ప్రకృతే సౌందర్యం! 21 ప్రకృతే ఆనందం!! సముద్ర గర్భం! మరో ప్రపంచం!


(గత సంచిక తరువాయి)
పాలిచ్చే చేప : (mammal fish) – వేడినీటి చేపలు – అతిశీతల ప్రాంత చేపలు :
అత్యంత చిరుచేప ఓ వింతగా భావిస్తుంటే, ఆఫ్రికాలోని అమెజాన్‍ ప్రాంతంలో పాలిచ్చే చేప లభించడం మరోవింత. వెయ్యి మీటర్ల లోతుల్లో కూడా చేపలు ఆవాసముంటే, మరికొన్ని చేపలు 500 C ఉష్ణోగ్రత వద్దకూడా జీవిస్తున్నట్లు, ఈ చేపలు ఉష్ణోగ్రత సమతుల్యతను (heat reducing) చేసుకునే యాంత్రికతను కలిగి వున్నట్లు కాలిఫోర్నియా సముద్రజలాల్లో గుర్తించారు. ఇది ఇలా వుంటే, మరికొన్ని జాతి చేపలు సున్నా డిగ్రీల ఉష్ణోగ్రత (freezing) వద్ద కూడా జీవిస్తున్నట్లు శాస్త్రజ్ఞుల పరిశీలనలో తేలింది.


తెల్లరక్తం చేపలు (white blooded fishes)
అంటార్కిటికా పరిశోధనల సందర్భంగా, కెర్‍గుయ్‍లెన్‍ (kerguelen) ద్వీప పరిసర ప్రాంతాల్లో మూడు రకాల చేపల్ని తెల్లరక్తం చేపలుగా సోవియట్‍ పరిశోధకులను గుర్తించారు. డజన్ల కొద్దిగా గల ఈ రకం చేపల్లో, హెమోగ్లోబిన్‍, ఎరిత్రోసైట్స్ (erythrocytes) లేనట్లు తేలింది.


లోతును బట్టి జీవావరణం :
సముద్రాల్ని మథనం చేసే శాస్త్రజ్ఞులు సముద్రాన్ని రెండు భాగాలుగా విభజించారు. ఉపరితలం నుంచి 200 మీటర్ల లోతు వరకు పై భాగాన్ని పై పొర (layer)గా, ఆ తర్వాత భాగాన్ని లోపలి పొరగా గుర్తించారు. దాదాపు 20వ శతాబ్దపు మధ్యభాగం దాకా పై పొర పరిశోధనలే అసంపూర్తిగా జరిగాయి. మొట్టమొదటిసారి, 1949లో సోవియట్‍కు చెందిన విట్‍యాజ్‍ (vityaz) అనే ఓడ 10,000 మీటర్ల సముద్ర లోతుల్లో పరిశోధనల్ని ప్రారంభించింది. ఇంతలోతుల్లో ఎలాంటి జీవులు, జీవపదార్థం బతికి బట్టకట్ట లేదనే అభిప్రాయాన్ని, ఈ ఓడ పటాపంచలం చేసింది. అంత లోతుల్లో నుంచి పటిష్టమైన, సన్నని ఉక్కువలతో (trawl) వివిధ రకాల చిరు, మధ్యస్థ రకాల జంతువుల్ని ఓడ డెక్‍ పైకి చేర్చింది. అలా విణత్తగా గుర్తించిన జీవరాశి ఏ జంతువర్గీకరణలో చేరనివే కావడం గమనార్హం! అందులో సూడోలిపారిస్‍ (pseudolipairs) చేప ఒకటి. ఎలాంటి పొలుసులు లేని ఈ చేపకళ్ళు గుండుసూది తలంత మాత్రమే కలిగి వుండడం విశేషం.


ఇలా రంగుల చేపలు, తెల్లరక్తం చేపలు, వేడినీటిలో ఆవాసముండే చేపలన్నీ లాటిమేరియా (latimeria) లాంటి ఆకృతికి సంబంధించిన క్రాసోప్టెరిగి (crossopterygii) క్రమానికి (order) చెందిన శిలాజ వారసులని శాస్త్రజ్ఞులు నిర్ధారణకు వచ్చారు. అనగా, 300 మిలియన్‍ సం।। క్రితం (cretaceous కాలం) చెందినవిగా శిలాజ శాస్త్రజ్ఞులు భావించారు. పోతే, ఇదే కాలానికి చెందిన భూమిపై నడయాడిన వెన్నెముక గల జీవులు 50-60 మిలియన్‍ సంవత్సరాల క్రితం వరకు జీవించి కనుమరుగైనట్లు కథనాలు.


సజీవమైన శిలాజ చేపలు :
మిలియన్‍ సంవత్సరాల క్రితమే కనుమరుగైనవని భావిస్తున్న తరుణంలో కొన్ని రకాల చేపలు వివిధ ప్రాంతాల్లో జాలరులకు దొరకడం గమనార్హం! అలాంటి వాటిలో లాటిమేరియా, కొయిలకాంత్‍ (coelacanth) రకం చేపలు చెప్పుకో తగ్గవి. 22, డిసెంబర్‍ 1938లో దక్షిణాఫ్రికా తూర్పు లండన్‍ తీర ప్రాంతంలో మీటరన్నర పొడవున్న ఓ కొత్తరకం చేప లభించింది. దీన్ని స్మిత్‍ అనే జంతుశాస్త్రవేత్త పరిశీలించి, కనుమరుగైన క్రాసోప్టెరిగి క్రమానికి చెందిన చేపగా గుర్తించి ఆశ్చర్యానికి గురైయ్యాడు. ఈ సమాచారాన్ని తనకు అందించిన మ్యూజియం క్యూరేటర్‍ అయిన కోర్టినే (courtenanlatinmera) పేరున ఆ చేపకు లాటిమేరియా అని పేరుపెట్టాడు. తర్వాత 14 సంవత్సరాలకు 1952లో కొమోరో (•శీఎశీతీశీ) ద్వీపం వద్ద శిలాజంగా మారిందని భావిస్తున్న మరో చేప కొయిలకాంత్‍ సజీవంగా లభించింది. అలాగే మరో 8 సంవత్సరాలకు 1960లో ఇలాంటి వింతలే జరిగి, 16 రకాల కనుమరుగైన చేపలు సముద్రంలో నడయాడి శాస్త్రజ్ఞుల్ని ఆశ్చర్యానికి గురిచేసాయి.


ఇలా శిలాజాలుగా మారిన జీవులు తిరిగి ప్రత్యక్షం కావడం అంతుపట్టని విషయమే అయినా, శిలాజంలోని పిండం (embryo)లేదా మరేదైనా శరీర భాగం భద్రగావుంటే, వాటి నుంచి జీవులు పునరుత్పత్తి జరగవచ్చు అనే కొత్త ఆలోచనకు ఈ చేపలు దారులు వేసాయి.


సముద్రలోతుల్లో వింతలు :
పై ఆవిష్కరణలకు ముందే 1899లో, డచ్‍దేశపు ఓడ సిబోగో (sibogo) ఇండోనేసియా సముద్ర జలాల్లో సేకరించిన నమూనాల్ని, 15 సంవత్సరాల తర్వాత ఫ్రెంచ్‍ జీవశాస్త్రవేత్త మౌరైస్‍ కావ్‍లెరి (maurice caullery) 1914లో పరిశీలించగా, వాటిలో ప్రాథమికస్థాయి జీవులున్నట్లుగా గుర్తించి, అవి దారాల్లాంటి ఆకృతిని కల్గివున్నాయని, లాటిన్‍ భాషలో లినమ్‍ (linum), అనగా దారం అనే అర్థం వచ్చేలా ఓడ పేరుతో కలిపి శిబోగ్లినమ్‍ (siboglinum) అని పేరు పెట్టాడు. మరో 15 సం।। తర్వాత , 1932లో సోవియట్‍ గగరా (gagara) అనే ఓడను ఓకట్స్ (okhotsk) ప్రాంత సముద్రజలాల్లో 1500 మీటర్ల లోతుల్లో నుంచి సేకరించిన సమాచారాన్ని, యువ శాస్త్రజ్ఞుడు పావెల్‍ ఉషాకోవ్‍ (pavel ushakov) పరిశీలించి, అందులోని ఓ గొట్టంలాంటి పదార్థంలో చిరు చేపలు వున్నట్లుగా గుర్తించాడు. వీటిని పాలిచేటా (polychaeta)గా చెప్పుతూ, ఈ చేపలు శిబోగ్లినమ్‍ సోదరుల లాంటివని తేల్చాడు. అయినా సంతృప్తి చెందక, స్వీడిష్‍ జంతుశాస్త్రవేత్త జాన్సన్‍ను (johnson) సంప్రదించగా, అవి అప్పటి వరకు ఏ జంతువర్గంలో చేరని జీవులుగా ఆయన గుర్తించాడు. వాటి రూపురేఖల్ని బట్టి వాటికి పొగొనోపోర్స్ (pogonophores)గా పేరు పెట్టాడు. దీనర్థం, పొగో (జూశీస్త్రశీ) అంటే, లాటిన్‍లో గడ్డం లేదా బ్రష్‍ అని అర్థం. అనగా బ్రష్‍లాంటి ఆకారంలో వున్నాయవి.


ఇవే ఫలితాలు 1949లో పరిశోధన చేసిన విట్‍యాజ్‍ ఓడ సేకరించిన ఫలితాలకు పోలికలు ఉండడంతో ఓకట్స్ ప్రాంతంలోనే కాక, చాలా ప్రాంతాల్లో ఇలాంటి చిరు జీవులు 5-35 సెం.మీ. పొడవుతో, సెంటిమీటరు కన్నా తక్కువ వెడల్పులో వున్నట్లుగా తేల్చింది. ఇవి సమూహాలుగా 20-150 సెం.మీ. పొడువాటి గొట్టం (జిగురు పదార్థంలో తయారైన)లో ఆవాసం వుంటున్నట్లుగా నిర్దారించారు.


తల-నోరు లేని జీవులు : తర్వాత జరిగిన మరిన్ని పరిశోధనలు, ఈ జీవులపై భాగాన, వెంట్రుకల లాంటి టెంటాకిల్స్ వున్నట్లు, ఇవే నోరులా ఉదరంలా (stomach) పనిచేస్తాయని, బాహ్యంగ కాళ్ళు, రెక్కలు, వృంతాలు, శరీర అంతర్భాగంలో జీర్ణవ్యవస్థ లేకపోగా, లోపల గుండె, వెన్నుపాము, రక్తం, నాడీవ్యవస్థలు వుండడం శాస్త్రజ్ఞుల్ని ఆశ్చర్య పరిచింది.దీన్ని బట్టి ఇవి అత్యంత ప్రాథమిక స్థాయి జీవులని తేలింది.


చివరగా : ఈ విధంగా సముద్ర శోధనలు ఆలస్యంగా, తక్కువ స్థాయిలో జరిగినా, సాధించిన ఫలితాలు ఎంతో విలువైనవే! డార్వినిజానికి ఇవి మరింతగా దోహదం చేసినట్లు కూడా తేలింది.
పోతే, ఇక ముందు జరిగే పరిశోధనలు, సముద్రాల, సముద్ర జీవుల, జంతువుల, ఇతర సముద్ర వృక్ష సంపదల గూర్చి వాటి పరిరక్షణకై కొనసాగాలని ఆశిద్దాం! (వచ్చే సంచికలో సముద్ర జీవుల గూర్చి చూద్దాం!)

  • డా।। లచ్చయ్య గాండ్ల,
    ఎ : 9440116162

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *