ఇప్పుడంటే ఇంటర్నెట్, ఓటీటీల హవా నడుస్తోంది గానీ, రెండు, మూడు దశాబ్దాల కిందట సామాన్య ప్రజానీకం వినోదం కొరకు ప్రధానంగా ఆధారపడే సాధనం టీవీ అని చెప్పవచ్చు. అప్పట్లో టీవీలు పరిమాణంలో చాలా పెద్దవిగా ఉండి, ఎక్కువ స్థలాన్ని ఆక్రమించేవి, కానీ ప్రస్తుతం మిల్లీమీటర్ల మందంతో గోడకు అతికించుకొనే విధంగా, పరిమాణం, చాలా తక్కువగా ఉండి పలుచని, అతి తక్కువ మందం కలిగిన టీవీలు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం ‘ఇందుగలడందులేడని సందేహం వలదు’ అన్నట్లుగా విస్తరించిన కంప్యూటర్ల విషయానికొస్తే తొలితరం కంప్యూటరైన ENIAC పరిమాణం ఒక గదిని ఆక్రమించేంత ఉండేది. కానీ ప్రస్తుతం ల్యాప్‍టాప్, టాబ్లెట్‍ల వంటి అతి తక్కువ పరిమాణం కలిగిన కంప్యూటర్లు అందుబాటులోకి వచ్చాయి. అవి ENIACకన్నా లక్షల రెట్లు సమర్థవంతంగా పని చేస్తున్నాయి. సెల్‍ఫోన్ పరిమాణం మొదట్లో ఒక ఇటుకంత ఉండేది. కానీ ప్రస్తుతం అతి తక్కువ పరిమాణం కలిగి, ఎక్కువ ఫీచర్లతో మనం ఆశ్చర్యపోయే విధంగా మనకు సేవలందిస్తు న్నాయడంలో అతిశయోక్తిలేదు. సెల్‍ఫోన్ చేతిలో ఉంటే ప్రపంచమంతా మన అరచేతిలో ఉన్నట్లే అన్నట్టుగా ప్రస్తుత ప్రపంచ రూపురేఖలు మారి పోయాయి.
సాంకేతిక రంగంలో వస్తున్న ఈ విప్లవాత్మక మార్పులన్నింటికీ మూలం నానో టెక్నాలజీ. ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న వస్తువులను, మరింత సూక్ష్మస్థాయిలోకి మార్చి, వాటిని మరింత సమర్థవంతంగా పనిచే యించడమే నానోటెక్నాలజీ ప్రధాన లక్ష్యం. ఇలాంటి నానో టెక్నాలజీ గురించి, సమీప భవిష్యత్తులో అది తీసుకురాబోయే పెను మార్పుల గురించి మనం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
నానో టెక్నాలజీ అంటే?
అత్యంత సూక్ష్మస్థాయిలోని అణువులు, పరమాణువులు మరియు విభిన్న రకాల వస్తువుల నిర్మాణం, స్వరూపస్వభావాలు, ప్రవర్తనారీతులను ఇంజనీరింగ్ మరియు సైన్స్ విభాగాలను మేళవించి అధ్యయనం చేసే సాంకేతిక శాస్త్ర విభాగాన్ని ‘నానో టెక్నాలజీ’ అంటారు.
నానో అన్న గ్రీకు పదానికి ‘మరగుజ్జు’ అని అర్థం. ఒక నానో మీటర్ అనగా ఒక మీటర్‍లో బిలియన్ వంతు (One billion the of ametre) లేదా 10-9.
నానో టెక్నాలజీ – మూలాలు :
నానో టెక్నాలజీని మొదటిసారిగా జపాన్‍కు చెందిన నొరియ టొని గుచ్చి (1974) ప్రవేశపెట్టారు. నానో టెక్నాలజీ అనే పదాన్ని తొలిసారిగా 1959వ సం।।లో రిచర్డ్ ఫెన్‍మెన్ అన్న శాస్త్రవేత్త తాను రాసిన”There’s Plenty of room at the Bottom” అన్న సిద్ధాంత గ్రంథంలో ఉపయోగించారు. స్వతంత్ర అణువులను లాక్కోవడం వల్ల శాస్త్ర పరిశోధనల్లో విప్లవాత్మక మార్పులు వస్తాయని ‘‘ఫెన్‍మెన్’’ తెలిపారు.
నానో టెక్నాలజీలో మాలిక్యులార్ అణువులను ఉపయోగిం చడం ద్వారా నానో ఉపకరణాలను తయారుచేయవచ్చని ఆర్థర్ వాన్ హిప్పల్ తెలిపారు. స్కానింగ్ టన్నెలింగ్ మైక్రోస్కోప్ కనుగొన్న తరువాత అణువులను, పరమాణువులను విడివిడిగా చూడడం సాధ్యమైంది. దీనితో పాటు అటమిక్ ఫోర్స్ మైక్రోస్కోప్ కనుగొన్న తరువాత నానో టెక్నాలజీ వాస్తవరూపం దాల్చింది. స్కానింగ్ టన్నెలింగ్ మైక్రోస్కోప్‍ను 1981లో ఐబీఎం సంస్థకు చెందిన గెర్డ్ బిన్నింగ్, హెన్రిచ్‍రోవర్ కను గొన్నారు. దీనికి గానూ వీరికి భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. Engines of Creation : The coming Era of Nanotechnology (1986) అన్న గ్రంథం ద్వారా ఎరిక్ డ్రెక్సోలర్ అన్న శాస్త్రవేత్త, నానో టెక్నాలజీకి విస్తృతంగా ప్రచారం కల్పించారు.
1) నానో టెక్నాలజీ – భారతదేశం
నానో టెక్నాలజీపై పరిశోధనలను ప్రోత్సహించేందుకుగానూ మన ప్రభుత్వం 60 కోట్ల రూ।।ల నిధులతో ‘‘ది నానో సైన్స్ అండ్ టెక్నాలజీ ఇనిషియేటివ్’’ని ప్రారంభించింది. అదే విధంగా 2007లో 5 సం।।రాల కార్యాచరణ ప్రణాళికతో విస్తృతమైన లక్ష్యాలను నిర్దేశించుకొని, 1000 కోట్ల రూ।।ల నిధుల కేటాయింపుతో నానో సైన్స్ అండ్ టెక్నాలజీ మిషన్ (ఎన్‍ఎస్‍టీఎం) అన్న కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం ప్రారంభించింది.
నానో సైన్స్ అండ్ టెక్నాలజీ మిషన్ (ఎన్‍ఎసీటీఎం): 2007- లక్ష్యాలు
- నానో టెక్నాలజీకి అన్ని రంగాలలో ప్రాచుర్యం కల్పించడం
- నానో టెక్నాలజీ రంగానికి సంబంధించి మౌలిక సదుపాయాల అభివృద్ధి
- నానో సైన్స్ పురోగతి కొరకు పరిశోధన మరియు అభివృద్ధి కేంద్రాల ఏర్పాటు
- నానో టెక్నాలజీలో మానవ వనరుల అభివృద్ధి
- నానో టెక్నాలజీ రంగంలో అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించుకోవడం.
పైన పేర్కొన్న లక్ష్యాల సాధన కొరకు డిపార్ట్మెంట్ ఆఫ్ ఐటీ, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, డీఆర్‍డీఓ, సీయస్‍ఐఆర్ (కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్) తదితర సంస్థలు, ఇంకా ఇతర విభాగాలకు చెందిన పరిశోధకులు తమవంతు సహకారం అందించారు.
బెంగుళూరులోని ఇండియన్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐయస్‍సీ), ముంబైలోని ఇండియన్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లలో నానో ఫాబ్రికేషన్ మరియు నానో ఎలక్ట్రానిక్స్ జాతీయ కేంద్రాలు స్థాపించబడ్డాయి.
సాధించిన విజయాలు
- పైన పేర్కొన్న కార్యక్రమాలు విజయవంతంగా అమలు చేయడం ద్వారా భారతదేశం ఇప్పటి వరకూ నానో సైన్స్లో 23000 పరిశోధనా పత్రాలు ప్రచురించింది.
- 2013లో ప్రచురించబడిన పరిశోధనా పత్రాల సంఖ్య ఆధారంగా చైనా మరియు యూఎస్‍ఏ తర్వాత ఇండియా 3వ స్థానంలో నిలిచింది.
- నానో సైన్స్కు సంబంధించి 2013లో భారతీయ పేటెంట్ కార్యాలయానికి 300 పేటెంట్ దరఖాస్తులు వచ్చాయి. ఇది 2006 కంటే పది రెట్లు ఎక్కువ. ఇది నానోసైన్స్ అండ్ టెక్నాలజీ మిషన్ యొక్క సహకారం వల్లనే సాధించబడిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
- నానో టెక్నాలజీకి సంబంధించిన ప్రమాణాలను నిర్దేశించేందుకు పరిశోధన మరియు అభివృద్ధి కేంద్రాల ఏర్పాటు మరియు నానో టెక్నాలజీ కొరకు నేషనల్ రెగ్యులేటరీ ఫ్రేమ్‍వర్క్ రోడ్ మ్యాప్ తయారు చేయడం జరిగింది.
ఐకాన్ శాట్ సదస్సు (ICON SAT 2020) మార్చ్ 5-7, కోల్‍కతా – ప్రధానాంశాలు :
- ICONSAT అనగా ది ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ నానోసైన్స్ అండ్ టెక్నాలజీ ఇది ప్రతి 2 సం।।రాలకొకసారి జరిగే అంతర్జాతీయ కార్యక్రమం. దీనిని డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, నానో మిషన్ కింద నిర్వహిస్తుంది.
- ఈ సదస్సులో ఫిజిక్స్, కెమిస్ట్రీ మరియు మెటీరియల్ డొమైన్‍ల అభివృద్ధికి అత్యాధునిక నానో టెక్నాలజీని అభివృద్ధి చేయాలని నిర్ణయించారు.
- నానో సైన్స్ మరియు నానో టెక్నాలజీ సహాయంతో 5 వీ లు అయిన Mechanical (మెకా నికల్), Material(మెటీరియల్), Machines (మెషీన్స్), Manufacturing (మ్యాన్యుఫాక్చరింగ్) మరియు Man Power(మ్యాన్ పవర్)లను ఏకీకృతం చేయాలని నిర్ణయించారు.
- సుస్థిరాభివృద్ధితో నానో టెక్నాలజీని ఏకీకృతం చేయడం.
- నానో సైన్స్ యొక్క అభివృద్ధికి నిపుణులతో కూడిన నెట్‍వర్క్ ఏర్పాటు చేయడం ద్వారా వ్యవసాయం, ఇంధనం, రవాణా, ఆరోగ్యం మొదలైన రంగాలలో పరస్పర సహకారం యొక్క ఆవశ్యకతను నొక్కి చెప్పడం.
- నానో టెక్నాలజీకి సంబంధించిన విభిన్న విభాగాలలో తాజా అభివృద్ధిపై రీసెర్చ్ చేసేందుకు గానూ దేశంలో మరియు విదేశాల నుండి వచ్చే విద్యార్థులు మరియు యువపరిశోధకులకు ఒక వేదికను ఏర్పాటు చేయడం.
AWSAR పథకం :
- AWSAR అనగా Agumenting writing skills for Articulating Research అని అర్థం. దీనిని డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రవేశపెట్టింది.
- ఇది ICONSAT సదస్సులో ప్రధానమైన అంశంగా ప్రకటించడం జరిగింది.
- యువ పీహెచ్‍డీ స్కాలర్లు, మరియు పోస్ట్ డాక్టోరల్ ఫెలోలు తమ పరిశోధన మరియు అధ్యయనాల సమయంలో విభిన్న వార్తా పత్రికలు, మ్యాగజైన్‍లు, బ్లాగులు మరియు సోషల్ మీడియా ద్వారా తమ రచనల్ని ప్రచురించే విధంగా తగిన ప్రోత్సాహాన్ని అందించడం ఈ పథకం ప్రధాన లక్ష్యం.
- విజ్ఞాన శాస్త్రానికి సమాజంలో ప్రాచుర్యం కల్పించడానికి, జనంలో శాస్త్ర విజ్ఞానానికి సంబంధించిన భావజాలాన్ని పెంపొందించడానికి యువశాస్త్రవేత్తల సేవలను వినియోగించుకోవడం.
- మాస్ మీడియాలో కథనాలు ప్రచురించబడ్డ 100 ఉత్తమ ఎంట్రీలకు ఆర్థిక సహకారంతోపాటు, ప్రశంసాపత్రాన్ని కూడా అందించడం జరుగుతుంది.
- పోస్ట్-డాక్టోరల్ ఫెలోస్ సమర్పించిన పరిశోధనా పత్రాల నుండి 20 ఉత్తమ ఎంట్రీలు ఎంపిక చేయబడతాయి.
- వాటిలో అత్యుత్తమ పరిశోధనా కథనానికి ఒక లక్ష రూ।।లు నగదు బహుమతి ఇవ్వడం జరుగుతుంది.
నానో టెక్నాలజీ – అనువర్తనాలు :
1) ఆరోగ్యరంగం
a) డ్రగ్ డెలివరీ :
వ్యాధికారక కణాలను గుర్తించి, ఆ కణాలకు మాత్రమే ఔషధాలను సరఫరా చేసే నానో రోబోలు రూపొందించబడ్డాయి. తద్వారా ఆరోగ్యకరమైన కణాలను ఔషధాల యొక్క సైడ్ ఎఫెక్ట్ల నుండి రక్షించవచ్చు. క్యాన్సర్ చికిత్సలో ఈ విధానం విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి, కీమోథెరపీ యొక్క దుష్ప్రభావాలను గణనీయంగా తగ్గించింది.
b) ఇమేజింగ్ మరియు డయాగ్నోస్టిక్ పరికరాలు :
ఇవి నానో టెక్నాలజీ ద్వారా రూపొందించబడతాయి. మానవులకు సంక్రమించే రోగాలను తొలిదశలోనే గుర్తించి, మెరుగైన వ్యక్తిగతీకరించిన చికిత్సా విధానాలను అందించేందుకు మార్గం సుగమం చేస్తాయి. తద్వారా వ్యాధులను నిరోధించడంలో మెరుగైన విజయావకాశాలను నమోదు చేస్తున్నాయి.
c) రోగనిర్ధారణ మరియు చికిత్స :
ధమనులలో ఏర్పడే సూక్ష్మస్థాయి లోపాలను గుర్తించి, వాటిని సరిచేయడం లేదా అథెరోస్ల్కీరోసిస్ యొక్క నిర్ధారణ మరియు చికిత్సలపై నానో టెక్నాలజీ ద్వారా విస్తృతంగా అధ్యయనం జరుగుతోంది. ఇందులో భాగంగా శరీరంలోని మంచి కొలెస్ట్రాల్ గుర్తించి, ధమనులలోని లోపాలను సవరించే నానో పార్టికల్‍ను పరిశోధకులు రూపొందించారు.
d) పునరుత్పత్తి చికిత్సావిధానాలు :
నానో టెక్నాలజీ ద్వారా ఎముక మరియు నాడీకణాల వంటి సున్నితమైన భాగాలలో దెబ్బతిన్న కణాలను పునర్‍నిర్మించే విధంగా పరిశోధనలు జరుగుతున్నాయి. శరీరంలో దెబ్బతిన్న అవయవాలను తొలగించి, నానోటెక్నాలజీ సహాయంతో ఆ అవయవ కణజాలాలను, రోజుల వ్యవధిలో పునరుత్పత్తి చేసి, వాటిని తిరిగి పునః ప్రతిష్టించేందుకు, వెన్నెముకలో దెబ్బతిన్న భాగాలను గ్రాఫీన్ నానో రిబ్బన్‍లతో సరిచేసేందుకు విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్నాయి.
e) వ్యాక్సిన్ల అభివృద్ధి:
సూదుల అవసరం లేకుండా మందులు శరీరంలోకి సరఫరా చేసే విధంగా నానో వ్యాక్సిన్లను రూపొందించేందుకు నానోటెక్నాలజీ ద్వారా విస్త•తంగా పరిశోధనలు జరుగుతున్నాయి.
f) స్మార్ట్ పిల్స్ :
వీటినే స్మార్ట్ మాత్రలు అని పిలవవచ్చు. ఇవి అత్యంత సూక్ష్మస్థాయి నానో ఎలక్ట్రానిక్ పరికరాలను చెప్పవచ్చు. ఇవి ఆకారం మరియు నిర్మాణంలో ఫార్మాస్యూటికల్ మాత్రల లాగానే ఉన్నప్పటికీ, సెన్సింగ్, ఇమేజింగ్, డ్రగ్‍డెలివరీ వంటి అధునాతన విధులను నిర్వర్తిస్తాయి. నానో టెక్నాలజీ ద్వారా గతంలో పిల్‍క్యామ్, సూక్ష్మ వీడియో కెమెరాతో కూడిన క్యాప్సూల్ మరియు డోస్ ట్రాకింగ్ మాత్రల వంటి వివిధ రకాల స్మార్ట్ మాత్రలను అభివృద్ధి చేయడంలో సహాయపడింది.
g) నానో బోట్‍లు :
నానో బోట్‍లు సూక్ష్మస్థాయి రోబోట్‍లు అని చెప్పవచ్చు. ఇవి శరీరంలో సూక్ష్మ సర్జన్‍లుగా పనిచేస్తాయి. కణాంతర నిర్మాణాలను సరిచేయడానికి మరియు భర్తీ చేయడానికి వాటిని శరీరంలోకి చొప్పించవచ్చు. డీఎన్‍ఏ అణువులను చొప్పించడం ద్వారా అవి ప్రతికృతి చెంది అవయవాలలోని జన్యులోపాలను మరియు వ్యాధులను నయం చేసుకునే విధంగా చేసేందుకు పరిశోధనలు జరుగుతున్నాయి.
h) నానోఫైబర్‍లు :
నానో ఫైబర్‍లను గాయాలను డ్రెస్సింగ్ చేయడంలోనూ, సర్జికల్ టెక్స్టైల్స్ మరియు కణజాల ఇంజనీరింగ్, ఇంప్లాంట్స్, కృత్రిమ అవయవ విభాగాలలో విరివిగా వాడుతున్నారు. గాయాలకు కట్టుకట్టేందుకు స్మార్ట్ బ్యాండేజీలను రూపొందించే దిశగా శాస్త్రవేత్తలు పరిశోధనలు కొనసాగిస్తున్నారు. ఇది గాయం తగలిన భాగంలో
ఉంచినప్పుడు గాయం మానిపోయిన తరువాత, స్మార్ట్ బ్యాండేజ్ కణజాలంలోకి శోషించబడుతుంది. ఈ స్మార్ట్ బ్యాండేజీలలో పొందుపరిచిన నానో ఫైబర్‍లలో గడ్డకట్టించే కారకాలు, యాంటీ బయోటిక్‍లతో పాటు ఇన్‍ఫెక్షన్ సంకేతాలను గుర్తించడానికి సెన్సర్‍లను కూడా కలిగి ఉంటాయి.
i) కోవిడ్ – 19 :
నానోటెక్నాలజీ సహాయంతో కోవిడ్ సంక్రమణాన్ని నిరోధించే పీపీఈ కిట్లను రూపొందించవచ్చు. తద్వారా హెల్త్కేర్ వర్కర్ల ఆరోగ్యాన్ని సంరక్షించవచ్చు. వైరస్ సంక్రమణాన్ని నిరోధించే సర్ఫేస్ కోటింగ్స్, యాంటీవైరల్ డిసిన్‍ఫెక్టాన్స్ను రూపొందించి వైరస్ వ్యాప్తిని నిరోధించవచ్చు. వైరస్ ఇన్ఫెక్షన్‍ని త్వరగా గుర్తించడానికి అత్యంత నిర్దిష్టమైన మరియు సున్నితమైన నానో సెన్సార్లను రూపొందించవచ్చు. వైరస్ సంక్రమించిన కణజాలాన్ని మాత్రమే లక్ష్యంగా చేసుకొని, సైడ్ ఎఫెక్టస్లేని నూతన ఔషధాలు రూపొందించవచ్చు. అదేవిధంగా నానో ఆధారిత టీకాలను అభివృద్ధి చేయవచ్చు.
2) ఆహారపరిశ్రమ :
- నానో సెన్సర్ల ద్వారా, ఒక ఫ్లాష్‍లైట్‍ను ఉపయోగించి కలుషితమైన ఆహారంలో ఉన్న ఈ – కొలీ బ్యాక్టీరియాను గుర్తించవచ్చు.
- దాల్చిన చెక్క, ఒరెగానో నూనె మరియు జింక్, కాల్షియంల యొక్క నానో పార్టికల్స్తో తయారు చేయబడిన యాంటీ మైక్రోబియల్ ప్యాకింగ్ ఆహారంలో బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది.
- నానో బార్ కోడ్స్ ద్వారా ఆహార ప్యాకింగ్‍లలో లోపాలను మరియు వ్యక్తిగతీకరించిన ఉత్పత్తులను గుర్తించవచ్చు Tag individual products)
3) వస్త్ర పరిశ్రమ :
వస్త్ర పరిశ్రమరంగంలో నానో టెక్నాలజీ ద్వారా మరకలు పడని లేదా ముడతలు పడని స్మార్ట్ ఫ్యాబ్రిక్‍లను అభివృద్ధి చేయవచ్చు. అలాగే మోటార్ సైకిల్ హెల్మెట్ మరియు స్పోర్టస్ పరికాలను తయారు చేయడానికి బలమైన, తేలికైన మరియు నాణ్యత కలిగిన మెటీరియల్‍ను ఉత్పత్తి చేయవచ్చు.
4) ఎలక్ట్రానిక్స్ :
- నానో టెక్నాలజీ ద్వారా ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లు మరియు ట్రాన్సిస్టర్ల పరిమాణాన్ని గణనీయంగా తగ్గించవచ్చు.
- ఎలక్ట్రానిక్ పరికరాల యొక్క డిస్‍ప్లే స్క్రీన్‍లను మెరుగు పరచవచ్చు.
- ఎలక్ట్రానిక్ పరికరాల విద్యుత్ వినియోగం, బరువు మరియు మందాన్ని తగ్గించడంలో నానోటెక్నాలజీ సహాయపడుతుంది.
5) ఇంధన రంగం :
- నానో టెక్నాలజీ ద్వారా సౌరఫలకాల (Solar Panels) సామర్థ్యాన్ని, పనితీరును మెరుగుపరచవచ్చు. సౌరఫలకాల తయారీ పక్రియను మరింత సరళీకరించి, అవి చౌకగా లభ్యమయ్యే విధంగా చేయవచ్చు.
- ఇంధన ఉత్పత్తిని మరియు పెట్రోలియం పదార్థాల వినియోగ సామర్థ్యాన్ని మెరుగుపరచవచ్చు.
- మండే స్వభావం అతి తక్కువగా ఉండి, సమర్థవంతమైన పనితీరు కలిగి తేలికైన మరియు అధికశక్తి సాంద్రత కలిగిన అనేక బ్యాటరీలలో నానో టెక్నాలజీ ఉపయోగించబడుతోంది.
- ప్రస్తుతం ఉన్న సాంకేతిక పరిజ్ఞానాలు మరింత సమర్థవంతంగా, తక్కువ ఇంధనాన్ని వినియోగించుకొనే విధంగా తమ పనితీరును మెరుగుపరచుకునేందుకు నానోటెక్నాలజీ ఇతోధిక సహకారాన్ని అందిస్తోంది.
6) పర్యావరణం :
- నానో టెక్నాలజీ ద్వారా నీటిలోని మలినాలను గుర్తించి, నీటిని శుద్ధిచేయడం ద్వారా సరసమైన, స్వచ్ఛమైన తాగునీటిని అందించవచ్చు.
- నానో టెక్నాలజీ సహకారంతో రసాయనిక ప్రతిచర్యల ద్వారా అతితక్కువ ఖర్చుతో భూగర్భ జలాల్లోని పారిశ్రామిక నీటి కాలుష్య కారకాలను తొలగించవచ్చు.
- నానో టెక్నాలజీ సెన్సార్‍ల ద్వారా గాలి మరియు నేలలోని హానికరమైన రసాయన లేదా జీవ సంబంధ ఏజెంట్‍లను గుర్తించడం, వడబోయడం, తటస్థీకరణం చేయవచ్చు.
7) వ్యవసాయం :
a) నానో ఎరువులు :
మొక్కలలో పోషకాల లోపాన్ని నివారించడానికి, పోషకాలలోపం ఉన్న నిర్దిష్టప్రదేశాన్ని గుర్తించి, నానో టెక్నాలజీ సహకారంతో ఆ ప్రదేశానికి నెమ్మదిగా, నియంత్రిత పద్ధతిలో పోషకాలను విడుదల చేసే స్మార్ట్ డెలివరీ సిస్టమ్‍ను శాస్త్రవేత్తలు రూపొందించారు. నానో ఎరువులు మొక్కకు అవసరమైన పోషకాల లభ్యతను పెంచడం ద్వారా పంట ఉత్పాదకతను పెంచుతాయి.
b) నానో పెస్టిసైడ్స్ మరియు నానో హెర్బిసైడ్స్ :
కలుపు మరియు చీడపీడల నిర్వహణకు నానో హెర్బిసైడ్లు, నానో పెస్టిసైడ్లు వాడకం ద్వారా పంట ఉత్పాదకతను గణనీయంగా పెంచవచ్చు. పాలిమెరిక్ నానో పార్టికల్స్ మరియు ఇన్ ఆర్గానిక్ నానో పార్టికల్స్ను నానో హెర్బిసైడ్స్గా వినియోగించడం జరుగుతోంది.
c) విత్తన అభివృద్ధి :
విత్తనాల యొక్క నాణ్యతపై పంట ఉత్పాదకత ఆధారపడి
ఉంటుంది. కార్బన్ నానో ట్యూబులను టమాటో విత్తనం యొక్క కవచంలోకి ప్రవేశింపజేసినట్లయితే విత్తనం మొలకత్తే సామర్థ్యాన్ని, మరియు మొక్కల యొక్క పెరుగు దలను గణనీయంగా మెరుగు పరుస్తాయని విభిన్న పరిశోధనల్లో ఋజువైంది.
d) నానో బయోసెన్సర్లు :
- నానా బయోసెన్సర్లు మైక్రో ప్రాసెసర్ కలిగి ఉండి జీవ సంబంధ ప్రతిస్పందనలను విద్యుత్ ప్రతిస్పందనలుగా మారుస్తాయి.
- నానో బయోసెన్సర్లు రియల్ టైం సిగ్నల్ మానిటరింగ్ విధానం ద్వారా వ్యాధికారక సూక్ష్మజీవులు, యాంటీబయోటిక్ నిరోధకత, క్రిమిసంహారక మందులు, విషపూరిత రసాయనాలు మరియు భారలోహ కలుషితాలను ప్రత్యక్షంగానూ లేదా పరోక్షంగానూ గుర్తిస్తాయి. అదేవిధంగా పంట ఒత్తిడి, నేల స్థితిగతులు, మొక్కల పెరుగుదల, పోషకాల పరిమాణం మరియు ఆహార నాణ్యతను పర్యవేక్షించడానికి ఈ సాంకేతికత ఉపయోగించ బడుతుంది.
8) అంతరిక్ష రంగం :
కార్బన్ నానో ట్యాబులతో నిర్మితమైన పదార్థాలు వాటి యొక్క నిర్మాణాత్మక స్థిరత్వాన్ని పెంచుకోవడం ద్వారా అంతరిక్షవాహకనౌకల బరువును గణనీయంగా తగ్గించవచ్చు. స్పేస్ ఎలివేటర్లకు అవసరమైన కేబుళ్ళను తయారు చేయడానికి కూడా కార్బన్ నానో ట్యూబులను వాడవచ్చు. అంతరిక్షంలోకి వస్తువులను పంపడానికి అయ్యే ఖర్చును స్పేస్ ఎలివేటర్లు గణనీయంగా తగ్గిస్తాయి. స్పేస్ క్రాఫ్ట్లలోని ప్రాణాధార వ్యవస్థ, రేడియేషన్ విభాగాల పనితీరును పరిశీలించ డానికి, రసాయనాల ఉనికిని పర్యవేక్షించడానికి నానో సెన్సర్లను వినియోగిస్తారు.
సవాళ్ళు
- నానో టెక్నాలజీ రంగం మనదేశంలో ప్రగతిపథంలో పురోగమిస్తున్నప్పటికీ, ఇంకా మెరుగుపడాల్సిన అవసరం
- ఉంది.
- యూఎస్‍ఏ, ఫ్రాన్స్ మరియు చైనా వంటి దేశాలు నానో టెక్నాలజీకి కేటాయిస్తున్న పరిశోధనావ్యయంతో పోలిస్తే మనదేశం కేవలం ఒక భాగం మాత్రమే కేటాయిస్తోంది.
- 2011లో మొదటి 1 శాతం ప్రచురణలలో భారతదేశం నుండి 16 పేపర్లు మాత్రమే కనిపించాయి. అలాగే భారతదేశం నుండి యూఎస్ పేటెంట్ కార్యాలయానికి ధరఖాస్తు చేసిన పేటెంట్ల సంఖ్య, మొత్తం దరఖాస్తులలో 0.2 శాతం మాత్రమే.
- నానో సైన్స్ మరియు టెక్నాజీని ప్రజలు సానుకూలంగా ఆహ్వానిస్తున్నప్పటికీ, ఈ రంగంలో అండర్‍గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేట్ డిగ్రీ చదివే విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంది. మరియు కెరీర్ అవకాశాలు కూడా పరిమితంగా ఉన్నాయి.
- నానో సైన్స్ అండ్ టెక్నాలజీలో సం।।రానికి 150 పీహెచ్‍డీలు మాత్రమే వస్తున్నాయి. మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ ద్వారా వచ్చే దశాబ్దంలోఏటా 10,000 పీహెచ్‍డీ విద్యార్థులను తయారు చేయాలనే లక్ష్యంతోపోలిస్తే ఇది చాలా తక్కువ.
- నానో టెక్నాలజీకి మార్కెట్ పరంగా మంచి డిమాండ్ ఉన్నప్పటికీ ఈ రంగంలో పరిశోధనలకు ప్రైవేట్ రంగం తగినంత పెట్టుబడులు పెట్టకపోవడం ఆందోళన కలిగించే విషయమని చెప్పవచ్చు.
చివరిగా :
నానో టెక్నాలజీ వేగంగా పురోగమిస్తూ, వృద్ధికి అవకాశాలున్న వర్ధమాన సాంకేతిక రంగంగా అభివర్ణించవచ్చు. ఇది విభిన్న రంగాలలో బహుళ అనువర్తనాలను కలిగి ఉంది. వ్యవసాయం, వైద్యం, ఇంధనం, పర్యావరణ రంగంలో మన సమస్యలకు సత్వర పరిష్కారాలకు నానో టెక్నాలజీ అన్వేషిస్తున్నందున ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగాలు నానో టెక్నాలజీ రంగానికి మరింత తోడ్పాటునందించాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఈ రంగంలో ఇండియా గ్లోబల్ పవర్‍గా ఎదిగే అవకాశం ఉంది.
-పుట్టా పెద్ద ఓబులేసు,
ఎ : 9550290047