తెలంగాణ డక్కలి కళాకారుల పటం కథలు


తెలంగాణ డక్కలి కళాకారుల పటం కథలు తెలుగు వారి వైవిధ్య భరితమైన జీవితానికి, సంప్రదాయాలకు ప్రతిరూపాలు అన్ని జానపద కళారూపాలు కూడ. ఇవి అప్రయత్నంగా, సహజంగా ఆయా కళాకారుల నుండి రూపుదిద్దుకున్నప్పటికి వీటిలో సంగీత ముంటుంది. తాళం, లయ, నృత్యం, అభినయాలుంటాయి. వాద్యాల లయబద్ధమైన కలయిక, క్రమశిక్షణలుంటాయి. సామాజిక, రాజకీయ ఆధునిక పరిణామాలు ఎన్ని వచ్చినా పరంపరగా వస్తున్న ఈ కళారూపాలు చెక్కుచెదరకుండా ఉన్నాయి. మన కళలు, సంప్రదాయాలు ఇంత వరకు నిలిచాయంటే అది జానపద కళాకారుల గొప్పదనమే. జానపదం అంటే కేవలం పల్లెపాటలు అనే అభిప్రాయం ఒకనాడుండేది. ఈనాడు జానపద కళాకారుల పాటలు జానపద విజ్ఞానంలో ఒక భాగం. ఇది జానపద విజ్ఞాన పరిధి విస్తరించిన పరిణామ ఫలితమే. ప్రజల మధ్యనే స్వతఁసిద్ధంగా పుట్టి పెరిగిన కళారూపాలు కావటం వలన వీటికి జానపద కళారూపాలని పేరు వచ్చింది.


డక్కలి జానపద కళాకారులు తరతరాలు మన సంస్క•తిని పరిరక్షించడమే కాక అక్షర జ్ఞానం లేని గ్రామీణులు ఏనాడో, ఎక్కడో, ఎప్పుడో ఈ కళారూపాలను సృష్టించుకున్నారు. అలవోకగా, అశువుగా వచ్చిన పలుకులే పాటలుగా, పండుగ పబ్బాలలో ఆడే ఆటలే కళారూపాలయ్యాయి. అవే తరతరాలుగా నిలిచి ఉన్నాయి. కొత్త రూపాలను సంతరించుకున్నాయి. రాగ, తాళ లక్షణాలు తెలియక పోయినా లయబద్ధంగా పాడుతూ, ఆడుతూ అభినయంచేస్తూ ప్రజలను ముగ్ధులను చేస్తారు. వీరి జీవనంలోనే పటం కథల కళారూపాలు ప్రత్యేకమైన రూపును దిద్దుకున్నాయి. వారి జీవితాలతో పెనవేసుకున్నాయి. డక్కలి జానపద కళారూపాలు ముఖ్యంగా తెలంగాణా జానపద కళారూపాలు అతి ప్రాచీనమైనవి. ఇవి తెలంగాణ ప్రాంత గ్రామీణ ప్రజల సంతోషానికి, మానసిక చైతన్యానికి, వినోద విజ్ఞానాలకు భూమికగా నిలిచి ఉన్నాయి. డక్కలి జానపద కళారూపాలకు ఆ కథలు చెప్పే, కులాలను బట్టి, వరుసల ననుసరించి, కథా వస్తువులను బట్టి ఆయా పేర్లు వచ్చాయి. ఈ కళారూపాలు ఆయా ప్రాంతాల ప్రజల ఆశలకు, ఆలోచనా సరళికి ప్రతిరూపాలని చెప్పవచ్చు. అందువల్లనే ఈ కళారూపాలు ప్రజలందరిని ఆకట్టుకుంటున్నాయి.


డక్కలికులం కళాకారులు:
తెలంగాణ ప్రాంతంలో మాదిగకులం వారు పూర్వకాలం నుండి తమ కులవృత్తులైన చర్మకార వృత్తి, దండోరా వృత్తి చేస్తూ జీవిస్తుండగా వీరిని ఆశ్రయించి జీవించే మొదటి ఆశ్రితకులం డక్కలి కులం వారు. డక్కలికులం వారు మాదిగలను తమ హక్కుదారులుగా భావిస్తారు. ఎందుకంటే మాదిగలకు, డక్కలి వారికి అతి దగ్గర సంబంధమున్నది. వీరిరువురు అన్నదమ్ములేనని జాంబపురాణం చెపుతుంది.


మాదిగలకు, డక్కలి వారికి సోదర సంబంధం ఉన్నదని తెలిపే కథ జాంబపురాణంలో ఉన్నది. సృష్టి ఏర్పడటానికి ముందు అది ఏకోనారాయణమూర్తి అంశంతో జాంబవంతుడు సృష్టింపబడినాడు. అప్పటికి భూమ్యాకాశాలు ఏర్పడనందున సముద్రపు నీటిపై తేలుతూ ఉంటాడు. తర్వాత ఆదిశక్తి, త్రిమూర్తులు పుడతారు, శివపార్వతుల వివాహం కొరకు శివుని ఆజ్ఞపై జాంబవంతుడు తన ఇద్దరు కుమారులలో పెద్దవాడిని చంపి అతని అవయవాలతో విశ్వకర్మకు పనిముట్లు తయారు చేసి ఇచ్చాడు. చివరకు అన్ని అవయవాలుపోగా అతని డొక్క మిగులుతుంది. జాంబవంతుడు ఆ ఏడు వెన్నుపూసల డొక్కను తనయింటి ముందున్న పెంటకుప్పలపై పారవేసినాడు. పార్వతీ పరమేశ్వరులు అనుగ్రహించి ఆ డొక్కపై విభూతి వేసి సంజీవి పుల్ల మోపి బాలుని బ్రతికించారు. వానిని జాంబవంతుని ఇంట్లోకి తీసుకువస్తుండగా ఇంటి ముందు గల గరుడస్తంభం కూలి, ఏడు ద్వారాలకు అగ్గితగులుతుంది. అప్పుడు వీడు అక్కర లేదని పెంటకుప్పపై కూర్చోపెడతారు. అందువల్ల జాంబవంతునికి దక్కని వాడై డొక్కలో పుట్టిన దక్కలివాడైనాడు. కలియుగంలో డక్కలివానిగాను, మరో కుమారుడు మాదిగవాడుగాను పుట్టినారు. కాబట్టి మాదిగవారికి, డక్కలివారికి సోదర సంబంధమున్నదని ఈ కథ ద్వారా తెలుస్తుంది.


జాంబవంతునికి దక్కనివాడై డక్కలి వానిగా పుట్టిన డక్కలి కులం వారికి మాదిగ వాడలో ప్రవేశం లేదు. ఊరి బైటనే నివసిస్తారు. వీరిలో చాలా మందికి రెండు నిట్రాళ్లయిళ్లుండవు. పడుకోవడానికి మంచ ముండదు. తినడానికి కంచ ముండదు మట్టి చిప్ప మాత్రమే ఉంటుంది. కాలికి చెప్పు లుండవు, కప్పుకోవడానికి గొంగళి కూడా ఉండదు. వీరికి సివారు మీద బిక్షమెత్తుకునే హక్కులేదు. కేవలం మాదిగ కులం వారినే ఆశ్రయించి బ్రతుకుతారు.
డక్కలి కళాకారులు మొదట జాంబపురాణ పటప్రదర్శన చేస్తూ కథాగానం చేసేవారు. కాని రాను రాను జనాకర్షణ కోసం కాలానుగుణంగా ముఖానికి రంగు పూసుకొని, వేషాలు వేసుకొని యక్షగాన పద్దతిలో జంబపురాణాన్ని ప్రదర్శిస్తున్నారు.


జాంబ పురాణంలో మాదిగ వారి ఉపకులాలు మాలవారి ఉపకులాలను గూర్చి వివరించబడింది. ఇవే కాక సమాజంలోని అన్ని కులాల ప్రస్తావన, పుట్టుకలు సవివరంగా తెలుపబడినాయి. అయితే సమాజంలోని విశ్వకర్మ పనిముట్లే కాక అన్ని కులాలకు చెందిన ఆయా వృత్తులకు అవసరమైన పనిముట్లు, పరికరాలు, జాంబవంతుని కుమారుని అవయవాలతో తయారు చేయబడి నాయని, అవి లభించడం వారికి మాదిగలు పెట్టిన భిక్షయే అని జాంబపురాణం చాటిచెప్పుతున్నది.


డక్కలి వారి పటం కథలు – కథ చెప్పే విధానం:
తెలంగాణ ప్రాంతంలో డక్కలి కళాకారులు మాదిగలను ఆశ్రయించి పటం ఆధారంగా జాంబపురాణాన్ని కథాగానం చేస్తూ ప్రదర్శిస్తారు. వీరే కాక ఈ ప్రాంతంలో మరికొన్ని ఆశ్రిత కులాల కళాకారులు కూడా పటం ఆధారంగా తమ కళారూపాలను ప్రదర్శిస్తారు. కాకిపడిగల పటం కథ, అద్దపు పటం, కథ, ఏనూటి పటం కథ, కూనపులి పటం కథ, మాసయ్యపటం కథ, తెరచీరల పటం కథ, గుఱ్ఱపు పటం కథ, పెక్కర్ల పటం కథ ప్రచారంలో
ఉన్న పటం కథలు.


జాంబపురాణాన్ని ఐదు రోజులు కథాగానం చేస్తూ ప్రదర్శిస్తారు. మొదటిరోజు ఆదిపురాణం, ఇందులో సృష్టి ఆవిర్భవించి నప్పటి నుండి అన్ని విషయాలు చెపుతారు. జాంబవంతుని పుట్టుక, ఆదిశక్తి పుట్టుక, త్రిమూర్తుల జననం, దేవదానవుల పుట్టుక, పంచభూతాలు ఏర్పడిన విధానం, మొదలైన విషయాలు కథాగానం చేస్తూ చెపుతారు. రెండవరోజు శివపార్వతుల కళ్యాణం చెపుతారు. ఇందులో త్రిమాతల పుట్టుక, వివ్వకర్మ పురాణం, అగస్త్య పురాణం, జాంబవంతుడు తన పెద్దకుమారుడైన ఆగమునిని చంపి అతని అవయవాలతో విశ్వకర్మకు పనిముట్లు చేసి ఇవ్వటం, ఆ పరికరాల సహాయంతో శివపార్వతుల పెళ్లికి మంగళసూత్రం మొదలైన ఆభరణాలు తయారు చేయటం, ఆగముని మిగిలిపోయిన డొక్క భాగం నుండి శివుడు సంజీవి పుల్లను మోపి మళ్లీ బ్రతికించడం, డక్కలి కులోత్పత్తి గాధ మొదలైన విషయాలు చెపుతారు.


మూడవ రోజు సముద్ర మధనం, సత్యకామధేనువు కథ (మాలచెన్నయ్య పురాణం) చెపుతారు. ఈ కథలో సముద్రమధనం వల్ల పుట్టిన అమృతం, విషం, పంపకాలు, చెన్నయ్య పుట్టుక, కామధేనువును సంరక్షించే బాద్యత చెన్నయ్యకు అప్పజెప్పటం, చెన్నయ్య దిష్టిదోషం వల్ల కామధేనువు చనిపోవటం, త్రిమూర్తుల, దేవతల కోరికపై జాంబవంతుడు తన కొంగవాల్‍ కత్తితో చనిపోయిన కామధేనువును ముక్కలు ముక్కలుగా కోసి వంత కొరకు సిద్ధం చేయటం, వంట చేసే సమయంలో చెన్నయ్య జాంబవంతుల నిర్లక్ష్యానికి శివుడు నీచకులం వారు కమ్మని శాపమివ్వటం, ఇంకా చాకలి సర్వయ్య మొదలైన వారి కథలు చెపుతారు. కథలో పాలు, పెరుగు, వెన్న, నెయ్యి అనే నాలుగు పంటలతోపాటు కామధేనువు మాంసం ఐదవ పంట అయిందని చెపుతారు.


నాలుగవ రోజు ఆరంజ్యోతి కళ్యాణం (అరుంధతీ కళ్యాణం) కథ చెపుతారు. దీన్ని వశిష్ట పురాణం అని కూడా అంటారు. ఈ కథలో పరాశర మహర్షి మాదిగ భోగం స్త్రీ ఊర్వశిని ప్రేమించటం అందువల్ల వారికి వశిష్టుడు పుట్టటం, వశిష్టున్ని పరాశరుడు ఊర్వశికి తెలియకుండా ఎత్తుకు వెళ్లటం, వశిష్టుడు పెరిగి పెద్దవాడై, మాతంగాపురి పట్నం వచ్చి, మాదిగ స్త్రీ అరుంధతిని పెళ్లాడటం, జాంబవంతుడు పెళ్ళి పెద్దగా ఉండి పెళ్లి చేయటం, త్రిమూర్తులు ఆశీర్వదించటం, మొదలైన విషయాలు చెపుతారు.


ఐదవ రోజు బలభద్ర విజయం కథ చెపుతారు. బలభద్రుడు ఒక ఆదర్శరైతుగా, పంటలు పండించే పొలం కాపుగా చిత్రించటం, అతని పొలం పంట దగ్గరికి శివుడు మారువేషంలో వచ్చి భిక్ష అడగటం, బలభద్రుడు ముందు భిక్ష వేయకపోవటం, ఆ తరువాత శివుని ఆజ్ఞపై బిక్షగాళ్లకు భిక్ష వేయటం ఇంకా కథాక్రమంలో భాగంగా గౌడ కులస్తులు కంఠమాగౌడు కథ, గంగిరెద్దుల కథ, పిచ్చుకుంట్ల కథ, ఎరుకల ముదిరాజువాళ్ల కథలు, సమాజంలోని అన్ని కులాల వారిని ఆశ్రయించి బ్రతికే ఉపకులాల గురించి చెపుతారు. చివరగా మాదిగ ఆశ్రిత కులాల డక్కల, బైండ్ల, చిందు, నులకచందయ్య, మాష్టివాళ్లకు మాదిగల నుండి హక్కుగా వచ్చే త్యాగాన్ని నిర్ణయించటం, మొదలైన విషయాలు చెపుతారు.


వీరు కేవలం పటం ఆధారంగా కథాగానం మాత్రమే చేసేవారు. కాని నేడు భాగవత సంప్రదాయ పద్దతిలో, యక్షగాన పద్దతిలో కూడా తమ కళారూపాన్ని ప్రదర్శిస్తున్నారు.


డక్కలివారి ప్రదర్శనోపకరణాలలో పటం మొదటి ఉపకరణం. ఈ పటంలో రంగురంగుల బొమ్మలు, జాంబ పురాణంలో వచ్చే పాత్రలు ఉంటాయి. వరంగల్‍ జిల్లా జనగాం తాలూకాలోని చేర్యాల గ్రామంలో ఈ పటం నకాశి వాళ్లు తయారు చేస్తారు. నకాశి వారితో జాంబపురాణ పాత్రలు వచ్చే విధంగా డక్కలి వారు పటం తయారు చేయించుకుంటారు.


ఐదు రోజులు కథలు చెప్పిన తరువాత పటాన్ని చుట్టి మాదిగ పెద్ద యింట్లో భద్రపరుస్తారు. త్యాగం అంతా వసూలయ్యే వరకు అక్కడే ఉంటుంది. పటం ఒకవేళ పాడై చినిగిపోతుంటే దానిని ఎక్కడపడితే అక్కడ పారెయ్యక గంగలో కలిపే సంప్రదాయం డక్కలివారికి ఉంది. పటంపై అన్ని దేవతల బొమ్మలుంటాయి కాబట్టి గంగలో కలుపడం వల్ల పుణ్యం దక్కుతుందని వీరి విశ్వాసం. పారుచున్న ఏ నదిలో కలిపినా అది గంగలో కలిపినట్లుగా భావిస్తారు. నది ఒడ్డున పూజలు, పునస్కారాలు చేసి, యాటను కోసి పండుగ చేసుకుని నీళ్లలో కలిపి వస్తారు. తరువాత కొత్తపటాన్ని తయారు చేయించుకుంటారు.

  • డా।। పాండుల సాయిలు,
    ఎ : 9652027481

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *