గాజులు అంటే ఇష్టపడని మహిళలు ఉండరు. బీరువాలో ఎన్ని డిజైన్లలో గాజులు ఉన్నా.. మళ్లీ ఇంకో డజన్ గాజులు తీసుకుందాం అనిపిస్తుంది వారికి. ప్రతి చీరకు కూడా మ్యాచింగ్ గాజులు తీసుకోవాలని వారికి ఉంటుంది. బంగారు గాజులను వేసుకోవాలనే కోరిక అందరికీ ఉంటుంది. కానీ, వారి వారి ఆర్థిక స్థితిగతులను బట్టి కొందరు బంగారు గాజులు చేయించుకుంటే, మరికొందరు వజ్రాల గాజులు కూడా చేయించుకుంటారు. అయితే, మట్టి గాజులు అందరికీ అందుబాటులో ఉంటాయి. డబ్బులతో సంబంధం లేకుండా కొందరు మట్టి గాజులను బాగా ఇష్టపడతారు.
తెలుగు రాష్ట్రాలు హస్తకళలకు, చేతివృత్తులకు ఒకప్పుడు కాణాచి. పూర్వము తెలుగు నేలపై చేతి వృత్తులకు అపూర్వ ఆదరణ లభించింది. అగ్గిపెట్టెలో యిమిడె పట్టుచీరను నేసిన ఘనత మన తెలుగు నేతగాళ్ళది. అలాగే శిల్పకళ, చిత్రకళ, కుమ్మరి, కమ్మరి వృత్తులు కూడా ఆదరణ చెందాయి. పరాయి పాలనలో క్రమంగా ఈ వృత్తుల కళల ప్రాబల్యం క్రమంగా సన్నగిల్లి అడుగంటిపోయాయి.
అతి పూరాతనమైన చేతికళల పరిశ్రమలలో చేతిగాజుల పరిశ్రమ ఒకటి. మహిళలకు అత్యంత ప్రీతిపాత్రమైనవి మట్టిగాజులు. చేతికి గాజులులేని స్త్రీలను వూహించలేము. స్త్రీలచేతులకు గాజులు వుండటం గౌరవ సూచకము. స్త్రీలు ఆభరణాలపై, పట్టుచీరెలపై ఎంత మక్కువ చూపెదరో, గాజులపై అంతే మక్కువ చూపిస్తారు. గాజులను మహిళలు ధరించడం సనాతన భారతీయ సంప్రదాయములో ఒకభాగము. ముతైదువకు వుండే ఐదు లక్షణాలలో గాజులు ఒకటి. గాజుల తయారి, అమ్మకంపై ఆధారపడి నేటికి కొన్ని లక్షల కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి. ఎక్కడ తిరునాల, లేదా జాతరలలో మనకు తప్పని సరిగా కన్పించేవి గాజులమ్మే దుఖాణాలు. గ్రామ ప్రాంతాలలోని వారపు సంతలలో కూడా గాజులమ్మే వారు కన్పిస్తారు. పూర్వకాలములో ప్రత్యేకముగా ఒక కులము (గాజుల బలిజ) వారు ఈ గాజులమ్మే వృత్తిలో వుండేవారు. గాజుల వుత్పత్తిదారుల నుండి గాజులను టోకులో కొనుగోలు చేసి ఊరూర తిరుగుచు, ఇంటింటికి తిరిగి గాజులమ్మేవారు. పూర్వకాలములో ఇంటిలో పెళ్ళి జరిగిన, శ్రీమంతము జరిగిన, లేదా ఏ శుభకార్యము జరిగిన గాజులోళ్ళను ఇంటికి పిలిపించుకుని, ఇంటిళ్ళిపాది ఆడవాళ్ళు గాజులు వేయించుకుని, వారికి నమస్కరించి, తగిన విధముగా సంభావన యిచ్చి పంపేవారు. ఏదైన కార్యము మీద బయటకు వెళ్ళునప్పుడు గాజులమ్మేవారు కాని, మట్టిగాజులు ధరించిన స్త్రీ ఎదురుగా వచ్చిన శుభకరమని, వెళ్ళే కార్యము జయప్రదంగా జరుగుతుందని భావిస్తారు. ఆధునిక కాలంలో వచ్చిన పెను మార్పుల కారణముగా ఊరూర తిరిగి గాజులమ్మే వారు కనుమరుగైపోయారు. కాని గాజుల వాడకం మారలేదు, తగ్గలేదు. అధునాతనంగా, పారిశ్రామికంగా దేశము మారినా, ఇప్పటికి గాజుల పరిశ్రమ హస్తకళ/చేతి వృత్తుల పరిశ్రమగా కొనసాగుతూ, కొన్ని లక్షల మధ్య తరగతి కుటుంబ ఆడవారికి జీవనోపాధి కల్పిస్తున్నది.
వేదకాలం నాటి కన్న ముందే స్త్రీలు గాజులు ధరించే వారని లభించిన ఆధారాలను బట్టి తెలుస్తున్నది. మహోంజొదార త్రవ్వకాలలో లభించిన చిత్రాలలో చేతికి కంకణం ధరించిన స్త్రీ చిత్రాలున్నాయి. యక్షిణి చిత్రాలలోని యక్షిణి కూడా చేతికి కంకణం ధరించింది. బాణబట్టు తన కావ్యములో సరస్వతిదేవి చేతికి గాజులు (కంగణ్) ధరించినట్లుగా పేర్కొన్నాడు. పురాతన తవ్వకాలలో తక్షశిల వద్ద, మౌర్య సామ్రాజ్యకాలం నాటి రాగి గాజులు లభించాయి. అజంతా చిత్రాలలోని, ఎల్లోరా శిల్పాలలోని స్త్రీలు గాజులు (కంగన్) ధరించడం కన్పిస్తున్నది. క్రీ.పూ. 230-100 నాటికే సింధు లోయలో గాజులు ధరించేవారని తెలుస్తున్నది. జానపద పాటలలో, కావ్యాలలో, సాహిత్యములో గాజుల ప్రస్తావన విస్త్రతంగా కన్పిస్తున్నది.
సిక్కులు తమ మతాచారంలో లోహంతో చేసిన గాజును ధరించెదరు. దానిని ‘కడ’ అంటారు. చేతికి ధరించే ఈ కంకణములను ఎక్కువగా గాజు (గ్లాస్‍తో చెయ్యడం వలన ‘గాజులు’ అనే పేరు తెలుగులో రూడి అయ్యింది. గాజులనే కరకంకణములని కూడా అంటారు. గాజులను సంస్క•తములో ‘కంకణ్’ అనియు, హిందీలో ‘చిడియ’, ‘చుడ’ అని అంటారు. పంజాబులో వధువులు పెళ్ళికి 21 రోజుల ముందు నుండి కాని, లేదా పెళ్ళి తరువాత సంవత్సరం వరకు ఏనుగు దంతముతో చేసిన గాజులని ధరించడం సంప్రదాయం. ఉత్తర ప్రదేశ్‍లో పెళ్ళికూతురు ఎర్రచీర, ఎర్రగాజులు ధరించడం శుభదాయకంగా తలచెదరు. మహారాష్ట్రలో, కర్నాటకలో, ఆంధ్రలో పెళ్ళికూతురు పచ్చగాజులు ధరించడం ఆనవాయితీ. పచ్చరంగు శుభానికి ప్రతీకగా భావిస్తారు.
అలాగే పూర్వకాలంలో రాజస్తాన్ వివాహిత స్త్రీలు భర్త వున్నంత కాలము మణికట్టు నుంచి, ముంచెయ్యి వరకు ఏనుగు దంతముతో చేసిన గాజులు ధరించేవారు. అలా ధరించడం వలన తన కుటుంబానికి, భర్తకు, సంతానానికి శుభం కలుగుతుందని నమ్మకము, విశ్వాసం. పశ్చిమ బెంగాల్‍లో చిన్న గవ్వలు లేదా ఎర్ర పగడాలతో చేసిన గాజులను చేతులకు వేసుకొనడం పెళ్లయిన ఆడవారికి ఆచారంగా ఉంది. నేటికి ఆదివాసి, గిరిజన స్త్రీలు చేతులకు నిండుగా, ముంజేతి వరకు తెల్లటి, వెడల్పాటి చెక్కతో లేదా వెదురుతో చేసిన గాజులు ధరించడం గమనించవచ్చును. స్త్రీ దేవతామూర్తులకు ఎర్రగాజులను భక్తులు కానుకగా, ముడుపులుగా సమర్పించెదరు. కలకత్తాలో కాళీ దేవతకు ఎర్రగాజులను భక్తులు సమర్పించుకుంటారు. మిగాతా ప్రాంతాలలో నల్లటి గాజులను సమర్పించుకుంటారు. దక్షిణ భారతదేశములో స్త్రీ గర్భవతిగా వున్నప్పుడు, పుట్టింటి వారు ‘శ్రీమంతము’లో ఒకచేతికి 21 గాజులు, మరోచేతికి 22 గాజులు తొడుగుతారు. గాజుతో చేసే గాజుల పరిశ్రమను మొగలుల కాలములో బాగా ప్రోత్సహించారు. ముఖ్యముగా ఫిరోజాబాద్‍లో గాజుల పరిశ్రమ అభివ•ద్ధి చెందుటకు కారణము మొగలు సుల్తానులు యిచ్చిన ప్రోత్సాహమే కారణము.
గాజుల తయారీ?
బంగారు గాజులు, బ్లాక్ మెటల్ గాజులు, రబ్బరు గాజులు, మట్టి గాజులు, లక్కగాజులు… ఎన్నో. కొంచెం కళాహృదయం ఉండాలే కానీ గాజులకే హారాలు అలంకరించవచ్చు. కళాపోషకులైన మహిళల మదిని ఇట్టే దోచేయవచ్చు. ఆ పని మాత్రం ఇంత వరకు మగవాళ్ల చేతిలోనే ఉండిపోయింది. కానీ మీరు తలుచుకుంటే మీ ఇంట్లోనే లక్క గాజుల తయారీ పరిశ్రమ పెట్టొచ్చు.
ఏమేం కావాలి:
సాధారణంగా పరిశ్రమల స్థాపనకు యంత్రసామగ్రి వంటి మౌలిక వసతులు అవసరం. లక్క గాజుల పరిశ్రమకు ప్లక్కర్, కట్టర్ వంటి చిన్న సాధనాలు, ఇంట్లో ఉపయోగించే పాత్రలు ఐదారు, గాజులు ఆరబెట్టడానికి స్టాండులు, నలుగురు మహిళలు కూర్చోవడానికి వీలుగా ఉండే చిన్న గది చాలు.
ముడి సరుకు:
అల్యూమినియం రింగులు, లెపాక్స్ ఆర్, లెపాక్స్ ఎక్స్ రసాయనాలు, వెల్‍కమ్ పౌడర్, స్టోర్స్, కుందర్స్, చమ్కీలు, చైనులు, రంగులు అవసరం.రెండు నెలలపాటు గాజులు చేయాలంటే కనీసంగా కొంత ముడిసరుకుని సిద్ధం చేసుకోవాలి. ఎంతెంత పరిమాణంలో ఉండాలో, ఎంతెంత ధరల్లో దొరుకుతాయో చూద్దాం.
వెల్‍కమ్ పౌడర్ – 25 కిలోలు (కిలో రూ.400)
లెపాక్స్ ఆర్ – 2 కిలోలు (కిలో 350-400)
లెపాక్స్ ఎక్స్ – 2 కిలోలు (కిలో 350-400)
ఐదారు రంగులు (యాభై గ్రాముల ప్యాకెట్ 50 రూపాయలు)
స్టోన్స్ – మూడు నాలుగు సైజులైనా తీసుకోవాలి. వాటిలో పదిరంగులుండేలా చూసుకోవాలి. ఒక్కొక్క రంగులో వంద గ్రాముల స్టోన్స్ తీసుకోవచ్చు. ధర స్టోన్ క్వాలిటీని బట్టి వందగ్రాముల ప్యాకెట్ 80 నుంచి 700 రూపాయలుంటుంది. చమ్కీలు – ఇవి కూడా పది రంగుల్లోవి తీసుకోవాలి. వంద గ్రాముల చమ్కీల ధర 50 రూపాయలుంటుంది.
చైన్స్ – గోల్డ్ కలర్, సిల్వర్ కలర్‍తోపాటు ఇతర రంగులలో కూడా ఉంటాయి. వీటిని కిలోల చొప్పున కొనాలి. కిలో రూ. 200 ఉంటుంది. ఒక్కో రంగు చైన్ ఒక్కో కిలో చొప్పున తీసుకోవచ్చు. గాజుల తయారీలో చైన్లు తప్పనిసరి కాదు. గాజులు మరింత ఆకర్షణీయంగా కనిపించడం కోసమే.
అల్యూమినియం రింగులు – సైజుల వారీగా ఒక్కొక్క సెట్. ఒక సెట్‍కి 60 – 70 రింగులుంటాయి. ఒక రింగు రెండు నుంచి ఇరవై రూపాయల వరకు ఉంటుంది. ఈ రింగుల సైజ్ గాజుల సైజుల్లాగే 2.4, 2.6, 2.8 అనే మూడు సైజుల్లో ఉంటాయి. (ప్రస్తుతం పై ధరల్లో మార్పులు ఉండవచ్చు).
తయారీ ఇలా!
లెపాక్స్ ఆర్, లెపాక్స్ ఎక్స్ రసాయనాలు బంకలాగ జిగురుగా ఉంటాయి. ఈ రెండింటినీ (వేటికవి విడిగా) వెల్‍కమ్ పౌడర్‍లో కలపాలి. కిలో లెపాక్స్కి నాలుగు కిలోల వెల్‍కమ్ పౌడర్ కావాల్సి ఉంటుంది. వీటిని చపాతీల పిండిలా కలుపుకోవాలి. ఈ రెండు మిశ్రమాలను (వెల్‍కమ్ పౌడర్‍లో కలిపిన లెపాక్స్ ఎక్స్, లెపాక్స్ ఆర్) కలిపి అల్యూమినియం రింగుకు అతికిస్తే గాజు తయారవుతుంది. వెంటనే (లక్క ఆరి గట్టిపడే లోపు) గాజు మీద కావల్సిన డిజైన్లలో రాళ్లు, కుందన్లు, చమ్కీలు, చైన్లు అతికించుకోవాలి.
ఇరవై నిమిషాలకు జిగురు కొంత వరకు ఆరిపోతుంది. ఆ తర్వాత కుందన్స్ వంటివి అతికించే ప్రయత్నం చేస్తే అతుకుతాయిగానీ గాజు ఆకారం చెడిపోతుంది. అందుకే పది, పదిహేను నిమిషాల లోపే పని పూర్తి చేయాలి. కుందన్స్ అతికించడం వంటి అలంకరణ అంతా అయిన తర్వాత గాజుల స్టాండుకు తగిలించి ఆరు గంటల సేపు ఆరనివ్వాలి. లక్క గట్టి పడి రాయిలా మారుతుంది. ఇక ఆ గాజు పగలదు, విరగదు.
గాజులను చెయ్యుటకు, మాములుగా యితర గాజు వస్తువులను తయారు చేసే ముడి గాజునే ఉపయోగిస్తారు. ‘ఫర్నెస్’లో ముడి గాజును బాగా కరిగే వరకు వేడిచేసి అందులో ఒక గొట్టంను ముంచి బయటకు తీస్తారు. గొట్టం చుట్టు కరిగిన గాజు స్తూపాకరంగా ఏర్పడుతుంది. ఇలా ఏర్పడిన స్తూపాకారవలయ గాజును గొట్టం మీద వుండగానే, గాజు గట్టిపడకముందే నెమ్మదిగా కొట్టి సమ ఆకారంగా, తిమ మందంగా, వుండేటట్లు చేస్తారు. యిప్పుడు మరో ఫర్నెస్లో యాంత్రికంగా, నెమ్మదిగా తిరుగుచున్న రోలరకూ పై భాగములో, గొట్టముపై వున్న గాజును వేడి చేసి, రోలరు యొక్క పై భాగానికి తాటించెదరు. యిప్పుడు, గొట్టం మీది గాజు రోలరు మీద సన్నని దారాలవలే వలయాలుగా ఏర్పడును. చూడటానికి ఈ స్దితిలో ‘స్ప్రింగ్’వలే వుండును. ఈ వలయాన్ని నిలువుగా ‘డైమండ్ కట్టరు’ ద్వారా కట్ చేస్తారు. యిలా కట్ చెయ్యడం వలన రెండు చివరులున్న రింగులుగా ఏర్పడును.
జుదాయి
‘జుదాయి’లేదా ‘జుడాయి’ విభాగములో విడిగా వున్న రింగులను దగ్గరిగా చేర్చి రింగుగా చెయ్యడం జరుగును. దీనిని ‘జోడించడం’లేదా ‘జుదాయి’ అంటారు. కిరోసిన్ ద్వారా గాలిని వేడిచేసి, వేడిగాలి సన్నని గొట్టం వంటి నాజిల్ ద్వారా వచ్చేటప్పుడు గాజు రింగుల రెండు విడి చివరలను వేడి గాలి ద్వారా, లేదా సన్నని మంట ద్వారా, రెండు చివరలు దగ్గరిగా చేర్చి అతికించెదరు. ఎక్కువగా ఈ పనిని ఆడ కార్మికులు చేస్తారు.
సాదై
ఈ విధానంలో అంచులను దగ్గరిగా చేర్చీ అతికించిన గాజుల జాయింట్లను మరియొక సారి వేడిచేసి, ఏమైన తేడాలుంటే సరిచేసి, గాజు అన్ని వైపుల నుండి సమానంగా కన్పించేలా చెస్తారు. ఈ పనికూడా ఎక్కువగా మహిళ కార్మికులే చేస్తారు.
డెకరేషన్
ఈ విభాగంలో గాజులకు నగీషీలు చెక్కి, అవసరమైతే ‘జరీ’ అద్ది కావలసిన రంగులను అద్దకము చెయ్యబడును. ఈ విభాగంలో కాస్త ఎక్కువ నైపుణ్యం కలిగిన కార్మికులు మాత్రమే చేస్తారు.