పచ్చని వనాలు, విరబూసిన మోదుగుపూలు, పాలధారలోలే కొండల అంచుల నుండి దూకే జలపాతాలు, వాగులు వంకలు వాటి పక్కన వరుసగా గడ్డి గుడిసెలు. ఆ గుడిసెల్లో జీవితాల్ని వెలిగించు కుంటున్న వేగుచుక్కల్లాంటి బంజారాలు. జాబిల్లిని తుంచి తమ ఘుంక్టోలో దాచారా! అన్నట్టుగా అందమైన కలంకారి వస్త్రధారణ, వ్యవసాయం, పశుపోషణ. ఈ ద•శ్యం అనాది భారతాన్ని ఆవిష్కరిస్తుంది. మదిని చరిత్ర పుటల్లోకి మళ్ళిస్తుంది. దేశ నిర్మాణంలో వీరి పాత్ర ప్రత్యేకం. బంజారాల సమగ్ర చరిత్ర మీద నేటివరకు ఎటువంటి గ్రంథాలు వెలువడలేదు. అటువంటి వీరి చరిత్రను ఒడిసిపట్టి అక్షరాలలో భద్రపరిచే తొలి ప్రయత్నం చేశారు డా.ఎం.ధనంజయ్ నాయక్, డా.సూర్యా ధనంజయ్ దంపతులు. వారు మలిచిన చరిత్ర గ్రంథమే ఈ ‘బంజారా చరిత్ర’.
ఈ గ్రంథం ప్రస్తుత తెలంగాణా ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా వైభవంగా ఆవిష్క•తమైంది. మరోగ్రంథం ‘గోర్ బంజారా యాన్ ఎండ్యూరింగ్ ట్రైబ్’ పేరుతో ఆంగ్లంలో 2020 లో విడుదలై సంచలనాన్ని స•ష్టించింది.
‘‘తమ చరిత్రను తామే చెప్పుకోవాలి. లేకపోతే కాలగర్భంలో కలిసిపోతాం. అప్పుడు అజ్ఞానులు చెప్పిందే చరిత్ర అవుతుంది’’ అంటారు డా. అంబేద్కర్. ఈ విపత్కర పరిస్థితి తమ బంజారా జాతికి రాకూడదనే సదుద్దేశ్యంతో రచయితలు తమజాతికున్న ఘన చరిత్రను అక్షరబద్ధం చేశారు. రచయితలిద్దరు వారి జాతిజనుల పట్ల, వారి సాహిత్యం పట్ల నిబద్ధత కలిగి ఉన్నవారు. నిరంతర పరిశోధనా ద•క్పథం కలిగి చరిత్ర మాటున దాగిన సత్యాలను సాహిత్యం మాధ్యమంగా లోకానికి పంచుతున్నవారు. రాష్ట్రాలు దాటి ప్రముఖులను కలుస్తూ, మూలాలను శోధిస్తూ క్రీస్తు పూర్వంనుండి నేటివరకు బంజారాల ఆనవాళ్ళను, వారి అస్తిత్వాన్ని సంశోధనాత్మకంగా జాతికి అందించారు. ఇందుకోసం వారు పడ్డ శ్రమ వెలకట్టలేనిది.
విశిష్టమైన ఈ గ్రంథానికి ‘అలిఖితమైన చరిత్రకు నిలువుటద్దం’ అనే శీర్షికతో తమ అమూల్యమైన ముందుమాటను అందించారు ఆచార్య ఎన్. గోపి. రచయితలు తమ తొలిపలుకుల్లో ఈ గ్రంథావశ్యకతను, నేడు తమ జాతి ఎదుర్కొంటున్న విషమ పరిస్థితులను వివరిస్తూ బంజారాలకు తమ మూలాలను, ఘనమైన వారి వారసత్వాన్ని అందజేయడమే లక్ష్యంగా ఈ గ్రంథాన్ని రచించారు. ఈ గ్రంథం పరిశోధనా పద్ధతులను అనుసరించి ఏడు అధ్యాయాలుగా విభజితమైంది.
గ్రంథ ‘పరిచయం’లో భారతదేశ వ్యాప్తంగా నివసిస్తున్న బంజారాలను, ఆయా రాష్ట్రాల్లో పిలుచుకునే పేర్లను, సామాజిక స్థాయికి సంబంధించిన విషయ చర్చ చేశారు గ్రంథకర్తలు. చరిత్ర పుటల కింద దాగిన వివిధ కాలాల్లో మానవ శాస్త్రవేత్తలు, చరిత్రకారులు, పరిశోధకుల వ్యాఖ్యానాల ఆధారంగా బంజారాల అస్తిత్వాన్ని విశ్లేషించారు. సింధూ నాగరికత కాలంలోని వస్తు సంస్క•తితో బంజారాల వస్తు సంస్క•తిని పోల్చి శోధనాత్మకంగా వివరించారు.
బంజారాల గురించి పాశ్చాత్య చరిత్రకారులు ఇలియట్, బ్రిగ్స్, కంబర్లేజ్, ఫ్రెంచ్ రత్నాల వ్యాపారి, యాత్రికుడు జీన్ బాస్టిన్ టావెర్నియర్, ఎడ్గర్ థర్స్టన్, కల్నల్ జేమ్స్ టాడ్, బంజారాల భాష గోర్బోలిని అధ్యయనం చేసిన భాషా శాస్త్రవేత్త గ్రియర్సన్ మొదలగువారితో పాటు హేమన్ డార్ఫ్, వెరియర్ ఎల్విన్ వంటివారి పరిశోధనల్లోని శోధనా సత్యాలు పాఠకులకు సరికొత్త చరిత్రను పరిచయం చేయిస్తాయి. పరిశోధకులు సయ్యద్ సిరాజ్ ఉల్ హసన్, ఎల్.కె ఆనంతక•ష్ణ, నంజుండయ్య, ఎస్.ఆర్.కనిత్కర్, సునీతి కుమార్ చటర్జీ, కె.ఎస్.సింగ్, ఎం.చిదానంద మూర్తి, రాంసింగ్ బాణావత్, పుష్పలత, ప్రొఫెసర్ మోతీరాజ్ రాథోడ్, హెచ్.డి లమాని, అబుల్ ఖైర్ మహ్మద్ ఫారూక్స్, బెనకన్హల్లి నాయక్, ప్రొఫెసర్ సన్నారాం చౌహన్, డా.ఖండోబా, బి.టి.లలితా నాయక్, చినియా నాయక్, ప్రొఫెసర్ సూర్యాధనంజయ్ నుండి నేటి వరకు జరిగిన పరిశోధనల్లో బంజారాల అస్తిత్వ నిరూపణలను సంక్షిప్త సమగ్రం చేశారు రచయితలు.
మొదటి అధ్యాయం బంజారాల ఉనికికి సంబంధించిన ఆధారాలను అందజేస్తుంది. విస్త•తమైన సమాచారాన్ని అందిస్తూ భారతీయ చరిత్రకారులు రామచంద్ర గుహ, రాహుల్ సాంక•త్యాయన్ వంటి వారిని తలపిస్తారు రచయితలు. వారు సేకరించిన సమాచార విస్త•తికి తోడు చేసిన విషయ నిర్ధారణ, నిరూపణ ఇందుకు కారణంగా చెప్పవచ్చు. ఈ అంశాలతో పాటు దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న బంజారాల ఉనికిని, బంజారా పద వ్యుత్పత్తిని, చరిత్రకారుల కథనాలు, బ్రిటీష్, నైజాం పాలనాకాలంలోని జనగణన నివేదికలను పేర్కొంటూ బంజారాల ఉనికిని తెలియబరుస్తారు .
రెండవ అధ్యాయం బంజారాల చారిత్రక ఆధారాలను విశదపరుస్తుంది. చరిత్రకారులు, మానవ శాస్త్రవేత్తలు గిరిజన తెగలకు ఇచ్చిన నిర్వచనాలతో ఆరంభమైన అధ్యాయం ఇంపీరియల్ గెజిటర్ ఆఫ్ ఇండియా 1911, డి.ఎన్. మజుందార్, ఎల్.పి. విద్యార్థి, ఏ.బి. బర్ధన్, కమలాదేవి చటోపాధ్యాయ వంటి భారతీయ ప్రముఖుల నిర్వచనాల నీడలో బంజారాలను ఒక ప్రత్యేక గిరిజన తెగగా పరిచయం చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా మనుగడలో ఉన్న మానవజాతి నిర్మాణక్రమం ఆధారంగా మానవ శాస్త్రవేత్తలు జనులను వివిధ జాతులుగా విభజించిన తీరును, అందులో నిపుణులు బంజారా జాతికి ఇచ్చిన వివరణలు ఇక్కడ పొందుపరచబడ్డాయి.
బంజారాల చారిత్రక ఆధారాలను, వీరి ప్రాచీనతకు కారణాలుగా చెబుతున్న సింధూ నాగరికత, అందులో బయటపడ్డ వస్తు సంస్క•తిని ప్రతిబింబించే ఎద్దుచిహ్నం, గోలాధారో, చన్హుధారో, ధోలావీరాల దగ్గర బయటపడ్డ దంతపు గాజుల పరిశ్రమ వివరాలు తెలియవస్తాయి. బంజారా ఎద్దులకు దాహార్తిని తీర్చిన లమాన్ కువా(బావి)ల ఆధారాలు సమర్పించబడ్డాయి. అంతేకాదు లాల్సోట్ లోని బంజారోంకా ఛత్రి, ఫిలిభిత్ లోని చారిత్రక గోడ, పిరియా బంజారా నిర్మించిన పిచోలా సరిహద్దు గోడ, ఉదయ్ పూర్ లోని బాదల్ ప్యాలెస్, మధ్యప్రదేశ్ లోని సిప్ నదిపై నిర్మించిన బంజారా డ్యాం, లక్కిషా నిర్మించిన జలాశయాలు, గోల్కొండ కోటకున్న బంజారా దర్వాజ, బంజారా హిల్స్ వంటివి చారిత్రక ఆధారాలుగా నమోదు చేయబడ్డాయి.
దేశాన్ని ఆర్థికంగా పుష్టిగా ఉంచే వ్యాపారానికి రహదారులు ఎంత అవసరమో అది సాగాలంటే రవాణా కూడా అంతే అవసరం. అందుకు కావాల్సిన రహదారులు బంజారాలు సాగించిన ‘లద్ని’ మార్గాలు కావడం విశేషం. అట్లా బంజారాలచే నిర్మించబడ్డ ప్రాచీన రవాణా మార్గాలు బ్రిటీషు వారిచేత, స్వాతంత్య్రానంతరం దేశప్రభుత్వంచే జాతీయ రహదారులుగా మలచబడ్డ తీరును ఈ అధ్యాయం సవిస్తరంగా వివరిస్తుంది.
మూడవ అధ్యాయం ప్రాచీన యుగంలో బంజారాల ప్రస్తానాన్ని వివరిస్తూ సాగుతుంది.
‘మా హడ్పాణీ మా జోధాబీ సింధూనదిరే పాలేమా/ సప్త సింధూ రాలేమా/దమ్డియా దామ్ లగాయోరే…’ అంటూ బంజారాలు పాడుకునే పాటలో తమ చరిత్ర దాగి ఉందంటారు. విదేశీ దండయాత్రల కారణంగా తమ బంగారు నగరం హరప్పాను, తమ జీవనాధార వ•త్తులను వదిలి సుదూరాలకు తరలిపోతున్నప్పుడు ఈ పాటను బంజారాలు పాడుకున్నారని రచయితలు తెలియజేస్తారు. సింధూ నాగరికత కాలంలో బంజారాల అస్తిత్వానికి ఆనవాళ్ళు లభించాయని చెప్పే హిస్టోరియన్ బి.జి.హల్భార్ వంటి వారి అభిప్రాయాలను క్రోడికరించారు రచయితలు. ఉప్పు రవాణా చేసిన కారణంగా బంజారాలు లమాన్, లాభాన్ అనే పేరుతో పిలవబడ్డారని ఈ అధ్యాయంలో తెలుస్తుంది. అంతేకాదు సింధూ లోయలో బయటపడిన గోలాధారో దగ్గర ‘టర్బినెల్లా ఫైరం’ నత్తజాతి షెల్స్ తో తయారుచేయబడ్డ గాజుల పరిశ్రమ, అక్కడ అసంపూర్ణంగా,శిధిలమైన స్థితిలో దొరికిన గాజులు బంజారాల బలియాలను పోలి ఉండడం, వీటిని ద్రువీకరించిన పురావస్తు శాస్త్రవేత్తలు, చరిత్ర పండితుల వివరణలను అందిస్తుంది. సప్తసింధూ, పంచజింగ్ ప్రాంతంలో భీకర యుద్ధాలు జరగడం. ఆయా జాతులు, తెగలు బంజారాలను యుద్ధ నిపుణులుగా ప్రాధాన్యతనివ్వడం. ఓడిపోయినప్పుడల్లా వైరిపక్షాలు వీరిని బందీలుగా చేసుకొని తీసుకెళ్లడం. అట్లా దేశేతర ప్రాంతాలకు బంజారాలు తరలిపోవడం వంటి విషయాలు ఇక్కడ తెలియవస్తాయి.
నాలుగవ అధ్యాయం మధ్య యుగంలో బంజారాల చారిత్రక ప్రస్తానాన్ని వివరిస్తుంది. వాణిజ్యపరంగా దేశ ఆర్థిక వ్యవస్థను నడిపిన సమూహాల్లో బంజారా సమాజం ముఖ్యమైనదన్న విషయమిక్కడ ప్రస్పుటమవుతుంది. దుర్భేధ్యమైన మార్గాల గుండా నిర్భయంగా ప్రయాణిస్తూ ఒక ప్రాంతంనుండి ఇంకో ప్రాంతానికి బంజారాలు సంప్రదాయ వస్తు రవాణా వ•త్తిని కొనసాగించినట్లు తెలుస్తుంది. గిరిజనులను ఉద్దేశించి విఖ్యాత చరిత్రకారిణి ‘రోమిలా థాపర్’ విశ్లేషణకు బంజారాలు దగ్గరగా కనబడతారిక్కడ. ముల్తాన్, కాబుల్ నుండి భారతదేశమంతా వాణిజ్య లావాదేవీల్లో బంజారాలు ముఖ్య భూమికను పోషించారని ఈ సమయంలోనే తురుష్కుల దండయాత్రలు భారత్ వైపు సాగడం ‘అమీర్ సూరి’ అధీనంలో ఉన్న గోర్ ప్రావిన్స్ ప్రజలపై వారు సాగించిన దారుణ మారణకాండ, ఎదిరించిన గోర్ ప్రజల ధైర్య సాహసాలు, అజ్మీర్ నుండి దక్షిణంగా ప్రయాణం సాగించిన నేపథ్యాన్ని ఈ అధ్యాయం పాఠకుల ముందుంచుతుంది.
అంతేకాదు ప•థ్విరాజ్ రాథోడ్ కాలంలో బంజారాలు అందించిన సేవలను ప్రస్తావిస్తూనే, మొగలుల దండయాత్రలను ఎదుర్కుంటూ తమ సామాజిక వ్యవస్థలను కాపాడుకున్న తీరును గురించి చెబుతుంది. ఈ విషయాలతో పాటు దేశవ్యాప్తంగా ఆనాడు ప్రచలితంగా ఉండి నేడు జాతీయ రహదారులుగా మారిన కార్వాన్ మార్గాల సవివరణ ఇక్కడ లభిస్తుంది. మొగల్ రాజుల కాలంలో ఘనంగా జీవన ప్రస్థానాన్ని సాగించి ఔరంగజేబును ఎదిరించిన ‘లక్కిషా బంజారా’ వీరత్వాన్ని కళ్ళకు కడుతుంది. మహ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో కుదుర్చుకున్న రవాణా ఒప్పందం మొగలుల కాలం వరకు కొనసాగడం వంటి వాణిజ్య సంబంధ విషయాలతో పాటు 13 వ శతాబ్దంలో బంజారాలు దక్కన్ కు చేరడం వంటి చారిత్రాత్మక అంశాలు ఈ అధ్యాయంలో చోటు చేసుకున్నాయి. మొగలుల కాలంలో బంజారాలు మధ్య భారతం నుండి దక్కన్ కు ప్రయాణించడం, నైజాం నవాబులచే వీరి నమ్మకమైన సేవలను ప్రసంశిస్తూ ఇక్కడి రాజులు ప్రకటించిన ఫర్మానాల వివరాలను ఈ అధ్యాయం మనకు అందిస్తుంది.
ఐదవ అధ్యాయం బంజారా ఆధ్యాత్మిక గురువులు, యోధుల గురించి సవివరంగా వివరిస్తుంది. బంజారా సమాజానికి దిశా నిర్దేశాన్ని అందిస్తూ కాలగమనంతో పాటు వారిని ముందుకు నడిపిన ఆధ్యాత్మిక గురువులు,ప్రవక్తలు, పరివ్రాజకులు, జాతి సేవలో, దేశ సేవలో తమను తాము సమర్పణం చేసుకున్న యోధుల వివరాలు తెలియజేస్తుంది. తిరుమల వెంకటేశ్వర స్వామి పరమభక్తుడు హతీరాం బావాజీ చరిత్రను, దేవాలయ పరిపాలనలో సంస్కరణలను తెచ్చిన తీరును పరిచయం చేస్తుంది. బంజారాల జీవితాలను అత్యున్నతంగా వెలిగించిన సంత్ సేవాలాల్ మహారాజ్, వారిఆధ్యాత్మిక వారసుడు రామారావ్ మహరాజ్ వంటి ధార్మిక గురువులు వారి బోధనలు కనిపిస్తాయి.
బంజారా యోధులు చిత్తోడ్ రాజు రతన్ సేన్ కు కుడి, ఎడమ భుజాలుగా ఉన్న ‘గోరా, బాదల్’, వింధ్య ప్రాంతపు మహోబా రాజ్య సింహం ‘ఆలా వూదా’, చిత్తోడ్ గడ్ రక్షకులు ‘జయమల్ రాథోడ్, ఫాత్మల్ చూడావత్’లు, షావుకార్, మహా వ్యాపారి, వీరుడు ‘లక్కిషా బంజారా’లు కనిపిస్తారు.వీరేకాక స్వాతంత్య్ర సంగ్రామ స్పూర్తిని హ•దయంలో దాచుకొని పోరాటం సాగించిన ‘గోవింద్ గురు బంజారా’, ‘మీటూ భూక్యా’, ‘ఠాణు నాయక్’ వంటి వీరులు, వారి త్యాగాలు తెలియజేస్తుంది.
ఆరో అధ్యాయం బ్రిటిష్ పాలనలో బంజారాల చారిత్రక ప్రస్తావనను తెలియజేస్తుంది. ‘లద్ని’ వ్యాపార రవాణాను నిర్వహిస్తున్న బంజారాల జీవితాల్లో విషాదాన్ని నింపుతూ బ్రిటీష్ పాలకులు అనేక చట్టాలు చేశారు. 1857 సిపాయిల తిరుగుబాటులో బ్రిటీషువారిని ఎదిరించినవారిలో బంజారాలు కూడా ఉన్నారు. ఈ తెగకు చెందిన గురుగోవింద్ బంజారా లాంటి యోధులు కొందరు బ్రిటీష్ వారి గుండెల్లో దడలు పుట్టించారు. కాబట్టి రాజ్యాల సమ•ద్దిలో భాగం పంచుకుంటున్న బంజారాలను పక్కకు తప్పించాలని వారు భావించారు. ఇందుకోసం 1858లో ‘గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్’ ని తీసుకొచ్చారు. ఇందులో భాగంగా జనాభా లెక్కలు సేకరించి దేశాన్ని సామాజిక, రాజకీయ పరంగా నియంత్రించడానికి పూనుకున్న విధాన్ని తెలియపరుస్తూనే, బతుకు పోరాటాన్ని సాగిస్తున్న బంజారాల మీద 1871లో తెచ్చిన ‘క్రిమినల్ ట్రైబ్ యాక్ట్’ బంజారాల మీద చూపించిన నిరంకుశత్వాన్ని ఈ అధ్యాయం కన్నులకు కడుతుంది.
బ్రిటీష్ వారు రవాణా సౌకర్యం కోసం రైల్వే మార్గాలను ఏర్పాటు చేయడంతో జీవనోపాధి కోల్పోయారు. చెల్లాచెదురైనా బంజారాలు జీవించడానికే పోరాటాన్ని సాగించిన విధాన్ని తెలియబరుస్తుంది. బ్రిటీషు వారికి వ్యతిరేకంగా గిరిజనులు చేసిన వివిధ ఉద్యమాలను, దానికి నేత•త్వం వహించిన నాయకుల పోరాటాలను కళ్ళముందుంచుతుంది. దీనితో బ్రిటీష్ వారి క్రిమినల్ యాక్ట్ అనేక దశలుగా మార్పులు, చేర్పులతో గిరిజనులందరి మీద అమలు చేయబడడమే కాకుండా నిజాం రాజును కూడా ఆ చట్టాన్ని అమలు చేసేలా ఒత్తిడికి గురిచేశారు. దీనితో హైదరాబాద్ రాజ్యంలో ‘లంబాడా దస్తూర్ ఉల్ అమల్’ అనే కొత్త విధానం తేవడం జరిగింది. ఇది బంజారాలను పీడనకు గురిచేసింది. నిజాం రాష్ట్రంలో బంజారాలు తమదైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న సత్యాన్ని, తెలంగాణ సాయుధ ఉద్యమంలో బంజారాల పాత్రను వివరిస్తూ ఈ అధ్యాయం సాగిపోతుంది.
ఏడవఅధ్యాయంలో స్వాతంత్య్రానంతరం బంజారాల జీవనంలో కలిగిన మార్పులను, కాలానుగుణంగా వారు తమ అస్తిత్వ రక్షణకు ఉద్యమించిన తీరును దర్శిస్తాం. 1952 లో భారత ప్రభుత్వం క్రిమినల్ ట్రైబ్ యాక్ట్ పరిధి నుండి బంజారాలను డినోటిఫైడ్ చేసింది. దానితో 1950 నుండి అమలువతున్న గిరిజన రిజర్వేషన్ ఫలాలు వారికందలేదు. 1956 లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అవతరణ జరిగిణ తర్వాత కూడా గిరిజన రిజర్వేషన్ తెలంగాణ ప్రాంతపు బంజరాలకు అందలేదు. ఆంధ్ర ప్రాంతంలో సుగాలీల పేరుతో బంజారాలు రిజర్వేషన్ ఫలాలు పొందడం, హైదరాబాద్‍లో లంబాడీల పేరుతో వివక్షకు గురవ్వడం వంటి అంశాలు ఆనాటి అధికారుల నిర్లక్షం అద్దం అపడతాయి. ఈ స్థితిని దూరంచేసి తమ జాతికి రిజర్వేషన్ ఫలాలను ఎస్టి సామాజిక హోదాను అందించే తపనతో బాదావత్ రమణీబాయి చేసిన పోరాటం ప్రతి ఒక్కరిని కదిలిస్తుంది. ఆమెతో మొదలైన ఉద్యమం అమర్ సింగ్ తిలావత్ వంటి ప్రముఖుల దాకా సాగి చివరకు విజయం సాధించడం వరకు గల విజయ ప్రస్థానం ఈ అధ్యాయంలో కొన సాగుతుంది. అంతటితో ఆగకుండా నేటివరకు నడిచిన తెలంగాణ తొలి, మలి దశల ఉద్యమాల ప్రస్థానం అందులో బంజారాల భాగస్వామ్యం వరకు గల అన్ని అంశాలు ఇందులో చోటు చేసుకున్నాయి.
ప్రాచీన యుగాల నుండి నేటివరకు గల సామాజిక, రాజకీయ, ఆర్థిక జీవన పోరాటంలో బంజారాలు తమ అస్తిత్వాన్ని స్థిరపరుచుకున్న విధం, చారిత్రక పరిణామాలకు అనుగుణంగా వారిని వారు మలుచుకున్న తీరును ఈ గ్రంథం ఎరుకజేస్తుంది. భారతదేశ నిర్మాణంలో అనాదినుండి నేటి వరకు బంజారాల అమూల్యమైన పాత్రను ప్రపంచానికి విశదపరుస్తుంది. ప్రతీ ఒక్కరూ కొనుక్కొని చదువుకోగల, దేశవ్యాప్త గ్రంథాలయాల్లో
ఉండవలసిన చరిత్ర గ్రంథమిది. ఈ గ్రంథం చదివిన వారికి ఒక రామచంద్ర గుహ, ఒక జేమ్స్ మిల్, ఒక రోమిలా థాపర్, ఒక రాహుల్ సాంక•త్యాయన్ గుర్తుకువస్తారు. ‘దూరదర్శన్’,‘ఆజ్ తక్’, ‘ఎపిక్’ వంటి ఛానల్ లు చేసిన అనేక డాక్యుమెంటరీలు కళ్ళముందు కదలాడుతాయి. పండిత్ జవహార్ లాల్ నెహ్రు రాసిన ‘డిస్కవరీ ఆఫ్ ఇండియా’కు ఆవల మరో కొత్త ఇండియా ఆవిష్క•తమవుతుంది. చదువుతున్న అందరం ఒక్కసారిగా చరిత్ర గర్భంలోకి చేరి చలనస్థితిలో సంచరించి పేజీలు తిరగేస్తూ ఈనాటికి చేరుకుంటాం.
-డా।। మంత్రి శ్రీనివాస్
832 833 3720