అంధేరిరాత్ కే సితార్

అట్ల ఆనాడు అంటే బచ్‍ 1989 డిసెంబరు 15 రాత్రి మేమందరం ‘బాల్‍బాల్‍ మే బచ్‍ గయే’ అర్థాత్‍! వెంట్రుక వాసిలో ప్రాణాలను గుప్పిట్ల పెట్టుకుని తప్పించుకున్నాం. ఇక ఆ దెబ్బతో మేం చార్‍ సౌ సాల్‍ పురానా షహర్‍ నుండి బేదఖల్‍ఐ స్వంత ఇల్లు వదులుకుని హైద్రాబాద్‍ న్యూ సిటీకి కాందిశీకుల్లా వలస వచ్చాం. అచ్చంగా 1947 దేశ విభజన సమయంలో జరిగిన మానవ వలసల ప్రవాహాలలాగే!


× × ×


‘‘ఖుష్‍ రహో అహెలె చమన్‍
హమ్‍తో చమన్‍ చోడ్‍చలే…’’
(మై చుప్‍ రహుఁగీ సీన్మా పాట)


ఇంతకూ అసలేం జరిగిందంటే….
ఆరోజు రాత్రి 7.30 సమయం నేను రేడియోలో వివిధ భారతిల ఫౌజీభాయి యోంకా ఫర్మాయిషీ గానే వింటున్న. నా శ్రీమతి గ్యాసు నూనె బత్తీల స్టౌ మీద అన్నం వండేసి ఏదో వేపుడు కూర వేయిస్తుంది. పుదీనా పచ్చడి గుభాళింపు గదంతా వ్యాపించి నాకు ఆకలి విజృంభించింది. అప్పటికే పాతనగర మంతా రెండు రోజుల నుండి కర్ఫ్యూ. ప్రజలంతా కలుగుల్లోని ఎలుకల్లా ఇళ్లల్లోనే బంధీలై పోయారు. ప్రతి ఇల్లు స్వచ్ఛంద జైలుగా మారిపోయింది. స్కూళ్లు, ఆఫీసులు అన్నీ బందు. రేడియోలో హిందీ పాటలు వింటున్న నాకు అవతల మా గల్లీలో ఎవరివో కేకలు వినబడుతున్నట్లు అనుమానం వచ్చింది. అంతలనే శోభ కూడా ‘‘ఒకసారి ఆ రేడియో కొంచెం బందు చెయ్యి’’ అని గాభరగాభరగ అడిగింది. టక్కున రేడియో బందుచేసిన.
మా గల్లీ ముందు భాగంల నుండి గుంపుల ఒర్లుడు వినబడుతుంది. ‘‘నారా ఏ తక్‍బీర్‍- అల్లా హో అక్బర్‍’’ నినాదాలు. దాని వెం•టే ఇండ్ల మీదికి తలుపుల మీదికి కిటికీల మీదికి రాళ్లు విసురుతున్న చప్పుడు శురువయ్యింది. దాంతో ఏక్‍ దమ్మున సంగతేందో ఖుల్లంఖుల్లగ సమజయిపోయింది. నా పెద్ద తమ్ముడు, చిన్న తమ్ముడు ఉరుక్కుంటు పోయి మా పెద్ద దర్వాజాను ధన్‍మని చప్పుడయ్యేటట్లు గట్టిగ మూసి కిందా మీదా నడుమా గొళ్లాలు బిగించి పెట్టేసిండ్రు.
‘అల్లాహో అక్బర్‍…. మారొ మారొ.. పీటో పీటో…
చప్పుళ్లు మాకు దగ్గరవుతున్నయి. అంటే గుంపులు మా గల్లీలకు గుసాయించి వస్తున్నరన్న మాట. ఇంతలనే మా గల్లీ అటుపక్క
ఉండే రూప్‍లాల్‍ బజార్‍ బస్తీల నుండి ‘‘హర్‍ హర్‍ మహదేవ్‍, జై భవానీ వీర్‍ శివాజీ’’ అన్న మరాఠోళ్ల నినాదాలు మొదలైనాయి. ఆడోళ్ల మొగోళ్ల పిల్లల ఏడుపులు, మొత్తుకోవటం మా చెవులకు స్పష్టంగా వినబడుతున్నయి.
మేం ముగ్గురం అన్నదమ్ములం, మా అమ్మ నా ఆరేండ్ల బిడ్డా అందరం కాల్జేతులు గజగజవొణుకుతుంటే ‘‘ఇక అయిపోయిందిర మన పని’’ అని చావుకోసం క్షణాలు లెక్కపెట్టుకుంటున్నం. మా గల్లీ ముందు సంకుల సమరం జరుగుతుంది. లాఠీలు, కట్టెలు పఠెల్‍ పఠేల్‍మని నెత్తులమీద పడి పగులుతున్న చప్పుళ్లు… రాళ్ల వర్షం. అరే అల్లా మర్‍గయా అమ్మో అమ్మో అన్న అరుపులు గడ్‍బడ్‍ గడ్‍బ్‍గ మా చెవులు చిలులు పడేటట్లు వినబడుతున్నయి. ఇంతల కూర మాడి పోతున్న వాసన వచ్చి నా భార్య వంటింట్లకు ఉరికి బత్తీల పోయ్యి మీద నీళ్లు చిలకరించి మంట ఆర్పేసింది. కూర మాడి మసిబొగ్గు లయ్యింది.
‘‘వచ్చిన తుర్కొళ్లు మన బస్తీవాండ్లు కాదనుకుంట ఖాజీపురా నుండి వచ్చినట్లుంది’’ అని మా చిన్న తమ్ముడు గుసగుసగ మాట్లాడిండు. ఎందుకైనా మంచిదని మా అమ్మ మా ఇంట్ల – రూములల్ల లైట్లన్నీ ఆర్పేసింది. ఎక్కడెక్కడొ తలుపురెక్కలు విరుగుతున్న చప్పుళ్లు మరెక్కడొ నొప్పులతో బాధలతో ఎవరెవరో మూల్గుతున్న శబ్దాలు, ఏడ్పులార్పులు, అన్ని గందరగోళంగా మాకు వినబడుతున్నాయి. ఇంతలో మా ఇంటి వెనుకవైపు ఉండే శక్కర్‍గంజ్‍, పార్థీవాడల నుండి కొత్తగ ఏడ్పులు శురువైనాయి. అక్కడ ఇండ్లు తగులబడ్తున్నట్లు అటువైపుండే చీకటి ఆకాశంల వెలుగులు కనబడుతున్నాయి. ప్రాణాల రక్షణకోసం మనుషులు చివరి క్షణాలలో చేసే ఆర్తనాదాలు మా గుండెలను గుబగుబలాడిస్తున్నాయి.
నేను, పెద్ద తమ్ముడు నెమ్మదిగ గోడల మీదికెక్కి ఇంటిపై కప్పు మీదికి చేరుకుని శక్కర్‍గంజ్‍ పార్థీవాడ వైపు చూసినం. ఏముంది? ఇండ్లన్నీ తగులబడ్తున్నయి! క్రిందికి దిగొచ్చి ఆ సంగతి గుసగుసగ అందరికీ చెప్పేసినం.
‘‘అమ్మో రజాకార్ల కాలం మళ్లీ వొచ్చినట్లుంది. అప్పుడు కూడా ఇట్లనే అయ్యింది’’. అనుకుంట అమ్మ మా ఇలవేల్పు చిల్పూరు గుట్ట బుగులు వేంకటేశ్వరస్వామికి చేతులెత్తి మొక్కి తన ఆకులు పోకల సంచి నుండి ఒక రూపాయి బిళ్లను ఇవతలికి తీసి దానిని కండ్ల కద్దుకుని తన కొంగు కొసన గట్టిగ ముడేసి ముడుపు కట్టింది. తనకు ఏం గండం వచ్చినా అట్లా మొక్కు, ముడుపు కట్టటం ఆమెకు అలవాటే.
కర్ఫ్యూ ఉండంగనే చీకటి పడంగనే అట్ల ఆ గడబడలు శురువైనయి. ఇంతల సైరన్‍లు బజాయించుకుంట పోలీసు వ్యాన్‍లు మా బస్తీల చక్కర్లు కొట్టినయి. ఒక అర్ధ గంటయినంక అంతటా సున్‍సాన్‍ శ్మశాన నిశ్శబ్దం తాండవమాడింది. మళ్లీ ఆ రాత్రి ఎప్పుడు యాడంగ ఎవరొస్తరో ఏం చేస్తరో చెప్పలేం. కావున మేమందరం మా పక్కింటి కరణపు బ్రాహ్మల ఇంట్లె నుండి అటుపక్కనుండే దేవీదాస్‍ బాసూత్కర్‍ మరాఠోళ్ల బాడాలోకి వెళ్లినం. ఆ ఇల్లు గట్టి బందోబస్తుతో చిన్న సైజు గడీలాగ ఉం•ది. అప్పటికే ఆ బాడాల మా గల్లీవాళ్లందరూ జమయ్యిండ్రు. గొల్లోళ్ల భారతమ్మ, వొడ్లొల్ల సుశీలమ్మ పిల్లాజెల్లా ముసలి ముతకా అందరూ నానాజాతి సమితి సభ్యుల్లా అక్కడ గుమికూడిండ్రు. ఆ ఇంటామే గుండేబాయి, ఆమె సవతి రాధాబాయి, ఆమె కొడుకు దేవీదాస్‍ భాసూత్కర్‍ ‘‘ఏం ఫికర్‍ లేదు’’ ఈ రాత్రి ఇక్కడే ఉండండ్రి అని అందరికీ భరోసా ఇచ్చిండ్రు. దేవీదాస్‍ తాత కుతుబ్‍షాహీల కాలంల మరాఠాదేశం నుండి హైద్రాబాద్‍కు వలస వచ్చి ఈ బస్తీల సెటిల్‍ అయ్యిండు. బాగా దండోళ్లు. దేవీదాస్‍ తండ్రి బేగంబజార్‍ – ఫీల్‍ఖానాలో (గజశాల) గజరాజుల నిర్వహణపై అదికారిగా పనిచేసేవాడు. దేవీదాస్‍కు తుర్కొళ్లంటే వళ్లంతా మంట. పతంగుల పండగప్పుడు హిందూ ముస్లిం యువకుల కొట్లాటలల్ల ఆయన తల పగుల గొట్టిండ్రంట. అట్ల అది పురానీ దుశ్మనీ.


ఆ రాత్రంత తిండి తిప్పలు లేక శివరాత్రి జాగారం చేసి పొద్దుగాల్నే మా్ల కొచ్చినం. ఇగ ఇక్కడుండోద్దురా పెద్దనాని ఎప్పుడేం జరుగుతదొ తెల్వదు. శాలిబండకు పోదాం పదుండ్రి. అక్క ఇంట్ల ఉందాం. ప్రాణాలైనా దక్కుత్తై అని అమ్మ అందర్నీ బయలుదేర తీసింది. మూటలు ముల్లెలు సందూకలు తీసుకుని పెద్దలం పిల్లలం అందరం గుంపుగా శాలీబండ వైపు బయలు దేరినం. మా అక్క ఇల్లు రోడ్డు మీదనే ఉంటది. కావున దాడులు జరిగే ప్రమాదం లేదు. మా రూప్‍లాల్‍ బజార్‍ బస్తీల నుండి నడుస్తున్నం. బస్తీ పురానాపూల్‍ స్మశాన్‍ఘాట్‍ లాగ కనబడ్తుంది. ఇండ్లమీద బాగనే హమ్లాలు జరిగినయి. కోమటాయన దుక్‍నం తీన్‍తేరా నౌ అఠారా అయ్యింది. మల్హర్‍రావ్‍ ఇంటిమీద దాడి చేసి ఆయన తలకాయ పగలకొట్టినట్టుంది. నెత్తికి పట్టీ కట్టుకుని ఆయన ఇంటి అరుగుమీద దీనంగ కూచుండు.
రంజిత్‍, విక్రం ఇండ్ల మీద కూడా దాడి జర్గిందంట. ఇంకొ మలుపుల పుండ్లీక్‍ కాలు, చెయ్యి విరిగి కుంటుకుంట నడువబట్టిండు. దేశ విభజన సమయంలో కాందిశీకుల్లాగనే మేం కూడా గుండెలు అరచేతులల్ల పెట్టుకుని ఏ గల్లీల నుండి ఎవరు దాడిచేస్తరో అన్న భయంతోని వణుక్కుంట, నడుసుకుంట రొడ్డెక్కి అక్కింటికి చేరుకుని బ్రతికినం రా దేవుడా అని దీర్ఘంగ దమ్ముతీసినం.
అక్కింట్ల అక్బార్‍ కనబడింది. అన్నీ దుర్వార్తలే. పార్థీవాడ మొత్తం లంకాదహనం, రావణకాష్టం జరిగింది. చాల మందిని తల్వార్లతో నరికి ఆ మంటల్లోకి విసిరేసిండ్రు. ప్రాణాలతో బ్రతికిన ఆ పిట్టలోళ్లందరూ చెట్టు మీది పిట్టల్లా బెదిరి పోయి చెదిరి పోయి నాల్గు దిక్కులా పారిపోయిండ్రంట. ఇంతకూ ఈ మత కల్లోలాలు ఎందుకు జరిగాయంటే చెన్నారెడ్డిని గద్దెదించి నేదురుమిల్లి జనార్థన్‍ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయనీకె అన్నమాట! ఆవులావులు కొట్లాడుకుంటే నడుమన లేగ దూడల కాళ్లు విరిగిపోయినట్లు ఆ సామెత నిజమే అయ్యింది.
ఆ దెబ్బతో మేం మా ఇల్లును అగ్గువ సగ్గువకు ముస్లీంలకే అమ్మి కొత్తప్టణానికి వలస వచ్చి కిరాయి ఇండ్లల్ల చేరినం.
ఆ తర్వాత దేశంలో ‘‘రామ్‍ రథయాత్ర’’ బయలుదేరింది.
జైశ్రీరాం నినాదం ‘‘రాం-రహీంల’’ మధ్యన చిచ్చుపెట్టింది. గోతులు త్రవ్వి గోడలు లేపింది.
ఆఖరికి అయోధ్యలో పలుగుపారలు చేపట్టిన కిష్కింద మూకల ‘‘కరసేవ’’తో బాబ్రీమస్జిద్‍ శత్రు దాడికి గురై నాలుగు కాళ్లు విరిగిన నల్ల ఏనుగులా కుప్ప కూలింది.


గాడ్సే జనవరి 30న తూటాలు పేల్చినా గాంధీజీ నిజంగా మరణించింది మాత్రం 1992 డిసెంబరు ఆరవతేదీ నాడే.
‘‘ఈశ్వర్‍ అల్లా తేరేనామ్‍’’ ప్రార్ధన గంగలో కలిసింది.
మసీదు విధ్వంసం వార్త విన్న చాలా మంది హిందువులు సిగ్గుతో, అపరాధభావనతో తలలు క్రిందికి దించుకున్నారు. ముస్లిం దోస్తుల కళ్లల్లోకి సూటిగా చూడలేకపోయారు.
ఒకరోజు కవి మిత్రుడు సిద్దార్థ కనిపించాడు. ఎట్లున్నవ్‍ సిద్దార్థా అని పలకరించగానే ‘‘అన్నా ఏం చెప్పాలె మసీదును కూలగొట్టిన దినం నాకైతే నా ఇంట్లె నుండే పీనుగ లేచినట్లు దుఃఖం వచ్చింది’’ అన్నాడు. ఎంతైనా కవి హృదయం కదా!
చాలా కాలానికి బాగే ఆం పుట్‍ఫాత్‍ మీద ఒక ‘టీనేజీ పిల్లగాడు నన్ను ఆపి’’ కైరియత్‍ హైనా సాబ్‍’’ అని ప్రశ్నించిడు. అతనెవరో తెల్వక నేను తెల్లముఖం వేసిన. మీ ఇంటిని మేమే కొన్నాం సాబ్‍ అప్పుడు నేను చాలా చిన్నపిల్లగాన్ని, నన్ను మీరు గుర్తుప్టరు. కాని మీరు నాకు బాగా తెలుసు’’ అని స్వచ్చంగా నవ్వుతూ ఉర్దూలో మాట్లాడాడు.
దాంతో నేను సంబరపడి మా ఇల్లు ఎలా ఉంది? బాగుందా? అని ఇంటిమీద బెంగతో అడిగాను.
‘‘ఓ బహుత్‍ అచ్చా ఘర్‍హై సాబ్‍’’ హమ్‍లొగ్‍ వహాఁ బహుత్‍ తరక్కీ హుయే’’ అని సంతోషంగా చెప్పాడు.
నేను శుక్రియా ఖుదా హాఫీజ్‍’’ అని కదులుతుంటే సాబ్‍ అని పిలిచాడు. నేను వెనుకకు తిరిగి చూసాను.
‘‘ఓ ఘర్‍ అబీభీ ఆప్‍ కా హీ హై సాబ్‍, ఆప్‍ కబీభీ ఆ సక్తేహైఁ’’ అన్నాడు.
ఆ యువకుని మంచిమాట, మానవత్వపు మాట నా చెవుల బడగానే నా కండ్లల్ల కన్నీళ్లు గుబగుబమని పొంగుకొచ్చినయి
చీకటిలో చిరుదీపం వెలిగింది.
అంధేరీ రాత్‍ కె సితారే
‘‘మతములన్నియు మాసిపోవును. జ్ఞానమొక్కటే నిలిచి వెలుగును’’అన్నట్లు ఇటువంటి యువకులే హైద్రాబాద్‍ నగర సంస్క•తి – గంగా జమునా తెహజీబ్‍ను- నిలబెడతారని నాకు భరోసా కల్గింది.
‘‘హమ్‍ లాయేహైఁ తుఫాన్‍ సె కిస్తీ నికాల్‍కే
ఇస్‍ దేశ్‍ కో రఖ్‍నా మేరే బచ్చోఁ సంభాల్‍ కే’’
(జాగృతి సీన్మాపాట)


(చార్‍మినార్‍ కథలు-పుస్తకం నుంచి)
-పరవస్తు లోకేశ్వర్‍,
ఎ: 91606 80847

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *