జీవితసంగ్రహం :
‘‘పరబ్రహ్మ పరమేశ్వర….’’ అనే ప్రార్థనాగీతాన్ని రచించిన కవి శ్రీచందాల కేశవదాసు. ఆయన కవియే కాక రచయిత, నాటకకర్త, హరిదాసు, నటుడు, దర్శకుడు, వైద్యుడు, అష్టావధాని, గాయకుడు, సామాజికకార్యకర్త కూడా. పూర్తిగా కళాసేవకే అంకితమైన విశిష్టకళాకారులాయన. సాధారణజీవితంలో కూడా ఎన్నో ఆదర్శాలను అందించిన గొప్ప మానవతామూర్తి దాసుగారు. ‘‘దాసు’’ శబ్దం ఆయనకు హరికథాగానం ద్వారా, భాగవత సప్తాహనిర్వహణ ద్వారా సంక్రమించిన సేవాపూర్వకమైన మంచి పేరు.
ఖమ్మంజిల్లా జక్కేపల్లి గ్రామంలో పాపమ్మ, లక్ష్మీనారాయణ దంపతులకు కేశవదాసు 20-06-1876 నాడు రెండవ కుమారునిగా జన్మించినారు. చిన్నతనంలోనే తండ్రి చనిపోగా అన్నగారైన వెంకట్రామయ్య దగ్గరే పెరుగుతూ విద్యాభ్యాసం చేశారు. యోగవిద్యా మూర్తియైన అన్నగారు కేశవదాసులో తన తపశ్శక్తిని నిక్షిప్తం చేస్తూ ఎన్నో విషయాలను బోధించారు. తనలాగా బ్రహ్మచర్యం పాటించక గృహస్థుడవై ధర్మకార్యాలు చేయమని హితవు పలుకుతూ అడవికి తపస్సు కోసం వెళ్ళిపోయారు. అన్నగారి మాటలను శ్రద్ధగా స్వీకరించిన కేశవదాసు సిరిపురం జమీందారు పిల్లలకు చదువు చెబుతూ జీవితాన్ని ప్రారంభించారు. ఆ పిల్లలనే పృచ్ఛకులుగా చేసి అవధాన విద్యను అభ్యసించారు.
కేశవదాసు వైవాహికజీవితంలో ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొన్నారు. రామకవి, కృష్ణమూర్తి, సీతారామయ్యలనే కుమారులు, ఆండాళు అనే కుమార్తె జన్మించారు. రామకవి తండ్రిలాగే పద్యకవిత్వాన్ని రాస్తూ మంచి కవిగా పేరుతెచ్చుకున్నాడు. కృష్ణమూర్తి ఆర్.ఎం.పి. వైద్యునిగా పని చేస్తూ రాజకీయరంగంలో కూడా చురుగ్గా పనిచేస్తున్నాడు. సీతారామయ్య భద్రాచలంలో ఉపాధ్యాయునిగా పని చేశాడు. మునగాలలో నివసిస్తూ రేపాల కాంగ్రేసు ఉద్యమ క్యాంపు కార్యదర్శిగా పనిచేస్తున్న గంధం నర్సయ్య జనతాకళామండలిలో నాటకాలు వేస్తూ ఉండేవారు. అంతేకాక బుర్రకథ కళాకారునిగా కూడా మంచి పేరుతెచ్చుకున్నారు. ఆండాళుకు అతనితో వివాహం చేశారు.
కేశవదాసు భక్తితత్త్వంతో ప్రజలలో సమతాభావాన్ని, పారమార్థిక చింతనను కలిగించాలని భావిస్తూ ఎన్నో గ్రామాలను పర్యటించారు. 1907లో శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతున్న తమ్మర గ్రామాన్ని చేరుకున్నారు. అక్కడి శ్రీసీతారామచంద్రస్వామి ఆలయార్చకులు నరగిరి నరసింహాచార్యులుగారి పరిచయంతో వైష్ణవసిద్ధాంతాలను, భాగవతసప్తాహనిర్వహణను తెలుసుకున్నారు. అక్కడినుంచే రచనావ్యాసంగాన్ని ప్రారంభించారు. ఆ సంవత్సరమే ఆగస్టులో మొదటి భాగవతసప్తాహాన్ని ప్రారంభించారు. దేవాలయపరిస్థితిని చూచి ఎంతో బాధపడి జీర్ణోద్ధరణకు పూనుకున్నారు. రాజగోపుర నిర్మాణం, రథశాల నిర్మాణం, వాహనాలు ఇతరసామగ్రి కొనుగోలు కోసం విరాళాలు పోగుజేసే పథకాలను సిద్ధం చేశారు. ఆనాటినుంచి తన కళాప్రదర్శన ద్వారా వచ్చిన ప్రతిపైసను దేవాలయ జీర్ణోద్ధరణకే వినియోగించారు.
కేశవదాసు 1909లో జగ్గయ్యపేటకు వెళ్ళి అక్కడ అష్టావధానం, ‘లవకుశ’ హరికథాగానం చేశారు. ఆ సభకు అతిథిగా విచ్చేసిన పాపట్ల లక్ష్మీకాంతయ్యగారితో కేశవదాసుకు పరిచయం ఏర్పడింది. లక్ష్మీకాంతయ్యగారు అప్పటికే గొప్ప సంగీత విద్వాంసులుగా, నాటకరంగంలో వాగ్గేయ కారులుగా ప్రసిద్ధి పొందియున్నారు. పాపట్లవారిని కేశవదాసు తమ సంగీత గురువుగా భావించారు. ఆ ఇద్దరు కలిసి నాటకరంగంలో 14 సంవత్సరాలపాటు ఎనలేని సేవ చేశారు.
1910లో కేశవదాసు పాపట్ల లక్ష్మీకాంతయ్యగారితో కలిసి యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలకు వెళ్ళారు. ఆ సందర్భంలో పాపట్లవారి సూచన మేరకు కేశవదాసు ‘‘పరబ్రహ్మ, పరమేశ్వర, పురుషోత్తమ’’ అనే గీతాన్ని అక్కడే వ్రాయగా, వెంటనే పాపట్లవారు దానికి కల్యాణిరాగంలో బాణీ చేశారు. ఆ గీతాన్ని నాటకసంస్థలవారికి పంపి ప్రార్థనాగీతంగా ఆలపించమని సూచించారు. సురభి మొదలైన నాటక సంస్థలన్నీ ఇప్పటికీ ఈ గీతాన్నే ప్రార్థనాగీతంగా ఆలపించడం సంప్రదాయంగా అనుసరిస్తున్నాయి. యాదగిరిగుట్టలో ఉన్నప్పుడే ఆలయ సాంప్రదాయిక కార్యక్రమాలతో బాటు ధార్మిక,సాహిత్య, సంగీత కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయాలని ఆ యిద్దరూ దేవాలయ నిర్వాహకులకు చెప్పి ఏర్పాటు చేయించారు. అప్పటినుండి ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలలో విధిగా ధార్మిక, సాహిత్య, సంగీత కార్యక్రమాలు యాదగిరిగుట్టలో జరుగుతున్నాయి.
1913లో మైలవరం బాలభారతి నాటకసంస్థలో కేశవదాసు పాపట్లవారి ప్రోత్సాహంతో ‘ప్రాంప్టర్’గా చేరారు.1921 నుంచి కేశవదాసు నాటకరచనలోనూ, ఇతరుల నాటకాలకు గీతాలు రచించడంలోనూ ఊపిరిమెసలనంతగా మునిగినా తమ్మర దేవాలయ జీర్ణోద్ధరణ పనులను, భాగవతసప్తాహ నిర్వహణను, కళాప్రదర్శనను ఏమాత్రమూ మరిచిపోలేదు.
1931లో హెచ్.ఎం.రెడ్డి గారి పిలుపు మేరకు వెళ్ళి మొదటి తెలుగు టాకీ సినిమా ‘భక్తప్రహ్లాద’కు పాటలు రచించారు. 1933లో హుజూర్‍నగర్, కందిబండ, జగ్గయ్యపేట మొదలైన ప్రాంతాలను పర్యటించి అష్టావధానాలను ముమ్మరంగా చేశారు. 1935లో కలకత్తా వెళ్ళి దాసరి కోటిరత్నంగారి కోసం ‘సతీఅనసూయ’ సినిమాకు పనిచేసి లభించిన పారితోషికంతో తమ్మర స్వామివారికి చామరాలు, భూచక్ర గొడుగు తెచ్చి సమర్పించారు. 1940లో దబ్బాకుపల్లి గ్రామానికి వెళ్ళి వైద్యంతోనూ, హరికథాగానంతోనూ అక్కడివారిని మురిపించి వచ్చిన సన్మానసామగ్రినంతా అమ్మి తమ్మర దేవాలయానికి విరాళమిచ్చారు. 1941లో పోలంపల్లి గ్రామానికి వెళ్ళి తాను రచించిన ‘కనక్తార’ నాటకాన్ని టికెట్ పెట్టి ప్రదర్శింపజేసి, వచ్చిన మొత్తాన్ని అక్కడి గ్రంథాలయానికి విరాళంగా ఇచ్చారు. తిరువూరుకు వెళ్ళినప్పుడు అక్కడ భద్రాచలం యాత్రికుల కోసం చలువ పందిళ్ళు వేయించి, మంచినీళ్ళ బావిని త్రవ్వించారు. ‘సర్వరోగ నివారిణి’ అనే ఔషధాన్ని తయారుచేసి అందరికీ ఉచితంగా ఇమ్మని అక్కడి ‘సామ్రాజ్యం’ అనే నర్సుకు అప్పగించారు. 1943, 1944, 1945 సంవత్సరాలలో నాటక రంగంలోనూ, సినిమారంగంలోనూ తీరికలేకుండా గడిపిన కేశవదాసు 1946లో జక్కేపల్లికి చేరుకున్నారు.
ఇల్లు జేరినప్పటి నుంచి కేశవదాసుకు కుటుంబసమస్యలు విషమంగా మారడం ప్రారంభించాయి. పెద్ద సంసారాన్ని పోషించ డంలో ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. వాటిని ఎదుర్కోవడానికి జక్కేపల్లిలో, చుట్టుప్రక్కల ప్రాంతాలలోనూ హరికథలు చెప్పడం అధికం చేశారు. కాని చెప్పుకోదగినంత ప్రోత్సాహం లభించలేదు. మానసికంగా కుంగుబాటు మొదలైంది. ఇంతలో రజాకార్ల ఆగడాలు పెచ్చుమీరి పోయాయి. వాళ్ళు జక్కేపల్లిలో కూడా ప్రవేశించి లూటీలు, గృహదహనాలు, హత్యలు మొదలైనవి విపరీతంగా చేస్తూ కేశవదాసు ఇంటిని కూడా వదల్లేదు. ఆయన రచనాసంపదను, వస్తుసామగ్రిని, ఆస్తిపాస్తులను, ధనధాన్యాలను ఛిన్నాభిన్నం చేశారు. ఆ పరిస్థితులలో కేశవదాసు పొలాలను నమ్మకస్తులకు అప్పగించి సకుటుంబంగా ఖమ్మం పట్టణాన్ని చేరుకున్నారు. కొందరు సన్నిహితుల సూచనల పేరకు నాయకన్ గూడెంకు మకాం మార్చిన కేశవదాసు వైద్యం చేస్తూ ఆధ్యాత్మిక జీవితానికి అలవాటుపడినారు. ఆయన నాయకన్‍గూడెంలో చాలావరకు ప్రశాంతజీవితాన్నే గడిపి 14-05-1956 నాడు తన యిష్టదైవమైన సీతారామచంద్ర స్వామివారిలో లీనమైనారు.
కళారంగసేవ
కేశవదాసు సాహిత్యం, సంగీతం, నాటకం అనే అంశాలకు సంబంధించిన పది పక్రియలలో రచనలు చేశారు. లలితకళా సమాహార రూపాలైన నాటకం, హరికథలలో కూడా తన ప్రజ్ఞా విశేషాలను ప్రదర్శించారు. వీటన్నిటిలోనూ ఆయనలోని బహుముఖ ప్రజ్ఞ, ధార్మిక చింతన, ఆధ్యాత్మిక దృష్టి, పరోపకారభావన, సామాజిక అవగాహన అనేవి అంతర్వాహినిగా ప్రవహిస్తూ ఉండడం ఒక విశిష్టలక్షణం.
1) సాహిత్యరచనలు : 1907లో కేశవదాసు మొట్టమొదటిసారి తమ్మర గ్రామానికి వెళ్ళినప్పుడు ఆలయార్చకులు నరసింహాచార్య సూచన మేరకు మొట్టమొదటిసారి ‘స్తవమాలిక’ అనే రచనతో సాహిత్యసేవను ప్రారంభించారు. 1910లో అక్కడే వినయం, త్రికరణశుద్ధి, భాగవతలక్షణం, నిష్కామయోగ ఆవశ్యకతలను వివరిస్తూ ‘‘శ్రీరామ దండకము, పంచముఖ శ్రీఆంజనేయ దండకము’’ అనే రెండు దండకాలను రచించారు. తెలుగువారి ఆచార సంప్రదాయాలలో పాటలకు విశేషమైన ప్రాముఖ్యం ఉంది. ఆయా పండుగలు, వాటి సన్నివేశాల కోసం కేశవదాసు ఎన్నో మంగళహారతులు, జోలపాటలు, హెచ్చరికలు, మేలుకొలుపులు, స్తోత్రగీతాలు రచించారు. వాటిలో ‘‘ఓరోరి గణపతిరా, భారము నీదే, దేవదేవా విశ్వంభరణ’’ అనే పాటలు బాగా ప్రసిద్ధి పొందాయి. ‘శ్రీజానకి తలుపుల బంధనము’ అనే తలుపుదగ్గరి పాటను తమ్మరలో ఇప్పటికీ పాడుకుంటారు. వైష్ణవసిద్ధాంతాన్ని బాగా ఇష్టపడిన కేశవదాసు శివునిగురించికూడా ఒకేఒక్క గీతాన్ని రచించారు.‘మంచి గుణమీయరా ఉమామనోహరా శంకరా’ అనే ఆ పాటను ప్రజలు బాగా ఆదరించారు.
‘పరబ్రహ్మ పరమేశ్వర పురుషోత్తమ సదానంద’ అనే పాట నాటకరంగంలో ప్రార్థనాగీతంగా చాలా మంచి పేరును సంపాదించు కున్నది. ఈ పాట పల్లవిలోని రెండు పంక్తులను శంకర్‍వ్యాస్ బాణీలో ‘‘భక్తధ్రువ్’’ (1937)అనే హిందీ చిత్రంలో టైటిల్స్ నేపథ్యంలో ఉపయోగించడం ఒక విశేషం.
2) నాటకరంగం : ప్రబోధం, ఉపదేశం, సందేశం అనేవి భావప్రసార సామగ్రులు. నియమంగాని, చట్టంగాని, సూత్రంగాని, గొప్ప సిద్ధాంతంగాని అందరికీ సమానంగా వర్తింపజేయాలంటే ఏకాభిప్రాయం ఎంతో అవసరమవుతుంది. దీన్ని సాధించడానికి,పైన చెప్పిన సామగ్రులను ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి అవసరమయ్యే ప్రధానసాధనాలలో నాటకం ఎంతో ముఖ్యమైనది.
కేశవదాసు నెల్లుట్ల జమీందారు రామనరసింహారావుగారి ప్రోత్సాహంతో 1911లో ‘‘కనక్తార’’ అనే నాటకాన్ని రచించగా, కొండపల్లి వీరయ్య & సన్స్, కందుల గోవిందం మొదలైనవారు ఈ నాటకానికి అనేకముద్రణలు తీసుకువచ్చారు. కేశవదాసు కరుణ రసప్రాధాన్యం కలిగిన సాంఘిక ఇతివృత్తాన్ని జానపదశైలిలో కల్పిత వస్తువుతో ఈ నాటకాన్ని రచించారు. దీనిలో వీరరసం అంగభూతంగా ఉంటుంది. తార,కనకసేనుడు అనే అక్కాతమ్ముళ్ళ కథను దీనిలో మనోహరంగా చిత్రించారు. మొత్తం ఇతివృత్తాన్ని 5 అంకాలుగా విభజించుకుని, ధర్మసంస్థాపనా రీతిని అంతస్సూత్రంగా చేసుకుని రచించారే కాని, సరదా కోసమో, కాలక్షేపం కోసమో, ఉత్కంఠ కలిగించడం కోసమో రాయలేదని చెప్పవచ్చు. తన నాటక రచనా లక్ష్యాన్ని నాటకం చివరి భరతవాక్యంలో స్పష్టంగా చెప్పారు. ఆయా సన్నివేశాలకు అనుగుణంగా 25 పాటలు కూడా వ్రాశారు. నాటకరచన పూర్తి కాగానే ఈ నాటకాన్ని జగ్గయ్యపేటకు తీసుకువెళ్ళి కవిపండితులు, శతావధాని సంపన్ముడుంబైసింగరాచార్యులవారికి ఇచ్చి వారితో పరిష్కరింపజేశారు. తరువాతనే నాటకం ఎన్నో ముద్రణలను పొందింది.
ఈ విధంగా కేశవదాసు నాటకరంగంలో ప్రాంప్టరుగా, రచయితగా, దర్శకునిగా, నటునిగా, నిర్వాహకునిగా అవిరళకృషి చేసి నాటకకళను ఉజ్జీవింపజేయడానికి దోహదం చేసిన మహా మనీషిగా చరిత్రలో సముచితస్థానం సంపాదించు కున్నారు.
3) చలనచిత్రరంగం : 1931లో హెచ్.ఎం.రెడ్డి (హనుమంతప్ప మునియప్ప రెడ్డి) గారు జనరంజకమైన పౌరాణికకథను సినిమాగా తియ్యాలనుకున్నారు. ధర్మవరం రామకృష్ణమా చార్యులు గారి విషాద సారంగధర, చిత్రనళీయం, ప్రహ్లాద నాటకాలు ఎంతో ప్రజాదరణ పొందాయి. వాటిలో పూర్తిగా భక్తిరసాత్మకమైన ‘ప్రహ్లాద’ ను తీసుకుని హెచ్.ఎం.రెడ్డిగారు ‘‘భక్తప్రహ్లాద’’ పేరుతో సినిమాను రూపొందించుకున్నారు. మాటలు, పాటలు అన్నీ ధర్మవరం వారివే ఎన్నుకున్నారు. అయితే స్క్రిప్టు రాసుకునే సందర్భంలో కొన్ని సన్నివేశాలలో తప్పనిసరిగా పాటలుండాలని భావించారు. కాని అప్పటికే ధర్మవరంవారు జీవించిలేరు. కనుక ఆ రోజుల్లో కనక్తార, శ్రీకృష్ణతులాభారం నాటక గేయరచనా పక్రియలో అత్యంతనైపుణ్యాన్ని, ప్రసిద్ధిని సాధించిన కేశవదాసుగారిని పిలిపించుకున్నారు.
కేశవదాసు రెడ్డిగారి సూచనల ప్రకారం ప్రహ్లాదునికి లీలావతి విషమిచ్చే సన్నివేశంలో ‘పరితాపభారంబు’ అనే పాటను, మరో రెండు సన్నివేశాల కోసం ‘తనయా యిటులన్, భీకరమగు నా’ అనే పాటలను రచించి యిచ్చారు. ఈ సినిమాను బొంబాయిలో కృష్ణాఫిలింస్‍వారు ఆర్థెషీర్ ఇరానీ సహకారంతో నిర్మించగా హెచ్.ఎం.రెడ్డిగారు దర్శకత్వం వహించారు.
మల్లాది అచ్యుతరామశాస్త్రిగారు రచించిన ‘సతీసక్కుబాయి’ నాటకాన్ని 1935లో అరోరా కంపెనీవారు భారతలక్ష్మీఫిలింస్ బ్యానర్ మీద సినిమాగా తీయగా బి.వి.రామానందం దర్శకత్వం వహించారు. నాటకానికి పాటలు రాసి స్వరపరచిన దైతాగోపాలంగారి పాటలతో బాటు సోమరాజు రామానుజరావుగారి ‘సతీసక్కుబాయి’ నాటకానికి కేశవదాసు రాసిన ప్రజాదరణ గల పాటలను కూడా సినిమాలోకి చేర్చారు. వీటిని కూడా దైతాగోపాలంగారే స్వరపరిచారు. అయితే మిగతా పాటల కన్న కేశవదాసుగారి పాటలే ప్రజలకు నచ్చాయి. అందువల్ల ఈ సినిమాను 1954లో మరోసారి తీసినా దాసుగారి పాటలనే వినియోగించుకున్నారు. కాని కేశవదాసుగారి పేరును సినిమా టైటిల్స్లో వేయక దైతాగోపాలంగారి పేరుమీదనే చెలామణి చేశారు. కేశవదాసుగారి పాటలను దాసరి కోటిరత్నం, తుంగల చలపతిరావు,ఎస్.వరలక్ష్మి,కె.రఘురామయ్య,అబ్రహాం మొదలైనవారు ఆలపించారు. కొన్ని పాటలను బెంగుళూరు ట్విన్స్ రికార్డింగ్ కంపెనీవారు, మరికొన్ని పాటలను హె.చ్.ఎం.వి కంపెనీవారు రికార్డులుగా విడుదల చేశారు. 1955లో చిన్ని బ్రదర్స్వారు తీసిన ‘సతీసక్కుబాయి’ సినిమాలో కేశవదాసుగారి పాటలు కాక వాటికి అనుసరణలను సముద్రాల గారితో రాయించారు. బాణీలను మాత్రం యథాతథంగా ఉంచారంటే ఆ బాణీలకు ఎంతటి ప్రజాదరణ లభించిందో ఆలోచిస్తే అర్థమవు తుంది. ‘‘గజ్జెలందియలు ఘల్లుఘల్లుమన, రాదేల కరుణ, భక్తమణికి నిర్బంధము తొలగెన్, కృష్ణా పోబోకుమా, నీ పదములనింక’’ అనేవి కేశవదాసుగారి ఆణిముత్యాల వంటి పాటలు.
ఈ విధంగా కేశవదాసు భక్తి,ఆధ్యాత్మిక, సామాజికభావాలతో ఆనాటి ప్రత్యేక ఆకర్షణ గల సినిమా మాధ్యమానికి ఉపయోగపడే భౌతిక తత్త్వాన్ని కూడా ప్రదర్శింపగలగడాన్ని ఆలోచిస్తే ఆయనలోని రచనాప్రాగల్భ్యత, నిత్యనూతన చైతన్యస్ఫూర్తి ఎంతటి ఉన్నతస్థాయిలో ఉండేవో మనకు బాగా అర్థమవుతుంది. ఆయన ధర్మోపదేశం కోసం ఎన్నుకున్న రచనా వ్యాసంగంలో బహుళ జనీనమైన భక్తికి ప్రాముఖ్యం ఇవ్వడం వల్ల సామాన్య ప్రజానీకంలోకి సులభంగా చొచ్చుకుపోయారు. భక్తిని ఆయన ఎన్నడూ వృథా కాలక్షేపం కోసమో, ప్రేమ శూన్యమైన వట్టి పూజల కోసమో ఉపయోగించుకోలేదు. నైతిక జీవితసముద్ధరరణను మానవజన్మచరితార్థతాసాధనకు ఆయన అన్ని సమకాలీన పక్రియలను ఉపయోగించుకోగలిగారు. ఆధునిక సాంకేతిక వికాసాన్ని, దాని పరిణామాన్ని కూడా తనలో జీర్ణించుకుని సాంస్కృతిక పునరుజ్జీవనానికి పాటుపడినారు.
- డా।। ఎం.పురుషోత్తమాచార్య
ఎ : 9396611905