సభ్య సమాజంలో బాలలపై హింస అప్రజాస్వామికం – దండన బోధనా పద్దతి కాదు!

Experience gained in two schools under my control has taught me that punishment does not purify, if anything, it hardens children. – M.K. Gandhi
The true character of a society is revealed in how it treats its children. –Nelson Mandela

పిల్లలపై హింస ఏ రూపంలో జరిగినా అది వారి మౌలికమైన హక్కును హరించి వేయడమే. పిల్లలు తమ కుటుంబాల నుండి, చుట్టూ ఉన్న సమాజం నుండి ప్రేమ, అనురాగాలు పొందాలి. శారీరక, మానసిక ఎదుగుదలకు షరతులులేని మద్దతు వారికివ్వాలి. అందుకోసం పిల్లలను వారికి అనుకూలమైన వాతావరణంలో పెరగనివ్వాలి. ఎటువంటి శారీరక, మానసిక, లైంగిక హింసలకు గురి చేయరాదు. దురద•ష్ట వశాత్తు మన దేశంలో పిల్లలపై హింస రోజురోజుకు పెరుగుతూనే ఉంది.


పిల్లల పై శారీరక హింస, మానసిక హింస, అవమానాలు, పిల్లలపై నిస్సందేహంగా ప్రభావం చూపుతాయి అంతే కాకుండా వారి విశ్వాసం మరియు ఆత్మగౌరవం స్థాయిలపై ప్రభావం చూపుతాయి. పిల్లల స్వేచ్ఛ మరియు వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగే అంశాలు. పిల్లల పై శారీరక హింస పిల్లల ఆరోగ్యాన్ని బలహీనపరుస్తుంది, వారి పెరుగుదల మరియు శ్రేయస్సును దెబ్బతీస్తుంది. పిల్లలను దండించడం వలన పిల్లలు చదువు మానేయడం వారి విద్యా హక్కుకు హాని కలిగిస్తుందని అనేక పరిశోధనలు చెబుతున్నాయి. శిక్ష పడుతుందనే భయం పిల్లలను చదువు పట్ల అయిష్టత భావం పెరుగుతుంది. ప్రశ్నలు అడగడానికి లేదా వారికి బోధించిన వాటిని సవాలు చేయడాన్ని నిరుత్సాహ పరుస్తుంది. విద్యపట్లనే కాదు పెద్దల పట్ల తమ చుట్టూ ఉన్న సమాజం పట్ల కూడా వ్యతిరేక ద•క్పదాన్ని పెంచుతుంది.


పిల్లలపై హింసను సమర్ధించే ఈ వాతావరణంలో తల్లిదండ్రులు కూడా పిల్లలను శిక్షించడం అనివార్యమని నమ్ముతారు మరియు పిల్లలను క్రమశిక్షణలో ఉంచడానికి తరచుగా ఇళ్ళల్లో కూడా ఇలాంటి పద్ధతులను ఉపయోగిస్తారు. కొంత మంది పెద్దలు పిల్లలను హింసకు గురి చేయడం మంచి పద్దతి కాదని నమ్మినా పిల్లలపై హింసను ప్రశ్నించకుండానే మిగిలిపోతారు.


పాఠశాలలలో హోంవర్క్ సరిగా చేయలేదని, క్లాస్‍లో సవ్యంగా ఉండడం లేదని స్కూలుకు ఆలస్యంగా వచ్చారని, బోధన చేస్తున్నప్పుడు క్లాస్‍లో అల్లరి చేశారని, నిద్ర పోతున్నారని, తోటి పిల్లలను అల్లరి పెడుతున్నారని ఇంగ్లీషులో మాట్లాడలేదని, అనుమతి లేకుండా తరగతి బయట తిరుగుతున్నారని ఇలా పలు కారణాలతో పిల్లలను దండించడం గురుంచి ప్రసార మాధ్యమాల ద్వారా తరచుగా చూస్తూనే ఉన్నాము.


పిల్లలను దండించడం లేదా అవమానించడం తప్పు అని శిక్షణ పొందిన ప్రతి ఉపాధ్యాయులకు తెలుసు. విద్యా నిపుణులుగా పిల్లలలో భయం నేర్చుకునే పక్రియను అణిచివేస్తుందని వారికి పూర్తిగా తెలుసు. ప్రతి బిడ్డ ప్రత్యేకమైనదని మరియు నేర్చుకునే విధానంలో పొందడంలో తనదైన వేగం మరియు శైలిని కలిగి ఉంటారని కూడా తెలుసు. ఉపాధ్యాయుల శిక్షణలో స•జనాత్మక పద్ధతిలో పిల్లలతో నిమగ్నమయ్యే నైపుణ్యాలను శిక్షణ పొందిన ఉపాధ్యాయులందరు నేర్చుకున్నారు. అయినప్పటికీ, పిల్లలపై హింసకు ఎందుకు పాల్పడుతున్నారు అనేది ఒక పెద్ద ప్రశ్న. ఎందుకంటే విద్యా వ్యవస్థలో ఉన్నఅత్యధిక శాతం సిబ్బంది దండన పిల్లల బాగు కోసమే అని గట్టిగా నమ్ముతారు కాబట్టి ఉపాధ్యాయులు ఒక విషయం గమనించాలి పిల్లల హక్కులతోనే ఉపాధ్యాయులకు పాఠాలు బోధించే హక్కును కలిగి ఉంటారని పిల్లలు తమతో సమానం అని పిల్లలహక్కుల కోసం ఉపాధ్యాయుల లోకం నిలబడితే వాస్తవంగా ఉపాధ్యాయుల హక్కులను కూడా సాధించవచ్చనే విషయాన్ని గమనించాలి. బడి బయట సమాజంలో, పిల్లల ఇళ్ళలో పిల్లల మీద హింస జరిగితే పిల్లలు ఉపాధ్యాయులకు చెప్పుకునే వాతావరణం ఉండాలి.


ఉపాధ్యాయులు పిల్లల పక్షం వహించాలి. పిల్లల హక్కుల రక్షణ కోసం నిలబడాలి. అప్పుడే అది పిల్లలకు ఆత్మ విశ్వాసం ఇచ్చే సంస్థ గా గుర్తించబడుతుంది. ఆ పాఠశాల మాత్రమే పిల్లల పక్షం వహించినట్లు అని అర్ధం.


కొన్ని బడులు కొంత మంది ఉపాధ్యాయులు దండన బోధనా పద్దతి కాదని గట్టిగా నమ్మి తరగతి గదులను పిల్లల కోసం ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించి పిల్లల పక్షం వహించడం మనం గమనిస్తూనే ఉన్నాము. ఈ పక్రియను ప్రతి పాఠశాల తమ ఉపాధ్యాయులకు పదేపదే గుర్తు చేసిన నాడే మన తరగతి గదులు ప్రజాస్వామీకరణ వైపు అడుగులు వేసినట్లు.


పిల్లల హక్కుల రక్షణ కు ఐక్య రాజ్య సమితి బాలల హక్కుల వడంబడిక మరియు మన దేశంలో ఉన్న అనేక చట్టాలు పిల్లల హక్కులకు రక్షణగా నిలబడుతాయి.


అంతర్జాతీయ బాలల హక్కుల ఒడంబడికపై అత్యధిక దేశాలు సంతకాలు చేశాయి. మన దేశం 1992లో ఈ ఒడంబడిక మీద సంతకం చేసి పిల్లల రక్షణలో ప్రపంచ దేశాల సరసన మన దేశం కూడా చేరింది. ఈ ఒడంబడిక నిర్వచనం ప్రకారం పిల్లలు బడులకు వచ్చినప్పుడు పాఠశాలలు పిల్లలను గౌరవించేవిగా ఉండాలి తప్ప పిల్లల హక్కులను హరించివేసిదిగా అవమానపరిచేవిగా ఉండడానికి వీలు లేదు. పిల్లలను గౌరవించే రీతిలో విద్యనందించాలి. క్రమ శిక్షణ పేరుతో బాలల పట్ల ఎటువంటి రకమైన హింసను సమర్ధించే ఎటువంటి వాదనలు కూడా ప్రభుత్వాలు చేయరాదని ఒక సూచనలో తెలియ చేసింది.


భారత రాజ్యాంగంలో కూడా పిల్లల రక్షణ, సంరక్షణ, వారి ఎదుగుదలకు తోడ్పడడంవంటి పలు అంశాలను పొందుపరిచారు. ముఖ్యంగా 14, 15, 15(3), 19(1)a, 21, 21(1)a, 23, 24, 39(వ), 39(f) మొదలగు అధికరణల ద్వారా పిల్లలను హింస నుండి కాపాడాలని మన రాజ్యాంగం ప్రభుత్వాలను ఆదేశిస్తున్నది. వీటి ఆధారంగానే పలు జాతీయ విధానాలను పిల్లల కోసం రూపొందించారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన చట్టం, బాలల న్యాయ, రక్షణ, విద్యా హక్కు, POCSO మొదలైన చట్టాలు ఈ విధానాల నుండి వచ్చినవే. విద్యా హక్కు చట్టం బాలలపై హింసను పూర్తిగా నిషేదించింది
కానీ ఎన్ని చట్టాలు, విధానాలు, రాజ్యాంగ మార్గదర్శకాలు చేసినా పిల్లలపై హింస మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. ప్లాన్‍ ఇంటర్నేషనల్‍ అనే స్వచ్ఛంద సంస్థ నివేదిక ప్రకారం మన దేశంలో దాదాపు 69 శాతం బాలలు శారీరక హింసకు గురి అవుతున్నారు. చాలా మంది పిల్లలు తమపై జరుగుతున్న హింసను ఎవరితోనూ చెప్పుకోరు. మానసిక హింసనయితే భరిస్తూ పెద్దల మీద, ఈ సమాజం మీద వారు ఏహ్యభావాన్ని పెంచుకుంటున్నారు. పిల్లలపై హింస జరిగినప్పుడల్లా దీనిని సమర్థించే వాదనలే ఎక్కువగా వినబడుతుంటాయి. పిల్లల బాగు కోసమే వారి భవిష్యత్తు కోసమే దండిస్తున్నామని, వారిని హింసించడాన్ని తప్పు పట్టవలసిన అవసరం లేదని అది మన సంస్క•తిలో భాగమనే వాదనలు చేసే వారూ ఉన్నారు. మరో అడుగు ముందు కేసి మా చిన్నతనంలో మమ్మల్ని దండీచడం వల్లనే ఇంత ఎదిగినామని సూత్రీకరణలు కూడా వింటుంటాం. శారీరక దండన ను వ్యతిరేకిస్తూ క్రమ శిక్షణ కోసం కళ్లు ఎర్రగా చేసి బెదిరించడం, అలిగి వారి మీద ఒత్తిడి పెంచడం, లేదా పోలీసు పేరు చెప్పో, టీచర్లకు చెప్తామనో భయపెట్టడం లాంటివి చేయవచ్చని సమర్థించేవారూ ఉన్నారు. ఈ వాదనల సారాంశం ఒక్కటే పిల్లలను దండించవచ్చు, భయపెట్టవచ్చు అనే నిర్ధారణకు రావడమే. ఒక్కటి మాత్రం నిజం పిల్లలు ఎవరు కూడా అవమానపడడానికి దెబ్బలు తినడానికి ఇష్టపడరు. పెద్దల ప్రపంచం తమ మనోభావాలను అర్థం చేసుకోదని పైగా వాళ్ళు దండించిన వారినే సమర్ధిస్తారని పలు సంఘటల ద్వారా వారికి తెలిసి పోతుంది. పిల్లల పై హింస కు వ్యతిరేకిస్తూ సమాజం లో పెద్ద ఎత్తున చర్చ జరగాలి. పౌర సమాజం ఈ విషయం లో చొరవ చూపాలి.


చివరగా రాజ్యాంగం ప్రసాదించిన అన్ని హక్కులను ప్రభుత్వాలు అమలు చేసి బాలలపై అన్ని రకాల హింసను రూపుమాపాలి. బాలల హక్కుల రక్షణ కోసం పనిచేస్తున్న విద్యా శాఖ, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ, చైల్డ్ లైన్‍ అత్యవసర సేవల హెల్ప్ లైనే 1098, జిల్లా బాలల సంక్షేమ కమిటీలు, జిల్లా బాలల పరిరక్షణ సంస్థలు, పోలీస్‍ శాఖలు జిల్లా మండల స్థాయిలో సమన్వయం తో పనిచేసి బాలల పై హింస లేని పాఠశాలలుగా గ్రామలుగా తీర్చిదిద్దాలి. ఇందుకోసం ప్రభుత్వ యంత్రాంగం తమ సాంస్క•తిక శాఖ ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం చేయాలి. దండన లేని పిల్లల పక్షం వహిస్తున్న పాఠశాలల గురుంచి ఆయా పాఠశాలలు అవలంబిస్తున్న పద్దతుల గురుంచి విస్త•తమైన ప్రచారం జరగాలి. ప్రతి పాఠశాలలో నెలకు ఒక సారి అయినా పిల్లల సమావేశాలు నిర్వహించాలి. బడిలో క్రమశిక్షణ పేరుతో అవలంబిస్తున్న పద్దతుల పై చర్చ జరగాలి. దండన కారణంగా ఆ నెలలో బడి మానేసిన విద్యార్థులను బడికి తిరిగి రప్పించాలి. ప్రతి పాఠశాలలో ఉన్న ఫిర్యాదుల బాక్స్ను విద్యార్థులు ఉపయోగించే విధంగా చూడాలి. బాలల హక్కుల గురుంచి చట్టాలను ప్రభుత్వ యంత్రంగానికి మరి ముఖ్యంగా పాఠశాలలోని బోధన మరియు బోధనేతర సిబ్బందికి శిక్షణలను ఏర్పాటు చేయాలి. విద్యార్థులు తమ అభిప్రాయాలను స్వేచ్చగా తెలియచేసే వాతావరణాన్ని కల్పించాలి.


పిల్లలు కూడా పౌరులని, వారికి చట్టాలు వర్తిస్తాయని, వారిని గౌరవించే నూతన సంప్రదాయాన్ని నెలకొల్పాలి. ఈ విషయాన్ని పెద్దలందరూ అర్థం చేసుకోవాలని కోట్లాది మంది బాలలు మౌనంగా ఎదురు చూస్తున్నారు. బాలల మనో భావాలను అర్థం చేసుకొవాడానికి పిల్లలను సమానంగా చూసుకోవడానికి పిల్లలతో సహ•ద్భావంతో మెలగడానికి తగిన నైపుణ్యతలను పెంచుకోవాలి. పెద్దలంతా పెద్ద మనసుతో పిల్లల పక్షం వహించాలని కోరుకుందాం.


-ఆర్‍.వెంకట్‍ రెడ్డి
జాతీయ కన్వీనర్‍, ఎం.వి.ఫౌండేషన్‍
ఎ: 9949865516

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *