ఓటు ఎంత వ్యక్తిగతమో అంత సామాజికమైనది. మనం బ్రతక వలసిన సమాజపు రూపురేఖల్ని నిర్ధారించి విధానాలను రూపొందించే నిర్మాణశక్తి ‘ఓటు’. ప్రపంచ దేశాల ముందు మనల్ని గౌరవంగానో, అగౌరవంగానో నిలబెట్టేది మన ఓటు ద్వారా నిర్మితమైన వ్యవస్థే. ప్రపంచంలోనే అతి పెద్దప్రజాస్వామిక దేశంగా మన దేశానికి గుర్తింపు, విలువా ఉన్నాయి. దీనికి కారణం మన వారసత్వపు ప్రజాస్వామిక దృక్పథం.
దేశానికి స్వాతంత్య్రం వస్తే ప్రజాస్వామ్య వ్యవస్థ కుప్పకూలిపోతుందనీ, అంతర్గత ఘర్షణలతో దేశం అల్లకల్లోలం అయిపోతుందనీ పాశ్చాత్య దేశాలు ప్రచారం చేశాయి. కానీ దానికి భిన్నంగా గత 75 సంవత్సరాలుగా ఎన్ని అవరోధాలున్నప్పటికీ, ఎన్ని తప్పొప్పులున్నప్పటికీ పార్లమెంటరీ వ్యవస్థ ద్వారా మన దేశం ప్రజాస్వామిక దేశంగా తన సత్తాను చాటుకుంటూనే వుంది. వివిధ జాతులు, మతాలు, కులాలు, ప్రాంతాలు, భాషలు, సంస్కృతులు, భౌగోళిక స్థితులతో ఎంతో వైవిధ్య భరితమయిన ఈ సువిశాల దేశంలో ఇంత సుదీర్ఘకాలం పాటు ప్రజాస్వామిక వ్యవస్థ కొనసాగటం ఒక చారిత్రక విజయం. ఈ స్థితిని ప్రపంచలో మరెక్కడా ఊహించలేము.
ఇప్పటికీ కొన్ని దేశాలలో ప్రజలందరికీ ఓటు హక్కు లేదు. ఒకప్పుడు మనదేశంలోను విద్యావంతులకు, ధనవంతులకు మాత్రమే ఓటు హక్కు వుండేది. అనేక పరిణామాల తర్వాత ధనిక, పేద, ఆడ, మగ, తృతీయ జెండర్, ప్రాంతాలు, కుల మత వివక్ష లేకుండా 18 సం।। నిండిన వారందరికీ ఓటు హక్కు లభించింది. ప్రపంచ వ్యాప్తంగా ఓటు హక్కు వినియోగించటంలోను చాలా పరిమితులు కనిపిస్తున్నాయి. మన దేశంతో పోలిస్తే ఇతర అభివృద్ధి చెందిన దేశాల్లో సహితం ఓటింగ్ సరళి భిన్నంగా వుంది. ఆయా దేశాల్లో ఉన్నత వర్గాలు, ధనవంతులు మినహా సామాన్య ప్రజలు ఓటుహక్కు వినియోగించుకోవటం లేదు. కానీ మన దేశంలో ఉన్నత, మధ్య తరగతి వర్గాల కంటే అట్టడుగు ప్రజలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, పేద ప్రజలు ఓటింగ్లో ఎక్కువ సంఖ్యలో పాల్గొంటున్నారు. ఓటు మనిషికి గుర్తింపు అని భావిస్తున్నారు. ఓటు హక్కుని వినియోగించుకోవటం దేశభక్తిలో భాగమని కూడా మన ప్రజల గాఢ విశ్వాసం. పంచాయితీ నుండి లోక్ సభ దాకా ప్రతి ఎన్నికలలో ప్రజలందరూ భాగస్వాములవుతున్నారు.
ఎన్నికల సమయంలో అన్ని రాజకీయ పార్టీలు తమతమ మేనిఫెస్టోలతో ప్రజల ముందుకు వస్తాయి. సాధ్య, అసాధ్యాలతో నిమిత్తం లేకుండా అనేక వాగ్దానాలు, వరాలు ప్రకటిస్తాయి. అనేక ప్రలోభాలతో, ప్రభావాలతో ప్రజలను చుట్టుముడతాయి. ప్రజలు ఆగం కావద్దు. గత అనుభవాల గుణపాఠాలు బేరీజు వేసుకోవాలి. ఆలోచించుకుని, చర్చించుకుని ఓటు వేయాల్సిన విజ్ఞత ప్రజలదే.
ఎన్నికలు నిర్వహించటానికి కేంద్ర ఎన్నికల కమీషన్ నుండి రాష్ట్రస్థాయి, నియోజకవర్గాల స్థాయి, పంచాయితీ స్థాయి వరకు వివిధ హోదాలలో ఎన్నికల అధికారులు ఉంటారు. ఎలాంటి ప్రలోభాలు లేకుండా సక్రమంగా, క్రమబద్ధంగా అవకతవకలు లేని విధంగా ఎన్నికలు జరిపించటం వీరివిధి. వారికి అన్ని విధాల సహకరించటం పార్టీల, ప్రజల అప్రమత్తత మరియు బాధ్యత.
ప్రజలందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి. మన భవిష్యత్తునే కాదు, మన ప్రజాస్వామ్యమిక వ్యవస్థను కాపాడేది మన ఓటే.
(మణికొండ వేదకుమార్)
ఎడిటర్