పర్యావరణ విషాదాలు – సాహిత్య సంవేదనలు

పర్యావరణ ఉద్యమ చైతన్యం కలిగించిన వారిలో భారతదేశం సర్వోన్నతంగా స్మరించదగినవారు సుందర్‍లాల్‍ బహుగుణ. ఆయన ఒక సందర్భంలో ప్రకృతి, పర్యావరణ సమస్యలు, సంక్షోభాల విషయంగా కవులు, రచయితలు, పాత్రికేయులు, న్యాయవాదులు స్పందించవలసిన అవసరం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. పర్యావరణ వాదులు, కార్యకర్తలు, పర్యావరణ శాస్త్రవేత్తలు వారు చేయవలసింది వారు ఎలాగూ చేస్తారు కానీ, తక్కిన వారు ప్రజా బాహుళ్యానికి పర్యావరణ విషయంగా సరైన అవగాహన కల్పించడానికి, సదిశలో జనబాహుళ్యం నడవటానికి కవులు, రచయితలు కృషి చేయాలని ఆశించారు బహుగుణ. గత నాలుగైదు దశాబ్దాలుగా భారతీయ పర్యావరణ ఉద్యమాలు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. మేధా పాట్కర్‍, నందనాశివ లాంటి వారు అంతర్జాతీయంగా కూడా పేరు గడించారు. అసలు భారతీయ సాహిత్యమే పర్యావరణ హితాన్ని కాంక్షిస్తూ రాయబడిందని ఎంతగా అనుకున్నప్పటికీ ప్రాచీన సాహిత్యాన్ని మినహాయిస్తే, వివిధ సామాజిక, రాజకీయ ఉద్యమాలు నడిచినందువల్ల ఉద్యమాల గురించి వచ్చినంతగా పర్యావరణ అంశం గురించి వచ్చిన సాహిత్యం ఈ నాటికీ చెప్పుకోదగ్గ స్థాయిలో లేదనే అనుకోవాలి. దీనికి కారణం పర్యావరణం అనే అంశం తమకు సంబంధిచినది కాదని కవులు, రచయితలు భావించటం కావచ్చు. వారికి ఈ విషయమ్మీద ఉండవలసినంతగా అవగాహన లేకపోవటమూ కావచ్చు.
తెలుగు సాహిత్యంలో గత మూడు దశాబ్దాలుగా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పర్యావరణం అనేది అడపాదడపా ఆయా రచనల్లో ప్రాధాన్యం పొందుతూవస్తున్నది. కొద్దిమంది కవులు, రచయితలు పర్యావరణ సమస్యలను ఇతివృత్తాలుగా స్వీకరించి రచనలు వెలువరిస్తున్నారు. ప్రాణ్‍రావు లాంటి వారు పర్యావరణానికీ పరిమితమై రచనలు చేస్తే, ఇటీవలనే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన తల్లావజ్జల పతంజలి శాస్త్రిలాంటి వారు అటు క్షేత్రస్థాయిలోనూ ఇటు సాహిత్యక్షేత్రంలోనూ పనిచేస్తున్నారు. చంద్రలత, పాపినేని శివశంకర్‍ కథలు నవలలు రాస్తున్నారు. ఆ మాటకొస్తే తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రజావాగ్గేయకారులు సృష్టించిన సాహిత్యమంతా ముప్పాతిక మున్వీసం పర్యావరణానికే సంబంధించినది. పెద్దింటి అశోక్‍కుమార్‍ లాంటి రచయితలు ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా పర్యావరణం గురించి ప్రస్తావిస్తున్నారు.


అయితే చాలా చిత్రంగా పోస్ట్మోడరన్‍ రచయితగా ప్రయోగవాదిగా, శిల్ప విలక్షణ కథకుడిగా ప్రఖ్యాతి వహించిన డా. వి. చంద్రశేఖరరావు ‘ఆకుపచ్చని దేశం’ పేరిట నవల రాశారు. వారు రాసిన కొన్ని కథలు వాతావరణ చిత్రణలో పర్యావరణ స్ప•హను పెంచేవి. ఒక రెండు కథలు వారు రాసినవి పర్యావరణ సంక్షోభం గురించి మనలను ఎంతగానో ఎడ్యుకేట్‍ చేస్తాయి. ఆ రెండు కథలే ఒకటి ‘చలికాలం, ఒక మేఘం, అంతే కథ’, మరొకటి ‘ఋతుసంహారం’.


హైదరాబాద్‍ నగరానికి ఓ మిత్రుడు అప్పగించిన పనిమీద వస్తాడు అతను. హైదరాబాద్‍లో దిగగానే అతడొక దృశ్యం చూస్తాడు. అదేమంటే ‘‘నల్లని పెనుమబ్బు సినిమాల్లో చూపే స్పెషల్‍ ఎఫెక్ట్ దృశ్యంలా నగరాన్ని కప్పి వెయ్యటం చూసి నేను నివ్వెరపోయాను… హైదరాబాద్‍లో నేను గడిపిన ఇరవైనాలుగు గంటలూ ఈ నల్ల మబ్బు గురించిన పరిశోధనగానే మిగిలిపోయింది’’ వచ్చిన పని వదిలి పెట్టి ఈ నల్ల మబ్బు గురించే ఆలోచిస్తాడు ‘‘విశాలమైన మచ్చలా, అంతనల్లగా, అంతగాఢంగా మేఘం ఉండటం నేను విస్తుపొయ్యాను. తుఫానో, భీకరమైన వర్షమో, పెను విపత్తో వాటిన్నిటికీ సూచికలా ఉందా మబ్బు. అయితే మిగిలిన జనం ఎవరూ ఈ మేఘాన్ని పట్టించుకొన్నట్లు లేరు’’ మిగిలిన వారు పట్టించుకోవటం లేదు కాని ఇతను పట్టించుకుంటాడు. బస్సులో ప్రయాణించాడు మబ్బువల్ల చీకటైపోతుంది బస్సు. కండక్టర్‍ను లైట్‍ వేయమని అడుగుతాడు ఆమె పట్టించుకోదు. ఎవరినో అడిగితే కంగారుపడి, అందులో పరేషాన్‍ కావడానికి ఏమీలేదని ఈ కాలంలో మబ్బులు అట్లాగే ఉంటాయని సమాధానమిస్తాడు. అదేమిటో తెలుసుకుందామని అతడు వాతావరణ పరిశోధనా సంస్థకు వెళతాడు. ఆ సంస్థ డైరక్టర్‍ ఇతని వైపు చూసి ‘‘వాటీజ్‍ గ్రేట్‍ వండర్‍ ఇన్‍ ఇట్‍! మబ్బులు లేకపోతే, ఎండలు ఎక్కువయితే కంగారు పడాలిగానీ..’’ అన్నాడు. మబ్బుల గురించి వివరాల కోసం ఒక అధికారిక వెబ్‍సైట్‍ ఏర్పాటు చేశాము. దానిని చూడండి అని సలహా ఇచ్చాడు. అయినా అతడు తన వెతుకులాటను ఆపడు. లోకేష్‍ అనే పత్రికా సంపాదకుడి అంతిమ యాత్రలో పాల్గొంటూ కూడా అతడు నల్ల మబ్బు గురించే ఆలోచిస్తూ ఉంటాడు. అతను యిలా అనుకుంటాడు. ‘‘దుఃఖంలా, విపత్తులా ఉన్నఈ పెను మేఘం గంటగంటకీ నల్లగా చిక్కనవుతూ – నిజానికి లోకేష్‍ మరణానికి, ఈ నల్ల మబ్బుకి ఏదో సంబంధం ఉండి ఉంటుందనిపించింది’’ శవయాత్ర ఊరేగింపులో కూడా ఓ వ్యక్తిని అడుగుతాడు నల్లమబ్బుకి, లోకేష్‍ మరణానికి ఏమైనా సంబంధం ఉందా అని అతడు విసుక్కుంటాడు. అట్లా సంబంధం వెతకటం మూఢనమ్మకం అని చెపుతాడు. ఒక సాంస్క•తిక మేళా దగ్గర ఆగుతాడు. అక్కడ కూడా ‘‘దట్టమైన గుబురు అడవిలా పైన అల్లుకొని ఉంది మేఘం. నల్లగా కమిలిన ఆకులు వరుసగా పేర్చినట్లుగా ఉందా మేఘం’’ ఇటా ఆ మేఘం విషయమే అతడిని వెంటాడుతూ ఉంటుంది. కథ ఇతర విషయాలు ఎన్ని చెప్పినప్పటికి ఈ మేఘం కథ ఒక కాలుష్యాన్ని సూచిస్తున్నది. ఆ కాలుష్యం పట్ల మనుషులు పట్టని తనాన్ని పట్టింపులేని తనాన్ని సూచిస్తుంది. తమకు ఏ విపత్తు ఆపద ఏ రూపంలో సంభవించినా పట్టించుకోని తనం గురించి చెబుతుంది కథ.


ఒక నల్లమబ్బు విషాద కథ అది అయితే… వాతావరణంలో వచ్చే మార్పులు మనుషులపై ఎటువంటి ప్రభావం ఉంటుందో ‘ఋతుసంహారం’ అనే కథ తెలియజెపుతుంది. కథలో కోమలికి ‘ఊపిరాడని తనం’ అనే ఇబ్బంది వస్తుంది. ఇది నగరంలో జరిగే హింస యాక్సిడెంట్లు, మరణాల నుంచి వచ్చింది కాదు. ఒక ఆదివారం టీవీలో ఒక ప్రత్యేకమైన వార్త ప్రసారమవుతుంది. అదేమిటంటే…. ‘‘ఆకాశంలో వింత, ఎర్రగా నారింజ పండు రంగులో మెరుస్తున్న ఒక వస్తువు గురించి, ఆ రంగు ప్రత్యేకంగా మునుపెన్నడూ చూడనట్లుగా, దాని చుట్టూ వెలుగులు విరజిమ్ము తున్నట్లు….’గా కనిపిస్తుంది. దాని గురించి పలు రకాలుగా చెప్పుకుంటూ ఉంటారు. కొందరు వెలుగుల ఫౌంటిన్‍ అంటారు. కొందరు ఎగిరే పళ్ళాలు అని భావిస్తారు. మరికొందరు వేరే గ్రహం నుంచి వచ్చిన జీవులు అనుకుంటారు. కొంతమంది మాత్రం విధ్వంసక గ్రహశకలాలో కాలిపోయి భూమిపై వేలాడుతూ ఉన్నాయని భావిస్తారు. నగరానికి కొత్త ఆపద వచ్చిందని తీర్మానించారు. కానీ, ఆ ఆపద ఎందువల్ల ఏర్పడింది, ఆ ఆపద తెచ్చి పెట్టిన కొత్త సమస్యలు ఏమిటనేది ఎవరూ ఆలోచించరు. కేవలం బాధితులుగానే మిగులుతూ ఉంటారు. ఈ ఊపిరాడని తనం, చనిపోతానేమోననే భయం ఒక్క కోమిలికే కాదు ‘‘ఇట్లాంటి మానసికమైన ఇబ్బందులు కోమలికి మాత్రమే కాక సిటీ అంతటా కొన్ని వేలమందికి వచ్చాయని వార్త. ముఖ్యంగా స్త్రీలలో ఇట్లాంటి మూప్‍ వేరియేషన్స్ వస్తున్నాయని వైద్యులు తీర్మానించారు. సిటీ అంతటా ప్రీ-సైలాజికల్‍ క్లినిక్‍లు ఏర్పాటు చేశారు’’ ఇది కోమలి ఒక్కదాని సమస్యే కాకపోవటం గమనించదగింది. కోమలికి ప్రతిరోజూ నిద్రపోయేముదు ‘ట్రాంక్విలైజర్‍’ వేయాల్సిన పరిస్థితి తలెత్తింది. కోమలికి వచ్చిన సమస్య ఏమిటి? కోమలి ముభావంగా ఉంటుంది. అన్నిటి మీద ఆసక్తి కోల్పోయింది. ఆకాశంలో కనిపించే వెలుగు గురించే చెబుతుంది. అసలు ఆ కుటుంబ మొత్తానికే నిద్ర పట్టక పోవటం అనేది సమస్యగా మారింది. ఆ కుటుంబం ఇటువంటి నిద్రలేమి సమస్యతో బాధపడుతూ ఉండటం వల్ల ఇంటికి• స్నేహితులను పిలవటం మానేశారు.

అందరూ అలసటగా ఉంటున్నారు. వంటావార్పూ ఆపేశారు. ఏదో తినటానికన్నట్లు బయట నుంచి ఆర్డరు ఇచ్చి తెప్పించుకుంటున్నారు. కోమలికి ఇటువంటి లక్షణాలు బయట పడ్డాక మరో మూడు నెలలు గడిచిన అనంతరం ఈ కథను నెరేట్‍చేస్తున్న పాత్ర అంటుంది. ‘‘ నా కొలీగ్స్ ప్రవర్తనలోనూ మార్పులు గమనించాను. వాళ్ళు చాలా రెస్ట్లెస్‍గా ఉంటున్నారు. అలజడిగా, కోపంగా, చిన్న విషయానికే బరెస్ట్ అవుతున్నారు. ఈ మూడు నెలల్లో వెయ్యికి పైగా ఆత్మహత్యలు నమోదు అయ్యాయి. సిటీలో స్ట్రైక్‍లు, బందులు, మనుషులు, సమూహాలుగా చీలిపోయి కొట్లాట, దొమ్మీలు జీవితం భరించలేనంత చేదుగా ఉంది’’ అని భావిస్తాడు. ఇదిలా ఉంటే ఆ ఇంట్లోనే కోమలి కొడుక్కి జ్వరం వస్తుంది. జ్వరం ఎంతకీ తగ్గదు. నూటమూడు డిగ్రీల జ్వరం పదహారు రోజుల పాటు తగ్గకుండా వస్తుంది. ఆ పిల్లవాడు పరీక్షలు రాయాల్సి వుంది. ఒక్క డిగ్రీ జ్వరం జారినా సరే వెళ్లి పరీక్ష రాసేందుకు ప్రయత్నిస్తూ, శక్తిని కూడగట్టుకునే బలాన్ని తెచ్చుకుంటూ ఉంటాడు. జయంతుడు అనే పిల్లవాడు రాసిన పరీక్షలో అడిగిన ప్రశ్న ‘గ్లోబల్‍ వార్మింగ్‍’ అయితే ఆ కుటుంబం ఆ నగరం ఎదుర్కొంటున్న సమస్యలు అంతటితో సమసి పోలేదు మరి కొన్నాళ్ల తరువాత నగరంలో కుండపోతగా వర్షం, వరదలు ఫలితంగా ఏర్పడే ట్రాఫిక్‍జామ్‍లు తీరా ఇంటికి చేరితే అపార్ట్మెంట్‍లు వరద నీటిలో నిండిపోయి కనిపిస్తాయి. ఆ నాటి వరదల్లోనే నిద్రించాల్సి వస్తుంది వారికి. ఆ వానల గురించిన వార్త ఏమంటే ‘వరద నీటివల్లనో, అడవులు నరికివేయటం వల్లనో అడవుల్లోని చిరుతలు, కొండ చిలువలు, చెరువుల్లోని మొసళ్లు నగరంలోకి ప్రవేశిస్తున్నాయని’ ఈ కథలో గ్లోబల్‍ వార్మింగ్‍ కారణంగా ఏర్పడ్డ, ఎదుర్కొన్న ప్రతి ఇబ్బందినీ రచయిత ప్రస్తావించాడు. కోమలి, ఆమెతో పాటు నగరంలో అందరూ ఎదుర్కొన్న ప్రవర్తనలో మార్పుకు కారణం ‘డిప్రెషన్‍’, డిప్రెషన్‍కి కారణం గ్లోబల్‍ వార్మింగ్‍ కనిపించకుండా మానవ జీవితంపై వాతావరణం చూపే ప్రభావాలను రచయిత ప్రతిభావంతంగా ప్రస్తావించాడు. వ్యక్తిగత సమస్యలు, మానసిక సమతుల్యత దెబ్బతినటం, అందువల్ల సామాజిక సంబంధాలు, మానవ సంబంధాలు దెబ్బతినటం’’ ఒక దానితో ఒకటిగా మూడివడి
ఉన్నాయనేది మన ఎరుకలో ఉంచడానికి రచయిత సల్పిన కృషి గుర్తించదగింది.


-ఎస్‍. స్పందన
ఎ : 9849057076

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *