ఆకాశంలో తెగిపడే చుక్కలు


నిజానికి ఉల్కలు అనేవి ఆస్టరాయిడ్‍ బెల్ట్ నుంచి వచ్చేవి. సౌరకుటుంబంలో అంగారక, గురుగ్రహాల నడుమ ‘గ్రహశకలాల సమూహం’ (Asteroids Belt) ఎల్లప్పుడు ఒక కక్ష్యలో తిరుగు తుంటాయి. ఒక్కోసారి ఈ గ్రహశకలాలు ఆ గుంపు నుంచి వెలువడి అత్యంతవేగంతో భూమి వాతావరణంలోనికి ప్రవేశించినపుడు వాటిలో ఎక్కువభాగం మండిపోతాయి. కొన్ని మాత్రమే అరుదుగా భూమిమీద రాలిపడుతుంటాయి. దాన్నే ఉల్కాపాతం అంటారు. రాలిపడ్డ పదార్థాలు ఉల్కలు. గ్రహాంతర పదార్థశకలాలు(Celestial Bodies) . భూమి అక్షంలో వక్రత, భూమండలం మీద వాటి స్థానం కారణంగా రష్యా, అర్జెంటీనా వంటి దేశాలలో ఎక్కువగా ఉల్కాపాతా లుంటాయి. గ్రహాలుగా మారలేని గ్రహశకలాలు ఉల్కలుగా మారుతాయి. ఇవి 1. గ్రహశకలాలు, 2.మీటియోరైట్స్, 3.తోకచుక్కల నుంచి వచ్చిన పదార్థం, 4. చంద్రుడు, అంగారక గ్రహాల నుంచి వచ్చే పదార్థాలు.


ఉల్కలు మూడురకాలు.
1.స్టోనీ మీటియోరైట్స్, 2.ఐరన్‍ అండ్‍ స్టోనీ మీటియోరైట్స్, 3. ఐరన్‍ మీటియోరైట్స్


స్టోనీ మీటియోరైట్స్: వీటిలో సిలికేట్‍ ఖనిజాలెక్కువగా వుంటాయి. ఇవి రెండు రకాలు.
1.కాండ్రైట్స్, 2. అకాండ్రైట్స్
కాండ్రైట్స్:
గ్రహాలు ప్రాథమికదశలో ఎట్లుండేవో ఇవీ అట్లనే వుంటాయి. కాండ్రైట్స్ని చూసినపుడు వాటిమీద చిన్న, చిన్న బిందువుల్లాంటి సిలికేట్స్, సల్ఫైడ్‍, ఇనుము రేణువులు కనిపిస్తాయి. గ్రీకుభాషలో కాండ్రైట్స్ అంటే ఇసుకరేణువులు.
అకాండ్రైట్స్:
అకాండ్రైట్స్ కొన్ని కార్బన్‍ సమ్మేళనాలను కలిగి ఉంటాయి ,కర్బనం, ఆర్గానిక్‍ పదార్థాలుంటాయి. వీటిలో కాండ్రైట్స్ లో వుండే టెక్చర్‍ వుండదు. భూమ్మీద కరిగిన స్థితిలో ఉండే ‘ఇగ్నీషియస్‍ డిఫరెన్షియేషన్‍’ ఉంటుంది. ఇనుమువంటి బరువైన మూలకా లుంటాయి. లోపలికి చొచ్చుకుపోయి క్రస్ట్ లో చేరివుండేవి తేలికగా వుంటాయి.
ఐరన్‍-స్టోనీ మీటియోరైట్స్:
వీటిలో ఇనుము, నికెల్‍, సిలికేట్‍ భాగాలుంటాయి. ఇవి రెండు రకాలు: 1.పెల్లసైట్స్, 2. మీసో సైడరైట్స్… భూమిలోని మాంటిల్‍ కు కరస్పాండింగ్‍ గా వుంటుంది. మాంటిల్‍ లోని పదార్థాలే ఇందులో వుంటాయి. ఈ మీటియోరైట్స్లో వజ్రాలుంటాయి. రత్నాలు, ఉపరత్నాలు దొరకవచ్చు.
ఐరన్‍ మీటియోరైట్స్:
ఆస్టరాయిడ్స్ నుంచి వచ్చే కోర్‍ పదార్థాలు. వీటిలో ఇనుము, నికెల్‍, సల్ఫైడ్స్ ఉంటాయి. ఇందులోని ఇనుము పొరలుగా ఉంటుంది. Rocky Planets అనబడే Mercury, Mars, Venus and Earth లలో స్తరీకరణ లుంటాయి. అదే స్తరీకరణ ఐరన్‍ మీటియోరైట్స్ లోని ఇనుములో ఉంటుంది.
ఉల్కాపదార్థం ఆస్టరాయిడ్‍ బెల్ట్, కోమెట్స్ నుంచి వస్తుంది. ఇవిగాక అతి తక్కువశాతంలో చంద్ర, కుజ గ్రహాల నుంచి కూడా వస్తుంది. ఆస్టరాయిడ్స్ వచ్చిన పదార్థాలు భూమివలెనె 450కోట్ల సం.రాలు, అంతకు మించి వయస్సు కలిగివుంటాయి. చందగ్రహం నుంచి వచ్చిన ఉల్కలు 250కోట్ల సం.రాలు, అంగారకగ్రహం వచ్చినవి 165కోట్ల సం.రాల పైబడి వుంటాయి.


ఉల్కాపాతాలు:
జియోలాజికల్‍ సర్వే ఆఫ్‍ ఇండియా చేత భారతీయ మ్యూజియంలో 643 మెటియోరైట్లు భద్రపరచబడ్డాయి. మనదేశంలో 2021సం. జూన్‍ నెలలో రాజస్థాన్లో లభించిన ఉల్కాశిల పిడికిట్లో పట్టేంత చిన్నది. జీఎస్సై వారు ఈ ఉల్కమీద పరిశోధన చేస్తున్నారు. 2016లో తమిళనాడులో ఉల్కపడ్దది. 2001లో తెలంగాణా రాష్ట్రం హుజూర్‍ నగర్‍ సమీపంలోని ఒక గ్రామం దగ్గర ఉల్కావర్షం (మీటియోరైటిక్‍ షవర్‍) పడ్డది. అవి ఎటువంటి ఉల్కలో ఎవరూ చూడలేదు. ఇంకా 1814లో గుర్రంకొండ ప్రాంతంలో 28 గ్రాములు, 1852లో యేటూరులో 13కిలోలపైన, 1870లో నెడగొల్ల ప్రాంతంలో, 1898, 1936లలో హైద్రాబాద్‍లో, 1901లో అల్వాల్‍ ప్రాంతంలో, 1934లో తిరుపతిలో 240గ్రాములు, 1997లో విస్సన్నపేటలో(కృష్ణా జిల్లా, ఆం.ప్ర.) 1300గ్రాముల ఉల్కలుపడ్డ వివరాలు లభిస్తున్నాయి.
మనకండ్ల ముందు పడే ఉల్కలను ‘ఫాల్స్’ అంటారు. ఎపుడోపడి, తర్వాత చూసిన వాటిని ‘ఫైండ్స్’ అంటారు. ఉల్కలకు అయస్కాంతం చేత ఆకర్షింపబడే స్వభావముంటుంది. కొన్ని ఉల్కలను పోలిన ‘క్లస్టర్‍ రాక్స్’ ఉంటాయి. లోహాన్ని శుద్ధి చేసినపుడు మిగిలిపోయే చిట్టెంముద్దలు ఉల్కల రూపంతో పోలి వుంటుంది. కాని, ఉల్కలనిపించి తికమకపెడ్తాయి.


ఉల్కల చరిత్ర:
చారిత్రకయుగంలో, చరిత్రపూర్వయుగంలో ఈ ఉల్కల కార ణంగా భూమ్మీద ఎన్నో మార్పులు జరిగాయి. భారతదేశంలో మహా రాష్ట్రలోని ‘లోనార్‍’ సరస్సు, రాజస్థాన్‍లో, మధ్యప్రదేశ్‍ లోని శివపురి, రాంఘడ్‍లలో పెద్దక్రేటర్స్ కనిపిస్తాయి. అరిజోనా క్రేటర్‍ ప్రపంచ ప్రఖ్యాతమైనది. ఈ లోతైన గుంతలు అతివేగంగా భూమిని ఢీకొట్టిన పెద్ద, పెద్ద ఉల్కల వల్లనే ఏర్పడ్డాయి. గ్రహాంతర పదార్థాలతో కూడిన ఉల్కలు నేలమీద పడ్డపుడు, అక్కడ నేలలోని పదార్థాలు కరిగి, ఉల్కా పదార్థాలతో కలిసి ఏర్పడే వాటిని ‘ఇంపాక్టైట్స్’ అంటారు. గాజుపూస ల్లాంటి ‘స్పిరికిల్‍ బాడీస్‍’ టెక్ట్టైట్స్, చిలుకా సరస్సులో లభించే ఆకుపచ్చని సెమీప్రెషీయస్‍ స్టోన్స్గా లభించే వాటిని ‘మోల్డోవైట్స్’ అంటారు. లిబియల్‍ డెసర్ట్ గ్లాస్‍(ఎల్డీజి) కూడా ఉల్కలవల్ల ఏర్పడ్డ పదార్థమే.
చరిత్రపూర్వయుగంలో 61/2కోట్ల సం.రాల క్రితం మెక్సికో యూకటాన్‍ పెనిన్సులాలోని చిక్సులూబులో 6మైళ్ళ విస్తీర్ణంలో ఉండే ఉల్కాఖండం పడినపుడు అక్కడ 125 కి.మీ.ల కైవారంలో క్రేటర్‍ (గొయ్యి) ఏర్పడ్డది. అపుడు ఎగజిమ్మిన పదార్థంతో భూమిమీది వాతావరణం అతలాకుతలమైంది. అపుడున్న డైనోసార్లు, సంబంధిత జాతులన్నీ పూర్తిగా నశించిపోయాయి. మిగిలిపోయిన క్షీరదాలు తమతోపోటీపడే డైనోసార్లు లేకపోవడంతో ఎంతో ఎదిగిపోయాయి. పరిణామక్రమంలో క్షీరదాల నుంచే మానవజాతి ఆవిర్భవించింది. అంటే ఒకవిధంగా మానవజాతి పరిణామానికి ఉల్కాపాతం కారణమైంది. అంతేకాదు ట్రయాసిక్‍ యుగాంతంలో జరిగిన ప్రళయాలకు (ఎక్స్టెంక్షన్స్) ఉల్కలుపడడమే కారణమంటారు. భూమ్మీద ఇంతగా నీరుండడానికి సౌరమండలంనుంచి, తోకచుక్కల నుంచి రాలిపడిన ఉల్కాపాతమే కారణంగా చెప్తారు శాస్త్రవేత్తలు. గ్రహాంతరాలనుంచి జీవం నేలమీదకు ఉల్కలవల్లనే వచ్చిందనే సిద్ధాంతాలు కూడా రూపుదిద్దుకుంటున్నాయి.


ఉల్కలు-యాజమాన్యచట్టాలు:
ఉల్కలు యజమాని లేని వస్తువులు. యాజమాన్యం ఎవరిదన్న ప్రశ్న అవి పడ్డ భూభాగం ఏ దేశానికి చెందినదో ఆ దేశం యొక్క చట్టంపై ఆధారపడి ఉంటుంది. కొన్ని దేశాలలో ఈ అంశంపై వ్యవహరించడానికి నిర్దిష్ట చట్టం లేదు. కొన్ని దేశాల్లో మతపరమైన చట్టం వర్తించబడుతుంది. ప్రామాణిక భూచట్టాలు కూడా ఉల్కలకు వర్తిస్తాయి. అపుడు భూమి యజమానే ఉల్కల యజమాని. అమెరికా సంయుక్తరాష్ట్రాల్లో ఉల్కలు కనుగొనబడితే వాటి యాజ మాన్యం ఆ మెటియోరైట్‍ యొక్క ఉపయోగంపై ఆధారపడి ఉంటుంది. ఒక వ్యక్తికి సంవత్సరానికి పది పౌండ్లకు మించకుండా చేతితో తీసుకెళ్లగలిగే ఉల్క దొరికితే అది సేకర్తకే చెందుతుంది. అమెరికా చట్టం ప్రకారం వీటి కొనుగోలు మార్కెట్‍ విలువ ప్రకారం ఉంటుంది.
శాస్త్రపరిశోధనల కోసం విద్యాసంస్థలు పురా వస్తువుల చట్టం ప్రకారం అనుమతులకు లోబడి మెటియోరైట్‍లను సేకరించి ఉంచు కోవడానికి అవకాశం ఉంటుంది. బోర్డ్ ఆప్‍ లాండ్‍ మేనేజ్మెంట్‍ (BLM) జారీచేసిన భూ వినియోగ అనుమతిపత్రం ద్వారా అమ్మకం కొరకు పన్నుకట్టే షరతుమీద వాణిజ్య సేకరణకు అనుమతించ బడుతుంది. అర్జెంటీనాలో ప్రాంతీయచట్టాలు వర్తిస్తాయి, ప్రాంతీయ ఆస్తిగా ప్రకటించబడిన ఒక 18కి.మీ విస్తీర్ణంలో ఉల్కలు ప్రాంతీయ ఆస్తిగా ప్రకటించబడ్డాయి. సేకరణపై రుసుము వర్తించ బడుతుంది. అమ్మకానికి లభించే ఉల్కలు ఎక్కువగా అర్జెంటీనా నుండి వచ్చాయి.


కెనడాలో ఇది ఆ భూమి యజమాని యొక్క ఆస్తి. తనకు విక్రయించే హక్కు ఉంది. అయితే ఎగుమతి అనుమతి కోసం, స్థానిక సంస్థలు కొనుగోలు చేయడానికి 6నెలల వ్యవధి ఉంటుంది. డెన్మార్క్ లో మెటియోరైట్‍ ఒక జాతీయ ఆస్తి. దొరికినవారు పన్నుకట్టాలి. జపాన్‍లో ఉల్క అనేది అన్ని హక్కులతో కూడిన భూ యజమానుల ఆస్తి. మెక్సికోలో అంతరిక్ష వస్తువులు జాతీయ ఆస్తి. మెటియోరైట్‍ దిగుమతి చట్టబద్ధం. బ్రిటన్‍లో ఉల్క భూయజమాని ఆస్తి, ప్రత్యేక పరిస్థితులలో దానిని ట్రెజర్‍ ట్రోవ్‍గా కూడా ప్రకటించవచ్చు. అప్పుడు అది ప్రభుత్వ ఆస్తి అవుతుంది. అంటార్కిటిక్‍లో జరిగే ఉల్కల సేకరణ, వ్యవహారాలన్నీ అంటార్కిటికా ఒప్పందానికి లోబడి ఉంటాయి. భారతదేశంలో ఉల్కను ప్రభుత్వానికి అప్పగించడం తప్పనిసరి. ఇది ప్రభుత్వ ఆస్తిగా పేర్కొనబడినప్పటికీ, ఇది ఏ చట్టం ప్రకారం అని స్పష్టంగా లేదు. మెటియోరైట్‍లు మరియు వాటి సేకరణకు సంబంధించిన నిర్దిష్ట చట్టమేదీ ద•ష్టికి రాలేదు.

  • చకిలం వేణుగోపాల్‍ రావు,
    ఎ: 9866449348
  • శ్రీరామోజు హరగోపాల్‍, ఎ : 99494 98698

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *