పర్యావరణం – శాస్త్రం – నైతికత – తాత్విక దృక్పథాలు


(గత సంచిక తరువాయి)


సోషల్‍ ఎకాలజీ
ముర్రేబుక్‍చిన్‍ అనే సామాజిక సిద్ధాంతకర్త సాగించిన ఆలోచనధారను ‘సోషల్‍ ఎకాలజీ’గా వ్యవహరిస్తున్నారు. నాలుగు దశాబ్దాలపై చిలుకుగా ఈయన సామాజిక ఆధిపత్యం, ప్రకృతిపై ఆధిపత్యం మధ్యగల సంబంధాలను గురించి సాగించిన రచనల సారాంశం సోషల్‍ ఎకాలజీగా గుర్తింపు పొందింది.
ఈయన సాగించిన చింతనకు మూలాలు భిన్న రకాలైన తాత్త్విక సంప్రదాయాలలో కనిపిస్తాయి. ముఖ్యంగా మార్క్సీయ సామ్యవాదం, ఉదార అరాచకవాదం, పాశ్చాత్య జీవవాదాలలో దర్శనమిస్తాయి. అదే విధంగా అరిస్టాటిల్‍, హెగెల్‍ వంటి తత్త్వవేత్తల ఆలోచనల ప్రభావం కనిపిస్తుంది.
ముర్రే బుక్‍చిన్‍ ప్రధానంగా ఆధిపత్యం అనే భావనను పరిశీలించాడు. ఆయన వాడిన సామాజిక ఆధిపత్యం అనేది ఏ అర్థంలో వాడాడో పరిశీలించాలి. ప్రత్యేకంగా ముర్రే సిద్ధాంతంలో శ్రేణులు (hierarchies) అనేది ప్రధాన భావనగా కనిపిస్తుంది. చాలా వివరణాత్మకంగా శ్రేణులు గురించి తెలిపాడు.


“The cultural and psychological systems obedience and command not merely the economic and political system to which the terms class and state most appropriately refer. Accordingly, hierarchy and domination could easily continue to exist in a “class less” or “state less society”.


రాజ్యం, వర్గం అనే పదాలు ఆర్థిక, రాజకీయ వ్యవస్థలను ఎంత ఖచ్చితంగా సూచిస్తాయో, సాంస్కృతిక, సంప్రదాయ, మానసిక వ్యవస్థలైన విధేయత, ఆదేశాలనేవి సూచించవు. వర్గం ఆర్థికాన్ని, రాజ్యం రాజకీయ వ్యవస్థలను సరళంగానే సూచిస్తాయి. అంటే రాజ్యం, ఆర్థిక వ్యవస్థల నుండి ఆదేశం, విధేయతలను మినహాయించి చూశాడు. ఇవి సంప్రదాయం, సాంస్కృతిక, మానసిక వ్యవస్థలకు చెందినవిగా పేర్కొంటున్నాడు. అదేవిధంగా ముర్రే బుక్‍చిన్‍ ఈ విధంగా అభిప్రాయడ్డాడు.
“Accordingly, hierarchy and domination could easily continue to exist in a “class less” or “state less Society”
పెద్దలు, పిల్లలను, పురుషులు స్త్రీలను, ఒక జాతి మరొకజాతిని, జన సమూహాన్ని, పట్టణం పల్లెపై ఆధిపత్యం నెరపుతుందనే అర్థంలో domination అనే పదాన్ని సూచించాడు.


శ్రేణులు అంటునప్పుడు కనీసం రెండు బృందాలు లేదా సమూహాలు ఉంటాయి. ఒకటి మరొక దానిపై అధికారం కలిగి ఉంటుంది. ఈ అధికారంలో ఆధిపత్యవర్గం ఆదేశాలను ఇస్తుంది. న్యూనవర్గం విధేయతను పాటిస్తుంది. శ్రేణులు సామాజిక వ్యవస్థలో ఆధిపత్యాన్ని ప్రోత్సహిస్తాయి. దీనితో ఆధిక్యతలో ఉన్న బృందం తమకంటే తక్కువగా ఉన్న బృందం ద్వారా తన ప్రయోజనాలను నెరవేర్చుకోగలుగుతుంది. ఇది తమకంటే తక్కువ బృందాల ఆకాంక్షలను నెరవేర్చుకోవటంలో అడ్డుకూడా తగులుతుంది. ఆర్థికవర్గాలలోనే సామాజిక శ్రేణి, ఆధిపత్యం ప్రాథమిక రూపంలో ఉంటుందని సంప్రదాయ మార్క్సిస్టులు భావించినట్లుగా ముర్రే భావించలేదు. అలాగే అనార్కిస్టులు భావించినట్లుగా సామాజిక ఆధిపత్యానికి ఆధునిక రాజ్యం ప్రాథమిక ఏజెంట్‍గా ఉంటుందనీ భావించలేదు. ఆర్థిక వర్గాలు లేని సమాజాలలోనూ ఆధిపత్య నిర్మాణాలుంటాయని భావించాడు. అదేవిధంగా ముర్రే చెప్పిన దానిలో భౌతిక ఆధిపత్యం, అధికారం సామాజిక నియంత్రణకు మాత్రమే సాధనాలు కావు. దీనిని గురించి విశ్లేషించిన Jardins ఈ విధంగా వ్యాఖ్యానించాడు. “Hierarchy” is also a state of consciousness” as well as a social condition. People can be oppressed by their consciousness, their understandings and beliefs, as much as by external forces”.
బాహ్యశక్తులు ఎంతగా తమను అణిచివేస్తాయో తమ స్వీయ చైతన్యంలో అంతగా అణచివేయబడతారు. వారి అవగాహనలు, విశ్వాస నమ్మకాలు కూడా అంతగా అణచివేతకు గురవుతాయి.


అంటే సామాజికంగా ఉన్న శ్రేణీగత నిర్మాణాలను ప్రజలు అంతర్లీనపరచుకుంటారు. తద్వారా తమ జీవితాలు అవమానాలకు, అపరాధ భావాలకు గురవుతుండగా, ఆధిపత్యం గలవారు జీవితంలోని సుఖ సంతోషాలను ఆనందిస్తారు. ఈ రకమైన శ్రేణీగత నిర్మాణాలు, ఆధిపత్యం పాతరాతియుగం మొదలుకొని ఆధునిక యుగం వరకు భిన్న రూపాల్లో ఉనికిలో ఉన్నాయని బుక్‍చిన్‍ గుర్తించి సూచించాడు.
సామాజిక శ్రేణుల పద్ధతుల నుండి ప్రకృతి ఆధిపత్యం మొలకెత్తింది. అయితే బుక్‍చిన్‍ ప్రామాణిక మార్క్సిస్టు అన్వయాన్ని తల్లకిందులు చేశాడు. మార్క్సిస్టుల దృష్టిలో మానవుల ఆధిపత్య సామర్థ్యం వ్యక్తిగత ఆస్తి సంపదను సృష్టించడానికి దోహదపడింది. వర్గ నిర్మాణాలు వర్గ సంఘర్షణకు అణచివేతకు దారితీశాయి. బుక్‍చిన్‍ దృష్టిలో ఆధిపత్య సామాజిక నిర్మాణాలు ప్రకృతిపై ఆధిక్యతకు మార్గాన్నిచ్చాయి. అంటే సామాజిక ఆధిపత్య విధానాలు ఒక విస్తృత సాంస్కృతిక మనస్తత్వాన్ని పెంపొందించాయి లేదా భావజాలాన్ని రూపొందించాయి. ఈ భావజాలం ప్రకృతిపై ఆధిపత్యాన్ని సమర్థించేదిగా మిగిలింది. అంటే “social hierarchies provide both the psychological and material conditions- the motivation and the means- for exploiting and dominating nature”అని చెప్పవచ్చు.
శ్రేణీగత సమాజాలలో సామాజిక సంస్థలు, ఆచరణలు అన్నీ నియంత్రణను కల్పించడానికి రూపకల్పన చేయబడి ఉంటాయి. ఆర్థిక సామర్థ్యం ఒక ఆదర్శంగా పేర్కొనబడుతుంది. ఇటువంటి సమాజాలలో విజయం ఆధిపత్యం వహించటం, నియంత్రించటంగా అవగాహన చేసుకోబడుతుంది. అంటే ఎక్కువ మంది ఒక్కరికోసం పనిచేయటం, అధిక సంపద, అధికారం, హోదాను కలిగి ఉండటమే విజయంగా అభివర్ణింపబడుతుంది. ఇటువంటి స్థితి ఉన్నప్పుడు సమాజం విజయాన్ని మానవేతర ప్రకృతిపై ఆధిపత్యంగా, నియంత్రణగా గుర్తిస్తుంది. శ్రేణీగత సమాజాలు రద్దు అయినప్పుడు మాత్రమే ప్రకృతి, మానవేతర ప్రపంచం విముక్తమవుతుంది. అట్లాంటప్పుడే పర్యావరణ సంక్షోభాలు అంతరిస్తాయి. సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.


మానవాధిపత్యం నుండి ప్రకృతికి స్వేచ్ఛ ఎప్పుడు లభిస్తుందంటే మానవులు కూడా ఆధిపత్యం నుండి స్వేచ్ఛ పొందినప్పుడని బుక్‍చిన్‍ ప్రబలంగా విశ్వసించాడు. బుక్‍చిన్‍ ప్రతిపాదనలు పర్యావరణ తాత్త్విక సిద్ధాంతాలను ఒకమేరకు ప్రభావితం చేశాయి. మానవాళి తమ ఆధిపత్య ధోరణులను అర్థం చేసుకోవడానికి ఎంతగానో తోడ్పడింది. పర్యావరణ సంక్షోభాల విషయంగా తాత్త్విక చర్చలను ముందుకు నెట్టింది. పర్యావరణ సంక్షోభాలకు ముగింపు పలికే ప్రతి తాత్త్విక ఆలోచన కూడా అటు పర్యావరణానికి, ఇటు మానవ సమూహాలకు తోడ్పడ్తుందనటంలో సందేహిం చాల్సిందేమీ లేదు.


పర్యావరణ స్త్రీవాదం (Ecofeminism)
పర్యావరణ సంబంధాంశాలను స్త్రీవాద దృష్టికోణంతో పరిశీలించటంతో పర్యావరణ స్త్రీవాదం ఉనికిలోకి వస్తుంది. స్త్రీవాదం పితృస్వామ్య వ్యవస్థ, ఆధిపత్యం, పురుషాధిక్యతలు, కుటుంబ నియంత్రణ, జెండర్‍పరంగా అసమానతలను గురించి పేర్కొంటుంది. సరిగ్గా సామాజిక పర్యావరణ వాదం పేర్కొన్న ఆధిపత్యం, నియంత్రణల గురించి పర్యావరణ స్త్రీవాదం మాట్లాడుతుంది. అటు సోషల్‍ ఎకాలజీని ఇటు స్త్రీవాదుల ఆలోచనలను కలిపి స్త్రీవాద పర్యావరణమని వ్యవహరిస్తున్నారు. అయితే ఈ రెండింటి మధ్య ఎన్ని సామ్యాలు కనిపిస్తాయో అన్ని తేడాలు కూడా ఉన్నాయి. కాగా ముర్రే బుక్‍చిన్‍ సామాజిక పర్యావరణ వాదానికి ఆద్యుడు. పర్యావరణ స్త్రీవాదంలో భిన్న ఆలోచనా స్రవంతులు కలగలుస్తాయి. ఇది ఒక ఏకీకృత సిద్ధాంతంగా కంటే, స్త్రీవాదులలో ఎన్ని వైవిధ్యపూరిత దృష్టి కోణాలున్నాయో వాటిని ప్రతిఫలింపజేస్తూ పర్యావరణ సమస్యలపై సాధారణ దృక్పథాలను వెల్లడిస్తుంది. “Social ecology and ecofeminism have much in common in their general analysis of ecological problems. Each sees ecological destruction as related to social problems of control and dominance”


పర్యావరణ విధ్వంసం అనేది నియంత్రణ, ఆధిపత్యం అనే సామాజిక సమస్యలకు సంబంధించిందిగా భావిస్తుంది. అయితే అటు సోషల్‍ ఎకాలజి గానీ, ఇటు పర్యావరణ స్రీవాదంగానీ ఈ సామాజిక సమస్యలకు భిన్నమైన ప్రత్యేకమైన వివరణలను అందించాయి. అట్లాగే సామాజిక మార్పుకోసం వీరు తలపెట్టే కార్యక్రమాలు కూడా పూర్తిగా ప్రత్యేకం. భిన్నంగానూ ఉంటాయి.
సోషల్‍ ఎకాలజీ, ఎకోఫెమినిజం పర్యావరణ సంక్షోభాలకు దారితీసిన కారణాలను అన్వేషించేందుకు సమాజాన్ని పరిశీలిస్తాయి. ఈ రెండు కూడా గుప్త పర్యావరణ వాదుల్లా పర్యావరణ విధ్వంసానికి మానవ, సామాజిక కారణాలను విస్మరించవు. ఈ రెండూ మానవకేంద్రక దృష్టికోణమే విధ్వంసాలకు కారణమని అంగీకరించవు. మానవులు రూపుదిద్దుకున్న వ్యవస్థలు, ఆచరణలు కారణమని చెపుతాయి. ముఖ్యంగా న్యాయసమ్మతంకాని వ్యవస్థలు, ఆచరణలను గురించి విమర్శనాత్మకంగా ఉంటాయి. సంప్రదాయ నైతికతల వైఫల్యమే పర్యావరణ సమస్యలకు కారణమనే వాదాన్ని ఇవి అంగీకరించవు. సామాజిక న్యాయం గురించిన సంప్రదాయ సిద్ధాంతాలు పర్యావరణ సమస్యలను విశ్లేషించడానికి తగినవనే దృక్పథాన్ని వీరు అంగీకరించరు. కొన్ని సామాజిక కారణాలు పర్యావరణ సంక్షోభాలకు మూలం అని వాదిస్తారు.


Specifically, social ecologists and ecofeminists believe that the domination and degradation of nature arise from social patterns of domination and hierarchy, patterns of social life in which some humans excercise control or domination over others”
సామాజిక పద్ధతులు సామాజిక జీవితంలో కొందరు ఇతరులపై నియంత్రణను, ఆధిపత్యం కలిగి ఉండటానికి వీలు కల్పించాయని ఇవే ప్రకృతిపై ఆధిపత్యానికి ప్రకృతిని క్షీణింప జేయడానికి మౌలికమైన కారణం అన్నది వీరి వాదం. వీరికి సామాజిక న్యాయం అనేది ప్రధానంగా దృష్టి నిలపాల్సిన అంశంగా అనిపిస్తుంది.
తొలిస్త్రీవాద తాత్త్వికులైన Rosemary Radford Reuther పర్యావరణ సమస్యలను సంబోధించాలంటే ఏం చేయాలో ఈ విధంగా సూచించింది.
“Women must see that there can be no liberation for them and no solution to the ecological crisis within a society whose fundamental model of relationships continue to be one of domination. They must unite the demnads of the womens movement with those of the ecological movement to envision a radical reshaping of the basic socioeconomic relations and the underlying values of this society”


పర్యావరణ విధ్వంసాన్ని మానవ ఆధిపత్యరూపంగా అర్థం చేసుకోవాలి. స్త్రీల ఆకాంక్షలన్నిటినీ ఐక్యం చేస్తూ పర్యావరణ ఉద్యమంలో భాగం చేస్తూ సామాజిక ఆర్థిక సంబంధాలను, సామాజిక విలువలను సరికొత్త రూపానికి మార్చటం అవసరం అని భావించాలి. ఆధిపత్యం అంటే ప్రకృతిపై ఆధిపత్యమే కాబట్టి అటు సోషల్‍ ఎకాలజిస్టులు, ఇటు పర్యావరణ స్త్రీవాదులు మానవులపై ఇతర మానవులు నెరపే సామాజిక సాధారణ పద్ధతులను అర్థం చేసుకోవలసి ఉంటుందని భావించారు. పర్యావరణ సంక్షోభాలకు సంబంధించిన సరైన అవగాహనతో సామాజిక, రాజకీయ తాత్త్వికతలను ప్రశ్నించాల్సిన అవసరాన్ని వీరు నొక్కిచెప్పారు.
మనమెట్లా జీవించాలి అనే ప్రాథమిక ప్రశ్న ఒక వ్యక్తిని, సమూహాన్ని సంబోధిస్తుంది. ఇది కొన్నిసార్లు ‘‘నీతి’’గా అభివర్ణింప బడుతుంది. మనమెలా కలసి జీవించాలి? అనే ప్రశ్న సామాజిక న్యాయానికి సంబంధించింది. అందువల్లనే పర్యావరణ స్త్రీ వాదులు సామాజిక న్యాయం అనే మాట సామాజిక, రాజకీయతత్వానికి తొలిసూత్రంగా మార్చగలిగారు. కలిసి జీవించటం అంటే సమానత్వంతో మానవులతో జీవించటం. కేవలం మానవులతోనే కాకుండా మానవేతరమైన అన్నిటితో సమానత్వ భావనతో జీవించటం. సామాజిక ఆధిపత్యానికి, ప్రకృతిపై ఆధిపత్యానికి మధ్య నున్న సంబంధాలను ఎకోఫెమినిజం విభిన్నమైన పద్ధతులలో గుర్తించింది. స్త్రీవాద ఉద్యమాలకు, పర్యావరణ ఉద్యమాలకు గల సంబంధాలను కూడా ఇది గుర్తించింది. ఆ మేరకు పర్యావరణ తత్త్వ వివేచనలో తన దోహదాన్ని ప్రాధాన్యాంశంగా చూపగలిగింది.


అయితే ఆధిపత్యం గురించి లోతయిన అంశాలను కూడా వారు స్పృశించారు. ప్రతి ఆధిపత్యానికి ఒక తర్కం ఉంటుంది. ఇది ఆలోచనా పద్ధతికి సంబంధించింది. పురుషుల ఆధిపత్యం స్త్రీలపై ఉండటానికి గల కారణం ఆలోచనా విధాన ఫలితమే. అది చారిత్రకంగా, అనుభ వాత్మకంగా, ప్రతీకాత్మ కంగా, సైద్ధాంతికంగా కూడా వృద్ధి పొందుతూ వచ్చింది.
స్త్రీలు ఉద్వేగాత్ములు, పురుషులు తార్కింగా ఉంటారు అనే ఆలోచనా పద్ధతిలో ఒకరు అధికులు, మరొకలు అనధికులు అనే విలువ జత చేయబడింది. స్త్రీ పురుషుల స్వభావాలను, లక్షణాలను ఈ విలువ ఒక శ్రేణీగత నిర్మాణంగా రూపుదిద్దుకుంటుంది. స్త్రీలు తార్కికంగా ఆలోచించలేరు కనుక అధికులు కాలేరు అని నిర్థారించబడుతుంది. సహజంగానే పురుషులకు ఉన్నత స్థితి, స్త్రీలకు న్యూనస్థాయి కల్పించబడుతుంది. ఈ తరహా ఆలోచనా పద్ధతులను, ఆధిపత్య తర్కాన్ని ఫెమినిజం నిరాకరిస్తుంది.
అలీసన్‍ జగ్గర్‍ రూపొందించిన ఆలోచనా చట్రం చాలామంది పర్యావరణ స్త్రీవాదుల ఆలోచనలను ప్రభావితం చేసింది. అలీసన్‍ జగ్గర్‍ ఉదార, మార్కిస్టు, రాడికల్‍ సోషలిస్టు ఫెమినిజాలుగా విభజించింది. ఇన్ని విధాలైన స్త్రీవాదాలకు ఆమె అణచివేతను, ప్రత్యామ్నాయ తాత్త్వికతలను పేర్కొంది.
ఉదారవాద స్త్రీవాదం స్త్రీ పురుషుల మధ్య తేడాలు ఉన్నాయనే విషయాన్ని నిరాకరిస్తుంది. ఉదార స్త్రీవాదం మానవులు ఒకే రకమైన స్వభావాన్ని కలిగి ఉంటారని, తార్కిక లక్షణం ఉంటుందని పేర్కొంటుంది. ఏ విధమైన చిన్న చూపు చూసినా, అసమానత పాటించినా అది న్యాయబద్ధం కాదని వాదిస్తుంది. అందువల్లనే ఉదార స్త్రీవాదం వివక్షతను గుర్తిస్తూ దానికి వ్యతిరేకంగా పోరాడుతుంది. సమాన హక్కులు, సమాన అవకాశాలను కోరుతుంది.


మార్క్సిస్టు ఫెమినిజం ప్రకారం స్త్రీల అణచివేతకు కారణం ఇంటిపనికి స్త్రీని పరిమితం చేయడం అంటుంది. ఇంటిపనిని ఆధారిత శ్రమరూపంగా భావిస్తుంది. స్త్రీల శ్రమకు వేతనరూప ప్రతిఫలం ఉండదు. స్త్రీల శ్రమ విస్మరణకు గురవుతుంది. గృహ సంబంధమైన పని, శ్రమ స్త్రీలకు ఆస్తిహక్కులను యాజమాన్య హక్కులను ఇచ్చేది కాదు. స్వతంత్రమైన ఉత్పాదక శ్రమ రూపాల్లో స్త్రీలు పాల్గొనటం ద్వారా స్త్రీలు అణచివేత, దోపిడీల నుండి విముక్తం అవుతారని సూచిస్తుంది.
సామ్యవాద స్త్రీవాదం మార్కిస్టుల వర్గ విశ్లేషణను నిరాకరిస్తుంది. సంక్లిష్టమైన సామాజిక సంబంధాల కారణంగానే స్త్రీల అణచివేత కొనసాగుతుందని భావిస్తుంది. ఈ సంబంధాలలో ఆర్థిక కారణాలతో పాటు సంప్రదాయ జండర్‍ విధానాలు, గుర్తింపులు దాగి ఉన్నాయని పేర్కొంటుంది. అందుకే వీరు ఒక మార్గాన్ని చూపారు. “Both marxist and socialist feminists would likely to describe the women of the chipco movement as becoming liberated from economic and social oppression to take a move autonamous and responsible role in theirown lives”
స్త్రీలపై ఆధిపత్యం, అణచివేతలు తొలగిపోవాలంటే చిప్కో ఉద్యమంలో స్త్రీలలాగా స్వయం ప్రతిపత్తిని పొందాలని సూచిస్తుంది. ఆర్థిక, సామాజిక, స్వయం ప్రతిపత్తిని పొందాలి.


ఇక రాడికల్‍ ఫెమినిస్టుల ప్రకారం జైవిక, లైంగిక తేడాలు స్త్రీ పురుషుల మధ్య ఉన్న కారణంగానే అణచివేతకు ఒక పునాది ఏర్పడిందని భావిస్తుంది. తల్లిగా, భార్యగా, లైంగిక వస్తువుగా స్త్రీ పరిగణన పొందటానికి ఈ జైవిక తేడాలను సమాజం సమర్థనీయంగా ప్రయోగించ గలిగింది. సంప్రదాయ జెండర్‍ పాత్రలు రద్దు పరచగలిగితే స్త్రీల అణచివేత సాధ్యపడు తుందని రాడికల్‍ ఫెమినిజం భావిస్తుంది.
ప్రకృతిపై ఆధిపత్యానికి, స్త్రీలపై ఆధిపత్యానికి గల సంబంధాలను ధర్డ్వేవ్‍ ఫెమినిజం బలంగా గుర్తించింది. ఈ ఆధిపత్యం సాధారణ పద్ధతిగా కాకుండా భిన్న మార్గాలలో సంబంధితమై ఉన్నట్లుగా సూచిస్తుంది. ఎందుకంటే “Women have been identified as close to nature and Nature has been identified as feminine”ఈ రెండింటిమీద ఆధిపత్యం, అణచివేతలు కొనసాగాయి. అందువల్ల ఆధిక్య-న్యూనతలు, అణచివేత దారులు, అణచివేతకు గురయ్యేవారు లాంటి నిర్మాణ చట్రాలను సవాలు చేస్తూ పోవటమే పర్యావరణ స్త్రీవాదం చేసే పని. వీటికి ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తూ, ఆవిష్కరిస్తూ తమపై ఆధిపత్యాన్ని, ప్రకృతిపై ఆధిక్యాలను తొలగించటమే ఇకోఫెమినిజంలోని ప్రధాన తాత్త్విక ఆకాంక్షగా పేర్కొనవచ్చు.


గుప్త పర్యావరణ అధ్యయనం (Deep Ecology)

పర్యావరణ అధ్యయనాల గురించి వెలువడిన తాత్త్విక వాదాల్లో ఇది ఒకటి. దీనిని నార్వేజియన్‍ తాత్వికుడు Arne Naess ఒక ఉద్యమంగా ప్రతిష్ఠించాడు. డీప్‍ ఎకాలజీగా నామకరణం చేశాడు. ఇది సంస్కరణ పర్యావరణ వాదానికి విరుద్ధమైంది. సంస్కరణ పర్యావరణ వాదాన్ని వ్యతిరేకిస్తుంది. పర్యావరణ సమస్యలను పరిష్కరించాలంటే ఆర్థిక, రాజకీయ నిర్మాణాలలో కొన్ని అవసరమైన సర్దుబాట్లు, మార్పులు చేస్తే చాలని సంస్కరణ పర్యావరణ వాదం భావిస్తుంది. దూరదృష్టిలేని, పైపైన ఆలోచనలు చేసే సంస్కరణ పర్యావరణ వాదంలోని డొల్లతనాన్ని బయటపెట్టింది. ఈ తాత్త్విక చింతనలోని ప్రధాన ఆలోచన ప్రకారం ప్రాణికోటి మధ్య పరస్పర ఆధారపడి ఉన్న సంబంధాల సంక్లిష్టతలోకి పర్యావరణం అంతర్దృష్టిని ప్రసరించటం వల్ల ప్రాథమిక అంచనాలలో విప్లవాత్మక మార్పులు సంభవిస్తాయని భావిస్తుంది. ఆధునిక మానవాళి తన సహజ పరిసర ప్రపంచంతో అత్యంత దౌష్ట్య పూరితంగా వ్యవహరిస్తుంది. ఎందుకంటే వారి సంస్కృతి ప్రకారం, మానవాళి తన సహజ ప్రపంచంకంటే తనని తాను భిన్నమైనదిగా, అధికమైనదిగా, ఉన్నతమైనదిగా సంభావించుకుంటుంది. దీనికి భిన్నంగా డీప్‍ ఎకాలజీ ఆలోచిస్తుంది.
Deep ecology, on the other hand, affirms an understanding of life in which the thinking of the ‘self’ must already include other organisms and all that supports them, as part of ones own Identity”


దీని బట్టి చూస్తే తోటి ప్రాణి కోటిలో తన స్వీయాత్మను గుర్తించటం, గౌరవించటం అనే అవగాహను డీప్‍ ఎకాలజి ఇస్తుంది. స్వీయం అంటే ఇతర జీవులను కూడా తన అస్తిత్వంలో మిళితం చేసుకుని చూడటం. ‘స్వీయం’ అనేది విడిగా లేదు. అది మహా ప్రాణ చైతన్యంలో అంతర్భవించి ఉంది. అది నిరంతరం తన అస్తిత్వ లేదా గుర్తింపు చక్రాన్ని ఇతర ప్రాణులతో పోల్చుకోవడం ద్వారా విశాల పరచుకుంటూ ఉంటుంది. ఉదార వాద పెట్టుబడి దారి విధానంలో కనిపించే అణుమాత్ర మానవుడి లాంటి ఉనికి కాదు అది. ఒక ప్రాణిని సంహరించటమంటే తనపై తానే ఆత్మహింసకు పాల్పడే చర్యగా అర్థం చేసుకోమనే ఆలోచనను ఇది కలిగిస్తుంది. దీనిలో నుంచే ప్రాణి కేంద్రక నైతికత ఉద్భవిస్తుంది.
ఒక విశాల సామాజిక ఉద్యమంగా ‘డీప్‍ ఎకాలజీ’ ప్రాణి కేంద్రక నైతికతను అనేకాంశాలతో విస్తారంగా పంచుకుంటుంది. ఈ గుప్త పర్యావరణం ఆచరణాత్మక నైతికత లేదా న్యాయ ఆలోచన లేకుండానే సంప్రదాయ పరిష్కారాలను సూచిస్తుంది. అదేమంటే సమాజాన్ని మార్చటం కోసం స్వీయాత్మను మార్చుకోవటం ఉత్తమమని సూచిస్తుంది. ఈ తాత్త్విక చింనతలో రెండు నియమాలు కనిపిస్తాయి.


ఒకటి : స్వీయ చైతన్యం (Self-realisation)
రెండు : ప్రాణి కేంద్రక సమానత్వం (Biocentric equality)

అదేవిధంగా మానవ జీవన శైలి పట్ల కూడా ఈ వాదం అభ్యంతరాలను వ్యక్తపరిచింది. మానవులు సాధ్యమైనంత నిరాడంబరంగా ఉండాలని, సాంకేతిక రహితంగా ఉండాలని సూచించింది. Our life styles ought to be simple in the sense that our consumer or material desires should be kept to a minimum. దీనిని గురించి ఆలోచిస్తే మన భౌతిక వాంఛలు లేదా కోరికలు అన్నీ మానవ సమాజపు కృత్రిమ ఉత్పత్తులే అని తేలుతుంది.
డీప్‍ ఎకాలజీని గురించి పేర్కొన్న వారిలో ప్రముఖంగా ముగ్గురు చింతనాశీలురు కనిపిస్తారు. ఒకరు Arne Neass, రెండవ వారుDevall, మూడవ వారు George Sessions.


వీరిలో Arne Neass ఉపరి పర్యావరణ ఉద్యమం Shallow ecology movementలోని లోపాన్ని ఎత్తి చూపాడు. ఉపరి పర్యావరణ ఉద్యమం కాలుష్యానికి, వనరుల తరుగుదలకు వ్యతిరేకంగా నిబద్ధతతో పోరాడింది. ఈ నిబద్ధతాయుత పోరాటం పర్యావరణానికి చేకూర్చే హితవేమీ లేదు. పైగా ఇది అభివృద్ది చెందిన దేశాలకు చెందిన సమృద్ధత గల ప్రజల ఆరోగ్యాలను సంరక్షించటమే ముఖ్య లక్ష్యంగా పోరాడింది. ఇది మానవ కేంద్రకమైనది. కాలుష్యానికి, వనరుల క్షీణతలకు గల సామాజిక, మానవ కారణాలను అన్వేషించకుండా కేవలం వాటికి వ్యతిరేకంగా పోరాడటం ప్రయోజన రహితమని డీప్‍ ఎకాలజిస్టులు భావించారు. నేస్‍ మనం విడివ్యక్తులుగా మనల్ని మనం మార్చుకొని, సంస్కృతిని మార్చాల్సిన అవసరాన్ని గుర్తించగా దేవాల్‍, సెషన్స్లు కొత్తది ఏమీ సృష్టించకుండానే పాతదాన్ని జాగృతం చేయాలని ఆశించారు. ఈ కొత్తది రూపొందటంలో పర్యావరణ చైతన్యం, పర్యావరణ, తాత్త్విక, ఆధ్యాత్మిక విధానాలు దోహదం చేయాలని ఆశించారు. భూమి, వృక్షాలు, జంతువులు, మానవుల మధ్య ఐక్యత ఉండాలని ఆకాంక్షించారు.


పర్యావరణ సమస్యలు, సంక్షోభాలకు కారణం మన ప్రాపంచిక, తాత్త్విక దృక్పథాలే కనుక అవి మారాలని ఆశించారు. ప్రత్యామ్నాయాల కొరకు అన్వేషించారు. ప్రత్యామ్నాయ ప్రాపంచిక, తాత్త్విక దృక్పథాలను ‘పర్యావరణ తాత్త్వికత’గా ‘ఇకో-సొఫీ’గా పేర్కొన్నారు. ఇందుకోసం వారు కొన్ని సాధారణ సూత్రాలను, ప్రకటనలను రూపొందించి డీప్‍ఎ కాలజీకి ఒక భూమికను సమకూర్చారు. వాటిల్లో ముఖ్యమైనవి ఇవి.

  1. The flourishing of human and non human life on Earth has intrinsic value.
    The value of non human life-form is independent of the usefulness these may have for narrrow human purposes.
  2. Rich ness and diversity of life -forms are values in themselves and contribute to the flourishing of human and non human life on Earth.
  3. Humans have no right to reduce the richness and diversity except to satisfy vital needs.
  4. Present human interference with the non human world in excessive and the situation is worsening.


వీటితో పాటు మరికొన్ని సూత్రాలను రూపుదిద్దారు. మొత్తం మీద మానవ ఆధిపత్య భావనతో కూడిన ప్రాపంచిక దృక్పథం మారి పర్యావరణ హితకారక ఆలోచన విధానం రూపొందాల్సిన అవసరాన్ని డీప్‍ ఎకాలజీ నొక్కి చెప్పింది.


-డా।। ఆర్‍. సీతారామారావు,
ఎ : 9866563519

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *