తెలంగాణలో 10 లక్షల ఎకరాల్లో సాగుకు అవకాశం
వేసవి వచ్చింది. ఈ కాలంలో కూరగాయలు దొరకటం కష్టం. ఏ కూరగాయ పండించినా మంచి డిమాండ్ ఉంటుంది. అధిక లాభాలు రావాలంటే.. యాసంగిలో కూరగాయలే సాగు చేయాలి. రాష్ట్రంలో కూరగాయల సాగుకు సమయం ఆసన్నమైనది. వరి వేద్దామనుకొన్నా.. బియ్యం కొనబోమని కేంద్రం తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో కూరగాయల సాగు రైతులకు భారీ ఆదాయాన్ని తెచ్చిపెడుతుందని ఉద్యానశాఖ అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అవసరాలకు సరిపడా కూరగాయలు సాగు కావడం లేదని, దాంతో ధరలు పెరుగుతున్నాయని అంటున్నారు. రెండేండ్లుగా రాష్ట్రంలో కూరగాయల సాగు భారీగా తగ్గిపోయిందని, గతంలో ఏడాదికి 3-4 లక్షల ఎకరాలో సాగవగా, అది లక్షన్నర ఎకరాలకు తగ్గిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆ దిశగా రైతులు దృష్టిసారిస్తే రూపాయికి మూడు రెట్ల ఆదాయాన్ని పొందవచ్చని సూచిస్తున్నారు.
అవకాశాన్ని అందిపుచ్చుకొంటే..
ప్రస్తుత పరిస్థితుల్లో ఏ రకం కూరగాయ అయినా కిలో కనీసం రూ.60 పలుకుతున్నది. ఈ వేసవిలో ధరలు మరింత పెరిగే అవకాశం లేకపోలేదు. గతంలో రాష్ట్రంలో సరైన నీటి వనరులు లేక రైతులు కూరగాయల సాగుకు ముందుకు వచ్చేవారుకాదు. ఇప్పుడా ఇబ్బంది లేదు. పుష్కలమైన సాగునీరు అందుబాటులో ఉన్నది. ఈ నీటిని ఉపయోగించుకొని కూరగాయలు సాగు చేస్తే ఉపయోగకరంగా ఉంటుందని అధికారులు తెలుపుతున్నారు. ఒక ఎకరం వరిసాగుకు ఉపయోగించే నీటితో 4 ఎకరాల్లో కూరగాయలను సాగు చేయొచ్చని సూచిస్తున్నారు. నీటి వనరులు అందుబాటులో ఉండటం, వేసవిలో మంచి ధర పలికే అవకాశం ఉండటంతో యాసంగిలో అధిక విస్తీర్ణంలో కూరగాయలు, ఆకుకూరల్ని సాగు చేయాలని రైతులను ప్రోత్సహిస్తున్నారు.
మూడింతల లాభం
కూరగాయల సాగులో రూపాయి పెట్టుబడి పెడితే రూ.3కు పైగా లాభం వస్తుందని ఉద్యానశాఖ చేసిన అధ్యయనంలో తేలింది. రూపాయి పెట్టుబడితో బెండకాయకు రూ.2.5, టమాటకు రూ.3, మిరప రూ.3.7, వంకాయ రూ.3.7, ఉల్లిగడ్డ రూ.6.5 వెల్లుల్లి రూ.3.2 లాభాలు వస్తాయని వెల్లడైంది. వరి, ఇతర వాణిజ్య పంటల ద్వారా ఆర్నెల్లకోసారి డబ్బులు చేతికి వస్తాయి. అదే కూరగాయల సాగుతో ప్రతి రోజు చేతికి డబ్బులు అందుతాయి.
26 లక్షల టన్నులు అవసరం
వరికి ప్రత్యామ్నాయంగా కూరగాయల సాగు ఎంతో లాభసాటిగా ఉంటుందని, సాగుకు ముందుకు రావాలని ఉద్యానశాఖ అధికారులు సూచించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 10 లక్షల ఎకరాల్లో కూరగాయలను సాగుచేసేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని తెలిపారు. ఏటా రాష్ట్ర ప్రజల అవసరాలకు 26 లక్షల టన్నులకు పైగా కూరగాయలు అవసరం ఉండగా, మన వద్ద 16 లక్షల టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతున్నాయి. ఇంకా 10 లక్షల టన్నుల లోటులో ఉన్నాం. దీంతో కూరగాయలను మహారాష్ట్ర, కర్ణాటకతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
రైతులకు అవసరమైన సాయం
యాసంగిలో వరికి బదులు కూరగాయలను సాగు చేస్తే మంచి లాభాలు ఉంటాయి. మన దగ్గర అవసరాలకు సరిపడా కూరగాయలు ఉత్పత్తి కావడం లేదు. అందుకే ధరలు పెరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో రైతులు కూరగాయలు సాగు చేస్తే మూడు రెట్ల లాభం ఉంటుంది. కూరగాయల సాగులో రైతులకు అవసరమైన సాయం చేస్తున్నాం. అవసరమైనవారికి డ్రిప్ వ్యవస్థను ఏర్పాటుచేస్తున్నాం అని ఉద్యానవన శాఖ అధికారులు తెలుపుతున్నారు.
ఆనబోయిన స్వామి, ఎ : 9963 87 2222