క్షమయా ధరిత్రి! దాతృత్వమే నీ ఘనకీర్తి!!

ప్రకృతే నియంత్రిస్తుంది ! 14 ప్రకృతే శాసిస్తుంది!!



(గత సంచిక తరువాయి)
విత్తుముందా, చెట్టుముందా అని కొందరు, గుడ్డు ముందా, పిల్ల ముందా అని మరికొందరు కొంటె ప్రశ్నలు వేస్తూ వుంటారు. వీటన్నిటికి అమినో ఆమ్లాలతో ఏర్పడ్డ మొదటి ఏకకణ జీవి ముందని, దీని నుంచే బహుళ కణ జీవులు రూపాంతరం చెందాయనే విషయాల్ని రెండవ కథనంలో చర్చించాం. అయినా కొందరికి సంతృప్తినివ్వని జవాబులే ఇవి. క్లామిడోమోనస్‍ అనే ఏక కణ జీవి వృక్ష, జంతు జాతులకు ఓ తల్లిలాంటిది. ఈ విధంగా రెండు జాతులు రూపాంతరం చెందిన తర్వాత మొదటి తరం మొక్కలు లైంగికేతర (a sexual), లైంగిక (a sexual) పద్దతులతో సంతానోత్పత్తిని అభివృద్ధి చేసుకున్నాయి. ఇప్పటికి ఈ విధానంలో మొక్కలను, పెద్ద జాతి చెట్లను ఉత్పత్తి చేస్తూనే వున్నాం. ఇక్కడ విత్తనం అనే ప్రస్తావన లేదు. అలాగే జంతు వర్గంలో కూడా పై రెండు పద్దతుల్లో ప్రత్యుత్పత్తి జరుగును. కావున ఇక్కడ గుడ్డు అనే ప్రసక్తి లేదు. ఇదంతా ప్రకృతి ఏర్పర్చుకున్న ఓ ప్రామాణిక జీవన విధానం! పరిణామక్రమం!


కాబట్టి, భూమి జీవకోటికి ఓ విశిష్ట ఆవాస ప్రాంతం. ఇలా విభిన్న రూపాల జీవరాశికి ఆలవాలమైన నేల మానవుడికే కాదు సకల జీవకోటికి మాతృమూర్తే! ఇలా పరిణామం చెందిన జీవులు ఉత్తర ధృవం నుంచి దక్షిణ ధృవం దాకా, తూర్పు నుంచి పడమరదాకా, ఖండాలపై, సముద్రాలలో విస్తరించాయి. ఇలా విస్తరించిన జీవరాసులు ఆయా ప్రాంతాల శీతోష్ణస్థితి, ఉష్ణోగ్రతలకు, వాతావరణ మార్పులకు గురై నిలదొక్కుకోవడం, నశించడం జరిగింది. కొన్ని రకాల జీవులు కొన్ని ప్రాంతాలకే పరిమితమయ్యాయి. కంగారో ఆస్ట్రేలియాకు పరిమితం కాగా పెంగ్విన్‍లు దక్షిణ ధృవానికే అనుబంధంగా వుండిపోయాయి. ధృవప్రాంత, పర్వతప్రాంత ఎలుగుబంట్లు అంటూ రెండుగా విడిపోయాయి. ఇలా కొన్ని రకాల జీవులు కొన్ని ప్రాంతాలకే పరిమితం కాగా, మిగతావి సర్వాంతర్యామిగా ఎదిగాయి.


సౌరకుటంబంలో భూమి ఒక్కటే జీవుల ఆవాసం!

ఏడేడు (7+7) లోకాలు, పాతాళలోకం, స్వర్గ, నరక లోకాలంటూ అపరిపక్వతతో, అవిజ్ఞానంతో మానవుడు ఏర్పర్చుకున్న అభిప్రాయాలు! నమ్మకాలు! అయితే భూమొక్కటే జీవరాశికి ఆవాసంగా మారడానికి గల కారణాలను మొదటి కథనాల్లో చూసాం. ఇప్పుడు మరికొంత నిర్దిష్టంగా భూమిని పరిశీలిస్తే, ఆయా ప్రాంతాల్లో స్థిరపడిన జీవులకు, ఆ ప్రాంత పరిస్థితులకు, వాతావరణానికి దగ్గరి సంబంధం కనపడుతుంది. అవి ఈ కింది విధంగా విభజించడం జరిగింది.


భౌగోళికంగా భూమిని ఆరు ప్రధాన భాగాలుగా విభజించారు.


1. భూమధ్య రేఖ ప్రాంతం/ ఉష్ణమండల వర్షపు అటవి ప్రాంతం : (Tropical Region)
భూమధ్యరేఖకు అటు, ఇటు గల కర్కట, మకర రేఖల మధ్య ప్రాంతాలైన ఈ భాగంలో అత్యధిక వర్షపాతం, వేడిమి ప్రాంతం కావడంతో వాతావరణంలో అధిక తేమ చేరుతుంది. కాబట్టే ఈ ప్రాంతాలలోని చెట్లు విశాలంగా, మహా వృక్షాలుగా ఎదుగుతాయి. పర్వతాలపైన పొడవైన చెట్లు పెరుగుతాయి. అలాగే బాగా అభివృద్ధి చెందిన విశిష్ట జీవులకు ఈ ప్రాంతం నిలయం. అత్యధిక జనసాంద్రతతోపాటు, అరణ్యాలలో గొరిల్లా, ఒరంగుతాన్‍ లాంటి మానవుల పూర్వీకులు ఇక్కడ కనపడుతాయి. వీటితో పాటు చింపాంజీలు, రాబందులు, పెద్ద జాతి చిలుకలు, వడ్రంగి పిట్టలు, అన్ని రకాల పక్షులు, కొంగలు, విషపు కప్పులు (dart) అనేక రకాల కీటకాలు, సరీసృపాలు, వానపాములు కూడా సహజీవనం చేస్తాయి.
అలాగే వివిధ రకాల పంటలకు, పండ్లకు అపారమైన ఖనిజ, అటవీ సంపదకు ఈ ప్రాంతం ఓ రత్నగర్భలాంటిది. పర్వతాలు, పీఠభూములు దట్టమైన అడవులు వుండడంతో అత్యధిక వర్షపాతం వుంటుంది. పొడవైన నదులకు ఈ ప్రాంతం పుట్టినిల్లు. వీటితో పాటు, విశాలమైన ఎడారులు, మహా సముద్రాలకు ఇది ఆవాసమే! కాని, మారుతున్న కాలంతో, మానవ తప్పిదాలతో ఈ ఆవాసం ఎడారిగా రూపాంతరం చెందుతున్నది. ఇక్కడి జీవరాశి మనుగడకే ప్రశ్నార్థకంగా మారుతున్నది.

2. బురద / చిత్తడి నేలలు (Marshlands) :
ఈ ప్రాంతం కూడా భూమధ్యరేఖకు అటూ, ఇటూగానే వున్నా, ప్రత్యేకంగా నదుల, సరస్సుల, సముద్రాల తీర ప్రాంతాల్లో ఇవి అత్యధికంగా వుంటాయి. మంచినీటి వనరులతో, జలజీవ సంపదతో, డెల్టాలతో, పుష్కలమైన పంటలతో, మత్స్య, రొయ్యలతో ఇవి అలరారుతాయి. ప్రత్యేకంగా పరాగరేణువుల్ని వ్యాప్తి చేసే రంగు రంగుల సీతాకోక చిలుకలకు ఈ ప్రాంతం పుట్టినిల్లు. నీటి రవాణాకు అనువైనవి. భూమికోతను అరికట్టే పెద్ద గడ్డిజాతి 6 శాతం ఈ ప్రాంతంలోనే వుంది.
దాదాపు అత్యధిక దేశాల్లో ఈరకం నేలలు వుండడంతో, జనసాంద్రత కూడా అత్యధికంగా వుంటుంది. అలాగే ప్రకృతి సంపదల వినియోగం కూడా ఎక్కువే! వేట, వ్యవసాయం ప్రధాన వృత్తులుగా విరాజిల్లడంతో వీటి అనుబంధ పరిశ్రమలు, కుల వృత్తులు బాగా అభివృద్ధి చెందాయి. చేపలు, రొయ్యలు, కొంగలు, బాతులు, తాబేళ్ళు, అటవి జంతువులు ప్రధాన ఆహారం కావడంతో మనుషులకు ఇవి నిరంతరం ఎరగా వుంటాయి. ఎత్తైన పర్వతాలు, కొండలు, పీఠభూముల నుంచి పుట్టిన నదులు మైదాన ప్రాంతాలగుండా ప్రవహించి సముద్రంలో కలుస్తాయి. అందుకే భారీ నీటిపారుదల, బహుళార్థసాధక ప్రాజెక్టుల నిర్మాణానికి ఇవి అణువుగా వుంటాయి. అంటే జాతీయ, అంతర్జాతీయ కాంట్రాక్టర్లకు ఇవి బంగారు గుడ్లు పెట్టే ప్రాంతం కావడంతో పాలకుల్ని మెప్పించి, ఒప్పించి సాగునీటి ప్రయోజనాలని, తాగునీటి అవసరాలని, విద్యుత్‍ ఉత్పత్తి అని నిర్మించి వేలాది గ్రామాలు, జంతు, వృక్ష సంపదను ఈ ప్రాజెక్టుల్లో ముంచేస్తున్నారు. గిరిజన, గ్రామీణ ప్రాంతాలు జలమయం కాగా, ప్రజలు నిరాశ్రయులౌవుతున్నారు. ఈ సమస్యలు దీర్ఘకాలంగా పరిష్కరించ బడకపోవడంతో ఈ ప్రాజెక్టులన్నీ నిర్మాణం నుంచి పూడికకు గురైయ్యేదాకా (వట్టిపోయేదాకా) వివాదాస్పదంగానే వుంటున్నాయి. అంటే ఈ ప్రాంతాలు సంపదలతోపాటు, సమస్యలకు కూడా నిలయాలన్న మాట!

3. ధృవప్రాంతాలు (Polar regions):
ఇవి ఉత్తర అర్కిటిక్‍, దక్షిణ అంటార్కిటిక్‍ ప్రాంతాలు. ఇవి ఇరు ధృవ ప్రాంతాలు కావడంతో అత్యధిక భాగం, సంవత్సరంలో ఎక్కువ రోజులు మంచుతో కప్పబడి వుంటాయి.
అర్కిటిక్‍లో ఎస్కిమో అనే జాతి ఇగ్లూలు అనే మంచు ఇండ్లను నిర్మించుకొని, కుక్కలతో లాగే స్లెట్జ్ బండ్లను (చక్రాలు లేకుండా, మంచుపై సులభంగా కదిలేవి) వాడుతూ జీవిస్తారు. మంచుతో, కదిలే మంచుతో వుండే టండ్రా (tundra) ప్రాంతం కావడంతో, గడ్డిపొదలు, గుబురు లిచెన్‍ చెట్లు పెరుగుతాయి. వీటి మొదళ్ళలో విపరీతంగా నాచు పెరగడంతో జల, ఉభయచర జీవులు జీవిస్తాయి. సంవత్సరంలో సరాసరి ఉష్ణోగ్రత (-89oC) నుంచి (-50oC) మధ్య వుండడంతో తెల్లని ఎలుగు బంట్లు, సీల్సు, డేగల లాంటి గద్దలు, తెల్ల తిమింగలాలు, కస్తూరి ఎద్దులు, నక్కలు, నీటి కుక్కలు జీవనం సాగిస్తాయి.


అంటార్కిటికాలో ప్రధానంగా పెంగ్విన్‍లు, క్రిల్స్, తిమింగలాలు తదితర జంతుజాలం వున్నట్లు 13వ కథనాల్లో చూసాం! పెరుగుతున్న ఉష్ణోగ్రతకు, తరుగుతున్న మంచుకు ఇవి తమ ఉనికిని కోల్పోతున్నాయి. ఆర్కిటిక్‍ ప్రాంతాల్లో పెట్రోలియం తవ్వకాలతో ఉపరితలం, మంచు కలుషితంగా మారిపోయాయి. భూగోళానికి గల ఈ కిరీటాలు ఎలా ధ్వంసం అయ్యాయో, అవుతున్నాయో కూడా గత కథనాల్లో చూసాం! ఇందులో శాశ్వత మంచు కనుమరుగు కావడం భూగోళానికి పొంచివున్న పెద్ద ప్రమాద సూచిక!


శాశ్వత మంచు (pivotal permafrost) ప్రధాన కేంద్రాలైన ఇరు ధృవాలు భౌగోళిక పరంపర సంపదలో ఓ భాగం! అర్కిటిక్‍లో వందలాది అడుగుల లోపల గల ఈ మంచు పొర, అమెరికాకు సుమారుగా రెండింతలు వుంటుంది. ఇలా శాశ్వతంగా గడ్డకట్టిన మంచుతోపాటు, వేలాది సంవత్సరాల మొక్క, జంతు జాలాలకు ఇది ఓ గిడ్డంగి (store house) లాంటిది. అలాగే మిలియన్‍ సంవత్సరాలుగా కార్బన్‍ నిక్షేపిత ప్రాంతమిది. పెరుగుతున్న వేడిమికి ఈ భాగం కరగడంతో కార్బన్‍ డయాక్సైడ్‍, నైట్రస్‍ ఆక్సైడ్‍, మీథేన్‍ లాంటి హరిత వాయువులు వెలువడుతున్నాయి. ఈ వాయువులు నీటి ఆవిరితో కలిసి గ్రీన్‍హౌస్‍గా మారడంతో వాతావరణానికి కార్బన్‍ డయాక్సైడ్‍ కన్నా 84 రెట్లు ప్రమాదంగా మారాయి. గత 7 సం।।లలోనే 1900 నాటి కన్నా ఇది అధికమైంది.
ఆర్కిటిక్‍ మంచు సూర్యకాంతిని (ఉష్ణం) తిప్పి తిరిగి రోదసిలోకి పంపించే అతిపెద్ద కూలర్‍. ఇప్పుడిది అతి ప్రమాద ప్రాంతంగా మానవుడి దుశ్చర్యలచే మార్చి వేయబడింది. యావత్‍ భూమండలానికి రక్షణనిచ్చే ఈ రక్షణ కవచంకే రక్షణ లేకుండా పోయింది.

4. మహాసముద్రాలు (Oceans) :
భూగోళంపై మూడొంతులకు పైగా గల జల భాగం మహాసముద్రాలుగా, సముద్రాలుగా, ఖాతాలుగా, విశాల జలాశయాలుగా, సరస్సులుగా ఏర్పడ్డాయి. దేని ప్రత్యేకతలు దానివే. జలచక్రంచే ఏర్పడే వర్షం, భూభాగంపై ఏ ప్రాంతంలో కురిసినా, భూపైపొరల్లో కొంత నిల్వ వుండి వాగులు, వంకలు, నదులు, మహా నదులుగా మారి చివరికి ఏదో ఓ సముద్రాన్ని చేరుతాయి. ఇలా సముద్రం చేరిన నీరు అత్యధిక లావణీయతను పొంది
ఉప్పుగా మారి మానవుడికి, కొన్ని రకాల భూచరాల దాహార్థిని తీర్చని స్థితికి చేరుతుంది. కాని, వేలాది రకాల సముద్ర జీవరాశికి అదే ప్రధాన ఆవాసంగా మారడం సృష్టి వింతనే కాదా!
నేలతల్లి ఎంత సంపదను కలిగివుందో అంతకన్నా ఎన్నోరెట్ల సంపదల రత్నగర్భ ప్రాంతాలివి. తిరిగి సముద్రాల్ని అయిదు ప్రధాన సముద్రాలుగా విభజించారు.
1) ఆర్కిటిక్‍ 2) అట్లాంటిక్‍ 3) పసిఫిక్‍ 4) ఇండియన్‍ 5) దక్షిణ (ఆస్ట్రల్‍) ధృవ.
ఇవి భూఖండాల్ని 70 శాతం ఆక్రమిస్తాయి. లోతును బట్టి సముద్రాల్ని కూడా మూడు ఆవరణలుగా విభజించారు.
1. సూర్యకాంతి ప్రసరించే ఉపరితల ఆవరణ (Euphotic zone)
2. ఉపరితలం కింద వుండే పారదర్శక ఆవరణ (Disphotic zone)
3. కింది చీకటి ఆవరణ (Aphotic zone)


మానవుడి లాంటి జీవరాశి తప్ప, దాదాపు నేలపై గల అన్ని రకాల జీవరాశులు అత్యధిక సంఖ్యలో సముద్రంలో వున్నాయి. పోతే ఆవరణ (zone) స్థాయిని బట్టి జీవావరణ వ్యవస్థల అమరిక వుంటుంది. పై భాగంలో ఉభయ చరాలు, సరీసృపాలు, నీటి కొంగలు, చిన్నరకం చేపలు, రొయ్యలు, పీతలు, నత్త గుల్లలు, ముత్యపు చిప్పలు, తీర ప్రాంతాలకు దగ్గర ఎగిరే పక్షులు వుంటాయి. మధ్యభాగంలో ఉపరితలంలో వుండే జీవరాశులే పెద్ద ఆకారం గలవి వుంటాయి. కిందగల చీకటి భాగంలో పెద్దజాతి ఆర్థోపొడాలు, షార్క్లు, తిమింగలాలు, పెద్దరకం చేపలు, డాల్ఫిన్లు, సముద్ర కుక్కలుంటాయి. అట్టడుగు భాగాన పగడపు దిబ్బలు, లార్వాలు తినే పాచి, సముద్ర బాక్టీరియా, సముద్ర జంగుపిల్లి (sea otter) సన్యాసి సీల్స్ (monkseals), పెద్దరకం తాబేళ్ళు, ఈకల తిమింగలాలు, ఆక్టోఫస్‍లు, చుక్క (star) చేపలు వుంటాయి.
ఇంతటి వైవిధ్య జీవావరణ వ్యవస్థతో పాటు పెట్రోలియం, సహజవాయువులకు ఇది ఆలవాలం. ప్రపంచ దేశాల్ని, ఖండాల్ని కలిపే ఖర్చులేని రవాణా మార్గం కూడా ఇదే!
ఇన్ని విశిష్టతలు, సంపదలు, వైవిధ్యాలు గల సముద్రాల్ని మానవుడు తన వక్రబుద్ధితో, వికృత చేష్టలతో అల్లకల్లోలం చేస్తున్నాడు. అందుకే గర్భంలోని బడబాగ్ని భగ్గుమంటున్నది. సునామీలుగా, టైఫూన్‍న్లుగా, ఉప్పెనలుగా, నిరంతర తుఫాన్లుగా విరుచుక పడుతున్నవి. ప్లాస్టిక్‍, పెట్రోలియం, కర్మాగారాల విసర్జకాలతో, విహార యాత్రికుల దుశ్చర్యలతో, నగరాల మురుగుతో తల్లడిల్లుతున్నది.

5. సముద్ర తీరప్రాంతాలు (Coastal Regions)
ఉష్ణమండల, సతతహరిత అరణ్యప్రాంతాల్లో వుండే సముద్రతీర ప్రాంతాలివి. ఓ వైపు సముద్రపు ఉప్పునీరు, మరోవైపు సముద్రాల్లో సంగమం చెందే నదుల మంచినీరు కలిసి వుండే డెల్టాలు కాబట్టి ఇరు రకాల నీటితో సహజ జీవనం చేసే జంతుజాలం ఇక్కడ ఆవాసం వుంటాయి. సముద్ర అలల నుంచి, నదుల ప్రవాహం నుంచి నేల కోతను అరికట్టే మడ, సరుగుడు లాంటి లోతైన వేరు వ్యవస్థగల అడవులకు ఇవి ఆవాసాలు.
దాదాపు 1,55,400 చ.కి.మీ. వైశాల్యంతో, కొన్ని మధ్య ఆసియా దేశాల్లో తప్ప, మిగతా అన్ని దేశాల తీర ప్రాంతాల్లో ఈ రకం చెట్లు వున్నాయి. కోనసీమలాంటి ప్రకృతి రమణీయత, పంట పొలాలు, కొబ్బరి, చెరకు, అరటి తోటలు, మంచినీటి, ఉప్పునీటి సరస్సులతో, ప్రాంతీయ పక్షులకు తోడు శీతాకాలంలో పరదేశీ పక్షలకు (సైబీరియా కొంగలు) ఇవి యాత్రాస్థలాలు. భూ, జలచరాలు, ఉభయచర జీవులకు, ప్రాకుడు జంతువులకు, మంచినీటి, ఉప్పునీటి చేపలకు, రొయ్యలకు, పీతలకు ఇవి నిలయాలు. బెంగాల్‍ పులులు, కొండ ముచ్చులు, సముద్ర ఆవులు, నక్షత్ర తాబేళ్ళు ఉండే ప్రాంతాలివి.


కొల్లేరు, పులికాట్‍, చిలుకా లాంటి మంచి నీటి, ఉప్పునీటి సరస్సులు సముద్ర తీరప్రాంతాల్లోనే ఏర్పడుతాయి. కాని నేటి ఆధునిక వ్యవసాయ పోకడలతో, విచ్చలవిడిగా వాడే రసాయనాల కాలుష్యంతో, మరణమృదంగాన్ని వినిపిస్తున్నాయి. తలాపుకు సముద్రం వున్నా గొంతు తడుపుకోలేనట్లే, రక్తనాళాల్లా నదులు పారినా, దాహం తీర్చుకోలేని ప్రాంతాలుగా మారిపోయాయి. జంతువులది ఇదేస్థితి. చేపల, రొయ్యల చెరువులు ఈ ప్రాంతాలకు క్యాన్సర్‍ కారకాలుగా మారాయి. ఉప్పెనలు, సునామీలు, తుఫానులు ఈ ప్రాంతాలకు నిత్య చుట్టాలే!

6. ఎడారులు (Deserts) :
ఇవి అత్యల్ప వర్షపాతం గల ప్రాంతాలు. సంవత్సరంలో సరాసరి 100-200 మి.మీ. వర్షానికి మించి కురియదు. అనగా, సం।।లో 5 నుంచి 10 రోజులకు మించి వర్షం పడదు. ఏడాదిలో రెండు నెలలు తడిగా వుండి, రాత్రి కాగానే విపరీతమైన చలి చుట్టుకుంటుది.
ఆఫ్రికాలోని సహారా, మన రాజస్థాన్‍లో థార్‍, అరబ్బు దేశాల ఎడారులు ఈ కోవకు చెందినవే. భూమిపై దాదాపు 20 శాతం భూమిని ఈ ఎడారులు ఆక్రమిస్తాయి. భాష్పోత్సేకాన్ని అరికట్టే ఎడారి మొక్కలు ఈ ప్రాంతాల్లో పెరుగుతాయి. ఎడారి ఓడగా పిలువబడే ఒంటె, అధిక బొచ్చు (ఉన్ని) గల గొర్రెలు, ఉడుతలు, పెద్దరకం బల్లులు, తొండలు ఈ ప్రాంతాల్లో నివాసం వుంటాయి. ఈ ప్రాంతాల్లో పక్షుల కీలారావం దాదాపు అరుదుగా కనపడుతుంది.


సకల జీవరాశికి భూమియే ఓ ఆలయం (A store house):
మిలియన్‍ సంవత్సరాలుగా పరిణాత్మక మార్పునుండి గుణాత్మక మార్పుకు గురైన భూమి జీవరాశికి పురుడు పోసింది. కన్న తల్లిలా భూమధ్యరేఖ నుంచి ఇరు ధృవాల వరకు నేలపైన, మంచుపైన, మంచులోపల, సముద్రంపైనా, లోపల కోట్లాది జీవరాశికి, సూక్ష్మజీవులకు నారుపోసి నీరుపోసింది. పోస్తున్నది. మనం విభజించుకున్న ఆరు ప్రాంతాలు విశిష్టతను కలిగినవే. ప్రతి ప్రాంతం జీవకోటి మనుగడకు దోహదపడడం భూమాత నైజం.
కాబట్టి, మానవుడొక్కడే ఈ భూమికి కర్తకాదు. యావత్‍ జీవకోటి భూమాత బిడ్డలే! కాని మానవుడి వక్రబుద్ధి భూగోళాన్ని ఊపిరాడకుండా చేస్తున్నది. కనీసం ఇప్పుడున్నా ఆలోచిద్దాం! (వచ్చే సంచికలో అవిటిదైపోతున్న అవని కథనాల్ని చూద్దాం!)

  • డా।। లచ్చయ్య గాండ్ల,
    ఎ : 9440116162

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *