్తుతం (2019 నాటికి) దేశవ్యాప్తంగా 215 ఆకాశవాణి కేంద్రాల నుంచి 337 ప్రసార కేంద్రాలు పని చేస్తున్నాయి. బ్రిటీష్‍ వారు మనదేశంలో బాంబేలో తొలి రేడియో స్టేషన్‍ ప్రారంభించారు.


యునెస్కో గుర్తింపు
1946, ఫిబ్రవరి 13న ఐక్యరాజ్యసమితి రేడియో ప్రారంభించ బడింది. కాబట్టి ఆ సందర్భంగా ప్రతిఏటా ఫిబ్రవరి 13న ఈ దినోత్సవం జరుపుకునేలా జనరల్‍ కాన్ఫరెన్స్ 36వ సెక్షన్‍లో ప్రపంచ రేడియో దినోత్సవాన్ని ప్రకటించాలని బోర్డు యునెస్కోకు 2010లో సిఫారసు చేసింది. ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలు, ఐక్యరాజ్యసమితి సంస్థలు, అంతర్జాతీయ ప్రాంతీయ సంస్థలు, వృత్తి సంఘాలు, ప్రసార సంఘాలు, ప్రభుత్వేతర సంస్థలు మొదలైనవన్ని ప్రపంచ రేడియో దినోత్సవాన్ని జరుపుకోవాలని బోర్డు ఆహ్వానించింది. ప్రపంచ రేడియో దినోత్సవాన్ని జనరల్‍ అసెంబ్లీలో ఆమోదించడానికి, ప్రపంచవ్యాప్తంగా ఈ దినోత్సవం జరుపుకునే విధంగా యునెస్కో డైరెక్టర్‍ జనరల్‍ ఈ తీర్మానాన్ని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‍ దృష్టికి తీసుకురావాలని బోర్డు అభ్యర్థించింది. ఈ అభ్యర్థనను యునెస్కో జనరల్‍ కాన్ఫరెన్స్ పరిగణించి, 36 సి/63 ఫైల్‍లో ఉన్న తీర్మానాన్ని ఆమోదించింది. ప్రపంచ రేడియో దినోత్సవాన్ని 2011లో యునెస్కోలోని అన్ని సభ్య దేశాలు ఏకగ్రీవంగా ప్రకటించాయి. 2012 నుంచి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 13న ప్రపంచ రేడియో దినోత్సవంను జరుపుకుంటారు.


2012లో ఐక్యరాజ్య సమితి జనరల్‍ అసెంబ్లీ తీర్మానం మేరకు రేడియో డేను ప్రపంచవ్యాప్తంగా యునెస్కో సభ్యత్వమున్న అన్ని దేశాల్లో అధికారికంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సెమినార్లు, చర్చలు, రేడియో చరిత్ర, వైభవం, ప్రస్థానం వంటి అంశాలపై భిన్నమైన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.


యునెస్కో మూడు థీములతో..
వరల్డ్ రేడియో డేని గత ఏడాది వినూత్నంగా నిర్వహించారు. మూడు సబ్‍ థీములతో ఎవల్యూషన్‍, ఇన్నోవేషన్‍, కనెక్షన్‍ పేరుతో వీటిని నిర్వహించారు. కరోనా మహమ్మారి కారణంగా ముందుగా రికార్డ్ చేసిన ప్రత్యేక కార్యక్రమాలను రేడియో డే సందర్భంగా ప్రసారం చేశారు. సాధారణ రోజుల్లో అయితే ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీటిని నిర్వహించే వారు. ఏటా ఫిబ్రవరి 13న ఈ దినోత్సవాన్ని జరుపు కుంటున్నారు. దీని వెనుకున్న ఆంతర్యం అత్యధిక ప్రజలు రేడియోను మరింత విస్తృతంగా ఉపయోగించేలా చేయటమే. అత్యధికులకు సమాచారం చేరవేసే అత్యుత్తమ సాధనం నేటికీ రేడియోనే. ప్రపంచం నలుమూలలా రీచ్‍ అయ్యేది రేడియో మాత్రమే. అత్యంత చవకైన సాధనం మాత్రమే కాదు.. సులువుగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా దీన్ని వెంట తీసుకెళ్లవచ్చు. బేసిక్‍ ఫోన్‍, స్మార్ట్ ఫోన్లలో కూడా రేడియోను ఫాలో అవ్వచ్చు. ఎఫ్‍ఎం రేడియో వచ్చాక రేడియోకు మళ్లీ పూర్వ వైభవం వచ్చింది.


ఆకాశవాణి (రేడియో):
కాంతి వేగ పౌనఃపున్యాలతో విద్యుత్‍ అయస్కాంత తరంగాలను మాడ్యులేషన్‍ చేయటం ద్వారా తీగల ఆధారము లేకుండా గాలిలో శబ్ద సంకేతాలను ప్రసారం చేయు పక్రియను దూర శ్రవణ పక్రియ అంటారు. ఇలాంటి ప్రసారాలను వినటానికి ఉపయోగించే సాధనాన్ని రేడియో అంటారు. 1886లో హెన్‍రిచ్‍ హెర్ట్జ్అనే శాస్త్రవేత్త రేడియో తరంగాలను కనుగొన్నారు. ఆతరువాతి కాలంలో మార్కోనీ రేడియోను కనుగొన్నారు.


ఆల్‍ ఇండియా రేడియో :
 • 1923లో రేడియో క్లబ్‍ ఆఫ్‍ బాంబే దేశంలోనే తొలిసారిగా రేడియో ప్రసారాలను ప్రారంభించింది.
 • 23 జూలై 1927 న బ్రిటిష్‍ హయాంలో తొలి రేడియో స్టేషన్‍ బాంబేలో ప్రారంభమైంది. ఇండియన్‍ బ్రాడ్‍ కాస్టింగ్‍ కంపెనీ నెలకొల్పిన ఆ రేడియో స్టేషన్‍ను అప్పటి వైస్రాయ్‍ లార్డ్ ఇర్విన్‍ ప్రారంభించారు.
 • 1936లో ఇండియన్‍ బ్రాడ్‍ కాస్టింగ్‍ కంపెనీ పేరు ఆలిండియా రేడియోగా మారింది.
 • ఆలిండియా రేడియో అధికారికంగా 1956 నుండి ఆకాశవాణిగా పిలువబడుతుంది.


దక్కన్‍ రేడియో:
హైదరాబాద్‍ రాజ్యంలో మొట్టమొదటి రేడియో స్టేషన్‍ దక్కన్‍ రేడియో. ఇది మొదట ప్రైవేటు బ్రాడ్‍కాస్టింగ్‍ స్టేషన్‍గా 200 వాట్స్ ట్రాన్స్మిటింగ్‍ పవర్‍తో మొదలైంది. ఉర్దూలో కార్యక్రమాలు ఉండేవి. అబిడ్స్లోని చిరాగ్‍ అలీ లేన్‍లోని ‘అజామ్‍ మంజిల్‍’లో ఇది నెలకొని ఉండింది. చిరాగ్‍ అలీ కుటుంబ సభ్యులే దీన్ని నిర్వహించేవారు.
దక్కన్‍ రేడియోను నాటి నిజాం మీర్‍ ఉస్మాన్‍ అలీ ఖాన్‍ స్వాధీనం చేసుకొని జాతీయం చేశారు. ఖైరతాబాద్‍లో నూతన రేడియో స్టేషన్‍ ప్రారంభమైంది. 500 వాట్స్ నూతన ట్రాన్స్మీటర్‍ (730 కెహెచ్‍జెడ్‍)ను నెలకొల్పారు. దీన్ని మార్కోని కంపెనీ (ఇంగ్లాండ్‍) నుంచి కొనుగోలు చేశారు.


1933లో దీన్ని ప్రారంభించిన సమయంలో ఉర్దూలో వార్తా ప్రసారాలు ఉండేవి. దక్కని దోల్క్ కి గీత్‍, గజల్స్, ఖవ్వాలీ లాంటి కార్యక్రమాలు వచ్చేవి. మొదట్లో మొహర్రం నెలలో రేడియో ప్రసారాలు ఉండేవి కావు. ఆ తరువాత ఆ నెలలో మొదటి 13 రోజులు మాత్రం ప్రసారాలు నిలిపివేసేవారు. ఆ తరువాత కూడా నెల అంతా పాటల కార్యక్రమాలు ఉండేవి కావు. స్థానిక పత్రికల నుంచి వార్తల సమాచారం సేకరించేవారు.

 • హైదరాబాద్‍లో మహబూబ్‍ అలీ అనే తపాలా ఉద్యోగి 1933లో రేడియో స్టేషన్‍ను ప్రారంభించారు.
 • 1935లో ఈ రేడియో స్టేషన్‍ను అప్పట్లో హైదరాబాదును పరిపాలిస్తున్న నిజాం రాజు స్వాధీనం చేసుకున్నాడు.
 • 1939లో హైదరాబాద్‍ రేడియో స్టేషన్‍కు దక్కన్‍ రేడియోగా పేరు మార్చారు.
 • హైదరాబాద్‍ రేడియో స్టేషన్‍ నుంచి అప్పట్లో జరిగే ప్రసారాలు ఎక్కువగా ఉర్దూలో ఉండేవి.
 • దక్కన్‍ రేడియో నుంచి తెలుగు, కన్నడ, మరాఠీ భాషల్లో కూడా పరిమిత ప్రసారాలు సాగేవి. దక్కన్‍ రేడియోలో తెలుగు కార్యక్రమాలను పెంచేందుకు మాడపాటి హనుమంతరావు విశేషంగా కృషి చేశారు.
 • 1950లో భారత ప్రభుత్వం డెక్కన్‍ రేడియోను నిజాం నుంచి స్వాధీనం చేసుకుని, ఆలిండియా రేడియో పరిధిలోకి తెచ్చింది.

తెలుగులో రేడియో ప్రసారాలు:
 • 1938 జూన్‍ 16న మద్రాసులో రేడియో స్టేషన్‍ ప్రారంభం కావడంతో అప్పటి నుంచి తెలుగులో రేడియో ప్రసారాలు మొదలయ్యాయి. అప్పటి ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ప్రధాని కూర్మ వెంకట రెడ్డినాయుడు, మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రి సి.రాజగోపాలాచారి ప్రారంభోపన్యాసాలు చేశారు.
 • మద్రాసు రాష్ట్ర ప్రధాని కూర్మ వెంకటరెడ్డి నాయుడు భారతదేశం – రేడియో అంశంపై తెలుగులో ప్రసంగించారు. ఇది ప్రారంభోపన్యాసం మాత్రమే.
 • రేడియో కార్యక్రమాల్లో భాగంగా తొలి తెలుగు ప్రసంగం చేసిన ఘనత గిడుగు రామమూర్తి పంతులుకు దక్కుతుంది. సజీవమైన తెలుగు అనే అంశంపై గిడుగు 1938 జూన్‍ 18న పదిహేను నిమిషాల ప్రసంగం చేశారు.
 • మద్రాసు కేంద్రం నుంచి ప్రసారమైన తొలి తెలుగు నాటకం అనార్కలి. ఇది 1938 జూన్‍ 24న రాత్రి 8:30 గంటలకు ప్రసారమైంది.
 • మద్రాసు కేంద్రం నుంచి తొలి తెలుగు వ్యాఖ్యాతగా మల్లంపల్లి ఉమామహేశ్వరరావు పనిచేశారు. పిల్లల కార్యక్రమాల ద్వారా ఆయన రేడియో తాతయ్యగా ప్రసిద్ధి పొందారు.
 • 1948 డిసెంబరు 1న విజయవాడలో రేడియో స్టేషన్‍ ప్రారంభమైంది.
 • 1963లో విశాఖపట్నం, కడపలలో ఆలిండియా రేడియో స్టేషన్లు ప్రారంభమయ్యాయి.


ఎఫ్‍ఎం రేడియో:
ఎఫ్‍ఎం (ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్‍) రేడియో చానెల్స్కు పరిమిత ప్రాంతంలోని ప్రజల అభిరుచులు, సంస్కృతి ముఖ్యం. అనేక ప్రైవేట్‍ సంస్థలు దేశవ్యాప్తంగా ఎఫ్‍ఎం రేడియో ఛానెళ్లను ప్రారంభించాయి. ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్‍ఎంలను కూడా ప్రారంభించింది.
చాలెంజ్‍లు..
ఒకప్పుడు వార్తలు-విశేషాలకు, వినోదానికి, ప్రసార సాధనంగా, ప్రచార సాధనంగా విస్తృతంగా సేవలందించిన ఏకైక సాధనం రేడియో. ప్రస్తుతం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కారణంగా మూలన పడింది. చిన్న ఊళ్లలో మాత్రమే రేడియోను ఇంకా ఆస్వాదించటాన్ని మనం చూడవచ్చు. రేడియో ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లపై అంతర్జాతీయంగా చర్చ జరుగుతున్నా మోడీ నిర్వహిస్తున్న ‘మన్‍ కీ బాత్‍’ కారణంగా ఆల్‍ ఇండియా రేడియోకు మంచి యాడ్‍ రెవిన్యూ వస్తూ చాలా కాలం తరువాత లాభాల బాటపట్టడం విశేషం.

 • ఎసికె. శ్రీహరి,
  ఎ : 9849930145

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *