అలనాటి మేటి తెలంగాణ శాసనాలు-18
అనేక ప్రత్యేకతలు గల ఇద్దరు రాజుల
ఉజ్జిలి, మునుపటి మహబూబ్‍నగర్ జిల్లా, మక్తల్ తాలూకాలోని ఒక ప్రాచీన కోట. కళ్యాణ చాళుక్యుల కాలంలో ఒక రాజధాని. ఉజ్జిలి ఇపుడొక చిన్న గ్రామమైనా, క్రీ.శ.10-12 శతాబ్దాల్లో ఒక పాలనా కేంద్రంగా వెలుగొందిన నగరం. ఆ గ్రామంలోని ఒక బావి దగ్గర అనేక ప్రత్యేకతలున్న ఒక కన్నడ శాసనముంది. 131 సం।।ల తేడాతో ఒకేరాతిపై గల క్రీ.శ.966 నాటి మొదటి శాసనాన్ని మహామండలేశ్వర శ్రీ వల్లభచోళ మహారాజు, క్రీ.శ.1097 నాటి రెండో శాసనాన్ని నాలుగో సామేశ్వరుని మహాప్రధాని భానుదేవరసరు వేయించారు.
ఈ శాసనాన్ని తొలిసారిగ, తెలంగాణ శాసనాలు వా.2, సంఖ్య, 35గా, లక్ష్మణరాయ పరిశోధక మండలి, హైదరాబాదు, 1935లోనూ, ఆంధప్రదేశ్ అర్కియాలజికల్ సీరీస్, వా.1, లో మహబూబ్‍నగర్ శాసన సంఖ్య 61 గానూ, ఏ కాటలాగ్ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్ కాపీడ్ ఆప్ టూ 1964, గవర్నమెంట్ ఆఫ్ ఏపీ, హైదరాబాద్, 1965, పే.81-82, లోనూ, ఎన్నెస్ రామచంద్రమూర్తి (సం), ఇన్స్క్రిప్షన్స్ ఆఫ్ ఆంధప్రదేశ్, మహబూబ్‍నగర్ డిస్ట్రిక్టు, వా.1, శా.సం.149, హైదరాబాదు, 2003 పే.278-280లోనూ ప్రచురించబడింది. ఇదే శాసనం పైన ఒక వ్యాసాన్ని ఎన్నెస్ రామచంద్రమూర్తి, ఆం.ప్ర.హిస్టరీ కాంగ్రెస్ ప్రొసీడింగ్స్ వా. 20, 1996, పే.70-74లో ప్రచురించారు.
శాసనపాఠం : మొదటి వైపు
1.………. స ……………
2.బృధ్వివల్లభ మ. …………
3.త్యాశ్రయ కుళతిళకం చాళుక్యాభ. ……..
4.దేవర విజయ రాజ్యముత్తరోత్తరాభివృద్ధి
5.తారంబరం సలుత్తమిరె కల్యాణపురదనెలె వీడినోళు ….
6.థా వినోదదిం రాజ్యంగెయుత్తమిరె తతుపాద పద్మోపజీవి స్వస్తి సమధిగ (త.పం)
7.చ మహాశబ్ద మహా మణ్డళేశ్వరం శ్రీ వల్లభ చోళ మహారాజరు శకవశ
8.నెయ ప్రభవ సంవత్సరద మాగ్గ శిరశుద్ధ పంచమీ బ్రిహ
9.స్పతి వారదు ఉత్తరాయణ సంక్రాంతి నిమిత్తదిం కల్ల కెళగయ్నూ
10.రర మొదలబాడం రాజధాని ఉజ్జివొళలలకోటె యొళగణబసది శ్రీ
11.మద్రావిళ సంగదసేనగళద కౌరూరగచ్ఛదబద్ది జినాలయద చంనపా
12.శ్వ దేవర అంగభోగక్కం నివేద్యదీపదూప తాంబూళ ఈ బంద
13.హోదరిశియర అజ్జియర ఆహారదానక్కం సౌతెశుణ్న జీణ్నో ద్ధారక్కకం శ్రీ
14.వాదిరాజాన్వయద వాదిరాజదేవర శిశ్యరప్ప అల్లియ ఆచాయ్య రు ఇంద్రసేన
15.పండితదేవర కాలం కచ్చి ధారాపూర్వ కం మాడి ఉజ్జివొళల పడువణ సీమెయొ (ళ)
16.గె బద్ది పళ్లియిం బడగలు కొట్ట కెఱె ఒందుకెయి మత్తప్ప నె 12 సినెయత..
17.యలుహూవినతోంటమత్తకమ్మ 3 oo అశేష నకరంగళుం దేవగ్గె అచ్చినకం మట
18.దలుదళకెహార ఒందంబిట్టరు దీవిగెగె గాణొందం అశేషనకరహోన్నవణి హేరింగె
19. oo ఎలెయం బిట్టరు ఇంతిధమ్మ మం ప్రతిపాళిసువరు సౌధరె ఉలపయ్య నాయకరుం సౌ
20.ధరెప్రోలెయ నాయకనుం సౌధరయాజయ నాయకనుం అశేషనకరంగళుం, సమెయ
21.గళుం పంచమఠస్థానంగళుం ఇంతిధమ్మ మం ప్రతి పాళిసువరు…
రెండవవైపు
22.……… శ్రీస్వస్తి సమస్త భువనాశ్ర
23.య శ్రీపృథ్వీవల్లభ మహారాజాధిరాజ పరమేశ్వర పరమ భట్టారకం సత్యాశ్రయ
24.కుళతిళకం చాళుక్యాభరణం శ్రీమచాళుక్య చక్రవత్తి వీరసోమేశ్వర దేవ
25.వషద సకవశ 1019 నేయ పరాభవ సంవత్సరద పుశ్య సుద్ధ 13 యోదసి బ్రిహస్ప
26.తి వారదందు ఉత్తరాయణ సంక్రాంతి నిమిత్తదిం కల్ల కెళగునాడ మొదల బాడం
27.రాజధాని ఉజ్జివెళల కోటెయొళగణ బసది బద్దిజినాలయద దేవర వేద్య దీపధూప
28.ఫళ అష్టవిధాచ్ఛ నెగిం పౌతెసుణ్న జీణ్నో ద్ధారక్కం శ్రీ మన్మహా ప్రధానం సేనాధిపతి బాహత్తర
29.నియోగం శ్రీ కరణం శ్రీ మతకల్లకెళగు నాడ దండనాయకం భానుదేవరసరు
30.శ్రీమతు కల్లకెళగు నాడ సౌధరెకేషవయ్య నాయకరన్మతదిం అల్లియ ఆచాయ్య
31.రు ఇంద్రశేణ పండిత దేవర కాలం కచ్చి ధారాపూవ్వ కం మాడి ఉజ్జివొళలి పడువణ సీమెయె
32.ళగె రావుళహల్లియబడగ తోపులకుంటెయెంబకెఱెయం కొట్టరు ఆకెఱెయం తెంక
33.క్రయిమత్తప్ప 12 రడం కొట్టరు ఇన్తిధమ్మ మం ప్రతిపాళిసుపరు సౌధరెకే కేశవనాయు
34.కదుం సౌదరే… కనం…..
మొదటి శాసన వివరాలు
పృధ్వీవల్లభ, సత్యాశ్రయకులతిలక… దేవర, కళ్యాణపురం నుంచి రాజ్యం చేస్తున్నప్పుడు ఆయన పద్మోపజీవి, సమధిగత పంచమహాశబ్ద, మహామండలేశ్వర, శ్రీవల్లభచోళమహారాజు, శక సంవత్సరం 888 (క్రీ.శ.966)లో కల్లకెళగెనాడులోని ఉజ్జివోళల కోట రాజధానిగా పాలిస్తున్నపుడు , ఉజ్జిలిలోని ద్రావిళ సంఘం, సేనగణ, కౌరూరు గచ్చకు చెందిన బద్దిగజినాలయంలోని చెన్నపార్శ్వ (నాధ) దేవర అంగభోగం, ధూప, దీప, నైవేద్య, తాంబూళానికి, సందర్శనకొచ్చిన జైనాచార్యుల భోజనాలకు, ఆలయ జీర్ణోద్ధరణ, సున్నం గొట్టటానికి గాను అశేషనకరాలు కలిసి, స్థానికాచార్యుడు ఇంద్రసేన పండితుని కాళ్లు గడిగి, ఉజ్జవోళాల పడువణ సీమలోని బద్దిపళ్లిలో కొంత భూమిని, తోటలను దానం చేసినట్లునూ, ఈ ధర్మాన్ని సౌధెరె (చౌదరి) ఉలపయ్య నాయకుడు, సౌధరె ప్రోలెయనాయుడు, సౌధరె యాజయనాయకుడు, అశేష నకరాలు (వ్యాపార సంస్థలు), సమయాలు (మతసంస్థలు), పంచమఠస్థానాలు కాపాడాలని చెప్పబడింది.
రెండో శాసనం వివరాలు
శ్రీ పృధ్వీవల్లభ మహారాజాధిరాజ, పరమేశ్వర, పరమభట్టారక, సత్యాశ్రయ కులతిలక, చాళుక్యాభరణ, చాళుక్య చక్రవర్తి వీర (నాలుగో) సోమేశ్వరదేవుడు, శకవర్షం 1019 (క్రీ.శ.1097)లో ఉత్తరాయణ సంక్రాంతినాడు, కల్లకెళగునాడులోని, ఉజ్జివోళలకోట రాజధానిగా పాలిస్తుండగా అక్కడి బసదిలో నున్న బద్ధిజినాలయంలోని (పార్శ్వనాథుడుని) నైవేద్య, దీప, ధూప, ఫల, అష్టవిధార్చన, జీర్ణోద్ధారణ కోసం, శ్రీమన్మహా ప్రధాని, సేనాధిపతి, బాహత్తరనియోగి, శ్రీకరణం, శ్రీమత్ కల్లకెళగునాడుదండనాయకుడు అయిన భానుదేవరసరు, ఇంకా సౌధరెకేషవయ్య నాయకుడు, అక్కడ ఆచార్యుడైన ఇంద్రసేనపండితుని కాళ్లు కడిగి, ఉజ్జివొళలి పడువణసీమలోని రావులపల్లి తోపులకుంటె వెనుక చెరువుకింద, కొంత భూమిని కొని దానం చేశారని, ఈ ధర్మాన్ని సౌధరె కేశవనాయకుడు… కాపాడతారని చెప్పబడింది.
ఇక శాసనంలోని ప్రత్యేకతలు
ఈ రాతిపైన ఇద్దరు రాజుల పాలనలో ఇద్దరు వ్యక్తులు, సంస్థలు, జినాలయానికి చేసిన దానాలున్నాయి. మొదటి శాసన తేదీ క్రీ.శ.966. కళ్యాణచాళుక్య పాలన క్రీ.శ. 972కు గాని ప్రారంభం కాలేదు. అందుచేత ఈ తేదీ తప్పు. దేవుని పేరు చెన్నపార్శ్వనాథుడు. చెన్న కేశవ, చెన్నమల్లికార్జునుల మాదిరిగా పార్శ్వనాథుని ముందు చెన్న పదం గమనార్హం. మొదటి శాసనంలోని శ్రీవల్లభచోళుడు క్రీ.శ.1181-1200 మధ్య పాలించిన వీరసోమేశ్వరుని సమకాలికుడు. కాని క్రీ.శ.966లో పాలిస్తున్నట్లు పేర్కొనటం మరో తప్పు. ఈ శాసనం మొదటి సారిగా, సేనగణ అనే జైనశాఖను, ఇంద్రసేన పండితుడనే జైనాచార్యుణ్ణి, అప్పటి పాలనా విభాగమైన కల్లకెళగునాడు-500ను ప్రస్తావించింది. కాకతీయుల కాలంలో ప్రాముఖ్యతను సంతరించుకొన్న బాహత్తరనియోగ వ్యవస్థ, కళ్యాణ చాళుక్యుల కాలంలోనే పురుడు పోసుకుందని కూడా ఈ శాసనం వల్లే తెలుస్తుంది.
శాసనంలోని కుళతిళకం=కులతిలకం, తతుపాద = తత్పాద, మణ్దళేశ్వర = మండలేశ్వర, బ్రహస్పతి = బృహస్పతి, శ్రీమద్రావిళసంగ = శ్రీమద్రావిళ సంఘ, కౌరంగచ్చ = కౌరూరుగచ్చ, సకవర్శ = శకవర్ష పుశ్య = పుష్య; సుద్ధ = శుద్ధ, కేషవయ్య = కేశవయ్య, గా చదువుకోవాలి. ఇన్ని ప్రత్యేకతలున్న ఈ శాసనం అలనాటి మేటి తెలంగాణ శాసనాల్లో ఒకటి.
-ఈమని శివనాగిరెడ్డి-స్థపతి
ఎ : 9848598446